Showing posts with label బుక్ ఫెస్టివల్. Show all posts
Showing posts with label బుక్ ఫెస్టివల్. Show all posts

Monday, December 21, 2009

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్‌కు జనరల్‌గా రెండు ట్రిప్పులేస్తాను. ఓసారి తెలుగు పుస్తకాలు కొనుక్కోడానికీ, ఓసారి ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోడానికి. ఈ టపాలో పిల్లలపుస్తకాలగురించి నా అనుభవాలు రాస్తాను. నాక్కావలసింది, ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి తెలుగు పుస్తకాలు.
ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి చదవడమే రాదు వాళ్ళకి పుస్తకాలేమిటా అని అడక్కండి. ఆరునెల్ల వయసునుండే మనం పిల్లలకి పుస్తకాలు చదివి వినిపించొచ్చు. మొదట మనం పేజీకి ఒకే బొమ్మ ఉండే ఆపిల్, ఆరెంజ్ లాంటి పుస్తకాలతో ప్రారంభించాలి. ఒక్కొక్క పదం రిపీట్ చేస్తూ ఎంత నెమ్మదిగా చదివించినా పదినిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. ఆ తరువాత ఒక పేజీలో ఏదైనా ఆక్టివిటీ ఉండే పుస్తకాలు చదవడం మొదలెట్టాలి. (ఉదాహరణకి తోటమాలి మొక్కలకి నీళ్ళు పోయడం), 3-6 ఆరు నెలల్లో పిల్లలూ ఆ స్థాయి దాటేస్తారు. అప్పుడు మనం కాస్త కామిక్స్, అమర్ చిత్ర కథలాంటివి చదవొచ్చు వాళ్ళకి. ఇవన్నీ ఇంత సాధికారికంగా చెప్పడానికి నాకేమీ సైకాలజీ డిగ్రీల్లేవూ అలా అని నేను కనీసం పేరెంట్ ని కూడా కాదు. కాని అక్క/అన్నల పిల్లల మీద ఈపాటికే ప్రయోగాలు చేసి కరెష్టే అని తీర్మానించుకున్నాను.

మా ఇంట్లో ఓ మూడేళ్ళ బు(పి)డుగు. వాడికి టీవీ అట్టే చూపించొద్దని చాలా చిన్నప్పుడే వాళ్ళమ్మా నాన్న డిసైడ్ చేయడంతో దాంట్లో వాడికి పెద్ద అభిరుచి లేదు. వాడికి ఏడాది/ఏడాదిన్నర వయసున్నప్పుడు బొమ్మల కథలున్న పుస్తకాలు ముందేసి వాడికి చెబుతుంటే వాడి తిండి తినే ప్రసహనం గంటన్నర నుండి సగానికి కుదించవచ్చని, పాలు తాగే ప్రసహనం ముప్ఫై నుండి పది నిమిషాలకు కుదించవచని ఒక దేవరహస్యం తెలిసింది. ఇక అప్పుడు మొదలయ్యింది పిల్లలపుస్తకాల వేట. ఇక్కడ వాడి వయసు 1.5-3 కి మధ్య కాబట్టి వాడు స్వతహాగ చదవలేడు. అలాగే ఒక పేజీలో రెండు కంటే మించి బొమ్మలుంటే వాడికి నచ్చదు. మరి అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

విశాలాంధ్రలో/నవోదయల్లో చూడ్డం శుద్ధ దండగ. అక్కడ పిల్లల పుస్తకాలు 2-5% ఉంటాయి. అవీ తమంతట తామే తెలుగు చదువుకోగలిగే పిల్లల కోసం. ఇక Walden/AA Hussain వంటి ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో బోల్డు దేశీయ ప్రచురణలుంటాయి. అవన్ని misguided missiles లాగా ఉంటాయి. అసలు పిల్లల అభిరుచి గురించి వాళ్ళకి కాస్తైన జ్ఞానం ఉన్నట్టనిపించదు. ఒక టెక్ ఉపమానం ఇవాలంటే, బోల్డు ఇన్‌ఫర్మేషన్ పెట్టుకొని యూజర్ ఇంటర్ఫేస్ సరిగా లేని వెబ్‌సైట్లలా ఉంటాయి. ముందే చెప్పినట్టు అంత చిన్న పిల్లలకి ఒక పేజీలో ఒకటికన్నా ఎక్కువ బొమ్మలుండడం నచ్చదు. వాళ్ళ దృష్టి పరిపరి విధాలుగా పోతుంది. చివరికి నాకు దొరికినవి విదేశీ ప్రచురణలు. చక్కటి పిల్లల పుస్తకాలుంటాయి ఇంగ్లీషులో. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకొనే కార్టూన్ కారక్టర్స్ గట్రా. కానీ వీటితో ఒక పెద్ద చిక్కుంది. ఒకటి - అవి ఇంగ్లీషులో ఉంటాయి. అదేం పెద్ద కష్టం కాదు, కథ పూర్తిగా మనం చదివేసి వాళ్ళకి తెలుగులో చెబితే సరిపోతుందనుకుంటే, అవి చెప్పే కథలు కూడా ఏ డిస్నీ కారక్టర్సో, ఫెయిరీ ప్రిన్సెస్‌ల గురించో ఉంటాయి. పేర్లు కూడా జాన్, టాం బార్బీ ఇవి. మాటలు నేర్చుకునే వయసులో వాళ్ళకు వాళ్ళ చుట్టూ ఉన్న పేర్లు కాక వేరే అరువు పేర్లు వినిపించడం ఎంత సబబు? మనకు బోల్డన్ని పంచతంత్రాలు, రామాయణ భాగవతాలుండగా మనకూ తెలియని, మనం రిలేట్ చేసుకోలేని డిస్నీ కథలెందుకు చెప్పాలి?

ఇలాంటి సమయంలో నాకు 2007 బుక్ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ బెంగళూరు వాళ్ళ స్టాలు కనిపించింది. చిల్డ్రన్స్ బుక్ ట్రస్టు వాళ్ళు చక్కగా మన భారతీయ నేటివిటీ ఉన్న కథలు పేజీకొక బొమ్మ/ ఆక్టివిటీ ఇలస్ట్రేషన్లతో ఒకే లైన్ టెక్స్ట్ తో కొన్ని పుస్తకాలు ముద్రించారు. పోలోమని బోల్డు కొనేసుకున్నా.. అందులో ఉదాహరణకి ఒక కథ చెబుతాను. ఒక చిన్న పక్షి ఉంటుంది. ఓ రోజు నోట్లో గింజ పెట్టుకొని తింటుంటే గింజ కాస్త పడి మట్టిలో కూరుకుపోతుంది. ఆ పక్షి రోజూ అక్కడికి వచ్చి వెతుకుతుంటే ఓ రోజు అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. ఇలా... ఇంకొన్ని సబ్జెక్ట్స్, మీతా అండ్ హర్ మాజిక్ షూస్, మోహినీ భస్మాసుర, దీపావళి పండగ( మావాడికి ఇదెంత ఇష్టమో) etc... ఇవి ఇంగ్లీషులోనే ఉన్నా మన నేటివిటీకి దగ్గరగా ఉండి కొంతలో కొంత మేలనిపించాయి. అదే ఏడు తార్నాక నుండి ప్రచురితమయ్యే "మంచిపుస్తకం" ప్రచురణలు కూడా చూశాను. కానీ వాళ్ళవి ఇంకా బాల్యదశలోనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పిల్లల్ని ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. అలాగే ముట్టుకుంటే చిరిగిపోయేట్టు. ఆ వయసు పిల్లలనుండి మనం డెలికేట్ హాండ్లింగ్ ఆశిచంలేం కదా. 2008లో కూడా సేం స్టోరీ. తెలుగులో సరైన పుస్తకాలు లేవు. పిల్లల పుస్త్కాల్లో పేజీలు కాస్త మందంగా, త్వరగా చినిగిపోకండా ఉండాలి. CBT వాళ్ళూ, మంచిపుస్తకం వాళ్ళూ ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కాని రెండు కారణాల వల్ల దీన్ని క్షమించేయవచ్చు. 1) పిల్లలు ఒక కథని మహా అంటే రెణ్ణేల్లకు మించి చదవరు. అప్పటికి వారికది కంఠతా రావడమయి ఆ పుస్తకంతో పనిలేకుండా పోతుంది. పుస్తకం జీర్ణమైనా పెద్ద నష్టమేమీ ఉండదు. 2) దళసరి అట్టలు పెట్టి ముద్రిస్తే పుస్తకం ధర పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పుస్తకాల ధర్ ఇరవయి రూపాయలు. ఈ రోజుల్లో ఇది కారు చవక ధరంటాను. కాదంటారా? ప్రతీ సంవత్సరం నేను స్టాల్ ఓనర్లతో నేరుగా మాట్లాడి వాళ్ళకి ఫీడ్‌బాక్ ఇచ్చాను. అదీ పూర్వరంగం.

ఈ సంవత్సరం 2009 ఫెస్టివల్లో తిరుగుతూ తిరుగుతూ "మంచిపుస్తకం" వాళ్ళ స్టాల్‌కి వెళ్ళి చూద్దును కదా నేకోరుకున్న పిల్లల పుస్తకాలన్నీ అచ్చ తెలుగులో. ఎంత ఆనందమేసిందో. చక్కని తెలుగులో చిన్న చిన్న పిల్లల పుస్తకాలు. ఒక్కోటీ పది-పదదహారు పేజీల పుస్తకాలు. ధర ఇరవయి రూపాయలతో అందుబాటులోనే ఉంది. ఎడా పెడా కొనేశాను.

అఫ్కోర్స్ మా వాడికి కాదు. వాడు రెండేళ్ళుగా ఇలాంటివి చదివించుకొనీ చదివించుకొనీ వివిధదశలు దాటిపోయాడు. ప్రస్తుతం ఒక మెట్టెక్కి అమర్-చిత్ర కథ సిరీస్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. రామాయణ, భారత భగవతాలు తెగ విని బాగా ముదిరిపోయీ మొన్నీ మధ్యే ప్లేస్కూల్లో టీచర్లపై ఆగ్నేయాస్త్రం వేస్తానని, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే బ్రహాస్త్రం వేసి గదతో కొడతానని బెదిరించాడట. సో మావాడికీ యేడు బొమ్మలు తగ్గిపోయి ఒక్కో పేరాగ్రాఫున్న పుస్తకాలు కొన్నాను. చూడాలి వాడు ఎలా రియాక్టవుతాడో.

మీరు కూడా ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్ కి వెళ్తే రెండు స్టాల్స్ చూడ్డం మరవొద్దు. 1) చిల్డ్రన్స్ బూక్ ట్రస్టు వాళ్ళది 2) మంచిపుస్తకం వాళ్ళదీ. నాకు వీళ్ళతో ఎటువంటీ లావాదేవీలు లేవు సుమీ. పిల్లలు మీవాళ్ళైనా, మీ బంధుమిత్రగణంలో వాళ్ళైనా మనం పదిమందికి పుస్తకాలు బహుమానమిస్తే కనీసం ఒక్కరికి పుస్తకాలు చదివే అలవాటు అబ్బినా అవన్నీ సార్థకమయినట్టే. ఇంకోసారి పిల్లలున్న ఇంటికి వెళ్ళేప్పుడు ఇరవయి రూపాయలు పెట్టి డైరీమిల్క్ చాక్లెట్లు కొనేకన్నా ఇలాంటి పుస్తకమొకటి ఇచ్చి చూడండి.

ఇక నా విష్‌లిస్టులో తరువాతి ఐటం. అమర్‌చిత్రకథ లాంటి సిరీస్‌లు తెలుగులో కావాలి. తెలుగు ప్రచురణకర్తలూ వింటున్నారా?

అలాగే ఈ బుక్‌ఫెస్టివల్ కి నాదో విష్ లిస్టు. ఒక ఎలక్ట్రానికి స్క్రోల్ ఏర్పరచి ఉన్న రేర్/మంచి పుస్తకాల పేర్లు/రచయితలు అవి దొరికే స్టాల్స్ లిస్టు ఇవ్వొచ్చు. అప్పుడు చాలా మందికి ఎక్కువ తిరక్కుండా టీవీ ముందు కూర్చొని పుస్తకాలు కొనేసుకోవచ్చు. ఏమంటారు.