నాన్నగారికి బదిలీ అవడంతో ఊరు, ఇల్లు, బడీ అన్నీ మార్చాల్సివచ్చింది. పుట్టినప్పటినుండి తెలిసిన టౌను వదిలి మొదటిసారిగా పల్లెటూళ్ళో పడ్డారు. మూడో తరగతి వదిలి నాలులో అడుగిడుతున్న బుడుక్కి బెరుగ్గా ఉంది. కొత్తబడి ఎలా ఉంటుందో, స్నేహితులవుతారో లేదో అని. ఇంటి పక్కనే ఉంది. నచ్చకపోతే వేరే బడి అని ఒట్టేయించుకొని వెళ్ళాడు. టీచరొకాయన తరగతి గదిలోకి తీసుకెళ్ళి "ఇదిగో ఇతను కొత్తబ్బాయి. ఇవాళ్టి నుండి మనబడికే వస్తాడు. కుదురుగా ఉండండి అని ఒక హెచ్చరిక చేసి వెళ్ళాడు. క్లాసు రూము చూడగానే నీరసమొచ్చింది బుడుక్కి. మూడు పొడవాటి బెంచీలు. టౌను స్కూల్లోలా డెస్కులు లేవు. ఎలా రాసుకుంటారో ఏమో వీళ్ళంతా? అనుకుంటూనే కూచున్నాడు. ఇంగ్లీషు పీరియడుట. ఆరోజు సార్ రాలేదు. అంతా కలిపి పదిహేను మంది పిల్లలు. అందరు మూకుమ్మడిగా ప్రశ్నలేయడం మొదలెట్టారు. నీ పేరేంటి? ఇంతకు ముందెక్కడ చదివావు? అబ్బో టౌను స్కూలా? మీ క్లాసులో నీకే రాంకు? మీ ఇల్లెక్కడా? ఒక్కొక్కటే చెబుతూ నీ పేరేంటి అని అడిగాడు పక్కనున్న శీనూని. తన పేరు చెప్పి మిగిలిన పదిహేను మంది పిల్లల పేర్లు గడగడా చెప్పాడు వాగుడుకాయి శీను. ఓహో అని విని ఊరుకోగానే మళ్ళీ మొదలు. ఏదీ... అందరు పేర్లు మళ్ళీ చెప్పు చూద్దాం అని ఛాలెంజ్ చేశాడు వెంటనే. బాగా మెమొరీ గేములాడిన అనుభవంతో అప్పుడే విన్న పదిహేను పేర్లు అంతే వేగంగా అప్పజెప్పాడు బుడుగు. అలా పూర్తయ్యాయో లేదో "శభాష్" అని వినిపించింది తలుపు పక్కనుంది. టీచరు వచ్చినట్టుంది. పిల్లలంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు సర్దుకున్నారు. ఆవిడ పేరు ఉమా టీచరుట. ఆవిడా కొత్తగా జాయినయ్యారుట. ఇంగ్లీషు సారు రాలేదని పిల్లల్ని వదిలేయకుండా ఆ పీరియడ్ కోసం వచ్చారుట.
ఇంగ్లీషు పాఠాలని గాలికి వదిలేసి పిల్లలతో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. మొదట క్లాసురూములో వివేకానందుని పటం చూసి ఆయనపై ఒకటిరెండు ప్రశ్నలు. ఒక పిట్టకథ. ఆ కథల్లోంచి గొప్పవాళ్ళవ్వాలంటే మనకు కావలసిందేమిటి అని చిన్న చర్చ లేవదీశారు. పిల్లలంతా తలోటీ చెబుతున్నారు..కష్టపడ్డం, పట్టుదల, ధైర్యం, చదువు, తెలివి ఇలాంటివి. అన్నీ బోర్డుపై రాసి, చివర్లో "సచికృప" అన్న పదం రాశారు. ఈ తారకమంత్రం గుర్తు పెట్టుకోండి అందరూ అని చెబుతుంటే, అంటే ఏమిటని అడిగారంతా. సంకల్పం-చిత్తశుద్ధి-కృషి-పట్టుదల ఈ నాలుగు ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు అని ఉదాహరణలతో కథలతో ఆవిడ చెప్పిన తీరుకి కళ్ళు విప్పార్చుకుని విన్నారంతా. తర్వాతి పీరియడ్ కోసం టీచరు వచ్చి తలుపు తట్టేదాక బడిగంట కూడా వినిపించలేదెవ్వరికీ. ఆరోజు బడి అయిపోయాక క్లాసంతా ఉమాటీచరు పాఠం గురించే చర్చలు. ఈ కబుర్లలోపడి బుడుగు బెరుకు సంగతే మరిచాడు.
* * * * *
కొత్తబడి బాగా నచ్చింది బుడుక్కి. పల్లెటూళ్ళో టీచర్లు చాలా సరదాగా ఉంటారు. టీచర్లు పిల్లలతో బాగా చనువుగా ఉంటారు. చిన్న ఊరు. పెద్దగుడి. పక్కనే గోదావరి. ఎక్కడికివెళ్ళినా ఎవరో ఒక టీచరు కనిపిస్తారు. పిల్లలు టీచర్లకు మధ్య టౌనుకి మల్లే స్ట్రిక్టు దూరాలు/పొడిపొడి ఇంగ్లీషు మాటల్లో ఆర్డర్లు లేవు. చక్కగా ఇంటి భాషలో మాట్లాడుతారు. అందరికంటే ఎక్కువగా ఉమా టీచరంటే ఇష్టం బుడుక్కి. ఆవిడ తీసుకునే సోషల్ కం జనరల్ నాలెడ్జి పీరియడ్ కోసం రోజంతా ఎదురుచూసేవాళ్ళు పిల్లలు. పాఠం పూర్తి చేసి వెళ్ళేముందు రోజొక పజిలో/g.k. ప్రశ్నో ఇచ్చేవారు టీచరు. మర్నాడు దాని
కి సమాధానం కనుక్కుని రావాలి. ఆవిడతో "శభాష్" అనిపించుకోవటమే పెద్ద ప్రైజ్ పిల్లలకి. వచ్చీ రానట్టుగా ఊరిస్తూ ఉండేవి ఆ పజిల్స్ కూడా. అందరికీ ఒకటే ఆశ. ఆ పజిల్ ఎవ్వరికీ రాకూడదు, వాళ్ళొక్కరికే రావాలని. కొన్ని వెంటనే వచ్చేస్తే, కొన్నైతే రోజులతరబడి సమాధానాలు దొరక్క విసుగెత్తిపోయేవాళ్ళు. ఆవిడేమో నింపాదిగా రోజో క్లూ ఇచ్చేవారు సాల్వ్ చేసేవరకూ. ఒకరోజు పులీ, మేకా, గడ్డివాము పజిల్ ఐతే, మర్నాడు "కర్ణుడి తల్లి బావ కొడుకు కర్ణుడికి స్నేహితుడా? తమ్ముడా?" అని ప్రశ్న. బుడుగు, వాగుడుకాయి శీను, ఫస్ట్ ర్యాంకరు సతీషు ముగ్గురి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒక పజిల్ మాత్రం వారం రోజులు పట్టింది ముగ్గురూ కలిసి సమాధానం వెతికినా కూడా. "ఆసోమంబుగుశుశ" అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్న. రోజూ ఇంటికి వచ్చి ఉమాటీచరు కబుర్లతో అమ్మను హోరెత్తించేవాడు బుడుగు. ఆ పజిల్స్ సాల్వ్ చేయడంలో తనసాయమూ కావాలిగా మరి.
అసలు ఉమాటీచరుకి తెలీని పనేమైనా ఉందా అని అబ్బురమనిపించేది బుడుక్కి. స్కూల్లో వార్షికోత్సవాలకు నాటకాలు వేయాలన్నా, కార్తీక మాసం వనభోజనాలైనా, దగ్గర్లో గుట్ట మీద గుడికి డే ట్రిప్పైనా, చిన్నారి చేతన 3-డీ సినిమా పిల్లలకి చూపించాలన్నా అన్నీ టీచరు పర్యవేక్షణలో జరగాల్సిందే. పిల్లలు కూడా ఆవిడ ఏది చెబితే అది వేదమన్నట్టుగా వినేవాళ్ళు. టౌను బడికన్నా ఆ పల్లెటూరి బడి బాగా నచ్చింది బుడుక్కి. అమ్మా ఎప్పుడూ నేనిదే బళ్ళో చదువుకుంటానని చెప్పేశాడమ్మకి.
* * * * *
నాలుగో తరగతి చివర్లో ఉండగా ఒకసారి బుడుగు వాళ్ళ వంటింట్లో రెండు మార్లు పాములు కనిపించాయి. నెలలోపల బడి పక్క ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి మారారు. పొద్దున లేచి కొత్తయింటి పరిసరాలు చూస్తుంటే అర్థమయ్యింది బుడుక్కి. వాళ్ళ కొత్తిల్లు ఉమా టీచరు పక్కిల్లేనని. ఎంత సంతోషం వేసిందో. నెమ్మనెమ్మదిగా వాళ్ళ రెండు కుటుంబాలు మంచి స్నేహితులైపోయారు. వేడుకలకి పిలుచుకోవడాలు, పండుగలొస్తే ఏదో నెపంతో కలిసి వండుకోవడాలు, పిల్లల స్లీపోవర్లూ గట్రా. నాలుగో తరగతి సెలవుల్లో టీచరు బుడుక్కి ఊర్లో లైబ్రరీని పరిచయం చేసింది. సెలవులంతా పుస్తకాలూ, పజిల్స్, కథలతో సరదాగా గడచిపోయాయి.
ఆ రోజు బాగా గుర్తుంది బుడుగుకు. ఐదో తరగతి దసరా సెలవులకి పిన్నీ, చెల్లీ వచ్చారు. బల్లమీద ఏదో కథల పుస్తకం చదువుతుంటే బెడ్రూంలో అమ్మా, పిన్నీ వాళ్ళ మాటలు బుడుగు చెవినబడ్డాయి.
"ఈ ఉమా టీచరెవరక్కా? ఏ ఊరికి వెళ్ళిన నీకు ఇరుగూ పొరుగూ మంచివాళ్ళే దొరుకుతారు."
"వీడికి స్కూల్లో టీచరు. అలా పరిచయం. వీళ్ళ పక్కింటికొచ్చాక మంచి స్నేహితులయ్యారు.పాపం చాలా మంచావిడ. వాళ్ళాయనకు ఉద్యోగం సద్యోగం లేదు. ఇంటిని పట్టిచ్చుకోడు. కూతురు పెళ్ళీడుకొచ్చింది. ఇంకా మన బుడుగు తోడి పిల్లలిద్దరు. పాపం ఈవిడే రెక్కలు ముక్కలు చేసుకొని లాగుతుంది వాళ్ళ సంసారాన్ని."
"అవునా..? ఎంత చలాకీ మనిషి. వారం రోజులుగా చూస్తున్నా ఒక్కసారైనా ఆమెకిన్ని కష్టాలని అనిపించలేదు."
"అవున్నిజమే. పాపం గుట్టుగా ఉంటుంది. స్వాభిమానం గల మనిషి. ఎవరినీ అడగదు. ఒక మాట అనదు. తననంటే పడదు. వీధిలో ఏ శుభకార్యమైనా ఆవిడ ఉండాల్సిందే. పనిమొదలెడితే పదిమంది పెట్టు. ఈ ఊర్లో తెలుగుదేశం కార్యకర్త కూడా. ఊర్లో ఆవిడను మెచ్చుకోనివారు లేరు."
టీచరు కష్టాలు విని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ఆపై వినపడలేదు బుడుగుకి. టీచరంటే అప్పటికే ఉన్న గౌరవం, ఆరాధనభావం రెట్టింపవుతుంటే, మనసులో గట్టిగా అనుకున్నాడు. పెద్దయ్యాక ఎలాగైనా టీచరుకి సహాయం చేయాలని.
ఐదో తరగతి తరవాత ప్రైవేటుబడి చదువు ముగిసింది. ఆరునుండీ గవర్నమెంటు బడికి వెళ్ళాలి. అక్కడ చదువు చట్టుబండలని ముందుజాగర్తగా ఏదో గవర్నమెంటు హాస్టలుకి ఎంట్రన్సు రాయించి పంపించారు బుడుగుని. మరో ఏడాదికి నాన్నగారికి బదిలీ అయ్యి మళ్ళీ టౌనుకి వచ్చేశారు బుడుగు కుటుంబం. ఉత్తరాలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా టీచరుని ఏడాదికో రెండేళ్ళకో కలిసి కుటుంబవిశేషాలు పంచుకోవడం మానలేదు బుడుగు. ఇంజనీరింగులో సీటు వచ్చినప్పుడూ, పైచదువులకు విదేశానికి వెళ్ళినప్పుడూ తనకన్నా యెక్కువ సంతోషించ్చింది టీచరు. చిరుగర్వంతో నా స్టూడెంటని చెప్పుకోవడమూ విన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీచరుకు రేషన్ షాపు డీలర్‌షిప్ వచ్చిందనీ, ఆర్థికంగా కాస్త కుదుటపడ్డారనీ విని ఎంత సంతోషం కలిగిందో బుడుగుకి.
* * * * *
ఒకసారి ఆ ఊరు మీదుగా వెళ్తూ అక్కడ టీచర్ని కలుద్దామని వెళ్తే వాళ్ళింటి ముందు రేషనుకోసం వచ్చిన జనం మధ్య పనిలో మునిగి కనిపించారావిడ. పొడిపొడిగా రెండు మాటలు పలకరించి, సరే పనిలో ఉన్నారు కదా మరోసారి వచ్చినప్పుడు తీరిగ్గా మాట్లాడుదామని వచ్చేశాడు. ఆరునెల్లయ్యాక, ఇంకా న్యూయియర్ వేడుకల్లో ఉండగా ఫోన్ వచ్చింది. ఉమా టీచర్ యిక లేరని. పరీక్షలు రాయబోయే మనవరాలిని పలుకించడానికి వెళ్ళి ఏదో ఆయాసానికి గురయ్యారట. డాక్టరుని పిలుచుకు వచ్చేలోపే ముప్ఫై నిమిషాల్లో గుండెపోటుతో ప్రాణం పోయిందట. విన్న ఒక్కక్షణం ఎలా రియాక్టవాలో తోచలేదు బుడుగుకు. అలలు అలలుగా జ్ఞాపకాలు తరలివస్తుంటే, నిలబెట్టుకోని బాసలు వెక్కిరిస్తుంటే, ఆదరబాదరాగా కలిసిన చివరి పలుకరింపు గుర్తొచ్చింది. తల్లిదండ్రుల ఋణం ఎలాగోలా తీర్చుకోవచ్చేమో. పసిమొక్కగా ఉన్నప్పుడు చుట్టూ దడి కట్టి చేయూతనిచ్చిన టీచరు ఋణం ఎలా తీర్చుకోవచ్చు? కంటతడిపెట్టడం టీచరుకు అట్టే ఇష్టముండదని గుర్తుకు రాగా, శూన్యం నిండిన మనసుతో ఆలోచిస్తున్నాడు బుడుగు....
(యేదీ కల్పితం కాదు..మా ఉమా టీచరుకు అశ్రునయనాలతో...)