Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Thursday, February 04, 2010

ఇన్‌విక్టస్ - సినిమా సమీక్ష

ప్రసాద్స్‌లో ఇన్విక్టస్ పోస్టర్ చూస్తుంటే మాట్ డామన్, మోర్గన్ ఫ్రీమన్, దర్శకత్వం క్లింట్ ఈస్ట్‌వుడ్ అని కనిపించింది. అర్రె వాహ్ ఇంత మంచి క్యాస్ట్ ఉంది ఏం సినిమా అని ఇంటికొచ్చి సెర్చ్ చేస్తే మండేలా, ఫ్రాన్సువా పినార్ ల కథ అని తెలిసింది. (IPL2 పుణ్యమా అని మొన్నే ఫ్రాన్సువా పినార్ కథ తెలిసింది.) ఇక సినిమా ఇక్కడకు వచ్చేదాక వేచిచూసే ఓపిక లేక డౌన్‌లోడ్ చేసి చూశాను. (Sorry Clint, I promise I will pay and watch it on big screen again.) మోర్గాన్ ఫ్రీమాన్ అనగానే నాకు డ్రైవింగ్ మిస్ డెయిసీ, శాషంక్ రెడంప్షన్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మంచి బారిటోన్ గొంతుతో పోషించే ప్రతిపాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొస్తాడు. అలాగే మాట్ డేమన్ అనగానే గుడ్‌విల్ హంటింగ్ గుర్తొస్తుంది. వాటె బ్యూటిఫుల్ మూవీ. ఇక క్లింట్ ఈస్ట్‌వుడ్ గురించి చెప్పఖ్ఖర్లేదు. వయసు ముదురుతున్నకొద్దీ ఈ మనిషికి తెలివితేటలు ఎలా పెరుగుతున్నాయా అని ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇన్విక్టస్ అంటే లాటిన్ భాషలో అజేయులు/అపరాజితులు అని అర్థం. అలాగే ఇదొక ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కవిత. విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనే కవి ఆసుపత్రిలో ఉండగా కాలు తీసేస్తామన్నప్పుడు రాసుకున్నడు. ఇక్కడ చదవొచ్చు. (http://www.poemhunter.com/poem/invictus/). మండేలాకు ఇష్టమైన కవిత అని ఈ సినిమాలో ప్రస్తావన.

ఇక కథ విషయానికి వస్తే, 1994లో దక్షిణాఫ్రికాలో జరిగిన చారిత్రక ఎన్నికల్లో జాత్యహంకారానికి మంగళం పాడి తెల్లవాళ్ళూ, నల్లవాళ్ళూ ఓట్లు వేసి మండేలాను అధ్యక్షుడుగా ఎన్నుకున్న సందర్భం. ఒక కొత్త దేశం తన చరిత్రను మరిచి, నూతన అస్తిత్వం కోసం పురిటినొప్పులు పడుతోంది. తెల్లవాళ్ళకు నల్లవాళ్ళ మీద అపనమ్మకం. నల్లవాళ్ళకు తెల్లవాళ్ళపై ద్వేషం, ప్రతీకారవాంఛ. అలాంటి సమయంలో సంయమనంతో వ్యవహరించి అందరినీ ఒక్కత్రాటికి తెచ్చి ఒక దేశాన్ని నిర్మించేందుకు ఒక మహోన్నత వ్యక్తిత్వం గల నేత కావాలి. అతనే అపరగాంధీ లాంటి నెల్సన్ మండేలా. మనం చూస్తూనే ఉంటాం. దేశప్రజలను ఏకం చేసేందుకు రెండు సులువైన మార్గాలు యుద్ధం, ఆటలు. మండేలాకు ఈ చిట్కా బాగా తెలిసినట్టుంది. రగ్బీ ఆటను పాపులరైజ్ చేసి తననుకొన్న ఆశయాన్ని కొంతమేరకు ఎలా సాధించాడో చెప్పడమే ఈ సినిమా. ఇంతకన్నా ఎక్కువ చెబితే కథలోకి వెళ్ళినట్టవుతుంది. నిజంగా సినిమా చూశాక మండేలా లేకుంటే దక్షిణాఫ్రిక ఇప్పుడున్న శాంతియుతంగా ఉండేదా లేక మరో జింబాబ్వే అయ్యేదా అన్న అనుమానం కలుగుతుంది.

ఒక బయోపిక్ సినిమాని సందేశాత్మకంగా తీసి మెప్పించడం నిజంగా కత్తిమీద సామే. కానీ క్లింట్ ఈస్ట్‌వుడ్ బాగా డైరెక్ట్ చేశాడు. ప్రథమార్థం అంతా ఒక వ్యక్తిగా మండేలా ఔన్నత్యాన్ని (ఎక్కడా అతిలేకుండా) చూపిస్తే, ద్వితీయార్థంలో ఆటలో మునిగి పోయి మనమూ కాసేపు దక్షిణాఫ్రికన్లమైపోతాము. మండేలాగా మోర్గాన్ ఫ్రీమాన్ నటన అద్భుతం. కేవలం తన నటనకోసమే ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. తప్పకుండా ఆస్కార్ ఈసారి ఫ్రీమాన్ కే వస్తుందనుకుంటున్నాను. అలాగే మాట్ డేమన్ కూడా కాస్త అండర్‌ప్లే చేసి బాగా నటించాడు. (తనకి మాత్రం ఆస్కార్ రాదు. క్రిస్టొఫర్ వాల్జ్ ఉన్నాడు కదా మరి.) స్క్రీన్‌ప్లే కి ఆస్కార్ నామినేషన్ రాకపోవడం నాకైతే ఆశ్చర్యమనిపించింది.

ఇక నాకు ఎంతో నచ్చిన రెండు డైలాగ్స్.
mandela to his bodyguards when he is questioned on recruiting white ppl,
Forgiveness starts here, too. Forgiveness liberates the soul. It removes fear. That is why it is such a powerful weapon.
mandela to his daughter when she is angry at mandela for shaking a whitemans hand
"you seek to address your own personal feelings. That does nt help the nation"


మొన్నొకమిత్రుడితో తెలంగాణ వాదం గురించి మాట్లాడుతుంటే ఒక బంగారం లాంటి మాటన్నాడు. "విడగొట్టడం చిటికెలో పని. ఎవ్వడైనా చేయగలడు. కలుపుకుపోవాలంటేనే అందరికీ చేతకాని పని అన్ని జిన్నాను, గాంధినీ ఉదహరించాడు. అదింకో చర్చనుకోండి. ఆటలు, చరిత్ర, రాజకీయాలు, బయోగ్రఫీలు, మంచి సినిమాలు వీటిల్లో దేనిపైన ఆసక్తి ఉన్నా ఈ సినిమా తప్పక చూడండి

Sunday, January 17, 2010

ఓం శాంతి సినిమా సమీక్ష

పండక్కి విడుదలైన బోలెడు స్టార్ సినిమాల మధ్యలో ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. రెండు ప్రధాన వెబ్‌సైట్లు తెలుగుసినిమా.కాం, ఐడిల్ బ్రెయిన్లలో కూడా ఈ సినిమా ఊసు లేదు. ప్రసాద్స్‌కి వెళ్తే ఒక్క ఈ సినిమాకే టికెట్స్ దొరుకుతున్నాయి అని చెబితే సరే నవదీప్, కాజల్ ఐతే బానే చేస్తారు కదా పర్లేదని కొన్నాం. తీరా సినిమాలో కూర్చున్న తర్వాత నాతో వచ్చిన వాళ్ళెవరికీ నచ్చకపోయినా నాకైతే ప్రిడిక్టబుల్ స్టార్ సినిమాలకన్నా ఇదే బాగుందనిపించింది.

ఐదేళ్ళ క్రితం హాలివుడ్‌లో క్రాష్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా వచ్చింది. ఆ రైటర్ పాల్ హాగిస్ కు ఆస్కార్ కూడా సంపాదించి పెట్టిన చిత్రమది. సినిమాలో ఒక ఏడెనిమిది కథలు పారలల్‌గా సాగుతుంటాయి. చివరకు అన్నీ ఒకో చోట కలిసి slice of life తరహాలో ముగుస్తాయి. ప్రతీ కథలో అంతర్లీనంగా జాత్యహంకార చిత్రణ ఉంటుంది. ఇలాంటి పారలల్ థ్రెడ్స్ మాడల్ క్రాష్ లోనే మొట్ట మొదట వాడారా అన్నది ఎవరైనా సినిమా చరిత్రకారులెవరైనా చెప్పాలి. ఈ ఓం శాంతి చిత్రం కూడా ఇదే తరహాలో ఉంటుంది. ఐదు చిన్న కథలు పారలల్‌గా నడిచి ఒక చిత్రమైన ముగింపులో కలుస్తాయి.

నవదీప్ కథ నేటి ఐ.టీ ఇంజనీర్ల జీవితానికి ప్రతీక. ఉద్యోగం ఉన్నన్నాళ్ళూ విలాసవంతమైన జీవితాలూ, ఉద్యోగం ఊడితే వచ్చే రకరకాల ఒత్తిళ్ళూ చాలా రియలిస్టిక్‌గా, బోరు కొట్టించకుండా ఉంటుంది. నవదీప్ నటన బాగుంది. ఈ కథలో సునిల్ కామెడీ బాగా పండింది. ఇక రెండో కథ కాజల్ ది. జీవితాన్ని ఓ ఆటగా తీసుకొనే థ్రిల్ సీకింగ్ మెంటాలిటీ కాజల్‌ది. అర్ధరాత్రి స్మశానాల్లో ఆడపిల్లలూ కొంచెం సత్య దూరంగా ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంతివే ఇంకా కొన్ని రాండం యాక్ట్స్ ఉంటాయి. కానీ సినిమా మధ్యలో కాజల్ పాత్రతో ప్రేక్షకులు ఎంపథైజ్ అవుతారు. ఈ పాత్రకు చక్కని ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ఇక మూడో కథ ఉన్న ఊర్లో భూములమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుదామని ప్రయత్నించే ఒక కొడుకు పాత్ర. (ఈ నటుడెవరోనాకు తెలీదు. ) ఈ కథ కూడా చాలా బాగా చిత్రీకరించారు. తల్లి పాత్రకు మేకప్ మాత్రం కామెడీ అనిపించింది. ఇక నాలుగో కథ హాపీ డేస్ నటుడు నిఖిల్ ది. సినిమా మోజులో పడి సిటీకి వచ్చి మోసపోయే అనేకమంది ఔత్సాహికుల కథ. ఈ కథలో బోలెడంత కామెడీ జొప్పించ చూశాడు దర్శకుడు. నటనంతా ఓవర్ ద టాప్ గా ఉంది చాలా మట్టుకు చికాకు కలిగిస్తుంది. శివారెడ్డి వంటి ప్రతిభాశాలికి అలాంటి చెత్త పాత్ర ఇచ్చి సరైన న్యాయం చేయలేదు. ఈ కథలో స్క్రిప్టు ఇంకొంచెం మంచిగా రాసుకొనుండాల్సింది. ఇక ఐదో కథ బిందుమాధవిది. ఈ అమ్మాయికి నటనకి పెద్ద ఆస్కారంలేని చిన్న పాత్రనిచ్చారు. ఒక మిలిటరీ కాప్టెంతో పెళ్ళి నిశ్చయమయి, అతని కోసం వేచి చూస్తుంటుంది. తన అన్నేమో టెర్రరిస్టు. ఐదు కథలు వేటికవే ఒక సినిమా తీయగల నిడివి ఉన్న కథలు. వీటిని ఇరవయి నిమిషాల్లోకి కుదించాల్సేసరికి అన్నీ చాలా స్టీరియో టైపెడ్ గా తయారయ్యాయి. మొత్తానికి తెలుగు సినిమాల్లో ఇదో ప్రయోగమనే చెప్పొచ్చు.

సినిమా ప్రయోగాత్మకంగా ఉండడం బానే ఉన్నా ఎవరైనా గట్టి స్క్రీన్ ప్లే రైటరు దొరికుంటే ఇంకొంచెం బాగా పండి ఉండేది అనిపించింది. కాజల్ కథ చాలా అసంబద్ధంగా ఉంటుంది. కాస్త పకడ్బందీగా రాసుకొనుండాల్సింది. సినిమాలో నిఖిల్ కామెడీ కంటే సునిల్ కామెడీకే జనాలు బాగా రియాక్టయ్యారు. అలాగే టెర్రరిస్టు ఆంగిల్ ని చాలా అన్‌రియలిస్తిక్ గా చిత్రీకరించారు. బాంబు డిజైన్లు చక్కగా చార్టుల్లో గీసి ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? సినిమా సంగీతం ఇళయరాజా అని గంపెడాశలు పెట్టుకుంటాం. ఒక పాట మినహా మిగిలిన సంగీతం ఓఖే అనిపిస్తుంది. దర్శకుడు సరిగ్గ వాడుకోలేదో మరెంటో..డైలాగు రైటర్ బాగున్నాడు. నాకు నచ్చిన రెండు డైలాగులు..
1)ఎక్స్క్యూజ్ మి. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లా?
అవును..ఎలా కనుక్కున్నారు?
మరేం లేదు. మీరిద్దరే ఐనా రెండు పిజ్జాలు ఆర్డర్ చేసి సగం సగం వదిలేస్తేనూ..":)
2)తెల్లారి లేస్తె మట్టిని కళ్ళకద్దుకునేవాళ్ళం మనకు నెలకు లక్ష ఖర్చులు అవసరమట్రా?

ఎప్పుడూ ఒక హీరో, హీరో చేతిలో తన్నులు తినే విలన్లూ, తిట్టినా, ఇన్సల్టు చేసినా వాణ్ణే ప్రేమించే హీరోయినూ, ఓ ఐటం సాంగూ, హీరో పక్కన తొట్టి గాంగు తో కొంచెం కామెడీ లాంటి దినుసులు కూర్చుకొన్న ఫార్ముల చిత్రాలతో మీరు విసుగెత్తి పోయుంటే, మీలాంటి వారికి ఇది ఒక వెల్కం బ్రేక్. అలా కాక స్టార్ వాల్యూ చూసి ఎంజాయ్ చేసే టైపైతే మీరు దూరంగా ఉండడమే మంచిది.

ఈ సినిమాకు వెళ్ళడం వల్ల నాకు దక్కిన అడిషనల్ బోనస్ ఏంటంటే.మా ముందు వరసలో కూర్చొని సినిమా చూసిన కీరవాణి, రాజమౌళిలతో మాట్లాడ్డం :) both of them were gentlemen with no starry airs.

Friday, December 25, 2009

3 ఇడియట్స్ - ఫ్రెష్ అవుటాఫ్ అవెన్

అవతార్ సినిమా టికెట్లకోసం "బుక్ మై షో"లో పచార్లు చేస్తుంటే ఉన్నట్టుండి 3 ఇడియట్స్ టికెట్స్ కనిపించాయి. ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్స్. హిందీసినిమా ఫస్ట్డే ఫస్ట్ షో అవసరమా అని ఒకవైపు పీకుతున్నా అమీర్‌ఖాన్ ఉన్నాడన్న ధైర్యంతో కొనేశాను. తీరా రీడిఫ్‌లో రెండు సమీక్షలు చదివితే యావరేజ్ సినిమా అని రాశారు.

ఈ సినిమా చేతన్ భగత్ రాసిన కల్ట్ నవల five point someone ఆధారంగా నిర్మించబడిందని ఎప్పటినుండో చదువుతున్నాను. ఫైవ్ పాయింట్ సంవన్ ని యధాతథంగా తీస్తే గొప్ప సినిమా అవుతుందా? అందులో అన్ని సబ్‌ప్లాట్స్ ఉన్నాయా? అని అనుకున్నాను. 3 ఇడియట్స్ ఫైవ్ పాయింట్ సంవన్ ను యధాతథంగా తీసింది కాదు. ముఖ్యపాత్రలు, కాలేజ్ సెట్టింగ్ అందులోంచి తీసుకొని దానికి కొంచెం good will hunting లాంటి బాగ్రౌండ్ కలిపి, ఇంకొంచెం patch aaDaMs మసాల కలిపి కొంచెం ఒరిజినాలిటీ కూడా కలిపితే 3 ఇడియట్స్.

కథ ఒక ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగు కాలేజిలో నడుస్తుంది. ఆమిర్, మాధవన్, షర్మాన్ హాస్టల్లో రూమ్మేట్స్. బోలెడు కుటుంబభారాలు, ఆశలు మోస్తూ షర్మాన్ వస్తే తండ్రి బలవంతం మీద ఇష్టం లేకున్నా ఇంజనీరింగుకి వస్తాడు మాధవన్. ఆమిర్ అలాకాదు, తనకి మెకానికల్ ఇంజనీరింగంటే ప్రాణం. కష్టపడ్డం బదులు ఇష్టపడి చదవడం వల్ల అన్నిట్లో ముందుంటాడు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే ఆమిర్ వెనక ఒక షాకింగ్ నిజం ఉంటుంది. పొరలు పొరలుగా ఆ నిజాన్ని విప్పుతూ బోలెడు నవ్వులు పండిస్తూ మంచి ఎంటర్‌టైనర్ని తయారుహేశాడు డైరెక్టర్. కొన్ని జోకులు మాత్రం ఇంటర్‌నెట్లో బాగా నలిగిన జోకులు. ముగ్గురు హీరోల్లో మాధవన్ కొంచెం అండర్-యుటిలైజ్డ్. మిగిలిన పాత్రల్లో బొమన్ ఇరాని, కరీనా, చతుర్ రామలింగం క్యారక్టర్ బాగా చేశారు.

రాజూ హీరాని ఇంకా పాచ్ ఆడంస్ మాజిక్ నుండి బయటపడ్డట్టు లేదు. మున్నాభాయిMBBS లో చాలా సీన్లు వాడుకున్నాడు. మిగిలిన కాలేజి సీన్లు, డీన్‌తో ఫైట్ సీన్లు ఈ సినిమాలో పెట్టేసుకున్నాడు. చాలా సార్లు పుస్తకం ఆధారిత సినిమాలు చూసి మనం నిరాశ పడిపోతాం. కాని ఈ సినిమా పుస్తకంలో కేవలం సెట్టింగ్ అండ్ ప్లాట్స్ తీసుకున్నా డెఫినిట్‌గా ఇది అంతకంటే మంచి కథనే ప్రజంట్ చేశాడు.

నవతరంగంలో ఎవరో ఒకరు మంచి రివ్యూ ఎలాగూ ఇస్తారు. ప్రస్తుతానికైతే అదొక పైసా వసూల్ సినిమా అని, లగే రహో మున్నాభై లాగే మంచి ఎంటర్‌టైనర్ అని, రీడిఫ్ లో ఆ 2 ఇడియట్స్ రాసిన రివ్యూలని పట్టించుకోకుండా చక్కగా వెళ్ళి సినిమా చూడంది.

Saturday, October 10, 2009

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి క్వెంటిన్ టరంటీనో గురించి చెప్పఖ్ఖర్లేదు. రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ సినిమాలతో తనదంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. మూసకి భిన్నంగా ఆలోచించడానికి ఇంగ్లీషులో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. thinking out of the box, pushing the envelope అని. వాటికి నిజమైన ప్రతీకగా నిలుస్తాడు టరంటీనో. స్క్రీన్‌ప్లే తో ప్రయోగాలకు పెట్టింది పేరు. అలాగే తన చిత్రాలలో నేపథ్య సంగీతాన్ని చాలా జాగర్తగా ఎంచుకుంటాడు. ఉదాహరణకి కిల్‌బిల్ చిత్రం ఎంత హిట్టాయ్యిందో ఆ సౌండ్‌ట్రాక్ కూడా అంతే హిట్టయ్యింది. అలాంటి డైరెక్టర్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సినిమా తీశాడంటే సహజంగానే చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. పైగా ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు నామినేషన్లు, ఒక అవార్డు సంపాదించింది కూడా. మరి బాగుందా? నేనైతే తప్పక చూడాలని చెబుతాను.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఫ్రాన్స్ ని ఆక్రమించుకొని ఉంతుంది. నాజీలు యూదులను వెతికి మరీ చంపేస్తుంటారు. ఇలాంటి నాజీల గుండెల్లో దడ పుట్టించడానికి అమెరికా నుండి లెఫ్టినెంట్ అల్డో రెయిన్ (బ్రాడ్ పిట్) నాయకత్వంలో ఐనిమిది మంది యూదులబృదం బయలు దేరుతుంది. వీళ్ళ బృందానికి బాస్టర్డ్స్ అని పేరు. వాళ్ళు నాజీలను హతమారుస్తూ, ఒక్కో బృందంలో ఒక్కరిని విడిచి తమ గురించి పదిమందికి తెలిసేలా చేసి మిగిలినవారిని భయపెడుతుంటారు. మరో వైపు షొషానా నాజీల చేతిలో కుటుంబమంతా పోగొట్టుకొని ప్రాణం దక్కించుకున్న యువతి. మూడేళ్ళ తరువాత ఒక సినిమా థియేటర్‌కి ఓనర్‌గా పునర్దర్శనమిస్తుంది. షొషానాతో ప్రేమలో పడిన ఒక జర్మన్ వార్ హీరో వల్ల అతని ఆత్మ కథ ఆధారంగా మలచిన చిత్రం ప్రీమియర్ షొషానా సినిమా హాల్లో ఏర్పాటవుతుంది. తన కుటుంబాన్ని చంపిన కలొనల్ హాన్స్ లాండా వస్తున్నాడని తెలిసి షొషానా ప్రీమియర్ రోజు థియేటర్‌ని పేల్చి నాజీలను చంపాలని పథకం వేస్తుంది. ఆ ప్రీమియర్‌కు హిట్లర్‌తో సహా జర్మన్ అధికారగణమంతా వస్తున్నారని తెలిసి బాస్టర్డ్స్ గాంగ్ కూడా థియేటర్‌ని పేల్చాలని పథకం వేస్తారు. వీళ్ళందరిని వేయి కళ్ళతో కనిపెడుతూ ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉండే నిరంకుశాధికారి కలొనల్ హాన్స్ లాండా. చిత్రం ముగింపు ఏమయిందన్నది తెరపై చూడాల్సిందే.

ఒక చారిత్రక అంశాన్ని తీసుకొని దాన్ని ఫిక్షనలైజ్ రాయడానికి నిజంగానే ధైర్యముండాలి. టరంటీనో ఈ విషయంలో మొదటివాడు కాకపోవచ్చు కానీ గట్టి ప్రయత్నమే చేశాడు. నీజీలు యూదులు లాంటి అతి సున్నితమైన, గంభీరమైన విషయాన్ని తీసుకొని దాంట్లో కామెడీ చొప్పించడం నిజంగానే ఒక ఎక్స్‌పరిమెంటు. ఇక బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని వాడుకున్న తీరు సినిమా విద్యార్థులందరికి ఒక పాఠంగా మిగిలిపోతుంది. లాండా, షోషానా జర్మన్ మిలిటరీ గాంగ్‌తో కలుసుకొనే సీను ఎంత ఉత్కంఠంగా ఉంటుందో తెరమీద చూడాల్సిందే. అలాగే క్లైమాక్ష్ ముందర వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. మరి ఈ సినిమాకు పదికి పది మార్కులు వేయొచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి. కారణం. ఎడిటింగ్ లోపం. ప్రతీ సీన్నూ హాస్యాస్పదంగా మలచడానికి సాగతీసినట్టుంటుంది. అలాగే తియ్యగా మాట్లాడుతూ కోల్డ్ బ్లడెడ్‌గా వ్యవహరించే విలన్ పాత్ర చాలా మూస పాత్ర. లాండా పాత్రకు మరీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాల్సింది కాదు.

నటన విషయానికొస్తే సినిమాలో మనకు బాగా గుర్తుండి పోయే పాత్రలు మూడు. కల్నల్ హాన్స్ లాండా గా క్రిస్టొఫర్ వాల్ట్జ్ బాగా నటించాడు. కాన్స్ లో బెస్ట్ అవార్డ్ వచ్చింది కూడా. షోషానాగా ఫ్రెంచ్ నటి మెలనీ లారెంట్ నటన అద్భుతం. అల్డోగా బ్రాడ్ పిట్ కూడా బాగా నటించాడు.

గత పదిహేనేళ్ళ కాలంలో రెండో ప్రపంచయుద్ధం మీద మూడు పాపులర్ సినిమాలు వచ్చాయి. స్పీల్‌బర్గ్ షిండ్లర్స్ లిస్ట్, రాబర్టో బెనిని "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్", రొమాన్ పొలాన్స్కి "ద పియనిస్ట్". ప్రతీది దేనికదే గొప్పగా ఉంటుంది. మరి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వీటి స్థాయికి సరిపోగలదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అత్యంత గంభీర సన్నివేశాల్లో క్వెంటిన్ మార్కు హాస్యాన్ని జొప్పించి ఎదో హైబ్రీడ్ వంగడాల్లా రుచి పచీ లేకుండా చేశాడనిపించింది. కానీ సినిమా విద్యార్థులు, ప్రపంచ సినిమాపై ఆసక్తి ఉన్నవాళ్ళూ తప్పక వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తోంది. థియేటర్‌లో చూసే అవకాశం కోల్పోకండి.

తా.క.: పైన ఉదహరించిన చిత్రాల్లో life is beautiful సినిమా మీరు చూడకపోతే ఎలాగైనా సంపాదించి చూడండి. personally, I think its one of the best movies ever made. It will forever remain in my all time top 5 list.

Wednesday, September 09, 2009

రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్

యిమూ ఝాంగ్ అనగానే ప్రపంచసినిమాలో ఆసక్తి ఉన్న ప్రతివారికీ గుర్తొచ్చేది "హీరో" సినిమా. ఇంకా house of flying daggers సినిమా. కేవలం యాక్షన్ సినిమాలే తీస్తాడేమో అన్న భ్రమలను పటాపంచలు చేస్తాడీ సినిమాతో. స్థూలంగా కథనానికి వస్తే :
జపానీయులైన తకత, కెనిచి తండ్రీ కొడుకులు. కెనిచి వాళ్ళమ్మ మరణంతో ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి ఒకరినొకరు కలుసుకోకుండా విడిపోతారు. చాన్నాళ్ళకు కెనిచికి ఒంట్లో బాలేదని తెలిసి తకత జపాన్ వస్తాడు. కానీ కెనిచి తండ్రిని చూడడానికి నిరాకరించేసరికి తకత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కెనిచి భార్య తను నిర్మించిన డాక్యుమెంటరీ ఒకటి తకత కి కానుకగ ఇస్తుంది.
ఊరెళ్ళిన తకత ఆ డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో కెనిచి ఒక చైనీయ జానపదనృత్యాన్ని చిత్రీకరిస్తూ, ఆరోజు లీడ్ సింగర్ గొంతు బాలేకపోవడంతో అతని గానమొక్కటి రికార్డు చేయలేకపోతాడు. ఇంతలో కెనిచి కి లివర్ కాన్సర్ అని తెలుస్తుంది తకత కి. కొడుకు కోసం తకత చైనా వెళ్ళి ఆ డాక్యుమెంటరీ షూట్ చేసి తీసుకువద్దామనుకుంటాడు. దాంతో మొదలవుతుంది తకత పయనం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ లీడ్ సింగర్ జైల్లో పడ్డం, అదికారుల కాళ్ళా వేళ్ళా పడి పర్మిషన్ సంపాదించి జైలుకి వెళ్తే ఆ రోజు ఎక్కడో పుట్టిన కొడుకును తలచుకొని లీడ్ సింగర్ పాడలేకపోతాడు. ఇలాకాదని తకత వాళ్ళ కొడుకు యాంగ్‌యాంగ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఊరివాళ్ళనొప్పించి తనని తీసుకువస్తుంటే దార్లో వాళ్ళిద్దరూ తప్పిపోయి ఒక రాత్రంతా కాన్యన్స్‌లో తప్పిపోతారు. ఆ రాత్రీ, మొత్తం ఈ ప్రయాణంలో తకత తన గురించి, కొడుకు గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి ఆ డాక్యుమెంటరీ చివరికి షూట్ చేయగలిగాడా? కెనిచి కి ఏమవుతుందీ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోండి.
సినిమాలో ఆకట్టుకొనేవి రెండు విషయాలు. విజువల్స్. యిమూ ఝాంగ్ సినిమాల్న్నీ దృశ్యకావ్యాలే (మన సంజయ్ లీలా భన్సాలి గుర్తొస్తారు. ప్రతీ ఫ్రేం విజువల్ రిచ్‌నెస్‌టో ఉట్టిపడుతుంది). ఇక రెండవది, ముఖ్యమయింది ఒక బాధని సినిమాలోకి అనువదించడం. దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించలేకపోతే చిత్రం తేలిపోయేది. ప్రతీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దారు. జీవితమే ఒక వేయిమైళ్ళ పయనం. పంతాలకు పట్టింపులకుపోయి దాన్ని ఒంటరి పయనంగా మార్చుకుంటే ఎడతెగని పయనమవుతుంది. బోలెడు బంధాలు ప్రేమలు, బ్రేకప్పులు, మేకప్పులతో సందోహంతో గడిపితే కలగా మిగులుతుంది. మంచి కళ రసికున్ని వేరే time and space లోకి transcend చేస్తుందంటారు. ఈ సినిమా ముమ్మాటికీ అదేపని చేస్తుంది.మీకు కాస్త నిదానంగా నడిచే మీనింగ్‌ఫుల్ సినిమాలు చూడ్డంలో అట్టే అభ్యంతరం లేకపోతే తప్పక చూడొచ్చు.

ఈ సినిమా చూశాక నాకు ఇస్మాయిల్ కవితొకటి గుర్తొచ్చింది. కవిత ఇక్కడ.
===
రికార్డు (ఇస్మాయిల్ విరచితం)

తిరిగి తిరిగిరికార్డుపాట అంచున ఆగుతుంది.
ఇప్పుడు దీని కర్తెవరో చదివి తెలిసికోవచ్చు.
జీవితం ఆగినా కర్త పేరు తెలీదు.

రికార్డుకు మల్లే దీన్ని మళ్ళీ వేయలేం.
వేసినా మొదటిలా ఉండదేమో.
కవిత్వం లాగే
మరో మారు చదివితే మొదటిలా ఉండదే.
కన్యాత్వం పోతుంది.

సాఫీగా సాగే రికార్డు ఆయుష్షు మూడు నిమిషాలు.
గాడి పడితే అనంతం.
బాధ - జీవితానికి గాడి.
=====