Thursday, January 28, 2010

తిమ్మరుసు పుస్తకం

టైటిల్ చూసి మంచి పుస్తకం ఆనవాలు దొరికిందనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.

గుమ్మడిగారు పోయారని ఈటీవీలో "మహామంత్రి తిమ్మరుసు" సినిమా వేస్తున్నారు. ఈ సినిమా చూస్తోంటే మనసు అలా వలయాల్లోకి వెళ్ళి ఎక్కడో ఒక చిన్నప్పటి ఆదివారం మధ్యాహ్నం దగ్గర ఆగిపోయింది. ఏడెనిమిదేళ్ళ వయసప్పుడనుకుంటా. ఒకరోజు అమ్మతో పాటు ఎవరో తెలిసినవాళ్ళింటికి వెళ్ళాను. వెళ్ళిన ఇంటావిడ గర్ల్స్ హైస్కూల్లో హిందీ టీచరు. వాళ్ళింట్లో పిల్లలెవరూ ఉండరు. ఆవిడ వాళ్ళబ్బాయి ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ఏ పదో తరగతో పధ్నాలుగో తరగతో చదివేవాడు. నేను ససేమీరా వెంటరానని మారాం చేస్తే ఒక అరగంట పని చూసుకొని తిరిగి వచ్చేయాలని ఒప్పందం కుదుర్చుకుని వెంటతీసుకొని పోయింది అమ్మ. తీరా అక్కడికి వెళ్ళాక తేలిందేమంటే ఆవిడ పాపం అమ్మనెక్కడికో తోడుకు తీసుకెళ్ళాలని పిలిచాలట. నేనక్కడ అనవసరంగా ఉన్నానని అర్థమయ్యింది.వాళ్ళ వెంట వెళ్ళడానికి లేకా, ఇంటికి వెళ్ళడానికి లేకా నేనక్కడ ఇరుక్కున్నాను. నా ఆదివారం మధ్యాహ్నం అలా చట్టుబండలైనందుకు అమ్మ మీద కోపంతో గుర్రుగా చూస్తున్నాను. పాపం అమ్మ ఎలాగో ఊరడించి, ఎవేవో వాగ్దానాలు చేసి ఏదైనా కథల పుస్తకం చదువుతూ కూర్చో అని ఆవిడని అడిగారు. ఏవైనా ఉన్నాయా అని? వాళ్ళింట్లో బోల్డన్ని హిందీ పుస్తకాలున్నాయి. నాకింకా హిందీ అ, ఆ లు మాత్రమే వచ్చు. నీరసపడిపోయి వెతుకుతూ ఉంటే వాళ్ళబ్బాయి తెలుగు ఉపవాచకమొక్కటి కనిపించింది. అప్పాజీయో తిమ్మరుసో టైటిల్ సరిగా గుర్తు లేదు. సరే ఏదో ఒకటి అని చదువుతూ కూర్చున్నాను. ఎంత అద్భుతమైన పుస్తకమది. అసలు నాకు టైమూ అవీ గుర్తుంటేగా.. అలాగే చదువుతూ వాళ్ళింట్లో ఉండిపోయాను. రెండు గంటనుకున్న వాళ్ళ పని నాలుగ్గంటలయ్యింది. వాళ్ళబ్బాయి ఏదో పరీక్షకు చదువుతూ నన్ను పట్టించుకోలేదు. నేను తనని పట్టించుకోలేదు. బోల్డంత సమయం గడిచాక అయ్యో ఆలస్యమయిందంటూ కంగారు పడుతూ అమ్మ వచ్చేసింది. కంప్లైంట్లు లేవు అలకల్లేవూ. (మరి నేను విజయనగరసామ్రాజ్యంలో ఉన్నా కదా) ఇంటికి వెళ్తుంటే విచారంగా ఉన్న నన్ను చూసి చెబుతోంది అమ్మ. అనుకోకుండా ఆలస్యమైందిరా సారీ అని. నేనింకా తిమ్మరుసు ముగింపునుంది కోలుకోలేక పాపం, అప్పాజీ కళ్ళు పొడిచేయడం తప్పుకదమ్మా అని బాధపడుతూ అడిగాను. విషయం గ్రహించి చిన్నగా నవ్వుకుంటూ సందేహనివృత్తి చేసింది అమ్మ.

వలయాలు మళ్ళీ వెనక్కి తిప్పితే... కాస్త పెద్దయ్యాక ఆ పుస్తకం కోసం ఎంతో వెతికాను. అది ఒక తెలుగు ఉపవాచకం పుస్తకమని తెలుసు కానీ కనీసం ఏ తరగతి ఉపవాచకమో కూడా తెలీదు. రచయిత అంతకన్నా తెలీదు. ఎవరికైనా నేను ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నానో తెలిస్తే కాస్త చెబుదురూ...ప్లీజ్.

Sunday, January 17, 2010

ఓం శాంతి సినిమా సమీక్ష

పండక్కి విడుదలైన బోలెడు స్టార్ సినిమాల మధ్యలో ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. రెండు ప్రధాన వెబ్‌సైట్లు తెలుగుసినిమా.కాం, ఐడిల్ బ్రెయిన్లలో కూడా ఈ సినిమా ఊసు లేదు. ప్రసాద్స్‌కి వెళ్తే ఒక్క ఈ సినిమాకే టికెట్స్ దొరుకుతున్నాయి అని చెబితే సరే నవదీప్, కాజల్ ఐతే బానే చేస్తారు కదా పర్లేదని కొన్నాం. తీరా సినిమాలో కూర్చున్న తర్వాత నాతో వచ్చిన వాళ్ళెవరికీ నచ్చకపోయినా నాకైతే ప్రిడిక్టబుల్ స్టార్ సినిమాలకన్నా ఇదే బాగుందనిపించింది.

ఐదేళ్ళ క్రితం హాలివుడ్‌లో క్రాష్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా వచ్చింది. ఆ రైటర్ పాల్ హాగిస్ కు ఆస్కార్ కూడా సంపాదించి పెట్టిన చిత్రమది. సినిమాలో ఒక ఏడెనిమిది కథలు పారలల్‌గా సాగుతుంటాయి. చివరకు అన్నీ ఒకో చోట కలిసి slice of life తరహాలో ముగుస్తాయి. ప్రతీ కథలో అంతర్లీనంగా జాత్యహంకార చిత్రణ ఉంటుంది. ఇలాంటి పారలల్ థ్రెడ్స్ మాడల్ క్రాష్ లోనే మొట్ట మొదట వాడారా అన్నది ఎవరైనా సినిమా చరిత్రకారులెవరైనా చెప్పాలి. ఈ ఓం శాంతి చిత్రం కూడా ఇదే తరహాలో ఉంటుంది. ఐదు చిన్న కథలు పారలల్‌గా నడిచి ఒక చిత్రమైన ముగింపులో కలుస్తాయి.

నవదీప్ కథ నేటి ఐ.టీ ఇంజనీర్ల జీవితానికి ప్రతీక. ఉద్యోగం ఉన్నన్నాళ్ళూ విలాసవంతమైన జీవితాలూ, ఉద్యోగం ఊడితే వచ్చే రకరకాల ఒత్తిళ్ళూ చాలా రియలిస్టిక్‌గా, బోరు కొట్టించకుండా ఉంటుంది. నవదీప్ నటన బాగుంది. ఈ కథలో సునిల్ కామెడీ బాగా పండింది. ఇక రెండో కథ కాజల్ ది. జీవితాన్ని ఓ ఆటగా తీసుకొనే థ్రిల్ సీకింగ్ మెంటాలిటీ కాజల్‌ది. అర్ధరాత్రి స్మశానాల్లో ఆడపిల్లలూ కొంచెం సత్య దూరంగా ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంతివే ఇంకా కొన్ని రాండం యాక్ట్స్ ఉంటాయి. కానీ సినిమా మధ్యలో కాజల్ పాత్రతో ప్రేక్షకులు ఎంపథైజ్ అవుతారు. ఈ పాత్రకు చక్కని ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ఇక మూడో కథ ఉన్న ఊర్లో భూములమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుదామని ప్రయత్నించే ఒక కొడుకు పాత్ర. (ఈ నటుడెవరోనాకు తెలీదు. ) ఈ కథ కూడా చాలా బాగా చిత్రీకరించారు. తల్లి పాత్రకు మేకప్ మాత్రం కామెడీ అనిపించింది. ఇక నాలుగో కథ హాపీ డేస్ నటుడు నిఖిల్ ది. సినిమా మోజులో పడి సిటీకి వచ్చి మోసపోయే అనేకమంది ఔత్సాహికుల కథ. ఈ కథలో బోలెడంత కామెడీ జొప్పించ చూశాడు దర్శకుడు. నటనంతా ఓవర్ ద టాప్ గా ఉంది చాలా మట్టుకు చికాకు కలిగిస్తుంది. శివారెడ్డి వంటి ప్రతిభాశాలికి అలాంటి చెత్త పాత్ర ఇచ్చి సరైన న్యాయం చేయలేదు. ఈ కథలో స్క్రిప్టు ఇంకొంచెం మంచిగా రాసుకొనుండాల్సింది. ఇక ఐదో కథ బిందుమాధవిది. ఈ అమ్మాయికి నటనకి పెద్ద ఆస్కారంలేని చిన్న పాత్రనిచ్చారు. ఒక మిలిటరీ కాప్టెంతో పెళ్ళి నిశ్చయమయి, అతని కోసం వేచి చూస్తుంటుంది. తన అన్నేమో టెర్రరిస్టు. ఐదు కథలు వేటికవే ఒక సినిమా తీయగల నిడివి ఉన్న కథలు. వీటిని ఇరవయి నిమిషాల్లోకి కుదించాల్సేసరికి అన్నీ చాలా స్టీరియో టైపెడ్ గా తయారయ్యాయి. మొత్తానికి తెలుగు సినిమాల్లో ఇదో ప్రయోగమనే చెప్పొచ్చు.

సినిమా ప్రయోగాత్మకంగా ఉండడం బానే ఉన్నా ఎవరైనా గట్టి స్క్రీన్ ప్లే రైటరు దొరికుంటే ఇంకొంచెం బాగా పండి ఉండేది అనిపించింది. కాజల్ కథ చాలా అసంబద్ధంగా ఉంటుంది. కాస్త పకడ్బందీగా రాసుకొనుండాల్సింది. సినిమాలో నిఖిల్ కామెడీ కంటే సునిల్ కామెడీకే జనాలు బాగా రియాక్టయ్యారు. అలాగే టెర్రరిస్టు ఆంగిల్ ని చాలా అన్‌రియలిస్తిక్ గా చిత్రీకరించారు. బాంబు డిజైన్లు చక్కగా చార్టుల్లో గీసి ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? సినిమా సంగీతం ఇళయరాజా అని గంపెడాశలు పెట్టుకుంటాం. ఒక పాట మినహా మిగిలిన సంగీతం ఓఖే అనిపిస్తుంది. దర్శకుడు సరిగ్గ వాడుకోలేదో మరెంటో..డైలాగు రైటర్ బాగున్నాడు. నాకు నచ్చిన రెండు డైలాగులు..
1)ఎక్స్క్యూజ్ మి. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లా?
అవును..ఎలా కనుక్కున్నారు?
మరేం లేదు. మీరిద్దరే ఐనా రెండు పిజ్జాలు ఆర్డర్ చేసి సగం సగం వదిలేస్తేనూ..":)
2)తెల్లారి లేస్తె మట్టిని కళ్ళకద్దుకునేవాళ్ళం మనకు నెలకు లక్ష ఖర్చులు అవసరమట్రా?

ఎప్పుడూ ఒక హీరో, హీరో చేతిలో తన్నులు తినే విలన్లూ, తిట్టినా, ఇన్సల్టు చేసినా వాణ్ణే ప్రేమించే హీరోయినూ, ఓ ఐటం సాంగూ, హీరో పక్కన తొట్టి గాంగు తో కొంచెం కామెడీ లాంటి దినుసులు కూర్చుకొన్న ఫార్ముల చిత్రాలతో మీరు విసుగెత్తి పోయుంటే, మీలాంటి వారికి ఇది ఒక వెల్కం బ్రేక్. అలా కాక స్టార్ వాల్యూ చూసి ఎంజాయ్ చేసే టైపైతే మీరు దూరంగా ఉండడమే మంచిది.

ఈ సినిమాకు వెళ్ళడం వల్ల నాకు దక్కిన అడిషనల్ బోనస్ ఏంటంటే.మా ముందు వరసలో కూర్చొని సినిమా చూసిన కీరవాణి, రాజమౌళిలతో మాట్లాడ్డం :) both of them were gentlemen with no starry airs.

Tuesday, January 05, 2010

3ఇడియట్స్ మీద చేతన్ భగత్ గొడవ

చిన్నప్పుడు పావల అద్దెకి తెచ్చుకొనే నవల్లో ఒక రిపీటెడ్ థీం ఉండేది. ఒక రాజకుమారిని రాక్షసుడు ఎత్తుకుపోయి ఎక్కడో దీవుల్లో దాచిపెడతాడు. రాజుగారు రాజ్యమంతా చాటింపు వేస్తారు. రాజకుమారిని వెతికి తెచ్చిన వారికి రాకుమారినిచ్చి పెళ్ళి చేయడమో లేదా అర్ధరాజ్యమివ్వడమో లాంటి బహుమతిస్తామని. రాజాగారి దగ్గరకి ఒక ముగ్గురు యువకులు వస్తారు. మొదటివాడి దగ్గర రాజకుమారి ఎక్కడ ఉందో కనుక్కునే దుర్భిణి ఉంటుంది. రెండవ వాడి దగ్గర అక్కడికి తీసుకు వెళ్ళే మాయా తివాచి ఉంటుంది. మూడవా వాడు వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాజకుమారిని విడిపిస్తాడు. ఇప్పుడు రాజకుమారిని ఎవరికిచ్చి పెళ్ళిచేయాలని ధర్మసందేహం రాగా యుద్ధం చేసినవాడికే దక్కాలని మంత్రి తీర్పిస్తాడు.

ఈ మధ్య 3 ఇడియట్స్ గురించి ఫైవ్ పాయింట్ సంవన్ నవల రచయిత చేతన్ భగత్ కూ, రచయితలు రాజూ హీరానీకి, అభిజాత్ జోషీకి జరిగిన గొడవ చూస్తే మళ్ళీ ఇదంతా గుర్తొచ్చింది. ఒక కథ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఒరిజినల్ రచయితకా? ఆ కథను తీసుకొని ఇంప్రూవైజ్ చేసిన వాళ్ళకా? ఎప్పుడు ఎవరు కొట్టుకుంటారా అని వేచి చూసే మీడియా వెంటనే రంగంలోకి దిగి కొన్ని అవుటాఫ్ కంటెక్స్ట్ కోట్లని సంపాదించి లేని దుమారం సృష్టించింది.


ఆ నవలనూ, సినిమానూ బాగా ఎంజాయ్ చేసిన నాకు వీళ్ళకు గొడవలేంట్రా అని కాస్త నెట్లో వెతికితే తేలింది ఇది.

2004లో చేతన్ భగత్ మెగా సక్సెస్‌ఫుల్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ పుస్తకం వచ్చింది. కథ చాలా సింపుల్. ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళు ఆకతాయి పనులు చేస్తూ ఆఖరుకు కాలేజీలోంచి డిస్మిస్ చేసే పరిస్థితి తెచ్చుకొని చివరికి కాస్త తెలివితో కాస్త శ్రమతో గట్టెక్కుతారు. యువతకు సంబంధించిన థీం ఉండడం వల్ల, కేవలం 95 రూపాయలకు దొరకడం వల్ల పుస్తకానికి విపరీతమైన ఆదరణ లభించింది. దాదాపు పదిలక్షల పుస్తకాలు అమ్ముడు పోయి భారతీయ ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. చేతన్ భగత్ నవల్లన్నీ సినిమాను దృష్టిలో పెట్టుకొని రాసినట్టే ఉంటాయి. రెండేళ్ళయ్యాక వీవీసీ కంపనీ వాళ్ళు పుస్తకానికి పదకొండు లక్షలు చెల్లించి సినిమా హక్కులు కొనుక్కున్నారు. అంతవరకు బాగుంది. ఈ ప్రాజెక్టులోకి ఆమిర్ ఖాన్ అంత గొప్ప స్టార్ రాగానే ప్రాజెక్టు మీద అంచనాలు భారీగా పెరిగాయి. నవల్లో మూడు పాత్రలకూ సమమైన ప్రాధాన్యత ఉంటుంది. మరి ఆమిర్ ఖాన్ అలాంటి సినిమాలో ఇంకొ ఇద్దరు నటులకు ప్రాధాన్యత ఇస్తూ ఎలా నటించగలడు? నవల్లో కాస్త హీరోయిక్ లక్షణాలుండే పాత్ర రైయన్‌ది. సూత్రధారి పాత్ర రాజుది. వీవీసీ వాళ్ళు రయన్ పాత్రనిడివి పెంచి, రాజు పాత్రను కేవలం సూత్రధారిగా మలిచి రయన్ పాత్రకు గుడ్‌విల్ హంటింగ్ లో మేట్ డేమన్ బాగ్రౌండ్ లాంటిదిచ్చి రయన్ పాత్ర ఉదాత్తంగా మలచారు. పూర్తిగా మార్చారా? కాదు. ఇంతకు ముందే నా బ్లాగులో చెప్పినట్టు కొంచెం 5.1, కొంచెం పాచ్ ఆడంస్ తీసుకొని కొంత ఒరిజినాలిటీ తీసుకొని మొత్తానికి మంచి చిత్రాన్నే తీశారు.

చిక్కెక్కడ వచ్చిందయ్యా అంటే, సినిమాలో ముందర వచ్చే టైటిల్స్ లో కథ : రాజూ హీరానీ, అభిజాత్ జోషీ అని ఉంటుంది. చేతన్ భగత్ కి క్రెడిట్ ఎక్కడో సినిమా అయ్యాక రోలింగ్ క్రెడిట్స్ లో వస్తుంది. సినిమా అయ్యాక చేతన్ భగత్ బ్లాగులో కథ70% తనదేనని మూల పాత్రలు మొత్తం నవల్లోంచి తీసుకొని, కీలకమైన మలుపులు కూడా వాడుకున్నారు గావున తనకు కథ క్రెడిట్స్ ఇవ్వాలని అక్కసుగా రాసుకున్నాడు. అసలు బాలివుడ్‌లో హక్కులు కొనుక్కోవడమే లేదు అలాంటిది తాము చక్కగా పదకొండు లక్షలిచ్చి కొనుక్కుని 90% మార్చుకున్నాం తము చేసిన తప్పేంటి? చేతన్ భగత్ పబ్లిసిటీ గిమ్మిక్కులివన్నీ అని వీవీసీ వాళ్ళు గొడవ చేశారు. పనిలో పనిగా ఆమిర్ ఖానుతో ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లూ చూపించి ఇందులో మేం చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

ఏతావాత తేలిందెంటంటే వీవీసీ వాళ్ళు చక్కని లీగల్ ఒప్పందం కుదుర్చుకొని ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారు. చట్టపరంగా వాళ్ళను తప్పు బట్టడానికి లేదు. చేతన్ చెప్పిన దాంట్లోనూ తప్పేమీ లేదు. నవల్లోంచి 70% కాకపోయిన 50% ఐతే కథ తీసుకొన్నారు కాబట్టి తనకి కథ క్రెడిట్స్ ఇవ్వాలి. చేతన్ అసలే IIT, IIM గ్రాడ్యుయేట్. అలాంటిది ఈ సినిమా వాళ్ళ మాయలో పడి అలాంటి అరకొర ఒప్పందమ్మీద ఎందుకు సంతకం చేసినట్టు? హీరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారు తప్పులేదు. కానీ కథ 50% పోలికలు, కాలేజి సెట్టింగులు, మూల పాతలు, కొన్ని ప్రధాన సంఘటనలు నవల్లోంచి తీసుకుంటే నవలాకారుడికి క్రెడిట్ ఇవ్వొద్దా?

చాలా రీసెంట్ఆ స్లం్‌డాగ్ మిలియనీర్ హక్కుల్నీ ఇలాగే కొనుక్కుని కథను సినిమాకు అనుగుణంగా మార్చుకొని సినిమా తీశారు. కానీ స్లండాగ్ నిర్మాతలు, రచయితలు, దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలో రచయిత వికాస్ స్వరూప్ కి క్రెడిట్టిస్తూనే ఉన్నారు. సినిమా టైటిల్స్ లో కూడా వికాస్ కు కథ- కిందర్ క్రెడిట్టొస్తుంది. ఎవరో హాలివుడ్ వాళ్ళు న్యాయంగా ఉన్నప్పుడు బాలివుడ్ వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు? హక్కులు కొనుక్కొని సినిమాలు తీయడాలూ ఇవన్నీ మనకు కొత్త కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయా?

రాజూ హీరానీ, కథకు మీరెన్ని మార్పులు చేసినా కథ మీ సొంతమైతే కాదు. చట్టపరంగా మీరు కరెక్టేనేమో గాని ఎథికల్‌గా ఐతే కాదు. అసలు హాలివుడ్ నుండి ఇన్ని ఫ్రీమేకులు చేసి అతికించిన సీన్లతో సినిమాలు తీసి కథ మాది అంటే ఎలా? నాకైతే రాజూ హీరానీ మీద గౌరవం పదినుండి ఒకటికి వచ్చింది. ఇక చేతన్ భగత్ అంటారా? చేతన్, IIT, IIMలో చదివిన వాడివి. ఈసారైనా కాంట్రాక్టు క్షుణ్ణంగా చదివి సంతకం పెట్టడం నేర్చుకో.