నా బ్లాగు

My Photo
Name: budugu

Thursday, December 03, 2009

అనగనగా ఒక మొన్న

చాలామందికి (నాక్కూడా) ఆడవాళ్ళకు డ్రైవింగ్ - డైరెక్షన్ సెన్స్ సరిగా ఉండదని, మగవాళ్ళు ఆడవాళ్ళంత బాగా మల్టి-టాస్కింగ్ చేయలేరని నమ్మకం. (ఓకే ఓకే ఈ జనరలైజేషన్ కు ఏ బేసిస్ లేదు. కావున కామెంట్లతో హోరెత్తించకండి). అదే కాదు నాకు డ్రైవింగ్ స్కిల్స్ మీదా, డిరెక్షన్ సెన్స్ మీదా ప్రగా...ఢ నమ్మకం. దానికితోడు, నేనే గ్రూప్‌లో ఉన్నా డైరెక్షన్స్ నన్నే అడుగుతూ ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు బంధుమిత్రగణం. కాని మొన్న మాత్రం నాకు మాంచి గుణపాఠమయ్యింది.
చెప్పాను కదా తబ్లా కచేరీకని వెళ్ళి జస్రాజ్ మాయలో పడి పన్నెండున్నర వరకు చౌమొహల్లా పాలస్‌లో ఉండిపోయానని. వేళ్ళేప్పుడే నాకు కాస్త చిరాకేసింది. ఇంత మెయిన్ రోడ్లు పట్టుకు తిరగాలా షార్ట్ కట్ లో వెళ్తే బాగుండు అని. సరే ఇక తిరుగు ప్రయాణం లో వచ్చిన దారి కాదని ఓ నాలుగు కార్లు అఫ్జల్‌గంజ్ వైపు వెళ్తుంటే వాటిని ఫాలో అయ్యా. ఓ రెండు కిలోమీటర్ల దూరం నాకు పైలట్ వాహనాల్లా వచ్చి అటొకటి ఇటొకటి మలుపులు తీసుకున్నాయి. ఫాలో అవుదామంటే మరీ చిన్న గల్లీలు. సరే ఇప్పుడు వెళ్ళే రోడ్డు పెద్దదే గదా అని తిన్నగా వెళ్ళా కాసేపు. తిన్న్నగా వెళ్తే ఏ పురానపూలో, నయాపూలో వస్తుందనుకుంటే ఎంతకూ రాదే? సరే మూసేసిన దుకాణాల బోర్డులు చూస్తే అదేదో హుస్సేనీ ఆలం అని తెలిసింది. అయ్య బాబోయ్. ఎక్కడో ఓల్డ్ సిటీ గల్లీలో ఉన్నానని అర్థమయ్యింది. రాత్రి దాదపు ఒకటవుతోంది. ఒకటే చలి. నేను వేసుకున్నది హాఫ్ స్లీవ్స్ కాటన్ షర్టు. ఐసింగ్ ఆన్ ది కేక్ లా బండి రిజర్వ్లో పడి అప్పటికే ఓ యాభై కిలోమీటర్లయ్యింది. (బంద్ అని బంకుల దగ్గర క్యూలు ఉంటే నేను బద్ధకించా రిటర్న్‌లో ఎక్కడో పోయించవచ్చులే అని).

ఇక చూసుకోండి. లేని పోని ఊహలన్నీ వస్తున్నాయి. అంతలో GHMC రోడ్ బ్లాక్ కనిపించింది. అంతవరకు నాతో వచ్చిన బైకర్ రైట్ తీసుకుంటే సరే నేనూ రైట్ తీసుకున్నా. ఒక వందడుగులుపోగానే వాడు చక్కగా పార్క్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. నేను బిక్కమొగం వేసుకొని యూ టర్న్ తీసుకున్నా. అప్పటికీ నా సిక్స్త్ సెన్స్ ముందుకు సాగూ ఈ మాత్రం దానికి వెనక్కి తిరుగుతావా అని హేళన చేస్తోంది. మళ్ళీ మెయిన్ రోడ్ మీదకు రాగానే ఒకతను రోడ్ బ్లాక్ అవతలనుండి ఇవతలకి రావడం చూశా. హమ్మయ్య దొరికాడు.
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాత?"
"పురానా పూల్"
(హ హ..నా కాంఫిడెన్స్ మళ్ళీ పదిరెట్లయ్యింది.)
"గాడీ జా సక్తి క్యా?"
"థొడా సంభల్ కె జావో"
(ఓకే. గ్రీన్ లైట్)
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ చీకట్లో కష్టపడి గుంతల్లోంచి బండిని అవతలికి తీసుకెళ్ళి కాస్త దూరం వెళ్ళగానే ఒక టూ వే మెయిన్ రోడ్.
యా...బేబీ..దేర్ యు గో. అనుకుంటూ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాను. ఎంతకీ మూసీకి ఆవలి వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కనిపించదే? మళ్ళీ పప్పులో కాలేసానా? అనుకుంటూ అక్కడెవరో బైకర్ని అడిగా.
"యే రస్తా కిధర్ జాతీ?"
"షంషాబాద్"
ఓర్నాయనో అసలే పెట్రోల్ లేదంటే ఈ దారమ్మట వెళ్తే ఇంతే సంగతులు అనుకుంటూ మళ్ళీ యూ టర్న్.
తీరా చూస్తే నేనూ ఇంట్యూషన్ తో లెఫ్ట్ కొట్టా కానీ, ఒకసారి కనీసం రైట్ వైపు కన్నేసినా పురానాపూల్ ఎటో తెలిసేది. ఏమయింది నాకివాళ - డైరెక్షన్ సెన్స్ బొత్తిగా పనిచేయట్లేదు అనుకుంటూ ఒక ఆర్టీసి బస్సును ఫాలో అయ్యాను. దాదాపు పురానాపూల్ వరకు వెళ్ళాక తెగించి ఇంలిబన్ వరకు ఏం వెళ్తాం లే అని ఒక బ్రిడ్జ్ కనిపించగానే లెఫ్ట్ కొట్టేసా. బ్రిడ్జ్ ఆవలికి చేరితే అసలు అఫ్జల్ గంజే కనిపించదు..
ఓ షూట్. మళ్ళీ దారి తప్పానా? అని ఒక పెద్ద రోడ్డు కనిపించగానే తిన్నగా వెళ్ళా..
ఆ వీధంతా బేగంబజార్ టోకు సామానుల వాసన. హమ్మయ్య సరైన దార్లోనే ఉన్నా.. కాస్త తిన్నగా వెళ్ళి బేగంబజార్ రోడ్డెక్కితే చాలు అనుకొని వెళ్తున్నా.. ఎంతకీ మెయిన్ రోడ్ రాదె??
మరొకసారి జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం..దారి అడుగుదామంటే చింకిపోగులేసుకొని ఒక హోంలెస్ ఫెలో కనిపించాడు. వీణ్ణి కెలకాలా వద్దా అనుకుంటూ
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాతీ?"
ఆహ్?
"సీధ గయే తో కిధర్ జాతే"?
(ఇంతలో ఇంకొకడు అక్కడికి వచ్చాడు. వీడు వాడితో ఎందట ఈన గొడవ కొంచెం చెప్పురా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు).
ఓ షూట్. చక్కగా తెలుగులో అడిగా.
"నువ్వెక్కడికి బోవాలె?"
అప్పటికి అఫ్జల్గంజ్ దాటానని గెస్ చేసి నాంపల్లి అని చెప్పా.
"సీధబొయి లెఫ్ట్ తీసుకుంటే మొజంజాహి మార్కెట్. తెలుసుగద?"
"ఆ తెలుసు తెలుసు".
ఈ రోజు నాకేదో మూడిందని ఇంకోసారి రాత్రిపూట గల్లీల్లోకి దూరనని లెంపలేసుకుంటూ రజనీకాంత్ పాట పాడుకున్న.
"దేవుడా దేవుడా ..తిరుమల దేవుడా...ఉన్నావా ఉన్నావా..నువ్వసలున్నావా?"
ఎంత తిన్నగా వెళ్ళినా లెఫ్ట్ తర్న్ ఎక్కడ తీసుకోవాలో తెలిసింది గాదు. ఒకచోట మాత్రం పెద్దగా లైట్లు కనిపించాయి. సరే మన అదృష్టం చూఒద్దామని తిన్నగా వెళ్ళి చూస్తే అదో పెట్రోల్ బంక్.

ఆహ్..తిరుమల వాసా నువ్వింత తొందరగా ప్రార్థనలు వింటావా..ఐతే పెద్ద కోరికేదో కోరుకుందునే అనుకుంటూ పాట మార్చాను.
"దేవుడ దేవుడా తిరుమల దేవుడా.. ఉన్నావౌ ఉన్నావు నువ్ గ్యారంటిగున్నావు. ఇవాళ నన్నెందుకు పరీక్ష చేస్తున్నావు?"
బంకులో పెట్రోల్ పోయించి కాస్త ఊపిరి పీల్చుకొని,
"భాయ్ సాబ్, నాంపల్లి కైసే జానా?"
"ఇట్ల సీధ బొయి లెఫ్ట్ తిరుగుతే నాంపల్లి".
లెఫ్టా? టొటల్ల్య్ అన్ - ఇంట్యూటివ్ గ చెప్తున్నాడే వీడు?? వినాలా వొద్దా? కొంపతీసి వెనకే ఎవరినన్నా పంపించడుకదా? ఆలోచిస్తూ సీధా వెళ్ళి లెఫ్ట్ తిరిగి ఎందుకైనా మంచిది అని ఒకరినడిగా.
"కహా జాన హై తుంకో?"
"నాంపల్లి"
"యెహీ నాంపల్లి హై"
ఇదేవిటీ? చాయమాత్రంగానైనా అనిపించట్లేదు?
"ముఝే స్టెషన్ జానా హై"
"తొ పీచే జావో"

సరేనని వెనక్కి తిరగ్గానే పేద్దరోడ్డు. అరగంటగా నేను చలిలో వణుకుతూ, టెన్షన్ టెన్షన్ గా వెతుకుతున్న రోడ్డు. బతుకుజీవుడా అంటు ఇంటిదారి పట్టాను.

కాస్త ముందుకెళ్ళి ప్రాణం కుదుటపడ్డాక ఇంతమంది సరైనదారి చెబితే, వాళ్ళ అవతారాలు చూసి, ఒక్కణ్ణీ నమ్మక ఆ రోడ్లు గల్లీల్లో టెన్షన్ వల్లో ఏమో ఒక్కరికి థాంక్స్ చెప్పలేదని గుర్తొచ్చింది. ఛ ఛ. ఎంత సిగ్గుచేటు..ఒకసారి పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథ గుర్తొచ్చింది.

నా డైరెక్షన్ సెన్సునూ, ఓవర్ కాంఫిడెన్స్ ని తిట్టుకుంటూ, దేవుడికి క్షమాపణలు చెప్పి లెంపలేసుకుని వెచ్చగా ఇంట్లోకి వచ్చిపడ్డా. అదీ సంగతి.

Monday, November 30, 2009

పండిట్ జస్రాజ్ మేజిక్

పండిట్ జస్రాజ్ సంఈతోత్సవం జరుగుతుందని వారం రోజులుగా మా మేష్టారు చెబుతున్నారు. ఇరవయ్యేడున ఎవరో స్నేహితుడు ఇంటికి వచ్చాడని వెళ్ళలేదు. ఇరవై ఎనిమిదిన బక్రీద్ గోల ఉంటుందని వెళ్ళలేదు. (ఈ ఉత్సవం జరిగే చౌమొహల్లా పాలస్ మక్కా మసీదు వెనకాలే ఉంది). ఇరవయితొమ్మిదిన ఇంట్లో ఏదో సెలబ్రేషన్. మా తబ్లా మేష్టారు కాస్త గాఠ్ఠిగా చెప్పారు. ఇవాళ ఎలాగైన వెళ్ళాల్సిందే. ఇవాళ యోగేష్ సంసి తబ్ల సోలో ఉంది. వెళ్ళి వినిరా అని. నాకు మొదట ఆ చౌమొహల్లా పాలస్ వెతకాడానికి బద్ధకం. ఓల్డ్ సిటీలో ఎక్కడో ఉందది. అంతరాత్రి పూట ఓల్డ్ సిటీలో ఇరుక్కోవడం అసలే మంచిది కాదని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ తప్పిస్తున్నాను. ఇక గురువాజ్ఞ కాదనలేక ఆ తబ్లా ఒక్కటీ అటెండ్ అవుదామని రాత్రి ఏడున్నరకు ఒక్కణ్ణి వెళ్ళాను. తొమ్మిదివరకు వెనక్కొచ్చేద్దామని ఇంత చలిలో కనీసం ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా బైక్ మీద వెళ్ళాను.

ఎనిమిదింటికి నిదానంగా మొదలయ్యింది. మొదట జస్రాజ్ సంతానమంతా కలిసి శిష్యులతో ప్రార్థన నిర్వహించారు. రెండు బందిష్‌లు మేవాతీ ఘరానా వాళ్ళు రాసినవి. శిష్యులంతా కలిసి పాడి బాగా రక్తి కట్టించారు. తరవాత శశాంక్ ఫ్లూట్ కచేరీ అన్నారు. ఈ యోగేష్ సంసి ఎప్పుడు వస్తాడో ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అనుకుంటూ కూర్చున్నాను. ఐదు నిమిషాలయ్యాక అర్థమయ్యింది. ఈ శశాంక్ కర్నాటిక్‌లో ఆల్రెడీ పేరు మోసిన చైల్డ్ ప్రాడిజీ ఫ్లూటిస్ట్ శశాంక్ అని. అరగంటసేపు వాగధీశ్వరీ రాగంలో శ్రోతల్ని ముంచి తడిపేశాడు. రాగం-తానం-పల్లవి, పక్క వాద్యాల్లో ఒక మృదంగం, ఒక తబ్ల సహకారం. వాహ్..ఫర్లేదు ఇంత దూరం వచినందుకు ఇది వినే అవకాశం దక్కిందని సంతోషపడిపోయాను. ఈ కర్నాటిక్ సంగీతకారుడు హిందుస్తానీ కచేరీలో ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? శశాంక్ ప్రస్తుతం జస్రాజ్ గారి దగ్గిర మేవాతీ ఘరానాలో శిక్షణ పొందుతున్నాడు. ఎంత శిష్యుడైనా అల్రెడీ మరో సంప్రదాయంలో పండితుడేనని కర్నాటిక్ కచేరీ నిర్వహింపచేశారు. నిజంగా ఎంత బాగుండిందో... ఆసక్తి ఉన్నవాళ్ళు మళ్ళీ ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే కచేరీకి వేళ్ళవచ్చు.

తరవాత మొదలయ్యింది సంసీ గారి కచేరీ. ఏడాదిగా తబ్లా పాఠాలు నేరుస్తూ అంతవరకూ జరిగిన పర్కషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తబ్ల కచేరీ మాత్రం ఒక్క ముక్క అర్థమైతే ఓట్టు. తీన్‌తాల్ అని అర్థమయ్యింది గానీ ఆయన పేషకారీ కాయిదాలు, కాయిదాలు, రేలాలు రాకెట్ స్పీడులో నడిచాయి. వర్షం కురిసినట్టు ఒకటే గిడనగలు, కిడతకలు, తిరకిటలు. నా స్థాయికి చాలా ఎక్కువని తెలిసింది. విశ్వవిఖ్యాత అల్లా రఖా, జాకీర్ హుస్సేన్ శిష్యులాయన. నాకు ఆస్వాదించేంత తబ్లా తెలీకపోవడం నా దురదృష్టం. (పాఠాలు ఇలాగే కంటిన్యూ చేస్తే బహుశా వచ్చే ఏడాది..). శ్రోతలు కూడా పాపం అంతగా ఎంజాయ్ చేసినట్టు లేదు. ఇక సంసీ గారు డెస్పరేట్ అటెంప్ట్లో తబ్లా బోల్స్ వోకలైజ్ చేస్తూ వాయించడం మొదలెట్టారు. నాకైతే ఎందుకో రసాభాస అయ్యిందని అనిపించింది. అప్పటికే పదిన్నర. అదయ్యాక వెళ్దామని బయల్దేరుతున్నానో లేదో పెద్ద హంగామా మొదలయ్యింది. ఎక్కడెక్కడివాళ్ళో వచ్చి సీట్లో కూర్చోవడం మొదలెట్టారు. విషయమేంటా అని కనుక్కుంటే అప్పుడే జస్రాజ్ గారి కచేరీ మొదలవుతుందని చెప్పారు. ఒకవైపు చలి, రాత్రి పన్నెండవుతుందేమో అయిపోయేసరికి అని ఆలోచిస్తూ కాసేపు విందాంలే అనికూర్చున్నా.

పదకొండింటికి మెల్లగా మొదలయ్యింది మాజిక్. ఒకవైపు చలి వణికించి ఇంటికి వెళ్దామంటుంటే, మరో వైపు జస్రాజ్ గారి సంగీతం ఒకపట్టాన వెళ్ళనివ్వదు. మొదట శంకరుని స్తుతిస్తూ ఒక ఆలాపన. తరువాత అల్లాహ్ మెహెర్బాన్ అని ఒక బందిష్(ఆయన రాసిందే). నిజంగా అల్లా కిందకు దిగివస్తాడేమో అన్నట్టు పాడారు. పక్కనే మక్కా మసీదు వైపు చూస్తూ అల్లా, అల్లా అని పిలుస్తుంటే కాసేపు అందరం కులమతాలకతీతంగా అల్లా వస్తాడేమో అని చూశాం. నిజంగా అదొక డివైన్ అనుభూతి. అప్పటికి పావు తక్కువ పన్నెండయ్యింది. ఇల్లు గిల్లు చలీ గిలీ అప్పటికి అన్నీ మరిచాను. మాతా కాళికా అని అడానా రాగాన్ని ఎత్తుకున్నారు. అసురహరణీ, అసురహరణీ... మా మా.. అని పిలుస్తుంటే ఓహ్....నిజంగా అదో అలౌకికానుభూతి. ట్రాన్సెండెంటల్ ఎక్స్‌పీరియన్స్. పాట ముగిసి అందరు చప్పట్లుకొడుతుంటే మెల్లిగా తేరుకొని ఈలోకంలోకి వచ్చాను. ఒకసారి ఆలోచిస్తే నాకసలు జస్రాజ్ కచేరీ ఉందనే తెలీదు. వచ్చింది యోగేష్ సంసీ తబ్లా కోసం. అందులో ఏమీ అర్ధం కాలేదు. బాగా ఎంజాయ్ చేసింది మాత్రం జస్రాజ్ గారి సంగీతం, శశాంక్ ఫ్లూట్.

ఇంటికొచ్చి అసలు నేను వెళ్ళిందిఏం ఉత్సవం అని నెట్లో శోధిస్తే తెలిసింది. ప్రతి సంవత్సరం హైదరబాద్‌లో నవంబరు 27 నుండి ముఫ్హై వరకు "పండిట్ మోతీరాం పండిట్ మణిరాం సంగీత సమారోహ్" ఉత్సవరం జరుగుతంది. గత ముప్ఫై ఏడేళ్ళుగా జరుగుతోందీ ఉత్సవం. పండిట్ మోతీరాం (జస్రాజ్ గారి తండ్రి), పండిట్ మణిరాం (ఆయన అన్న) జ్ఞాపకార్థం ప్రతిసంవత్సరం మేవతీ ఘరానా కళాకారులు హైదరబాద్‌లో జరుపుతారీ ఉత్సవాన్ని. ప్రవేశరుసుము గట్రా ఉండవు. ఓపెన్ ఫర్ ఆల్. పాపం మోతీరాం గారిది చాలా ట్రాజిక్ స్టోరీ. ఆయన నిజాం అస్థాన విద్వాంసులుగా నియమించబడే రోజు నవంబరు 30న పరమపదించారు. ఇక ఆయన కుటుంబం హైదరాబాదులోనే సెటిల్ అయ్యింది. పెద్దకొడుకు మణిరాం పోషణ భారం తన మీద వేసుకొని జస్రాజ్ కు సంగీతం నేర్పించాడు. జస్రాజ్ మొదట తబ్లా నేర్చుకున్నా పధ్నాలుగో ఏట అది మానేసి వోకల్ వైపు మరలాడు. ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ అంతటి వాడు నిన్ను శిష్యుడుగా చేస్తుకుంటాను అంటే, లేదు నేను మా నాన్న సంప్రదాయాం నిలబెట్టాలి అని వద్దన్నాడట. తరువాత సినిమా డైరెక్టరు శాంతారాం కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. శాంతారాం సినిమా సంగీతంలో మున్ముందు బోలెడు డబ్బులున్నాయి ఇందులోకి దిగిపో అంటే, రూపాయికి ఆశపడి చేతిలో ఉన్న పావల పడేసుకోను అనిచెప్పాడట. ఏది రూపాయి? ఏది పావలా? :) డెభ్హయ్యెనిమిదేళ్ళ వయసులో చలిని లెఖ్ఖ చేయక తన తండ్రికి సంగీతనివాళి అర్పించిన తీరు మనోహరం.

ఏదైతేనేం ఒక్కటి మాత్రం నిజం. ఇకపై నవంబరు 30 న హైదరాబాదులో ఉంటే మాత్రం జస్రాజ్ గారి కచేరీ మిస్సయ్యే ప్రశ్నే లేదు.

Thursday, October 22, 2009

ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు.

బాగా చిన్నప్పటి మాట. నాకు మా ఇంట్లో కొన్ని నిషిద్ధ వస్తువులుండేవి. నాన్నగారి షేవింగ్ కిట్టు, కాల్కులేటర్, అమ్మ కుట్టుమిషను, కత్తెర ఇలాంటివి. ఏదైనా ముట్టొద్దని చెబితే ఇక మన క్యూరియాసిటీ పదింతలయ్యేది. రాత్రింబవళ్ళూ వాటిని ఎలా తీయాలి? వాటితో ఏం చేయాలి అనే ధ్యాస. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిఉన్న సమయంలో గబుక్కున కాల్కులేటరో కత్తెరో తీసి, మా రహస్యస్థావరంలోకి (పట్టెమంచాల మీద చీరలు ఆరవేస్తే చిన్న కాంపు సైటులా తయారయ్యి మా స్థావరంగా పనికొచ్చేది) తీసుకెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి తిరిగి దాని స్థానంలో దాన్ని పెట్టేసేవాణ్ణి. అప్పుడప్పుడే కూడికలు, గుణకారాలు నేరుస్తున్నాను గనుక కాల్కులేటర్ ఎందుకు, ఎలా వాడతారో తెలిసేది కాదు. ఖర్మకాలి ఒకరోజు దానితో ఆడుతుంటే దాని మీద నీళ్ళు పడి పాడయిపోయి ముక్కచివాట్లు తిన్నాను. అలాగే ఓసారి బాడ్మింటన్ రాకెట్ కొనిస్తే దాన్ని నీళ్ళలో ముంచి, కట్టెల పొయ్యిలో పెట్టి ఏవో ప్రయోగాలు చేసి నాశనం చేశాను. అప్పటికే వీడితో జాగర్తగా ఉండాలి అని రెపుటేషన్ సంపాదించాను.

అప్పట్లో మా బడి గవర్నమెంటు బడికి ఎక్కువా కాన్వెంటుకు తక్కువా అన్నట్టుండేది. మా బళ్ళో నియమమేంటంటే నాలుగో తరవతి వరకు అందరూ పెన్సిల్లే వాడాలి. ఐదవ తరగతి నుండి ఇంకు పెన్నులు వాడాలి. అదిగో అలాంటి సమయంలో మా ఇంట్లో ప్రవేశించాయి ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు. కాంలిన్ జామెట్రీ బాక్సు. దాంట్లో ఒక వృత్తలేఖిని, ఒక డివైడర్(తెలుగు పేరు మరిచాను), కోణమానిని, సెట్-స్క్వేర్లు. షార్పెనరు, రబ్బరు(అప్పట్లో ఎరేజర్ని అలాగే అనేవాళ్ళం) పెట్టుకోడానికి వేరే అరలు. యెల్లో కలరు మీద బ్లాక్ లైన్లతో తళతళ మెరుస్తూ చూట్టానికి ఎంత బాగుండేదో. ఇక ఇంకుపెన్నుది ఇంకో అందం.ఓ ఇంకుబుడ్డి, రెండు ఇంకు పిల్లర్లు (ఫిల్లెర్), రెండు తళతళ మెరిసే పాళీలు. ఇంత సరంజామాతో ఠీవీగా అలరారుతుండేది. వచ్చిన చిక్కల్లా నాకు మాత్రం వాటిని ముట్టుకోడానికి పర్మిషన్ లేదు. నేనప్పటికి మూడో తరగతే. అన్నయ్య ఐదో తరగతిలోకి వచ్చాడని కొన్నారు. ఎపుడెపుడు వాటితో ఆడదామా అని ఉవ్విళ్ళూరుతున్నాను. నా క్యూరియాసిటీ ముందే పసిగట్టిన అన్నయ్య ముడితే కాళ్ళిరగ్గొడతానని నాన్నతో వార్నింగిప్పించాడు.

ఇక చూస్కోండి నా కష్టాలు. నేనా చదివేది ముష్టి మూడో తరగతి. వెధవది జామెట్రీ బాక్సు కాదు కద కనీసం స్కేలు కూడా అఖ్ఖర్లేదు. రోజూ బడికెళ్ళే టైంలో మొదలయ్యేది అన్నయ్య తతంగం. మిలిటరీ వాళ్ళు యుద్ధానికెళ్ళే ముందు గన్స్ ఆయిలింగ్ చేసినట్టు అవసరమున్నా లేకున్నా అన్నయ్య జామెట్రీ బాక్సు తీసి అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, ఇంకు పెన్నులో ఇంకు నింపుకొని ఓ ఊరించేవాడు. నేనేం చెయ్యగలను మహా అంటే ఒక సారి పెన్సిల్ చెక్కుకొని మళ్ళీ సంచీలో పడేస్కోవడమే.ఓ వైపు పెద్దగా పట్టించుకోనట్టు నటిస్తూ, ఎప్పటికైనా నేనూ ఐదో తరగతిలో రాకపోతానా? నీ సంగతి తేల్చకపోతానా? అనుకొనేవాణ్ణి. సాయంత్రం బడి నుండి రాగానే మళ్ళీ కొత్తవేషాలు. పొద్దున్నే నింపిన పెన్నును ఇంకు పిల్లరుతో మళ్ళీ నింపుతూ, రికార్డు షీట్లపై వృత్తలేఖినితో వృత్తాలు గీస్తూ వాట్లో రంగులు నింపి బొమ్మలేస్తూ రోజో తమాషా చూపించేవాడు. ఇంకో రోజు అట్ట ముక్కలను డివైడర్‌తో కాత్తిరించి చక్రాలబండి చేసేవాడు. మరో రోజు స్కేలుతో డబల్ లైనింగ్, షాడోస్ తో పేర్లు రాసి చూపించేవాడు. అబ్బ, ఈ వెధవ మూడో తరగతి ఎప్పుడవుతుందో, దాని తర్వాత నాలుగో తరగతి ఎప్పుడవుతుందో నాకెప్పుడో జామెట్రీ బాక్సు వస్తుందో , పరమ చిరాగ్గ ఉండేది. పోనీ అన్నయ్యనడుగుదామా అంటే వాడసలే టాం సాయరు టైపు. రోజంతా వాడితో మంచిగా ఉండి రెండో మూడో లంచాలిచ్చాక(అమ్మ చిన్న చిన్న పనికి పిలిచినప్పుడల్లా నేనే వెళ్ళడం, దీపవళి బాంబుల్లో కొన్ని నా వాటాలోంచి ఇవ్వడం లాంటివి) ఇంకుపిల్లరుతో వాడి పెన్నులో ఇంకు నింపడానికి పర్మిషనిచ్చేవాడు. అప్పటికి వాడాటకు వెళ్ళినప్పుడళ్ళా ఆ జామెట్రీ బాక్సు తీసి మా రహస్యస్థావరంలో బోలెడు వృత్తాలు గీసి వాడు వచ్చే లోపు మళ్ళీ యధావిధిగా పెట్టేవాణ్ణి. కాని ఇలా దొంగతనంగా ఏం సరదాపడతాం. ఎన్ని వృత్తాలు గీసుకున్నా అన్నయ్యకు చూపించలేకపోతే ఏం లాభం. ఇలా కాదని దసరా సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు నన్నెంతో గారాబంగా చూసుకొనే నాయినమ్మని అడిగా. "నాయినమ్మా నాకో జామెట్రీ బాక్సు కొనిపెట్టవూ" అని. అదేంటో తెలీని నాయినమ్మ సరేనని డబ్బులిచ్చినా అమ్మకా విషయం తెలిసి ససేమీరా కొనివ్వనంది. మొతానికి అలా అలా మూడో తరగతిగడిచిపోయింది.
మరో ఏడాదికి నాకూ ఇంకు పెన్ను జామెట్రీ బాక్సు వస్తాయనగా నాన్నకు ఒక పల్లెటూరుకు బదిలీ అయిపోయింది. ఆ డొక్కు బళ్ళో ఇంకు పెన్ను ఎవరూ వాడరు. ఏ తరగతి వాళ్ళైనా బాల్ పాయింటు పెన్నుతో రాసుకోవచ్చు. అసలు ఈ బాల్ పెన్ను కనిపెట్టిన వాళ్ళననాలి. పుట్టింది మొదలు చచ్చేవరకు ఒకటే అవతారం అదీనూ. అసలు ఇంకు పెన్నుకున్న దర్జా హోదా బాల్ పెన్నుకెక్కడా. లైఫులో గొప్ప రొమాన్స్ మిస్సయ్యాను కదా అని బాధపడుతుంటే చల్లగా చెప్పారింకో వార్త. ఆ పల్లెటూరి బళ్ళో ఐదో తరగతిలో ఎవ్వరూ జామెట్రీ బాక్సు వాడరట. అనవసరపు ఆర్భాటాలెందుకు? అఖ్ఖర్లేదని టీచర్లే చెప్పేసారు. హతోస్మి.

నా ఐదో తరగతయిన తరువాత పల్లెటూళ్ళో చదువు చట్టుబండలైతోందని అన్నయ్యను సిటీలో బాబాయి దగ్గరికీ, నన్ను హాస్టలుకీ పంపేశారు. ట్రాజెడీ ఏంటంటే హాస్టల్లోనూ బాల్ పెన్నులే వాడేవాళ్ళం. మా హాస్టల్లో క్లాసురూములూ డార్మిటరీలు పక్కపక్కనే ఉండేవి. రోజూ పుస్తకాలు గట్రా మోసుకెళ్ళడం ఉండేది కాదు. ఎట్టకేలకూ ఆరో తరగతిలో జామెట్రీ బాక్సు కొనుకున్నా. మా హాస్టల్లో రాత్రి డెస్కులో పెట్టుకున్న పెన్నూ పెన్సిలూ తెల్లవారి అలాగే ఉంటే గొప్ప ఇక జామెట్రీ బాక్సు బతికి బట్టకడుతుందా? కల్లో మాట. మొత్తనికి ఒక్కరోజైనా పొద్దున్నే లేచి ఇంకుపెన్ను నింపుకొని, జామెట్రీ బాక్సొకసారి చెక్ చేసుకొని స్కూలుకి తీసుకెళ్ళే అవసరం లేకుండానే పదోతరగతి వరకూ చదివేశాను.

* * * *

మొన్నీ మధ్య మా విభు కి (అన్నయ్య కొడుక్కి) క్రేయాన్స్, అవి పెట్టుకుందుకు ఒక బాక్సు కొందామని స్టెషనరీ షాపుకి వెళ్ళాను. అన్నీ కొనేసి బిల్ కడ్తుంటే కౌంటర్లో అద్దాల కింద మిలమిలలాడుతూ వెక్కిరించాయి వృత్తలేఖినీ, కోణమానినీ ఇముడ్చుకున్న సరికొత్త జామెట్రీ బాక్సు, ఇంకు పెన్నూ.

Friday, October 09, 2009

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి క్వెంటిన్ టరంటీనో గురించి చెప్పఖ్ఖర్లేదు. రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ సినిమాలతో తనదంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. మూసకి భిన్నంగా ఆలోచించడానికి ఇంగ్లీషులో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. thinking out of the box, pushing the envelope అని. వాటికి నిజమైన ప్రతీకగా నిలుస్తాడు టరంటీనో. స్క్రీన్‌ప్లే తో ప్రయోగాలకు పెట్టింది పేరు. అలాగే తన చిత్రాలలో నేపథ్య సంగీతాన్ని చాలా జాగర్తగా ఎంచుకుంటాడు. ఉదాహరణకి కిల్‌బిల్ చిత్రం ఎంత హిట్టాయ్యిందో ఆ సౌండ్‌ట్రాక్ కూడా అంతే హిట్టయ్యింది. అలాంటి డైరెక్టర్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సినిమా తీశాడంటే సహజంగానే చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. పైగా ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు నామినేషన్లు, ఒక అవార్డు సంపాదించింది కూడా. మరి బాగుందా? నేనైతే తప్పక చూడాలని చెబుతాను.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఫ్రాన్స్ ని ఆక్రమించుకొని ఉంతుంది. నాజీలు యూదులను వెతికి మరీ చంపేస్తుంటారు. ఇలాంటి నాజీల గుండెల్లో దడ పుట్టించడానికి అమెరికా నుండి లెఫ్టినెంట్ అల్డో రెయిన్ (బ్రాడ్ పిట్) నాయకత్వంలో ఐనిమిది మంది యూదులబృదం బయలు దేరుతుంది. వీళ్ళ బృందానికి బాస్టర్డ్స్ అని పేరు. వాళ్ళు నాజీలను హతమారుస్తూ, ఒక్కో బృందంలో ఒక్కరిని విడిచి తమ గురించి పదిమందికి తెలిసేలా చేసి మిగిలినవారిని భయపెడుతుంటారు. మరో వైపు షొషానా నాజీల చేతిలో కుటుంబమంతా పోగొట్టుకొని ప్రాణం దక్కించుకున్న యువతి. మూడేళ్ళ తరువాత ఒక సినిమా థియేటర్‌కి ఓనర్‌గా పునర్దర్శనమిస్తుంది. షొషానాతో ప్రేమలో పడిన ఒక జర్మన్ వార్ హీరో వల్ల అతని ఆత్మ కథ ఆధారంగా మలచిన చిత్రం ప్రీమియర్ షొషానా సినిమా హాల్లో ఏర్పాటవుతుంది. తన కుటుంబాన్ని చంపిన కలొనల్ హాన్స్ లాండా వస్తున్నాడని తెలిసి షొషానా ప్రీమియర్ రోజు థియేటర్‌ని పేల్చి నాజీలను చంపాలని పథకం వేస్తుంది. ఆ ప్రీమియర్‌కు హిట్లర్‌తో సహా జర్మన్ అధికారగణమంతా వస్తున్నారని తెలిసి బాస్టర్డ్స్ గాంగ్ కూడా థియేటర్‌ని పేల్చాలని పథకం వేస్తారు. వీళ్ళందరిని వేయి కళ్ళతో కనిపెడుతూ ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉండే నిరంకుశాధికారి కలొనల్ హాన్స్ లాండా. చిత్రం ముగింపు ఏమయిందన్నది తెరపై చూడాల్సిందే.

ఒక చారిత్రక అంశాన్ని తీసుకొని దాన్ని ఫిక్షనలైజ్ రాయడానికి నిజంగానే ధైర్యముండాలి. టరంటీనో ఈ విషయంలో మొదటివాడు కాకపోవచ్చు కానీ గట్టి ప్రయత్నమే చేశాడు. నీజీలు యూదులు లాంటి అతి సున్నితమైన, గంభీరమైన విషయాన్ని తీసుకొని దాంట్లో కామెడీ చొప్పించడం నిజంగానే ఒక ఎక్స్‌పరిమెంటు. ఇక బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని వాడుకున్న తీరు సినిమా విద్యార్థులందరికి ఒక పాఠంగా మిగిలిపోతుంది. లాండా, షోషానా జర్మన్ మిలిటరీ గాంగ్‌తో కలుసుకొనే సీను ఎంత ఉత్కంఠంగా ఉంటుందో తెరమీద చూడాల్సిందే. అలాగే క్లైమాక్ష్ ముందర వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. మరి ఈ సినిమాకు పదికి పది మార్కులు వేయొచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి. కారణం. ఎడిటింగ్ లోపం. ప్రతీ సీన్నూ హాస్యాస్పదంగా మలచడానికి సాగతీసినట్టుంటుంది. అలాగే తియ్యగా మాట్లాడుతూ కోల్డ్ బ్లడెడ్‌గా వ్యవహరించే విలన్ పాత్ర చాలా మూస పాత్ర. లాండా పాత్రకు మరీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాల్సింది కాదు.

నటన విషయానికొస్తే సినిమాలో మనకు బాగా గుర్తుండి పోయే పాత్రలు మూడు. కల్నల్ హాన్స్ లాండా గా క్రిస్టొఫర్ వాల్ట్జ్ బాగా నటించాడు. కాన్స్ లో బెస్ట్ అవార్డ్ వచ్చింది కూడా. షోషానాగా ఫ్రెంచ్ నటి మెలనీ లారెంట్ నటన అద్భుతం. అల్డోగా బ్రాడ్ పిట్ కూడా బాగా నటించాడు.

గత పదిహేనేళ్ళ కాలంలో రెండో ప్రపంచయుద్ధం మీద మూడు పాపులర్ సినిమాలు వచ్చాయి. స్పీల్‌బర్గ్ షిండ్లర్స్ లిస్ట్, రాబర్టో బెనిని "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్", రొమాన్ పొలాన్స్కి "ద పియనిస్ట్". ప్రతీది దేనికదే గొప్పగా ఉంటుంది. మరి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వీటి స్థాయికి సరిపోగలదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అత్యంత గంభీర సన్నివేశాల్లో క్వెంటిన్ మార్కు హాస్యాన్ని జొప్పించి ఎదో హైబ్రీడ్ వంగడాల్లా రుచి పచీ లేకుండా చేశాడనిపించింది. కానీ సినిమా విద్యార్థులు, ప్రపంచ సినిమాపై ఆసక్తి ఉన్నవాళ్ళూ తప్పక వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తోంది. థియేటర్‌లో చూసే అవకాశం కోల్పోకండి.

తా.క.: పైన ఉదహరించిన చిత్రాల్లో life is beautiful సినిమా మీరు చూడకపోతే ఎలాగైనా సంపాదించి చూడండి. personally, I think its one of the best movies ever made. It will forever remain in my all time top 5 list.

Labels:

Thursday, September 17, 2009

మిలియన్స్ - ఒక డానీ బోయ్ల్ సినిమా

స్లండాగ్ మిలియనీర్ తీసి డానీ బోయ్ల్ ఇండియా అంతా ఫేమస్ అవకముందు 2004లో తీసిన సినిమా ఇది. క్రిటిక్స్ సంగతేమో తెలీదు కానీ నాకైతే నా ఆల్‌టైం టాప్ 5 లో ఉంటుందీ సినిమా. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మనలోనూ ఎక్కడో ఒక పసిమనసు దాగుండాలి అంటారు.డానీ బోయ్ల్ లో మాత్రం తప్పక ఒకపసివాడున్నాడని నా అనుమానం.

కథ విషయానికొస్తే డేమియన్, ఆంథొనీ ఇద్దరన్నదమ్ములు. ఇద్దరి వయసు ఎనిమిది నుండి పన్నెండేళ్ళ లోపే. వాళ్ళమ్మ పోవడంతో, నాన్నతో పాటు ఒక కొత్త నెయిబర్‌హుడ్ కి మారతారు. పెద్దవాడైన ఆంథొనీ స్ట్రీట్ స్మార్ట్ కిడ్. చిన్నవాడైన డేమియన్‌కి క్రిస్టియన్ సెయింట్స్ కనిపిస్తుంటారు. వాళ్ళందరితో తరచూ మాట్లాడుతుంటాడు. ఆంథొనీ, వాళ్ళ నాన్న ఇదొ పిచ్చిగా భావించి పట్టించుకోరు. డేమియన్‌కి చనిపోయిన వాళ్ళమ్మ సెయింట్ గా మారిందో లేదో అని ఒక దిగులు. కనిపించిన సెయింట్సందరినీ అడుగుతుంటాడు. ఇదిలా ఉండగా లండన్‌లో జరిగిన బాంక్ రాబరీసొమ్ము ఒక మిలియన్ పౌండ్ల బాగ్ డేమియన్ చేతికి చిక్కుతుంది. మూర్తీభవించిన మానవత్వం, అమాయకత్వమైన డెమియన్ ఆ డబ్బులు దేవుడే పంపించాడని పేదవాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాడు. తనకి కనిపించే సెయింట్స్ కూడా అవుననే చెబుతారు. ఇక డేమియన్ డబ్బుల్ని పేదవాళ్ళనుకున్న ప్రతివారికిస్తుంటే ఆంథొనీ ఎవ్వరికీ తెలీకుండా జాగర్తపడుతుంటారు. ఉన్నట్టుండి వచ్చిన డబ్బుల్తో ఆంథొనీ స్కూల్లో స్టార్ స్టేటస్ మెయింటెయిన్ చేస్తుంటాడు. ఈలోగా ఒక దొంగకి కొంచెం అనుమానమొచ్చి డేమియన్ ఆంథొనీల వెంటపడుతాడు. డేమియన్ ఆ దొంగ నుండి తప్పించుకొని ఆ డబ్బులకెలా న్యాయం చేశాడు? సెయింట్సంతా తనకి ఎలా తోడ్పడ్డారన్నది మిగతా సినిమా.

సినిమా నిండా డానీ బోయ్ల్ మార్కు సన్నివేశాలు, అంతర్లీనమైన హాస్యం పుష్కలంగా ఉంటుంది. పిల్లలిద్దర్నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్నాడు. రెండు వేల నాలుగులో నేను చూసినప్పటినుండీ ఎంతో మందికి చూపించానీ చిత్రాన్ని. బాలేదన్న వాళ్ళొక్కరూ లేరు ఇప్పటివరకు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఎలాగోలా సంపాదించి చూడండి.

తా.క. సోనీ పిక్స్‌లో గురువారం రాత్రి ఈ సినిమా చూసి సడన్‌గా ఇదంతా చెప్పాలనిపించింది. :) స్లండాగ్ మిలియనీర్ కంటే ఈ సినిమాకి డానీ బోయ్ల్ కి ఎక్కువ పేరు రావల్సింది. (స్లండాగ్ - గ్లోరిఫైడ్ పావర్టీ అనుకునేవాళ్ళలో నేనూ ఒకణ్ణి.)

Wednesday, September 09, 2009

హర్భజన్ సింగ్ వివాదం మీడియా ఓవరాక్షన్

క్రింద వీడియో చూడండి. నిజంగా హర్భజన్ ఎవరినైనా పంచ్ చేశాడా?ఎవడైనా కెమెరాతో మన తలను తాటిస్తే ఏం చేస్తాం? ఇలాంటి సొల్లు కబుర్లను ఎందుకు మీడియా సెన్సేషనలైజ్ చేస్తోంది?ప్రేక్షకులారా/పాఠకులారా జాగర్త. ఇంకోసారి మీడియా ఏదైన సంచలనాత్మక వార్త రాస్తే నాణానికి ఆవైపేం జరిగిందో అని కూడా ఆలోచించండి. గుడ్డిగా నమ్మకండేం.


రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్

యిమూ ఝాంగ్ అనగానే ప్రపంచసినిమాలో ఆసక్తి ఉన్న ప్రతివారికీ గుర్తొచ్చేది "హీరో" సినిమా. ఇంకా house of flying daggers సినిమా. కేవలం యాక్షన్ సినిమాలే తీస్తాడేమో అన్న భ్రమలను పటాపంచలు చేస్తాడీ సినిమాతో. స్థూలంగా కథనానికి వస్తే :
జపానీయులైన తకత, కెనిచి తండ్రీ కొడుకులు. కెనిచి వాళ్ళమ్మ మరణంతో ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి ఒకరినొకరు కలుసుకోకుండా విడిపోతారు. చాన్నాళ్ళకు కెనిచికి ఒంట్లో బాలేదని తెలిసి తకత జపాన్ వస్తాడు. కానీ కెనిచి తండ్రిని చూడడానికి నిరాకరించేసరికి తకత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కెనిచి భార్య తను నిర్మించిన డాక్యుమెంటరీ ఒకటి తకత కి కానుకగ ఇస్తుంది.
ఊరెళ్ళిన తకత ఆ డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో కెనిచి ఒక చైనీయ జానపదనృత్యాన్ని చిత్రీకరిస్తూ, ఆరోజు లీడ్ సింగర్ గొంతు బాలేకపోవడంతో అతని గానమొక్కటి రికార్డు చేయలేకపోతాడు. ఇంతలో కెనిచి కి లివర్ కాన్సర్ అని తెలుస్తుంది తకత కి. కొడుకు కోసం తకత చైనా వెళ్ళి ఆ డాక్యుమెంటరీ షూట్ చేసి తీసుకువద్దామనుకుంటాడు. దాంతో మొదలవుతుంది తకత పయనం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ లీడ్ సింగర్ జైల్లో పడ్డం, అదికారుల కాళ్ళా వేళ్ళా పడి పర్మిషన్ సంపాదించి జైలుకి వెళ్తే ఆ రోజు ఎక్కడో పుట్టిన కొడుకును తలచుకొని లీడ్ సింగర్ పాడలేకపోతాడు. ఇలాకాదని తకత వాళ్ళ కొడుకు యాంగ్‌యాంగ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఊరివాళ్ళనొప్పించి తనని తీసుకువస్తుంటే దార్లో వాళ్ళిద్దరూ తప్పిపోయి ఒక రాత్రంతా కాన్యన్స్‌లో తప్పిపోతారు. ఆ రాత్రీ, మొత్తం ఈ ప్రయాణంలో తకత తన గురించి, కొడుకు గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి ఆ డాక్యుమెంటరీ చివరికి షూట్ చేయగలిగాడా? కెనిచి కి ఏమవుతుందీ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోండి.
సినిమాలో ఆకట్టుకొనేవి రెండు విషయాలు. విజువల్స్. యిమూ ఝాంగ్ సినిమాల్న్నీ దృశ్యకావ్యాలే (మన సంజయ్ లీలా భన్సాలి గుర్తొస్తారు. ప్రతీ ఫ్రేం విజువల్ రిచ్‌నెస్‌టో ఉట్టిపడుతుంది). ఇక రెండవది, ముఖ్యమయింది ఒక బాధని సినిమాలోకి అనువదించడం. దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించలేకపోతే చిత్రం తేలిపోయేది. ప్రతీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దారు. జీవితమే ఒక వేయిమైళ్ళ పయనం. పంతాలకు పట్టింపులకుపోయి దాన్ని ఒంటరి పయనంగా మార్చుకుంటే ఎడతెగని పయనమవుతుంది. బోలెడు బంధాలు ప్రేమలు, బ్రేకప్పులు, మేకప్పులతో సందోహంతో గడిపితే కలగా మిగులుతుంది. మంచి కళ రసికున్ని వేరే time and space లోకి transcend చేస్తుందంటారు. ఈ సినిమా ముమ్మాటికీ అదేపని చేస్తుంది.మీకు కాస్త నిదానంగా నడిచే మీనింగ్‌ఫుల్ సినిమాలు చూడ్డంలో అట్టే అభ్యంతరం లేకపోతే తప్పక చూడొచ్చు.

ఈ సినిమా చూశాక నాకు ఇస్మాయిల్ కవితొకటి గుర్తొచ్చింది. కవిత ఇక్కడ.
===
రికార్డు (ఇస్మాయిల్ విరచితం)

తిరిగి తిరిగిరికార్డుపాట అంచున ఆగుతుంది.
ఇప్పుడు దీని కర్తెవరో చదివి తెలిసికోవచ్చు.
జీవితం ఆగినా కర్త పేరు తెలీదు.

రికార్డుకు మల్లే దీన్ని మళ్ళీ వేయలేం.
వేసినా మొదటిలా ఉండదేమో.
కవిత్వం లాగే
మరో మారు చదివితే మొదటిలా ఉండదే.
కన్యాత్వం పోతుంది.

సాఫీగా సాగే రికార్డు ఆయుష్షు మూడు నిమిషాలు.
గాడి పడితే అనంతం.
బాధ - జీవితానికి గాడి.
=====

Labels:

Monday, August 31, 2009

నేను చదివిన మొదటి నవల

పుట్టగానే ఎక్కడ బోల్డు సుఖపడిపోతానో అని కాబోలు దేవుడు నాకంటే ముందు అన్నయ్యని పుట్టించి ఉంచాడు. నాకు బుద్ధి తెలిసినప్పటినుండి మేమిద్దరం పోటీ పడని క్షణం లేదు. అన్నం దగ్గిర ఎవరు ఫస్ట్ డిష్ టేస్ట్ చూస్తారో, ఎవరు ఫాస్ట్‌గా తింటారో, ఎవరు ఫస్టు చేతులు కడుక్కుంటారో అని, హోంవర్క్ ఎవరు ఫస్ట్ పూర్తి చేస్తారోనని, స్కూల్ నుండి ఎవరు ఫస్ట్ వస్తారో అని....ఉఫ్....ఇంట్లో రోజూ రామరావణ యుద్ధాలే.

ఒక్కవిషయంలో మాత్రం ఈ పోటీ ముదిరి పాకాన పడేది. ఎందుకంటే ఆ పోటీలోగనక ఓడిపోతే, ఇక నెలరోజులు ఎదుటివాడి దెప్పులు భరించాలి. అదే చందమామ ఎవరు ఫస్ట్ చదువుతారో అన్న పోటీ. నెలలో మొదటి మూడు రోజులు పేపరువాడికోసం పొద్దున్నే కాపలా కాసేవాళ్ళం. పొరపాటున మనం లేని సమయంలో చందమామ వస్తే? హమ్మో ఇంకేమైనా ఉందా.. అన్నయ్య దాచిపెట్టేసి స్కూలునుండి రాగానే చదివేయడూ..అబ్బో అదొక టెన్స్ లైఫ్ లెండి. ఎనీవే, కొన్నాళ్ళకి సంధి కుదుర్చుకొని చందమామని వదిలేశాం ఎందుకంటే ఇద్దరం తోడుదొంగలుగా ఒక పని చేయాల్సి వచ్చింది.

ఎండాకాలం సెలవులొచ్చాయి. మధ్యాహ్నం బయటకి వెళ్ళామని తెలిసిందో సాయంత్రం బడితెపూజ(అప్పుడప్పుడు బెల్టుపూజ) జరిగేది. పోనీ మూడుగంటలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటే రోజూ వేళ్ళు నెప్పులు పుట్టేలా ఇరవయెక్కాలు రాయించేవారు. అమ్మ పడుకునేదాక ఏదో గీకేసి పడుకోగానే మా రహస్య స్థావరంలోకి వెళ్ళేవాళ్ళం. స్థావరమంటే ఎక్కడో ఉందనుకునేరు. మా ఇంట్లోనే పట్టెమంచాలు గోడవారగా వేసి పెట్టి వాటిపై బట్టలారేసేవాళ్ళు. దాంట్లో దూరి చక్కగా షాడో నవల్లు చదివేసేవాళ్ళం. దీంట్లో ఆశ్చర్యమేముందా? (నాకప్పుడు ఏడేళ్ళు, అన్నయ్యకు తొమ్మిది). అప్పుడు మాకేమర్థమయ్యేవో, ఎందుకు చదివేమో ఇప్పటికీ నవ్వొస్తుంది తలచుకుంటే. బహుశా వెధవపని చేస్తున్న థ్రిల్ అనుకుంటా :) మొత్తానికి ఒక వేసవి కాలం నాన్న దగ్గిరున్న షాదో నవలల్ సిరీస్ అంతా చదివి మేం కనిపెట్టిందేమంటే అన్నీ ఒకేలా ఉంటాయి డొక్కు నవల్లు...నాన్నగారెందుకు చదువుతారో ఏం పాడో అని. అలాగే ఆంధ్రభూమి, యువ ఇలాంటివన్నీ చదివేసేవాళ్ళం. అమ్మకు తెలిస్తే వీపు చీరేస్తుందని తెలిసీ. అప్పట్లో యువ దీపావళి సంచిక అని ఇంతేసి లావుపాటి పుస్తకమొచ్చేది. అలాగే ఒక చిన్న నవల కూడా ఉండేది (యువదో, స్వాతిదో). అన్నీ చదివేవాళ్ళం ఒక నవల తప్ప. మల్లిక్ కార్టూన్లు, రాగతి పండరి ముగ్గుల కార్టూన్లు చదువుకొని బోల్డు నవ్వుకునేవాళ్ళం. కథలు చదివినట్టు గుర్తు కానీ నవలలు మాత్రం పెద్దయ్యాకే చదవాలని ఒక అన్‌స్పోకెన్ రూల్ ఉండేది..

మూడేళ్ళకో బదిలీతో నాన్న ఊర్లు మారడం మొదలవగానే అన్నయ్యని బాబాయి దగ్గరకి, నన్ను హాస్టల్కి పంపించేశారు నాన్న. మొట్టమొదటి సారి హాస్టల్లో నాలుగునెలలు ఏకధాటిన అమ్మ నాన్నలకి దూరంగా ఉండి రేపనగా ఇంటికి వెళ్తామన్న రోజు. ఆ రోజెందుకో బోలెడు ఫ్రీ టైం దొరికి హాస్టల్లో 'చెక్కీ అని ఓ మిత్రుడి దగ్గరకి వెళ్ళాను. (అసలు పేరు రమేశ్ చక్రవర్తి లెండి). మా చెక్కి గాడి దగ్గిర ఒక పెద్ద నవల కనిపించింది. టైటిల్ "ఏడు తరాలు". ఇప్పుడైతే చూసేవాళ్ళు, వద్దనేవాళ్ళు ఎవరూ లేరు కదాని చదవడం మొదలెట్టా. సాయంత్రం మొదలెడితే రాత్రి అందరు పడుకున్నా వదల్లేదు. నేను ఓరాత్రి మూడింటివరకూ ఆ నవల చదువుతూ ఉండిపోవడం ఇప్పటికీ గుర్తు. ఆరో తరగతిలో రాత్రంతా మేల్కొని చదివింపజేసిన ఆ నవల అంటే ఇప్పటికీ నాకు భలే ఇష్టం. ఒకవైపు ఆ బానిస నాయకుడి బాధననుభవిస్తూ, మరోవైపు నవల చదువుతున్నందుకు థ్రిల్లవుతూ బాగా గుర్తుండి పోయిందా రోజు.ఇంజనీరింగులో జాయిన్ అయ్యాక మళ్ళీ ఆ పుస్తకం ఏక్కడ దొరుకుతుందని తెగ ట్రై చేశా. అందరు తెలుసని చెప్పేవాళ్ళే కానీ అదెక్కడా దొరికేది కాదు. ఒకరోజు పేపరు చదువుతుంటే తెలిసింది. అది "రూట్స్" అనే గొప్ప నవలకు అనువాదమని. ఇక ఒరిజినల్ సంపాదించి చదివి మళ్ళీ ఆ నాయకుడి బాధంతా అనుభవించాను. అమెరికాలో కూడా ఆ పుస్తకం మరొక్కసారి చదివాను. మొన్నీ మధ్య సహవాసి గారి అనువాదం చూసాను ఏడుతరాలకి. కానీ అది చిన్న పుస్తకం. నేను చదివింది సాహిత్య అకాడెమీ వారి బౌండు పుస్తకమని గుర్తు. మరెవరైనా ఈ నవలకి అనువాదం చేసారా? లేక నేను చదివింది సహవాసి గారి అనువాదమేనా అన్నది నాకు ఇప్పటికీ తేలని బేతాళప్రశ్న. ఆ తరువాత గోర్కీ అమ్మ, దాశరధి చిల్లర దేవుళ్ళు చదివాను. అవి కూడా అద్భుతమైన పుస్తకాలు. అవండీ నేను మొట్ట మొదట చదివిన మూడు నవల్లు. మూడు గొప్పవే.

ఇదంతా చదువుతుంటే మీరు చదివిన మొదటి నవల గుర్తొచ్చిందా? ఆలస్యమెందుకు..వేసెయ్యండొక టపా.
తా.క.: అన్నయ్యకీ నాకు ఇప్పుడు పోటీలేదు గానీ, పుస్తకాలు వొరేషియస్ గా చదివే అలవాటు ఇప్పటికీ ఇద్దరికీ పోలేదు. పుస్తకాలే లేకుంటే లైఫ్ ఎంత బోర్ కదా.