Thursday, October 22, 2009

ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు.

బాగా చిన్నప్పటి మాట. నాకు మా ఇంట్లో కొన్ని నిషిద్ధ వస్తువులుండేవి. నాన్నగారి షేవింగ్ కిట్టు, కాల్కులేటర్, అమ్మ కుట్టుమిషను, కత్తెర ఇలాంటివి. ఏదైనా ముట్టొద్దని చెబితే ఇక మన క్యూరియాసిటీ పదింతలయ్యేది. రాత్రింబవళ్ళూ వాటిని ఎలా తీయాలి? వాటితో ఏం చేయాలి అనే ధ్యాస. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిఉన్న సమయంలో గబుక్కున కాల్కులేటరో కత్తెరో తీసి, మా రహస్యస్థావరంలోకి (పట్టెమంచాల మీద చీరలు ఆరవేస్తే చిన్న కాంపు సైటులా తయారయ్యి మా స్థావరంగా పనికొచ్చేది) తీసుకెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి తిరిగి దాని స్థానంలో దాన్ని పెట్టేసేవాణ్ణి. అప్పుడప్పుడే కూడికలు, గుణకారాలు నేరుస్తున్నాను గనుక కాల్కులేటర్ ఎందుకు, ఎలా వాడతారో తెలిసేది కాదు. ఖర్మకాలి ఒకరోజు దానితో ఆడుతుంటే దాని మీద నీళ్ళు పడి పాడయిపోయి ముక్కచివాట్లు తిన్నాను. అలాగే ఓసారి బాడ్మింటన్ రాకెట్ కొనిస్తే దాన్ని నీళ్ళలో ముంచి, కట్టెల పొయ్యిలో పెట్టి ఏవో ప్రయోగాలు చేసి నాశనం చేశాను. అప్పటికే వీడితో జాగర్తగా ఉండాలి అని రెపుటేషన్ సంపాదించాను.

అప్పట్లో మా బడి గవర్నమెంటు బడికి ఎక్కువా కాన్వెంటుకు తక్కువా అన్నట్టుండేది. మా బళ్ళో నియమమేంటంటే నాలుగో తరవతి వరకు అందరూ పెన్సిల్లే వాడాలి. ఐదవ తరగతి నుండి ఇంకు పెన్నులు వాడాలి. అదిగో అలాంటి సమయంలో మా ఇంట్లో ప్రవేశించాయి ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు. కాంలిన్ జామెట్రీ బాక్సు. దాంట్లో ఒక వృత్తలేఖిని, ఒక డివైడర్(తెలుగు పేరు మరిచాను), కోణమానిని, సెట్-స్క్వేర్లు. షార్పెనరు, రబ్బరు(అప్పట్లో ఎరేజర్ని అలాగే అనేవాళ్ళం) పెట్టుకోడానికి వేరే అరలు. యెల్లో కలరు మీద బ్లాక్ లైన్లతో తళతళ మెరుస్తూ చూట్టానికి ఎంత బాగుండేదో. ఇక ఇంకుపెన్నుది ఇంకో అందం.ఓ ఇంకుబుడ్డి, రెండు ఇంకు పిల్లర్లు (ఫిల్లెర్), రెండు తళతళ మెరిసే పాళీలు. ఇంత సరంజామాతో ఠీవీగా అలరారుతుండేది. వచ్చిన చిక్కల్లా నాకు మాత్రం వాటిని ముట్టుకోడానికి పర్మిషన్ లేదు. నేనప్పటికి మూడో తరగతే. అన్నయ్య ఐదో తరగతిలోకి వచ్చాడని కొన్నారు. ఎపుడెపుడు వాటితో ఆడదామా అని ఉవ్విళ్ళూరుతున్నాను. నా క్యూరియాసిటీ ముందే పసిగట్టిన అన్నయ్య ముడితే కాళ్ళిరగ్గొడతానని నాన్నతో వార్నింగిప్పించాడు.

ఇక చూస్కోండి నా కష్టాలు. నేనా చదివేది ముష్టి మూడో తరగతి. వెధవది జామెట్రీ బాక్సు కాదు కద కనీసం స్కేలు కూడా అఖ్ఖర్లేదు. రోజూ బడికెళ్ళే టైంలో మొదలయ్యేది అన్నయ్య తతంగం. మిలిటరీ వాళ్ళు యుద్ధానికెళ్ళే ముందు గన్స్ ఆయిలింగ్ చేసినట్టు అవసరమున్నా లేకున్నా అన్నయ్య జామెట్రీ బాక్సు తీసి అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, ఇంకు పెన్నులో ఇంకు నింపుకొని ఓ ఊరించేవాడు. నేనేం చెయ్యగలను మహా అంటే ఒక సారి పెన్సిల్ చెక్కుకొని మళ్ళీ సంచీలో పడేస్కోవడమే.ఓ వైపు పెద్దగా పట్టించుకోనట్టు నటిస్తూ, ఎప్పటికైనా నేనూ ఐదో తరగతిలో రాకపోతానా? నీ సంగతి తేల్చకపోతానా? అనుకొనేవాణ్ణి. సాయంత్రం బడి నుండి రాగానే మళ్ళీ కొత్తవేషాలు. పొద్దున్నే నింపిన పెన్నును ఇంకు పిల్లరుతో మళ్ళీ నింపుతూ, రికార్డు షీట్లపై వృత్తలేఖినితో వృత్తాలు గీస్తూ వాట్లో రంగులు నింపి బొమ్మలేస్తూ రోజో తమాషా చూపించేవాడు. ఇంకో రోజు అట్ట ముక్కలను డివైడర్‌తో కాత్తిరించి చక్రాలబండి చేసేవాడు. మరో రోజు స్కేలుతో డబల్ లైనింగ్, షాడోస్ తో పేర్లు రాసి చూపించేవాడు. అబ్బ, ఈ వెధవ మూడో తరగతి ఎప్పుడవుతుందో, దాని తర్వాత నాలుగో తరగతి ఎప్పుడవుతుందో నాకెప్పుడో జామెట్రీ బాక్సు వస్తుందో , పరమ చిరాగ్గ ఉండేది. పోనీ అన్నయ్యనడుగుదామా అంటే వాడసలే టాం సాయరు టైపు. రోజంతా వాడితో మంచిగా ఉండి రెండో మూడో లంచాలిచ్చాక(అమ్మ చిన్న చిన్న పనికి పిలిచినప్పుడల్లా నేనే వెళ్ళడం, దీపవళి బాంబుల్లో కొన్ని నా వాటాలోంచి ఇవ్వడం లాంటివి) ఇంకుపిల్లరుతో వాడి పెన్నులో ఇంకు నింపడానికి పర్మిషనిచ్చేవాడు. అప్పటికి వాడాటకు వెళ్ళినప్పుడళ్ళా ఆ జామెట్రీ బాక్సు తీసి మా రహస్యస్థావరంలో బోలెడు వృత్తాలు గీసి వాడు వచ్చే లోపు మళ్ళీ యధావిధిగా పెట్టేవాణ్ణి. కాని ఇలా దొంగతనంగా ఏం సరదాపడతాం. ఎన్ని వృత్తాలు గీసుకున్నా అన్నయ్యకు చూపించలేకపోతే ఏం లాభం. ఇలా కాదని దసరా సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు నన్నెంతో గారాబంగా చూసుకొనే నాయినమ్మని అడిగా. "నాయినమ్మా నాకో జామెట్రీ బాక్సు కొనిపెట్టవూ" అని. అదేంటో తెలీని నాయినమ్మ సరేనని డబ్బులిచ్చినా అమ్మకా విషయం తెలిసి ససేమీరా కొనివ్వనంది. మొతానికి అలా అలా మూడో తరగతిగడిచిపోయింది.
మరో ఏడాదికి నాకూ ఇంకు పెన్ను జామెట్రీ బాక్సు వస్తాయనగా నాన్నకు ఒక పల్లెటూరుకు బదిలీ అయిపోయింది. ఆ డొక్కు బళ్ళో ఇంకు పెన్ను ఎవరూ వాడరు. ఏ తరగతి వాళ్ళైనా బాల్ పాయింటు పెన్నుతో రాసుకోవచ్చు. అసలు ఈ బాల్ పెన్ను కనిపెట్టిన వాళ్ళననాలి. పుట్టింది మొదలు చచ్చేవరకు ఒకటే అవతారం అదీనూ. అసలు ఇంకు పెన్నుకున్న దర్జా హోదా బాల్ పెన్నుకెక్కడా. లైఫులో గొప్ప రొమాన్స్ మిస్సయ్యాను కదా అని బాధపడుతుంటే చల్లగా చెప్పారింకో వార్త. ఆ పల్లెటూరి బళ్ళో ఐదో తరగతిలో ఎవ్వరూ జామెట్రీ బాక్సు వాడరట. అనవసరపు ఆర్భాటాలెందుకు? అఖ్ఖర్లేదని టీచర్లే చెప్పేసారు. హతోస్మి.

నా ఐదో తరగతయిన తరువాత పల్లెటూళ్ళో చదువు చట్టుబండలైతోందని అన్నయ్యను సిటీలో బాబాయి దగ్గరికీ, నన్ను హాస్టలుకీ పంపేశారు. ట్రాజెడీ ఏంటంటే హాస్టల్లోనూ బాల్ పెన్నులే వాడేవాళ్ళం. మా హాస్టల్లో క్లాసురూములూ డార్మిటరీలు పక్కపక్కనే ఉండేవి. రోజూ పుస్తకాలు గట్రా మోసుకెళ్ళడం ఉండేది కాదు. ఎట్టకేలకూ ఆరో తరగతిలో జామెట్రీ బాక్సు కొనుకున్నా. మా హాస్టల్లో రాత్రి డెస్కులో పెట్టుకున్న పెన్నూ పెన్సిలూ తెల్లవారి అలాగే ఉంటే గొప్ప ఇక జామెట్రీ బాక్సు బతికి బట్టకడుతుందా? కల్లో మాట. మొత్తనికి ఒక్కరోజైనా పొద్దున్నే లేచి ఇంకుపెన్ను నింపుకొని, జామెట్రీ బాక్సొకసారి చెక్ చేసుకొని స్కూలుకి తీసుకెళ్ళే అవసరం లేకుండానే పదోతరగతి వరకూ చదివేశాను.

* * * *

మొన్నీ మధ్య మా విభు కి (అన్నయ్య కొడుక్కి) క్రేయాన్స్, అవి పెట్టుకుందుకు ఒక బాక్సు కొందామని స్టెషనరీ షాపుకి వెళ్ళాను. అన్నీ కొనేసి బిల్ కడ్తుంటే కౌంటర్లో అద్దాల కింద మిలమిలలాడుతూ వెక్కిరించాయి వృత్తలేఖినీ, కోణమానినీ ఇముడ్చుకున్న సరికొత్త జామెట్రీ బాక్సు, ఇంకు పెన్నూ.

Saturday, October 10, 2009

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి క్వెంటిన్ టరంటీనో గురించి చెప్పఖ్ఖర్లేదు. రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ సినిమాలతో తనదంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. మూసకి భిన్నంగా ఆలోచించడానికి ఇంగ్లీషులో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. thinking out of the box, pushing the envelope అని. వాటికి నిజమైన ప్రతీకగా నిలుస్తాడు టరంటీనో. స్క్రీన్‌ప్లే తో ప్రయోగాలకు పెట్టింది పేరు. అలాగే తన చిత్రాలలో నేపథ్య సంగీతాన్ని చాలా జాగర్తగా ఎంచుకుంటాడు. ఉదాహరణకి కిల్‌బిల్ చిత్రం ఎంత హిట్టాయ్యిందో ఆ సౌండ్‌ట్రాక్ కూడా అంతే హిట్టయ్యింది. అలాంటి డైరెక్టర్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సినిమా తీశాడంటే సహజంగానే చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. పైగా ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు నామినేషన్లు, ఒక అవార్డు సంపాదించింది కూడా. మరి బాగుందా? నేనైతే తప్పక చూడాలని చెబుతాను.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఫ్రాన్స్ ని ఆక్రమించుకొని ఉంతుంది. నాజీలు యూదులను వెతికి మరీ చంపేస్తుంటారు. ఇలాంటి నాజీల గుండెల్లో దడ పుట్టించడానికి అమెరికా నుండి లెఫ్టినెంట్ అల్డో రెయిన్ (బ్రాడ్ పిట్) నాయకత్వంలో ఐనిమిది మంది యూదులబృదం బయలు దేరుతుంది. వీళ్ళ బృందానికి బాస్టర్డ్స్ అని పేరు. వాళ్ళు నాజీలను హతమారుస్తూ, ఒక్కో బృందంలో ఒక్కరిని విడిచి తమ గురించి పదిమందికి తెలిసేలా చేసి మిగిలినవారిని భయపెడుతుంటారు. మరో వైపు షొషానా నాజీల చేతిలో కుటుంబమంతా పోగొట్టుకొని ప్రాణం దక్కించుకున్న యువతి. మూడేళ్ళ తరువాత ఒక సినిమా థియేటర్‌కి ఓనర్‌గా పునర్దర్శనమిస్తుంది. షొషానాతో ప్రేమలో పడిన ఒక జర్మన్ వార్ హీరో వల్ల అతని ఆత్మ కథ ఆధారంగా మలచిన చిత్రం ప్రీమియర్ షొషానా సినిమా హాల్లో ఏర్పాటవుతుంది. తన కుటుంబాన్ని చంపిన కలొనల్ హాన్స్ లాండా వస్తున్నాడని తెలిసి షొషానా ప్రీమియర్ రోజు థియేటర్‌ని పేల్చి నాజీలను చంపాలని పథకం వేస్తుంది. ఆ ప్రీమియర్‌కు హిట్లర్‌తో సహా జర్మన్ అధికారగణమంతా వస్తున్నారని తెలిసి బాస్టర్డ్స్ గాంగ్ కూడా థియేటర్‌ని పేల్చాలని పథకం వేస్తారు. వీళ్ళందరిని వేయి కళ్ళతో కనిపెడుతూ ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉండే నిరంకుశాధికారి కలొనల్ హాన్స్ లాండా. చిత్రం ముగింపు ఏమయిందన్నది తెరపై చూడాల్సిందే.

ఒక చారిత్రక అంశాన్ని తీసుకొని దాన్ని ఫిక్షనలైజ్ రాయడానికి నిజంగానే ధైర్యముండాలి. టరంటీనో ఈ విషయంలో మొదటివాడు కాకపోవచ్చు కానీ గట్టి ప్రయత్నమే చేశాడు. నీజీలు యూదులు లాంటి అతి సున్నితమైన, గంభీరమైన విషయాన్ని తీసుకొని దాంట్లో కామెడీ చొప్పించడం నిజంగానే ఒక ఎక్స్‌పరిమెంటు. ఇక బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని వాడుకున్న తీరు సినిమా విద్యార్థులందరికి ఒక పాఠంగా మిగిలిపోతుంది. లాండా, షోషానా జర్మన్ మిలిటరీ గాంగ్‌తో కలుసుకొనే సీను ఎంత ఉత్కంఠంగా ఉంటుందో తెరమీద చూడాల్సిందే. అలాగే క్లైమాక్ష్ ముందర వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. మరి ఈ సినిమాకు పదికి పది మార్కులు వేయొచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి. కారణం. ఎడిటింగ్ లోపం. ప్రతీ సీన్నూ హాస్యాస్పదంగా మలచడానికి సాగతీసినట్టుంటుంది. అలాగే తియ్యగా మాట్లాడుతూ కోల్డ్ బ్లడెడ్‌గా వ్యవహరించే విలన్ పాత్ర చాలా మూస పాత్ర. లాండా పాత్రకు మరీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాల్సింది కాదు.

నటన విషయానికొస్తే సినిమాలో మనకు బాగా గుర్తుండి పోయే పాత్రలు మూడు. కల్నల్ హాన్స్ లాండా గా క్రిస్టొఫర్ వాల్ట్జ్ బాగా నటించాడు. కాన్స్ లో బెస్ట్ అవార్డ్ వచ్చింది కూడా. షోషానాగా ఫ్రెంచ్ నటి మెలనీ లారెంట్ నటన అద్భుతం. అల్డోగా బ్రాడ్ పిట్ కూడా బాగా నటించాడు.

గత పదిహేనేళ్ళ కాలంలో రెండో ప్రపంచయుద్ధం మీద మూడు పాపులర్ సినిమాలు వచ్చాయి. స్పీల్‌బర్గ్ షిండ్లర్స్ లిస్ట్, రాబర్టో బెనిని "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్", రొమాన్ పొలాన్స్కి "ద పియనిస్ట్". ప్రతీది దేనికదే గొప్పగా ఉంటుంది. మరి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వీటి స్థాయికి సరిపోగలదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అత్యంత గంభీర సన్నివేశాల్లో క్వెంటిన్ మార్కు హాస్యాన్ని జొప్పించి ఎదో హైబ్రీడ్ వంగడాల్లా రుచి పచీ లేకుండా చేశాడనిపించింది. కానీ సినిమా విద్యార్థులు, ప్రపంచ సినిమాపై ఆసక్తి ఉన్నవాళ్ళూ తప్పక వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తోంది. థియేటర్‌లో చూసే అవకాశం కోల్పోకండి.

తా.క.: పైన ఉదహరించిన చిత్రాల్లో life is beautiful సినిమా మీరు చూడకపోతే ఎలాగైనా సంపాదించి చూడండి. personally, I think its one of the best movies ever made. It will forever remain in my all time top 5 list.

Thursday, September 17, 2009

మిలియన్స్ - ఒక డానీ బోయ్ల్ సినిమా

స్లండాగ్ మిలియనీర్ తీసి డానీ బోయ్ల్ ఇండియా అంతా ఫేమస్ అవకముందు 2004లో తీసిన సినిమా ఇది. క్రిటిక్స్ సంగతేమో తెలీదు కానీ నాకైతే నా ఆల్‌టైం టాప్ 5 లో ఉంటుందీ సినిమా. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మనలోనూ ఎక్కడో ఒక పసిమనసు దాగుండాలి అంటారు.డానీ బోయ్ల్ లో మాత్రం తప్పక ఒకపసివాడున్నాడని నా అనుమానం.

కథ విషయానికొస్తే డేమియన్, ఆంథొనీ ఇద్దరన్నదమ్ములు. ఇద్దరి వయసు ఎనిమిది నుండి పన్నెండేళ్ళ లోపే. వాళ్ళమ్మ పోవడంతో, నాన్నతో పాటు ఒక కొత్త నెయిబర్‌హుడ్ కి మారతారు. పెద్దవాడైన ఆంథొనీ స్ట్రీట్ స్మార్ట్ కిడ్. చిన్నవాడైన డేమియన్‌కి క్రిస్టియన్ సెయింట్స్ కనిపిస్తుంటారు. వాళ్ళందరితో తరచూ మాట్లాడుతుంటాడు. ఆంథొనీ, వాళ్ళ నాన్న ఇదొ పిచ్చిగా భావించి పట్టించుకోరు. డేమియన్‌కి చనిపోయిన వాళ్ళమ్మ సెయింట్ గా మారిందో లేదో అని ఒక దిగులు. కనిపించిన సెయింట్సందరినీ అడుగుతుంటాడు. ఇదిలా ఉండగా లండన్‌లో జరిగిన బాంక్ రాబరీసొమ్ము ఒక మిలియన్ పౌండ్ల బాగ్ డేమియన్ చేతికి చిక్కుతుంది. మూర్తీభవించిన మానవత్వం, అమాయకత్వమైన డెమియన్ ఆ డబ్బులు దేవుడే పంపించాడని పేదవాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాడు. తనకి కనిపించే సెయింట్స్ కూడా అవుననే చెబుతారు. ఇక డేమియన్ డబ్బుల్ని పేదవాళ్ళనుకున్న ప్రతివారికిస్తుంటే ఆంథొనీ ఎవ్వరికీ తెలీకుండా జాగర్తపడుతుంటారు. ఉన్నట్టుండి వచ్చిన డబ్బుల్తో ఆంథొనీ స్కూల్లో స్టార్ స్టేటస్ మెయింటెయిన్ చేస్తుంటాడు. ఈలోగా ఒక దొంగకి కొంచెం అనుమానమొచ్చి డేమియన్ ఆంథొనీల వెంటపడుతాడు. డేమియన్ ఆ దొంగ నుండి తప్పించుకొని ఆ డబ్బులకెలా న్యాయం చేశాడు? సెయింట్సంతా తనకి ఎలా తోడ్పడ్డారన్నది మిగతా సినిమా.

సినిమా నిండా డానీ బోయ్ల్ మార్కు సన్నివేశాలు, అంతర్లీనమైన హాస్యం పుష్కలంగా ఉంటుంది. పిల్లలిద్దర్నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్నాడు. రెండు వేల నాలుగులో నేను చూసినప్పటినుండీ ఎంతో మందికి చూపించానీ చిత్రాన్ని. బాలేదన్న వాళ్ళొక్కరూ లేరు ఇప్పటివరకు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఎలాగోలా సంపాదించి చూడండి.

తా.క. సోనీ పిక్స్‌లో గురువారం రాత్రి ఈ సినిమా చూసి సడన్‌గా ఇదంతా చెప్పాలనిపించింది. :) స్లండాగ్ మిలియనీర్ కంటే ఈ సినిమాకి డానీ బోయ్ల్ కి ఎక్కువ పేరు రావల్సింది. (స్లండాగ్ - గ్లోరిఫైడ్ పావర్టీ అనుకునేవాళ్ళలో నేనూ ఒకణ్ణి.)

Thursday, September 10, 2009

హర్భజన్ సింగ్ వివాదం మీడియా ఓవరాక్షన్

క్రింద వీడియో చూడండి. నిజంగా హర్భజన్ ఎవరినైనా పంచ్ చేశాడా?ఎవడైనా కెమెరాతో మన తలను తాటిస్తే ఏం చేస్తాం? ఇలాంటి సొల్లు కబుర్లను ఎందుకు మీడియా సెన్సేషనలైజ్ చేస్తోంది?ప్రేక్షకులారా/పాఠకులారా జాగర్త. ఇంకోసారి మీడియా ఏదైన సంచలనాత్మక వార్త రాస్తే నాణానికి ఆవైపేం జరిగిందో అని కూడా ఆలోచించండి. గుడ్డిగా నమ్మకండేం.


Wednesday, September 09, 2009

రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్

యిమూ ఝాంగ్ అనగానే ప్రపంచసినిమాలో ఆసక్తి ఉన్న ప్రతివారికీ గుర్తొచ్చేది "హీరో" సినిమా. ఇంకా house of flying daggers సినిమా. కేవలం యాక్షన్ సినిమాలే తీస్తాడేమో అన్న భ్రమలను పటాపంచలు చేస్తాడీ సినిమాతో. స్థూలంగా కథనానికి వస్తే :
జపానీయులైన తకత, కెనిచి తండ్రీ కొడుకులు. కెనిచి వాళ్ళమ్మ మరణంతో ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి ఒకరినొకరు కలుసుకోకుండా విడిపోతారు. చాన్నాళ్ళకు కెనిచికి ఒంట్లో బాలేదని తెలిసి తకత జపాన్ వస్తాడు. కానీ కెనిచి తండ్రిని చూడడానికి నిరాకరించేసరికి తకత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కెనిచి భార్య తను నిర్మించిన డాక్యుమెంటరీ ఒకటి తకత కి కానుకగ ఇస్తుంది.
ఊరెళ్ళిన తకత ఆ డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో కెనిచి ఒక చైనీయ జానపదనృత్యాన్ని చిత్రీకరిస్తూ, ఆరోజు లీడ్ సింగర్ గొంతు బాలేకపోవడంతో అతని గానమొక్కటి రికార్డు చేయలేకపోతాడు. ఇంతలో కెనిచి కి లివర్ కాన్సర్ అని తెలుస్తుంది తకత కి. కొడుకు కోసం తకత చైనా వెళ్ళి ఆ డాక్యుమెంటరీ షూట్ చేసి తీసుకువద్దామనుకుంటాడు. దాంతో మొదలవుతుంది తకత పయనం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ లీడ్ సింగర్ జైల్లో పడ్డం, అదికారుల కాళ్ళా వేళ్ళా పడి పర్మిషన్ సంపాదించి జైలుకి వెళ్తే ఆ రోజు ఎక్కడో పుట్టిన కొడుకును తలచుకొని లీడ్ సింగర్ పాడలేకపోతాడు. ఇలాకాదని తకత వాళ్ళ కొడుకు యాంగ్‌యాంగ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఊరివాళ్ళనొప్పించి తనని తీసుకువస్తుంటే దార్లో వాళ్ళిద్దరూ తప్పిపోయి ఒక రాత్రంతా కాన్యన్స్‌లో తప్పిపోతారు. ఆ రాత్రీ, మొత్తం ఈ ప్రయాణంలో తకత తన గురించి, కొడుకు గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి ఆ డాక్యుమెంటరీ చివరికి షూట్ చేయగలిగాడా? కెనిచి కి ఏమవుతుందీ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోండి.
సినిమాలో ఆకట్టుకొనేవి రెండు విషయాలు. విజువల్స్. యిమూ ఝాంగ్ సినిమాల్న్నీ దృశ్యకావ్యాలే (మన సంజయ్ లీలా భన్సాలి గుర్తొస్తారు. ప్రతీ ఫ్రేం విజువల్ రిచ్‌నెస్‌టో ఉట్టిపడుతుంది). ఇక రెండవది, ముఖ్యమయింది ఒక బాధని సినిమాలోకి అనువదించడం. దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించలేకపోతే చిత్రం తేలిపోయేది. ప్రతీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దారు. జీవితమే ఒక వేయిమైళ్ళ పయనం. పంతాలకు పట్టింపులకుపోయి దాన్ని ఒంటరి పయనంగా మార్చుకుంటే ఎడతెగని పయనమవుతుంది. బోలెడు బంధాలు ప్రేమలు, బ్రేకప్పులు, మేకప్పులతో సందోహంతో గడిపితే కలగా మిగులుతుంది. మంచి కళ రసికున్ని వేరే time and space లోకి transcend చేస్తుందంటారు. ఈ సినిమా ముమ్మాటికీ అదేపని చేస్తుంది.మీకు కాస్త నిదానంగా నడిచే మీనింగ్‌ఫుల్ సినిమాలు చూడ్డంలో అట్టే అభ్యంతరం లేకపోతే తప్పక చూడొచ్చు.

ఈ సినిమా చూశాక నాకు ఇస్మాయిల్ కవితొకటి గుర్తొచ్చింది. కవిత ఇక్కడ.
===
రికార్డు (ఇస్మాయిల్ విరచితం)

తిరిగి తిరిగిరికార్డుపాట అంచున ఆగుతుంది.
ఇప్పుడు దీని కర్తెవరో చదివి తెలిసికోవచ్చు.
జీవితం ఆగినా కర్త పేరు తెలీదు.

రికార్డుకు మల్లే దీన్ని మళ్ళీ వేయలేం.
వేసినా మొదటిలా ఉండదేమో.
కవిత్వం లాగే
మరో మారు చదివితే మొదటిలా ఉండదే.
కన్యాత్వం పోతుంది.

సాఫీగా సాగే రికార్డు ఆయుష్షు మూడు నిమిషాలు.
గాడి పడితే అనంతం.
బాధ - జీవితానికి గాడి.
=====

Tuesday, September 01, 2009

నేను చదివిన మొదటి నవల

పుట్టగానే ఎక్కడ బోల్డు సుఖపడిపోతానో అని కాబోలు దేవుడు నాకంటే ముందు అన్నయ్యని పుట్టించి ఉంచాడు. నాకు బుద్ధి తెలిసినప్పటినుండి మేమిద్దరం పోటీ పడని క్షణం లేదు. అన్నం దగ్గిర ఎవరు ఫస్ట్ డిష్ టేస్ట్ చూస్తారో, ఎవరు ఫాస్ట్‌గా తింటారో, ఎవరు ఫస్టు చేతులు కడుక్కుంటారో అని, హోంవర్క్ ఎవరు ఫస్ట్ పూర్తి చేస్తారోనని, స్కూల్ నుండి ఎవరు ఫస్ట్ వస్తారో అని....ఉఫ్....ఇంట్లో రోజూ రామరావణ యుద్ధాలే.

ఒక్కవిషయంలో మాత్రం ఈ పోటీ ముదిరి పాకాన పడేది. ఎందుకంటే ఆ పోటీలోగనక ఓడిపోతే, ఇక నెలరోజులు ఎదుటివాడి దెప్పులు భరించాలి. అదే చందమామ ఎవరు ఫస్ట్ చదువుతారో అన్న పోటీ. నెలలో మొదటి మూడు రోజులు పేపరువాడికోసం పొద్దున్నే కాపలా కాసేవాళ్ళం. పొరపాటున మనం లేని సమయంలో చందమామ వస్తే? హమ్మో ఇంకేమైనా ఉందా.. అన్నయ్య దాచిపెట్టేసి స్కూలునుండి రాగానే చదివేయడూ..అబ్బో అదొక టెన్స్ లైఫ్ లెండి. ఎనీవే, కొన్నాళ్ళకి సంధి కుదుర్చుకొని చందమామని వదిలేశాం ఎందుకంటే ఇద్దరం తోడుదొంగలుగా ఒక పని చేయాల్సి వచ్చింది.

ఎండాకాలం సెలవులొచ్చాయి. మధ్యాహ్నం బయటకి వెళ్ళామని తెలిసిందో సాయంత్రం బడితెపూజ(అప్పుడప్పుడు బెల్టుపూజ) జరిగేది. పోనీ మూడుగంటలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటే రోజూ వేళ్ళు నెప్పులు పుట్టేలా ఇరవయెక్కాలు రాయించేవారు. అమ్మ పడుకునేదాక ఏదో గీకేసి పడుకోగానే మా రహస్య స్థావరంలోకి వెళ్ళేవాళ్ళం. స్థావరమంటే ఎక్కడో ఉందనుకునేరు. మా ఇంట్లోనే పట్టెమంచాలు గోడవారగా వేసి పెట్టి వాటిపై బట్టలారేసేవాళ్ళు. దాంట్లో దూరి చక్కగా షాడో నవల్లు చదివేసేవాళ్ళం. దీంట్లో ఆశ్చర్యమేముందా? (నాకప్పుడు ఏడేళ్ళు, అన్నయ్యకు తొమ్మిది). అప్పుడు మాకేమర్థమయ్యేవో, ఎందుకు చదివేమో ఇప్పటికీ నవ్వొస్తుంది తలచుకుంటే. బహుశా వెధవపని చేస్తున్న థ్రిల్ అనుకుంటా :) మొత్తానికి ఒక వేసవి కాలం నాన్న దగ్గిరున్న షాదో నవలల్ సిరీస్ అంతా చదివి మేం కనిపెట్టిందేమంటే అన్నీ ఒకేలా ఉంటాయి డొక్కు నవల్లు...నాన్నగారెందుకు చదువుతారో ఏం పాడో అని. అలాగే ఆంధ్రభూమి, యువ ఇలాంటివన్నీ చదివేసేవాళ్ళం. అమ్మకు తెలిస్తే వీపు చీరేస్తుందని తెలిసీ. అప్పట్లో యువ దీపావళి సంచిక అని ఇంతేసి లావుపాటి పుస్తకమొచ్చేది. అలాగే ఒక చిన్న నవల కూడా ఉండేది (యువదో, స్వాతిదో). అన్నీ చదివేవాళ్ళం ఒక నవల తప్ప. మల్లిక్ కార్టూన్లు, రాగతి పండరి ముగ్గుల కార్టూన్లు చదువుకొని బోల్డు నవ్వుకునేవాళ్ళం. కథలు చదివినట్టు గుర్తు కానీ నవలలు మాత్రం పెద్దయ్యాకే చదవాలని ఒక అన్‌స్పోకెన్ రూల్ ఉండేది..

మూడేళ్ళకో బదిలీతో నాన్న ఊర్లు మారడం మొదలవగానే అన్నయ్యని బాబాయి దగ్గరకి, నన్ను హాస్టల్కి పంపించేశారు నాన్న. మొట్టమొదటి సారి హాస్టల్లో నాలుగునెలలు ఏకధాటిన అమ్మ నాన్నలకి దూరంగా ఉండి రేపనగా ఇంటికి వెళ్తామన్న రోజు. ఆ రోజెందుకో బోలెడు ఫ్రీ టైం దొరికి హాస్టల్లో 'చెక్కీ అని ఓ మిత్రుడి దగ్గరకి వెళ్ళాను. (అసలు పేరు రమేశ్ చక్రవర్తి లెండి). మా చెక్కి గాడి దగ్గిర ఒక పెద్ద నవల కనిపించింది. టైటిల్ "ఏడు తరాలు". ఇప్పుడైతే చూసేవాళ్ళు, వద్దనేవాళ్ళు ఎవరూ లేరు కదాని చదవడం మొదలెట్టా. సాయంత్రం మొదలెడితే రాత్రి అందరు పడుకున్నా వదల్లేదు. నేను ఓరాత్రి మూడింటివరకూ ఆ నవల చదువుతూ ఉండిపోవడం ఇప్పటికీ గుర్తు. ఆరో తరగతిలో రాత్రంతా మేల్కొని చదివింపజేసిన ఆ నవల అంటే ఇప్పటికీ నాకు భలే ఇష్టం. ఒకవైపు ఆ బానిస నాయకుడి బాధననుభవిస్తూ, మరోవైపు నవల చదువుతున్నందుకు థ్రిల్లవుతూ బాగా గుర్తుండి పోయిందా రోజు.ఇంజనీరింగులో జాయిన్ అయ్యాక మళ్ళీ ఆ పుస్తకం ఏక్కడ దొరుకుతుందని తెగ ట్రై చేశా. అందరు తెలుసని చెప్పేవాళ్ళే కానీ అదెక్కడా దొరికేది కాదు. ఒకరోజు పేపరు చదువుతుంటే తెలిసింది. అది "రూట్స్" అనే గొప్ప నవలకు అనువాదమని. ఇక ఒరిజినల్ సంపాదించి చదివి మళ్ళీ ఆ నాయకుడి బాధంతా అనుభవించాను. అమెరికాలో కూడా ఆ పుస్తకం మరొక్కసారి చదివాను. మొన్నీ మధ్య సహవాసి గారి అనువాదం చూసాను ఏడుతరాలకి. కానీ అది చిన్న పుస్తకం. నేను చదివింది సాహిత్య అకాడెమీ వారి బౌండు పుస్తకమని గుర్తు. మరెవరైనా ఈ నవలకి అనువాదం చేసారా? లేక నేను చదివింది సహవాసి గారి అనువాదమేనా అన్నది నాకు ఇప్పటికీ తేలని బేతాళప్రశ్న. ఆ తరువాత గోర్కీ అమ్మ, దాశరధి చిల్లర దేవుళ్ళు చదివాను. అవి కూడా అద్భుతమైన పుస్తకాలు. అవండీ నేను మొట్ట మొదట చదివిన మూడు నవల్లు. మూడు గొప్పవే.

ఇదంతా చదువుతుంటే మీరు చదివిన మొదటి నవల గుర్తొచ్చిందా? ఆలస్యమెందుకు..వేసెయ్యండొక టపా.
తా.క.: అన్నయ్యకీ నాకు ఇప్పుడు పోటీలేదు గానీ, పుస్తకాలు వొరేషియస్ గా చదివే అలవాటు ఇప్పటికీ ఇద్దరికీ పోలేదు. పుస్తకాలే లేకుంటే లైఫ్ ఎంత బోర్ కదా.

Tuesday, August 25, 2009

బాబోయ్.. వినాయక చవితి

చిన్నప్పుడు వినాయక చవితి ఎప్పుడొస్తుందని ఎంతగా ఎదురుచూసేవారమో. నేను పెరిగింది ఒక చిన్న ఊర్లో. గోదావరి ఒడ్డున. అప్పటికింకా జనాల మీద కేబుల్ దండయాత్ర జరగలేదు. కేవలం డీడీ చానల్ తో టీవీ ప్రభావం ఎక్కువ ఉండేది కాదు. తొమ్మిది రోజులూ భజనలు, ప్రసాదాలు, గణపతులు చూస్తూ ఊరంతా ఒకటే తిరగడం. ఇక తొమ్మిదోరోజు గోదావరి దగ్గర పెద్ద ఉత్సవం. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇరవి యేళ్ళు. వినాయక చవితి వస్తుందంటే వామ్మో ఈ తొమ్మిది రోజులు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తోంది.
అసలు హైదరబాద్ లాంటి నగరాల్లో ఉండడమే ఒక పెద్ద పనిష్మెంటు. బడికి వెళ్ళాలన్న, ఆఫిసుకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ మహాసాగరాలు ఈదాలి. పీల్చడానికి మంచి గాలి ఉండదు. కాస్త సాయంత్రం ఎక్కడైనా తిరిగొద్దామంటే అట్టే జనాలు లేని పార్కులుండవు. వీకెండ్స్ ఆడుకుందామంఏ ఓ గ్రౌండు దొరకదు. క్వాలిటీ ఒఫ్ లైఫ్ ఎంత వరస్టుగా ఉంటుంది. వీటన్నిటికి తోడు ఈ తొమ్మిది రోజులు వినాయకుని పేరు చెప్పి సాయంత్రాలైతే చాలు మైకులతో హోరెత్తిస్తుంటారు. ఒకే వీధిలో రెండు మూడు వినాయకులు ఒకరితో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎందుకొచ్చావురా దేవుడా అనుకునేలా చెస్తారు. పొద్దున్నే ఆరింటికే మైకుల్లో సుప్రభాతాలు, సుందరకాండలు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండవమ్మ తల్లీ అనాలనిపిస్తుంది. పొరపాటున ఎవరినైనా ఆపమన్నామో మనం మొత్తం కాలనీకి, అపార్టుమెంటు కాంప్లెక్సుకి శతృవులమైతాం. భక్తి కాస్త ఉన్మాదంలోకి మారిపోతుంది. ఏ రోజుకి వాళ్ళు ఐదు సార్లు మైకుల్లో అరుస్తుంటే ఎప్పుడూ అడగరే? అని దానికి కమ్యూనల్ రంగు పులుముతారు. ఇదంతా చూస్తే ఎప్పుడో చర్చిల్ అన్న మాట గుర్తు వస్తుంది. I dont have a problem with christ but with christians నాకూ అదే అనాలనుంది. దేవుడా నాకు నీతో సమస్యలేదు కాని నీ భక్తులనుండి మాత్రం నన్ను రక్షించు.
తా. క. ఇలాంటిదే తిలక్ కవిత ఏదో ఉన్నట్టు గుర్తు, కుదిరితే ఇక్కడ పోస్టు చేస్తాను.

Wednesday, August 19, 2009

ఇస్మాయిల్

మన తెలుగు కవిత్వం మీద శ్రీ శ్రీ, క్రిష్ణశాస్త్రి, తిలక్‌ల ప్రభావం ఎంతటిదో చెప్పనలవి కాదు. కొత్తగా రాసేవారు మొదలుకొని, దిగ్గజాలవరకు ఇప్పటికీ అదే ప్రభావంలో రాస్తున్నారు. ఇలాంటి సాహిత్యమఱ్ఱి చెట్లకింద మరో వృక్షం పుట్టుకురావాలంటే ఎంత ధీశక్తి, నిబ్బరం ఉండాలి. సరిగ్గా అలాంటి వాడే ఇస్మాయిల్. ఈ కవులందరినీ ఎంతో మెచ్చుకున్నా, వీరిని కాదని తెలుగు కవిత్వానికి మరో దిశను పరిచయం చేసిన కవి. మనతరంలో చాలా మందికి తెలుగు కవిత్వంతో పరిచయం పదోతరగతితో ముగుస్తొంది. ఏ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం వల్లో ఏమో జనసామాన్యానికి ఇస్మాయిల్ కవిత్వం గురించి అంతగా తెలవదు. అలాంటి ఇస్మాయిల్ ని గుర్తు చేసుకుంటూ ఇవాల రెండు సాంపుల్ కవితలు. (ఇవేమీ ఆయన రాసినవాటిల్లో గొప్పవి కావు..ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి మాత్రమే)
1) నిద్దట్లో ఆమె కళ్ళు (ఇస్మాయిల్ : 1972)

అర్ధరాత్రి దూరాన
ఎక్కడో పడగ విప్పిన చప్పుడుకి
నిద్దట్లో కలవరపడి
పక్కకు తిరిగి
నన్ను హత్తుకుందామె.

ఆమెకళ్ళు
జలజలపారే
నిద్దర సెలయేటి
అడుగుని
గలగలమని పాడే
అందమైన
గులకరాళ్ళు.

ఈ మెరిసే నీళ్ళ చప్పుడుకి
ఆకర్షితులై
చీకట్లో మెసిలే
ఏవో వింత మృగాలు
ఆమె నిద్దుర ఒడ్డుల్ని
తచ్చాడుతాయి.

2) పాట (ఇస్మాయిల్ : 1978)

సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఏలా?

3) ఆత్మహత్య (ఇస్మాయిల్ : 1975)

తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచకా
ఎటో నడిచి పోయింది.


బ్లాగ్ మితృలకు ఆసక్తి ఉంటే మరిన్ని మరోసారి...
ఇట్లు మీ..

Monday, August 17, 2009

కమీనే

మాచిస్ సినిమా చూసి ఒక రెండు మూడు రోజులు ఆ సినిమా మాజిక్లో, ఒక నెలరోజులు ఆ సంగీతం మాజిక్లో ఉండిపోయా. అప్పట్నుండే నేను విశాల్ భరద్వాజ్ ఫాన్ని. ఈ అక్టింగ్ రాని ప్రియాంకతో, బేబీ ఫేస్డ్ షాహిద్తో సినిమా ఏంటా అనుకున్నా కమీనే గురించి వినగానే. కానీ కమీనే సంగీతం (సుఖ్విందర్, కైలాష్ ఖేర్..వాహ్ భయ్ వాహ్..) విని, సినిమా చూద్దాం అని కమిటయ్యా. and I am glad I did. మీకు గాంగ్ స్టర్ సినిమాలు, హత్యలూ, గన్ ఫైట్లు ఇలాంటివి నచ్చకపోతే సినిమాకి దూరంగా ఉండండి. మీకు క్వెంటిన్ టరంటీనో సినిమాలు నచ్చుతాయా? ఐతే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. టరంటీనో ముంబై మీద సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు.
విషాల్ ఈ సినిమాకి దర్శకత్వంవహించి , మాటలు రాసి, పాటలు కంపోజ్ చేశాడు.(ఎస్వీ క్రిష్ణా రెడ్డి గుర్తొస్తున్నాడా?). నాకైతే ప్రతీ దాంట్లో తనదైన మార్కు చూపించాడనిపించింది. విశాల్ కి నూటికి ఎనభై మార్కులు వేయాల్సిందే. షాహిద్ కపూర్ది డబుల్ రోల్. ఒకదాంట్లో రెగ్యులర్ మిడిల్ క్లాస్ వాడైతే మరో దాంట్లో ముంబైలో బతకనేర్చిన చోటా మోటా నేరస్తుడు. నటనలో వైవిధ్యం ఉన్నా, మరో పెద్ద నటుడైతే ఇంకా రాణించేవారనిపించింది. ఇలా ఆథర్ బ్యాక్డ్ రోల్ వచ్చినపుడు నటనలో విశ్వరూపం ప్రదర్శించాలి కాని సినిమాలో మిగిలిన అందరి యాక్టింగ్ ముందు షాహిద్ కాస్త తేలిపోతాడు. ఇక ప్రియాంక విషయానికొస్తే వావ్ అనకుండా ఉండలేం. ఎట్టకేలకు ప్రియాంకకు యాక్టింగ్ వచ్చని ఒప్పుకోవాల్సివస్తుంది. లోకల్ లీడర్ చెల్లిగా, తన ప్రియుడిని దక్కించుకోడానికి ఏమైనా చేసే ఈ పాత్రలో జీవించింది. ఇక సపొర్టింగ్ కాస్టంతా శహభాష్ అనేలా నటించారు. చాలామంది నాకు తెలియనివాళ్ళే. ఏదో ఫిల్మ్ స్కూల్ గ్యాంగులాగుంది. అందరికీ నటనలో మంచి పట్టుంది. నేపథ్యంలో కనిపించే మరో పాత్ర ముంబై.అసలు ఈ సినిమాలో ముంబయిని చిత్రీకరించిన తీరు చూసి స్లమ్డాగ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి.
సినిమాలో ఐదు నిమిషాలు కూర్చోగానే ముగింపు తెలిసే సినిమాలూ, ఏ కథా లేకున్నా కథనాన్ని లాగీ పీకే సినిమాలూ, ఇంటర్వల్ వరకు కథ ముందుకి నడవని సినిమాలు చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది. అలా అని ఇదో ఫీల్ గుడ్ సినిమా మాత్రం కాదు. go and see it in a theater if u dont mind some gangster action.

Thursday, August 13, 2009

యాది - డా.సామల సదాశివ

పుస్తకాల కొట్టులో అవీ ఇవీ వెతుకుతుంటే, "ఈ పుస్తకం చదవండి సార్. బాగుంటుంది" అని సదాశివ గారు రాసిన "యాది" పుస్తకాన్నిచ్చారు. అప్పటికి సదాశివగారి పేరు నేను వినలేదు. ఈ వ్యక్తి పేరే విననపుడు ఈయన జ్ఞాపకాలు కొనాలా వద్దా అని మీమాంస చేస్తూ రెండూ పేజీలు తిరగేశాను. అంకితం పేజీలో, రచయిత మనవడికి పుస్తకాన్ని అంకితమిస్తూ "వారీ కార్తీకా! ఇగ పటు.." అన్న వాక్యం ఆకర్షిచింది. ఇంత ప్రేమగా, ఇంటిభాషలో రాసిన పలకరింపు చూసి ఫర్లేదు బానే ఉండొచ్చనుకొని కొన్నాను. ఆ నమ్మకాన్ని నూటికి నూరు పాళ్ళూ నిజం చేసిందీపుస్తకం.

డెభ్భయ్యేళ్ళ నిండు జీవితంలో రచయిత అభిరుచులగురించీ, అవి పెంపొందిచేందుకు దోహదపడిన వ్యక్తులగురించీ, విన్నవీ, కన్నవీ, మధ్య మధ్యలో ఉర్దూ, ఫారసీ కొటెషన్లతో చదువుతుంటే "అహా, కబుర్లు చెప్పడం కూడా ఒక కళే" అనిపించకమానదు. హిందుస్తానీ సంగీతం గురించైతేనేమి (రూపాయికోసం పావలా వదులుకోనన్న పండిట్ జస్‌రాజ్ కథా, సాక్షాత్తు రామక్రిష్ణ పరమహంస దగ్గిర కడుపు నింపుకున్న ఉస్తాదోంకే ఉస్తాద్ బాబా అల్లా-ఉద్దీంఖాన్ కథా, హిందుస్తానీ సంగీతాన్ని కఠోరగురువుల చెర విడిపించిన భాత్ఖండే, పలూస్కర్ల గురించి వివరాలు), తెలుగు సాహిత్యకారుల గురించి ఐతేనేమి ( ఆంగ్లంలో "les miserables" చదివి, అనువదించేందుకు ఫ్రెంచి నేర్చుకున్న వేలూరి శివరామ శాస్త్రి గారి కబుర్లూ, విమర్శకులతో చికాకు పడి ఫోటో పంపని విశ్వనాథ వ్యవహారమూ, మధురాంతకం రాజారాం గారితో వ్యక్తిగతానుబంధం), ఉర్దూ గురించైతేనేమి (ఉర్దూ తన అనుబంధం గురించి, రూమీ మస్నవీని, అంజద్ రుబాయీలనూ అనువదించడానికి తను చేసిన శ్రమా, కాళోజీ సోదరుల గురించి రాసిన వ్యాసాలు, సియాసత్ పత్రిక సంపాదకుల గురించి చెప్పిన కబుర్లూ) అన్నీ చదివించే వ్యాసాలే. 'ఉర్దూ' ఒక మతానికి సంబంధించిన భాషకాదనీ సార్వజనీనమని చేసిన్ చర్చ కూడా మన తరం వాళ్ళు ఆలోచించదగ్గ విషయం.

సదాశివగారి విలక్షణమైన నేపథ్యమే ఇంతటి వైవిధ్యంగల కబుర్లకు మూలమనిపిస్తుంది చదువుతుంటే. సదాశివ గారి విద్యాభ్యాసం నిజాం ఏలిన తెలంగాణాలో జరిగింది. కాబట్టి చదివింది ఉర్దూ భాషా, ఉర్దూ మాధ్యమం. ప్రాతఃస్మరణీయులైన గురువుల వద్ద అమరం, ప్రబంధాలు చదివి నేర్చిన సంస్కృతాంధ్ర భాషలు. ఇవి కాక మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల అబ్బిన మరాఠీ భాష. చిన్నతనంలో ఇలాంటి పునాది వేసుకున్నవారు బహుభాషావేత్తలు కాకుండా ఉండగలరా? ఈ బహుభాషా ప్రావీణ్యమే సదాశివగారు రెండు వారధులు నిర్మించేందుకు కారణమయింది. ఒకటి రూమీ మస్నవీకి, అంజద్ రుబాయీలకు మరియు తెలుగు పాఠకులకు.ఇంకొకటి తెలుగు సాహిత్యానికి 'సియాసత్' ఉర్దూ పాఠకులకు. పుస్తకమంతా అంతర్లీనంగా కనిపించే మరొక విషయం సదాశివ గారి సహృదయత. వారి గురువుల పట్ల, శిష్యుల పట్ల, మిత్రుల పట్ల ఆయన ఆదరాభిమానాలు, భేషజాలు లేని వ్యక్తిత్వం పాఠకులను తప్పక ఆకట్టుకుంటాయి.

ఇన్ని సుగుణాలున్న పుస్తకంలో పునరుక్తిదోషాలు మాత్రం ఎక్కువే. ఒక పత్రికలో ధారావాహికగా వచ్చినపుడు పునరుక్తి అంతగా బాధించదు. పుస్తకంగా తెచ్చినప్పుడు మాత్రం పునరుక్తులను పరిష్కరించాల్సింది. అలాగే పుస్తకం చివర్లో తన స్నేహితులను గుర్తుచేసుకుంటారు రచయిత. సంగీత సాహిత్య విషయాలతో అలరారిన ఈ పుస్తకంలో అవి అంతగా నప్పలేదు.

వేసవి సెలవుల్లో తాతగారింటికి వెళ్ళినప్పుడు ఆరుబయట పక్కలు వేసుకొని పడుకునేవాళ్ళం. పిల్లలందర్ని పెట్టుకొని తన సుదీర్ఘ జీవన జ్ఞాపకాలను కథలు కథలుగా చెబుతుండేవారు తాతగారు. ఆనాటి అనుభూతిని మళ్ళీ గుర్తు తెచ్చిందీ పుస్తకం.
(యాది : ఎస్. సదాశివ. ప్ర.2005. నవోదయ, విశాలాంధ్రలో లభ్యమవుతాయి. వెల: 100/-)
కొసమెరుపు: అంతగా నన్నాకర్షించిన "వారీ..ఇగ పటు" వాక్యం సదాశివగారిది కాదట. తిరుమల రామచంద్ర గారి నుద్దేశించి ఆంధ్ర బిళణ "కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి" పలికిన పలుకులట.
(ఈ పుస్తకం తరువాత, సదాశివ గారు సంగీత శిఖరాలు- అని హిందుస్తానీ కళాకారుల మీద ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని వెలువరించారు. సంగీతప్రియులకు ఆ పుస్తకమూ పఠనీయమే).

Monday, August 10, 2009

మగధీర

వారమంతా ఎక్కడ చూసినా మగధీర ఎంత బాగుందోనని చెప్పుకోవడమే. హైప్ కాస్త ఎక్కువైనపుడు చాలా సార్లు సినిమాకి వెళ్ళి మనం నిరాశ పడిపోతాం. కానీ ఈ సినిమా నిజంగా హైప్‌కు తగ్గట్టే ఉంది. ఈపాటికి మీరు బోలెడన్ని సార్లు చదివి ఉంటారు. కాని తెలుగు తెరపై సాంకేతికంగా ఇంత మంచి చిత్రం ఒక చారిత్రక మలుపనే అనుకుంటున్నాను. సినిమలో కొన్ని సన్నివేశాలు బెన్-హర్, టెన్ కమాండ్‌మెంట్స్ ను గుర్తుకు తెచ్చేలా ఉనాయి. సో, తప్పకుండా చూడమనే చెబుతాను. థియేటర్లోనే చూడండి.
ఈ సినిమా పూర్తిగా డైరెక్టర్‌దే. ఆ సెట్లు, ఆర్టూ, స్క్రీన్ ప్లే అబ్బో..అనుకునేలా ఉన్నాయి. చాలా సన్నివేశాలు 300, హీరో (చైనీస్), సినిమా ను తలపింపజేస్తాయి. హీరోయిన్ కూడా బాగా నటించింది. చరణ్‌కు మాత్రం పూర్తి మార్కులు పడవు. ఇంకా డిక్షను ఇంప్రూవ్ చేసుకోవాలి. అరుంధతిలో సోనూ సూద్ విలనీ చూశాక, ఈ కొత్త విలన్ అట్టే నచ్చడు.
మొత్తమ్మీద ఈ సంవత్సరం మనకు రెండు మైల్‌స్తోన్ చిత్రాలు. అరుంధతి, మగధీర. సాంకేతికంగా మనమూ హాలివుడ్ లెవెల్లో తీయగలమని ఈ రెండూ చిత్రాలూ నిరూపించాయి. ఇక తదుపరి అడుగు ఒరిజినాలిటీ దిశగా వేయాలి. ఇకపై మన సృజనాత్మకతకు ఆకాశమే సరిహద్దు. అరుంధతిలో అంధురాలు ఢంకాలతో నృత్యం చేసే అద్భుత సన్నివేశం చైనీస్ సినిమా house of flying daggers నుండి స్పూర్తి పొందిందని తెలిస్తే మనసు చివుక్కుమంటుంది. అలాగే మగధీరలో కొన్ని సన్నివేశాలు.. కమాన్ గైస్.. lets be original.
ఇట్లు మీ..

అలనాటి ఆనవాళ్ళు

తెలుగు సినీ పరిశ్రమకు 75ఏళ్ళు నిండిన సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన మంచి సినిమాల మీద వ్యాసాలు, కబుర్లతో వెలువరించారీ పుస్తకాన్ని. దాదాపు ఐదారు వేలసినిమాల్లోంచి మంచి చిత్రాలు ఎన్నటం కత్తిమీద సామువంటిది. అందరిని మెప్పించడం జరగనిపని. కావున అలాంటి వివరాల్లోకి వెళ్ళనే వెళ్ళను. ప్రతి సినిమాకు తారాగణం, సాంకేతిక వర్గం, పాటల వివరాలు, మరీ మైల్‌స్టోన్ సినిమా ఐతే దర్శకులతో చిన్నపాటి బ్లర్బ్‌లు, అలాగే సినిమా సక్సెస్ వివరాలు బానే పొందుపరిచారు. ఈ పుస్తకానికి చదివింపగుణమూ ఉంది. కాని ఈ పుస్తకంలో సోల్ లేదు.
ఇలాంతి పుస్తకం రాయడానికి రచయితకు కనీసం మూడు అర్హతలు ఉండాలని నా అభిప్రాయం. 1) సినిమాలని ప్రేమించి, ఆరాధించాలి2) సినిమా సాంకేతికత గురించి కాస్తో కూస్తో తెలిసుండాలి3) రాసే భాషలో మంచి పట్టుండి, ఆకట్టుకొనే వచనం రాయగలగాలి..
పులగం చిన్నారయణకి మొదటి రెందున్నాయో లేవో కానీ, మూడవదైతే ఖచ్చితంగా లేదు. ఉదాహరణకు తెలుగువెలుగులు లాంటి వ్యాససమహారాన్ని, ఏదో పీ.ఎచ్.డీ ప్రాజెక్టుకు రాసినట్టు రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోండి. అదే రమణ, పిలకా గణపతి లాంటి దిగ్గజాలు రాస్తే ఎలా వచ్చింది చూడండి. అదీ సంగతి.
ఈ పుస్తకం గురించి నాకో మేజర్ కంప్లైంటు. వెల. రెండు వందల డెబ్భయ్యైదు రూపాయలుట. అసలు ఈ పుస్తకానికి టార్గెట్ ఆదియెన్స్ ఎవరు? ఎన్నారైలైతే పర్వాలేదు. సగటు ఆంధ్ర జీవులైతే మాత్రం ఈ పుస్తకాన్ని కొనడానికి అన్నేసి డబ్బులు దండగ అనే చెబుతాను. కోతికొమ్మచ్చి లాంటి హాట్ కేకు పుస్తకాలు (మంచి ప్రింటు క్వాలిటీతో) నూట ఏభై రూపాయల్లో దొరుకుతుంటే ఏంటట వీరి గొప్ప. ఇంతేసి ధరలు పెట్టి మళ్ళీ ఆంధ్రలో పుస్తకాలు కొనట్లేదు కొనట్లేదు అనడం మాత్రం రచయితకు తగదు.
ఇట్లు మీ....

Tuesday, August 04, 2009

రాఖీ పండగ

రాఖీ పండగ వస్తుందంటే బోల్డన్ని జ్ఞాపకాలు ముసురుకొస్తాయి. మేమ్ముగ్గురం అబ్బాయిలమైనా నాకు అక్షరాల ఇరవయ్యైదు మంది ఫస్ట్ కజిన్స్. సో, బానే రాఖీలు వచ్చేవి పోస్టులో. ఇవి గాక, ఇరుగుపొరుగు అక్కలు చెల్లెళ్ళు కలుపుకొని అధమ పక్షం డజన్ రాఖీలు కట్టుకొనేవాణ్ణి. చిన్నప్పుడు హాస్టల్లో ఐతే ఇంకా సరదాగా ఉండేది. అందరికి ఒకటీ రెండు రాఖీలుంటే నా దగ్గిర డజను. ఇప్పుడు కజిన్‌స్ అందరూ పెద్దవడం, పెళ్ళిళ్ళు చేసుకొని చెల్లా చెదురవడం, కారణాలేవైతేనేం.. సంఖ్య తగ్గి పోయింది.
ఎవరు పంపినా పంపకపోయినా నాకు తప్పకుండ వచ్చేదీ, నేనూ పని గట్టుకొని ఎదురు చూసేదీ పెద్దక్క (పెద్దనాన్న కూతురు) రాఖీ. పెద్దక్క రాఖీ చాలా స్పెషలు. ఠంచను గా వస్తుంది. చివరిదాకా ఎదురుచూసేలా చేయదు. ఇవన్నీ కాక రాఖీ తో పాటు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ మోసుకు వస్తుంది. చాలా చిన్నప్పుడు చాక్లెట్లు, కాస్త పెద్దయ్యాక గ్రీటింగ్ కార్డులు, హాస్టల్లో ఉన్నప్పుడు చాంతాడంత ఉత్తరాలు, తను కాస్త పెద్దయి ఉద్యోగం చేయగానే కొత్త చొక్కాలు... ఇలా సందర్భానుసారంగా ఏవేవో. కొన్నాళ్ళామధ్య అదృష్టం ఎక్కువై ఇద్దరం ఒకే ఊర్లో చదువుకునేవాళ్ళం. అప్పుడు చక్కగా నాన్న ఇచ్చిన డబ్బులతో అందరం ఏ మినర్వాకో, అబిడ్స్ తాజ్ కో వెళ్ళి పావ్ భాజీ, ఛోలే భటూరా తినే వాళ్ళం. ఇదిగో ఇవాళ కొరియర్ వాడు ఫోన్ చేసి, సార్ మీ పాకెట్ ఎట్లాగైనా తీసుకోవాలి రేపే రాఖీ అని ఫోన్ చేస్తే ఇవన్నీ గుర్తొచ్చాయి. వెధవ, స్వీట్ డబ్బా ఉందని ముందే సస్పెన్‌స్ తేల్చేశాడు.
ప్స్: చిన్నక్కా, ఇదంతా ఖోపంగా చదువుతున్నావని తెలుసు. ఏదో నీకు పెళ్ళయాక నువ్వూ పంపించడం మొదలెట్టావ్ కానీ, అప్పటి వరకు పంపిన రాఖీల క్రెడిట్టూ, క్రియేటివిటీ పెద్దక్కకే అని మనిద్దరికి తెలుసు. ఏమంటావ్ :)
అక్కలకు, చెల్లెళ్ళకూ, బ్లాగ్ మిత్రులకూ రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు మీ....

Monday, August 03, 2009

లవ్ ఆజ్ కల్

లవ్ ఆజ్ కల్
నాకసలు హిందీ సినిమా చూడాలంటే ఎక్కడలేని నీరసం వస్తుంది. హాలివుడ్ సినిమాల్లా కథనం ఉండదు, తెలుగు సినిమాల్లా కామెడీ ఉండదు. వెరసి చూడాలని ఆసక్తి ఉండదు. ఏడాది కాలంగా మిత్రులతో చూసి చూసి ఇప్పుడు అవీ అలవాటయ్యాయి. మగధీరకు టికెట్లు ఎలాగూ దొరకవని ఈ సినిమాకు వెళ్ళాం. డైరెక్టర్ ఇదివరకు జబ్ వి మెట్ తీసినతనే.
సినిమా కాస్త నిదానంగా నడుస్తుంది. పూతరేకులంత పలుచని కథాంశం. (wafer thin plot) :). బోరు కొట్టించకుండా సినిమా తీయడం కష్టమే. సినిమాలో రెండు కథలు నడుస్తుంటాయి. ఒకటి నేటి తరానికి సంబంధించిన ప్రేమాయణం. ఒకటి నిన్నటి తరానిది. సినిమాకు సైఫ్ నటనే పెద్ద బలం. గత ఏడేనిమిదేళ్ళుగా సైఫ్ నటనను మలచుకొన్న తీరు అద్భుతం. నిన్నటి తరమంటూ చూపించిన కథ చాలా బాగా తీశారు. సాంకేతికంగా నూటికి నూరు మార్కులు వేయొచ్చు. పాటలు మాత్రం నాకు ఆట్టే నచ్చలేదు. కథ వివరాల్లోకి ఎక్కువగా పోను. మీకు drama genre సినిమాలు నచ్చితే తప్పక చూడండి. థియేటర్‌లో కాకపోయినా...డీవీడీలో మాత్రం ఒకసారి చూడొచ్చు. సైఫ్ నటనకోసమైనా. అలాగే పాత తరం కథలో హీరోయిన్ కోసం ;-)ఓవరాల్, ఈ దర్శకుడినుండి ఇంకొన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు. -బు

Tuesday, May 23, 2006

పత్రికలు, ప్రారబ్దాలూ

పది పదిహేనేళ్ళ నాటి సంగతి. ఇంట్లో అందరం చదువుకునే పిల్లలం. టీనేజికి కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లలే అంతా. మా విస్తారపరివారం మొత్తంలో నగరంలో ఉన్నది మా ఒక్క కుటుంబమే కాబట్టి ఎప్పుడూ పై చదువులక్ని పెదనాన్న పిల్లలో అత్త పిల్లలో ఎవరో ఒకరు మాతో పాటే మా ఇంట ఉండేవాళ్ళు. అంత కలిపి ఐదారుగురికి తగ్గని సంత. డైనింగు టేబిలు మీదా, సెలవురోజు వస్తే అందరూ వాళ్ళ కాలేజీల కబుర్లూ, స్కూళ్ళ కబుర్లూ చెబుతూ తింటూంటే గంటలు నిమిషాల్లా దొర్లిపోయేవి. సెలవు రోజైతే ప్రతివాళ్ళకి ప్రత్యేకించి కొన్ని విధులుండేవి. దిక్కుమాలిన పాతపాటలు(అప్పట్లో నిద్రలేపితే అలాగే అనిపించేవి) చిత్రహార్లో వస్తాయని అక్కలిద్దరూ ఏడింటికే టీవీ పెట్టి అందర్నీ లేపేసేవాళ్ళు. తర్వాత పేపరు వస్తుంది. అందరూ తలో పేజీ తీసుకొని నిదానంగా చదువుతుంటే, లెండి లెండి, ఎనిమిదవ్వొచ్చింది అని అందర్ని లేపి ఎవరి పని వాళ్ళకప్పగించేది అమ్మ. అమ్మాయిలు, ఇల్లంతా దుమ్ము దులిపి, కడిగి, మొక్కలకి నీళ్ళు పోసి, వాళ్ళ పనుల్లో వాళ్ళుండేవాళ్ళు. అబ్బాయిలకు ఓ లిస్టు ఉండేది. కూరగాయల మార్కెట్టుకు పోయి వారానికి సరిపడా కూరగాయలు కొని తేవడం, కింద మంచినీళ్ళ టాంకు, పైన ఓవర్‌హెడ్డు టాంకు, కడిగి శుభ్రం చేయడం, ఇంటి చుట్టూ కలుపు మొక్కలు తీయడం, అంతా అయ్యేసరికి ఏ పదకొండో, పన్నెండో అయ్యేది. అందరూ తీరిగ్గా తలంటు పోస్తుకొని స్నానాలు ముగించే సరికి సెలవని ఏదో ఒక ప్రత్యేకవంటకంతో విందు సిద్ధంగా ఉండేది. హాయిగా తినేసి, ఏ ఆదివారం అనుబంధమో పట్టుకొని చక్కగా చదువుకుంటూ ఎప్పుడో తెలీకుండా నిద్రలోకి జారుకునేవాణ్ణి మిగిలిన వాళ్ళతో పాటు. మొన్నీ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు, నాస్టాల్జియా కోసమని ఇంచుమించు ఇలాంటి ఆదివారమే పండగలా జరుపుకొంటున్నాం అందరం. అన్నలు, తమ్ముళ్ళు, కజిన్సూ అందరం.
అసలే ఎండాకాలం, కిటికీలు, తలుపులన్నీ మూసి, వటవేళ్ళు తడిపి, కూలర్లు ఆన్ చేసి, అలాంటి కునుకే మరొకటి ఆస్వాదించేందుకు సిద్ధమయ్యాను. ఆదివారం అనుబంధం పట్టుకొని పేజీలు తిప్పుతున్నాను. కథా, కవితా, సరదా కబుర్లు ఒకటి తర్వాత ఒకటి పేజీలు తిరిగేస్తున్నాను.. ఇంకో పేజీ చదివితే మరో నిమిషంలో ఇక కళ్ళు మూసుకున్నట్టే..దిగ్గున తెలివొచ్చేస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కొన్ని సమాధానాలు. ఒకసారి కళ్ళు నులుముకున్నాను. ఏంటీ? నేను చదువుతున్నది వారపత్రికా? ఏదైన సరసమైన పత్రికా? అనుమానం లేదు వార్తాపత్రికే. గిల్లి చూసుకున్నాను. ఇంకా నిద్రపోలేదు. ఇక ఆ ఆర్టికల్ గురించి విస్తారంగా చర్చించాల్సిన అవసరం లేదు. మీ ఇంటికెళ్ళి ఒక ఆదివారం అనుబంధం తెరిచితే చాలు. నేను దేనిగురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసిపోతుంది.
కొన్ని మార్పులు జీవితంలో చాలా నిశ్శబ్దంగా జరిగిపోతాయి. మనం గమనించి తేరుకునేంతలో అది మన దినచర్యలో ఒక భాగంగా మారిపోతుంది. అసలు ఆదివారం అనుబంధం దినపత్రికల్లో ఇలాంటి వ్యాసాలు ఉండడం సమంజసమేనా? నాకు బాగా గుర్తు. మా పక్కింటాళ్ళకు బోల్డన్ని వారపత్రికలు వచ్చేవి. ఒక పదిహేను-ఇరవయ్యేళ్ళ క్రింద స్వాతిలో సరసమైన కథలు మొదలుపెట్టగానే, మాకు ఇంట్లో వార్నింగొచ్చేసింది. పొరపాటున వాళ్ళింట్లో పత్రికలు చదివారని తెలిసిందో కాళ్ళిరగ్గొడతామని :( సరే ఇంట్లో చిన్నపిల్లలు లేకుంటే, వారపత్రిక తెప్పించుకోవడంలో ఏ ఇబ్బందీ లేదు. మీ డబ్బులు మీరెలా తగలేసినా మీకు హక్కు ఉంది. కాని దినపత్రికలు కూడా ఇలాంటి వ్యాసాలు ప్రచురిస్తే, చిన్నపిల్లలున్న ఇంటి వాళ్ళు ఏం చేయాలి? సినిమాల్లో ఓ... తెగ హింస ఉంది, అశ్లీలంగా ఉంది అని గొడవలు చేసి సెన్సార్ చేస్తుంటారే. మరి, పత్రికలకి అలాంటి నియమాలు లేవా? సినిమా కావాలంటే మానుకోవచ్చు. పెరిగే పిల్లలున్న ఇంట్లో సమాచారం తెలుసుకోకుండా, దినపత్రికలు తెప్పించుకోకుండా ఎలా ఉండగలరు? మన దేశంలో పత్రికల్ని సెన్సారు చేసే బోర్డు కావాలి అంటాను. మీరేమంటారు. కొన్నాళ్ళ క్రితం ఇలాంటి పత్రికలపై ఒక ప్రజాహితవాజ్యం (public interest litigation) వచ్చిందని చదివాను. మళ్ళీ దాని ఊసే వినలేదు. ఆ కేసు ఏమయిందో తెలీదు. పత్రికలు మాత్రం యధేచ్ఛగా ప్రచురిస్తూనే ఉన్నాయి. (ఉదాహరణ కావాలంటే వార్త, ఆంధ్రజ్యోతి చూడండి. అలాగే ఏ వారపత్రికైనా..)
-బుడుగాయ్.
(కిరణ్ గారూ, శృంగారము రసరాజమని అన్నారు నిజమే. సర్కులేషన్ కోసం ఇన్ని అడ్డదార్లు తొక్కాలా? ఇప్పుడేమంటారు?)
tail piece: మన తరంలో (నాబోటి వాళ్ళను కలుపుకుని) చాలామందికి తెలుగు సరిగారాదు. మన ప్రమేయం లేకుండా మనపై రుద్దబడిన ఇంగ్లీషు విద్యైనా కానీయండి లేదా మార్కెట్ శక్తుల ప్రభావమే కానీయండి. ఒకరోజు ఏదో కవిత నచ్చిగట్టిగా చదివి మా రూమ్మేటుకు వినిపించాను. "మనసున దాగిన మర్మమేమిటో" అని ఒక లైనుంది. వాడికి వెంటనే అర్థమయ్యింది. మావాడు చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు మీడియం. తెలుగు చక్కగా చదవడం కూడా రాదు. అమెరికా వచ్చి ఆ కాస్త మరచిపోయాడు. ఎనిమిది దిక్కుల్లో నాలుగే తెలుసు (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పా..వెస్ట్). అలాంటిది వాడికి మర్మం అనే పదమెలా అర్థమయిందా అని ఆశ్చర్యపోయి వాణ్ణి అడిగితే, ఇంకా వాడికి తెలిసిన గ్రాంథిక పదాలు బోలెడున్నాయి. స్తంభన, పుంసత్వం, చూషణ, భావప్రాప్తి (*)... థాంక్స్ టు సమరం అని చెప్పాడు..నాకైతే ఎలా రియాక్టవాలో ఇప్పటికీ అర్థం కాదు. బహుశా తెలుగు భాష కనుమరుగవుతుందని ఓ..దిగాలు పడిపోతున్న బోధకులేమైనా గమనించాలేమో.
(*) బ్లాగులో ఈ దిక్కుమాలిన పదాలేమిటని చికాకు పడ్డవాళ్ళకి క్షమాపణలు. కానీ మీరు గమనించాల్సిందేమిటంటే, ఇవి నేను పత్రికల్లోంచి సెలక్టు చేసినవి మాత్రమే..

Wednesday, May 17, 2006

మన పుస్తకాలు - అమ్మకాలు

మీకో విషయం తెలుసా? బాగా ప్రాచుర్యం పొందిన తెలుగు సాహిత్య పుస్తకం మహా అంటే ఒక వెయ్యి కాపీలు అమ్ముడు పోవడం గొప్ప. రెండువేల కాపీలు అమ్ముడుపోతే అది మెగా సక్సెస్ కిందే లెక్క. ఆంధ్రరాష్ట్ర జనాభా ఇంచుమించుగా ఎనిమిది కోట్లు. అంటే ప్రతి నలభైవేల మందిలో ఒక్కరు పుస్తకం కొంటారన్న మాట. ఎంత దారుణమైన స్టాటిస్టిక్స్ కదా? అలా అని మన సాహిత్యం అంత బాగుండదా అంటే అదీ కాదు. రెండేళ్ళ క్రింద పునః ప్రచురణ జరిగినపుడు ముళ్ళపూడి వారి బుడుగు పుస్తకం కొన్నాను. నాకు కనిపించిన వాళ్ళందరినీ బతిమాలో, భయపెట్టో, మోహమాటపెట్టో చదివించాను. నచ్చలేదన్న వాళ్ళు ఒక్కరు కనిపిస్తే ఒట్టు. అలాగే ఈ మధ్య ప్రచురించిన పోలెరమ్మబండ కథలు కూడా. చదివిన ప్రతివాళ్ళు ఒక మంచి పుస్తకం చదివించినందుకు థాంక్స్ అని చెప్పేవాళ్ళే. కానీ వీళ్ళెవరూ పుస్తకాలషాపుకు వెళ్తే ఒట్టు. టీవీ వచ్చాక పుస్తకపఠనం తగ్గిందని సాధారణంగా అంటుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఆ సమస్య లేదు. బహుశా ఇక్కడ పుస్తకాలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి అని ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది.(ఇంకా ఈ టాపిక్‌పై బొలెడు చర్చించొచ్చు. ముందు ముందు బ్లాగ్స్ లో రాస్తాను. ఇవాల అనుకోకుండా కిరణ్ గారి పుస్తకాలపురుగు కాన్సెప్ట్ చూసి ఎప్పటినుండో మనసులో ఉన్న విషయాలు ఇక బ్లాగు మీద పెట్టక తప్పదనిపించింది. థాంక్స్ కిరణ్ :) ) మళ్ళీ కలుద్దాం.

స్వాగతం (కొంత స్వగతం కూడా :-))


ఎన్నాళ్ళుగానో నెట్లో కిరణ్ చావా గారి బ్లాగు చూస్తున్నా. ఇన్నాళ్ళకు బద్ధకం వదిలి నేనూ బ్లాగు మొదలెడుతున్నా. ఏవో గొప్ప విషయాలు పబ్లిష్ చేస్తాడేమోనని ఎదురుచూడొద్దు. లోకాభిరామాయణం రాయడానికే ఈ బ్లాగు. టిపికల్ ఇండియన్ కుర్రాళ్ళాగే సినిమాలంటే ఆరవప్రాణం :-) పుస్తకాలు, వార్తలన్నానూ..కొన్ని రోజులు బ్లాగు చదివితే మీకే తెలుస్తుంది లెండి.
నా బ్లాగుకు స్వాగతం.