Thursday, October 22, 2009

ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు.

బాగా చిన్నప్పటి మాట. నాకు మా ఇంట్లో కొన్ని నిషిద్ధ వస్తువులుండేవి. నాన్నగారి షేవింగ్ కిట్టు, కాల్కులేటర్, అమ్మ కుట్టుమిషను, కత్తెర ఇలాంటివి. ఏదైనా ముట్టొద్దని చెబితే ఇక మన క్యూరియాసిటీ పదింతలయ్యేది. రాత్రింబవళ్ళూ వాటిని ఎలా తీయాలి? వాటితో ఏం చేయాలి అనే ధ్యాస. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిఉన్న సమయంలో గబుక్కున కాల్కులేటరో కత్తెరో తీసి, మా రహస్యస్థావరంలోకి (పట్టెమంచాల మీద చీరలు ఆరవేస్తే చిన్న కాంపు సైటులా తయారయ్యి మా స్థావరంగా పనికొచ్చేది) తీసుకెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి తిరిగి దాని స్థానంలో దాన్ని పెట్టేసేవాణ్ణి. అప్పుడప్పుడే కూడికలు, గుణకారాలు నేరుస్తున్నాను గనుక కాల్కులేటర్ ఎందుకు, ఎలా వాడతారో తెలిసేది కాదు. ఖర్మకాలి ఒకరోజు దానితో ఆడుతుంటే దాని మీద నీళ్ళు పడి పాడయిపోయి ముక్కచివాట్లు తిన్నాను. అలాగే ఓసారి బాడ్మింటన్ రాకెట్ కొనిస్తే దాన్ని నీళ్ళలో ముంచి, కట్టెల పొయ్యిలో పెట్టి ఏవో ప్రయోగాలు చేసి నాశనం చేశాను. అప్పటికే వీడితో జాగర్తగా ఉండాలి అని రెపుటేషన్ సంపాదించాను.

అప్పట్లో మా బడి గవర్నమెంటు బడికి ఎక్కువా కాన్వెంటుకు తక్కువా అన్నట్టుండేది. మా బళ్ళో నియమమేంటంటే నాలుగో తరవతి వరకు అందరూ పెన్సిల్లే వాడాలి. ఐదవ తరగతి నుండి ఇంకు పెన్నులు వాడాలి. అదిగో అలాంటి సమయంలో మా ఇంట్లో ప్రవేశించాయి ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు. కాంలిన్ జామెట్రీ బాక్సు. దాంట్లో ఒక వృత్తలేఖిని, ఒక డివైడర్(తెలుగు పేరు మరిచాను), కోణమానిని, సెట్-స్క్వేర్లు. షార్పెనరు, రబ్బరు(అప్పట్లో ఎరేజర్ని అలాగే అనేవాళ్ళం) పెట్టుకోడానికి వేరే అరలు. యెల్లో కలరు మీద బ్లాక్ లైన్లతో తళతళ మెరుస్తూ చూట్టానికి ఎంత బాగుండేదో. ఇక ఇంకుపెన్నుది ఇంకో అందం.ఓ ఇంకుబుడ్డి, రెండు ఇంకు పిల్లర్లు (ఫిల్లెర్), రెండు తళతళ మెరిసే పాళీలు. ఇంత సరంజామాతో ఠీవీగా అలరారుతుండేది. వచ్చిన చిక్కల్లా నాకు మాత్రం వాటిని ముట్టుకోడానికి పర్మిషన్ లేదు. నేనప్పటికి మూడో తరగతే. అన్నయ్య ఐదో తరగతిలోకి వచ్చాడని కొన్నారు. ఎపుడెపుడు వాటితో ఆడదామా అని ఉవ్విళ్ళూరుతున్నాను. నా క్యూరియాసిటీ ముందే పసిగట్టిన అన్నయ్య ముడితే కాళ్ళిరగ్గొడతానని నాన్నతో వార్నింగిప్పించాడు.

ఇక చూస్కోండి నా కష్టాలు. నేనా చదివేది ముష్టి మూడో తరగతి. వెధవది జామెట్రీ బాక్సు కాదు కద కనీసం స్కేలు కూడా అఖ్ఖర్లేదు. రోజూ బడికెళ్ళే టైంలో మొదలయ్యేది అన్నయ్య తతంగం. మిలిటరీ వాళ్ళు యుద్ధానికెళ్ళే ముందు గన్స్ ఆయిలింగ్ చేసినట్టు అవసరమున్నా లేకున్నా అన్నయ్య జామెట్రీ బాక్సు తీసి అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, ఇంకు పెన్నులో ఇంకు నింపుకొని ఓ ఊరించేవాడు. నేనేం చెయ్యగలను మహా అంటే ఒక సారి పెన్సిల్ చెక్కుకొని మళ్ళీ సంచీలో పడేస్కోవడమే.ఓ వైపు పెద్దగా పట్టించుకోనట్టు నటిస్తూ, ఎప్పటికైనా నేనూ ఐదో తరగతిలో రాకపోతానా? నీ సంగతి తేల్చకపోతానా? అనుకొనేవాణ్ణి. సాయంత్రం బడి నుండి రాగానే మళ్ళీ కొత్తవేషాలు. పొద్దున్నే నింపిన పెన్నును ఇంకు పిల్లరుతో మళ్ళీ నింపుతూ, రికార్డు షీట్లపై వృత్తలేఖినితో వృత్తాలు గీస్తూ వాట్లో రంగులు నింపి బొమ్మలేస్తూ రోజో తమాషా చూపించేవాడు. ఇంకో రోజు అట్ట ముక్కలను డివైడర్‌తో కాత్తిరించి చక్రాలబండి చేసేవాడు. మరో రోజు స్కేలుతో డబల్ లైనింగ్, షాడోస్ తో పేర్లు రాసి చూపించేవాడు. అబ్బ, ఈ వెధవ మూడో తరగతి ఎప్పుడవుతుందో, దాని తర్వాత నాలుగో తరగతి ఎప్పుడవుతుందో నాకెప్పుడో జామెట్రీ బాక్సు వస్తుందో , పరమ చిరాగ్గ ఉండేది. పోనీ అన్నయ్యనడుగుదామా అంటే వాడసలే టాం సాయరు టైపు. రోజంతా వాడితో మంచిగా ఉండి రెండో మూడో లంచాలిచ్చాక(అమ్మ చిన్న చిన్న పనికి పిలిచినప్పుడల్లా నేనే వెళ్ళడం, దీపవళి బాంబుల్లో కొన్ని నా వాటాలోంచి ఇవ్వడం లాంటివి) ఇంకుపిల్లరుతో వాడి పెన్నులో ఇంకు నింపడానికి పర్మిషనిచ్చేవాడు. అప్పటికి వాడాటకు వెళ్ళినప్పుడళ్ళా ఆ జామెట్రీ బాక్సు తీసి మా రహస్యస్థావరంలో బోలెడు వృత్తాలు గీసి వాడు వచ్చే లోపు మళ్ళీ యధావిధిగా పెట్టేవాణ్ణి. కాని ఇలా దొంగతనంగా ఏం సరదాపడతాం. ఎన్ని వృత్తాలు గీసుకున్నా అన్నయ్యకు చూపించలేకపోతే ఏం లాభం. ఇలా కాదని దసరా సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు నన్నెంతో గారాబంగా చూసుకొనే నాయినమ్మని అడిగా. "నాయినమ్మా నాకో జామెట్రీ బాక్సు కొనిపెట్టవూ" అని. అదేంటో తెలీని నాయినమ్మ సరేనని డబ్బులిచ్చినా అమ్మకా విషయం తెలిసి ససేమీరా కొనివ్వనంది. మొతానికి అలా అలా మూడో తరగతిగడిచిపోయింది.
మరో ఏడాదికి నాకూ ఇంకు పెన్ను జామెట్రీ బాక్సు వస్తాయనగా నాన్నకు ఒక పల్లెటూరుకు బదిలీ అయిపోయింది. ఆ డొక్కు బళ్ళో ఇంకు పెన్ను ఎవరూ వాడరు. ఏ తరగతి వాళ్ళైనా బాల్ పాయింటు పెన్నుతో రాసుకోవచ్చు. అసలు ఈ బాల్ పెన్ను కనిపెట్టిన వాళ్ళననాలి. పుట్టింది మొదలు చచ్చేవరకు ఒకటే అవతారం అదీనూ. అసలు ఇంకు పెన్నుకున్న దర్జా హోదా బాల్ పెన్నుకెక్కడా. లైఫులో గొప్ప రొమాన్స్ మిస్సయ్యాను కదా అని బాధపడుతుంటే చల్లగా చెప్పారింకో వార్త. ఆ పల్లెటూరి బళ్ళో ఐదో తరగతిలో ఎవ్వరూ జామెట్రీ బాక్సు వాడరట. అనవసరపు ఆర్భాటాలెందుకు? అఖ్ఖర్లేదని టీచర్లే చెప్పేసారు. హతోస్మి.

నా ఐదో తరగతయిన తరువాత పల్లెటూళ్ళో చదువు చట్టుబండలైతోందని అన్నయ్యను సిటీలో బాబాయి దగ్గరికీ, నన్ను హాస్టలుకీ పంపేశారు. ట్రాజెడీ ఏంటంటే హాస్టల్లోనూ బాల్ పెన్నులే వాడేవాళ్ళం. మా హాస్టల్లో క్లాసురూములూ డార్మిటరీలు పక్కపక్కనే ఉండేవి. రోజూ పుస్తకాలు గట్రా మోసుకెళ్ళడం ఉండేది కాదు. ఎట్టకేలకూ ఆరో తరగతిలో జామెట్రీ బాక్సు కొనుకున్నా. మా హాస్టల్లో రాత్రి డెస్కులో పెట్టుకున్న పెన్నూ పెన్సిలూ తెల్లవారి అలాగే ఉంటే గొప్ప ఇక జామెట్రీ బాక్సు బతికి బట్టకడుతుందా? కల్లో మాట. మొత్తనికి ఒక్కరోజైనా పొద్దున్నే లేచి ఇంకుపెన్ను నింపుకొని, జామెట్రీ బాక్సొకసారి చెక్ చేసుకొని స్కూలుకి తీసుకెళ్ళే అవసరం లేకుండానే పదోతరగతి వరకూ చదివేశాను.

* * * *

మొన్నీ మధ్య మా విభు కి (అన్నయ్య కొడుక్కి) క్రేయాన్స్, అవి పెట్టుకుందుకు ఒక బాక్సు కొందామని స్టెషనరీ షాపుకి వెళ్ళాను. అన్నీ కొనేసి బిల్ కడ్తుంటే కౌంటర్లో అద్దాల కింద మిలమిలలాడుతూ వెక్కిరించాయి వృత్తలేఖినీ, కోణమానినీ ఇముడ్చుకున్న సరికొత్త జామెట్రీ బాక్సు, ఇంకు పెన్నూ.

Saturday, October 10, 2009

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ - సినిమా

ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి క్వెంటిన్ టరంటీనో గురించి చెప్పఖ్ఖర్లేదు. రిజర్వాయర్ డాగ్స్, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ సినిమాలతో తనదంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. మూసకి భిన్నంగా ఆలోచించడానికి ఇంగ్లీషులో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. thinking out of the box, pushing the envelope అని. వాటికి నిజమైన ప్రతీకగా నిలుస్తాడు టరంటీనో. స్క్రీన్‌ప్లే తో ప్రయోగాలకు పెట్టింది పేరు. అలాగే తన చిత్రాలలో నేపథ్య సంగీతాన్ని చాలా జాగర్తగా ఎంచుకుంటాడు. ఉదాహరణకి కిల్‌బిల్ చిత్రం ఎంత హిట్టాయ్యిందో ఆ సౌండ్‌ట్రాక్ కూడా అంతే హిట్టయ్యింది. అలాంటి డైరెక్టర్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సినిమా తీశాడంటే సహజంగానే చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. పైగా ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు నామినేషన్లు, ఒక అవార్డు సంపాదించింది కూడా. మరి బాగుందా? నేనైతే తప్పక చూడాలని చెబుతాను.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఫ్రాన్స్ ని ఆక్రమించుకొని ఉంతుంది. నాజీలు యూదులను వెతికి మరీ చంపేస్తుంటారు. ఇలాంటి నాజీల గుండెల్లో దడ పుట్టించడానికి అమెరికా నుండి లెఫ్టినెంట్ అల్డో రెయిన్ (బ్రాడ్ పిట్) నాయకత్వంలో ఐనిమిది మంది యూదులబృదం బయలు దేరుతుంది. వీళ్ళ బృందానికి బాస్టర్డ్స్ అని పేరు. వాళ్ళు నాజీలను హతమారుస్తూ, ఒక్కో బృందంలో ఒక్కరిని విడిచి తమ గురించి పదిమందికి తెలిసేలా చేసి మిగిలినవారిని భయపెడుతుంటారు. మరో వైపు షొషానా నాజీల చేతిలో కుటుంబమంతా పోగొట్టుకొని ప్రాణం దక్కించుకున్న యువతి. మూడేళ్ళ తరువాత ఒక సినిమా థియేటర్‌కి ఓనర్‌గా పునర్దర్శనమిస్తుంది. షొషానాతో ప్రేమలో పడిన ఒక జర్మన్ వార్ హీరో వల్ల అతని ఆత్మ కథ ఆధారంగా మలచిన చిత్రం ప్రీమియర్ షొషానా సినిమా హాల్లో ఏర్పాటవుతుంది. తన కుటుంబాన్ని చంపిన కలొనల్ హాన్స్ లాండా వస్తున్నాడని తెలిసి షొషానా ప్రీమియర్ రోజు థియేటర్‌ని పేల్చి నాజీలను చంపాలని పథకం వేస్తుంది. ఆ ప్రీమియర్‌కు హిట్లర్‌తో సహా జర్మన్ అధికారగణమంతా వస్తున్నారని తెలిసి బాస్టర్డ్స్ గాంగ్ కూడా థియేటర్‌ని పేల్చాలని పథకం వేస్తారు. వీళ్ళందరిని వేయి కళ్ళతో కనిపెడుతూ ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉండే నిరంకుశాధికారి కలొనల్ హాన్స్ లాండా. చిత్రం ముగింపు ఏమయిందన్నది తెరపై చూడాల్సిందే.

ఒక చారిత్రక అంశాన్ని తీసుకొని దాన్ని ఫిక్షనలైజ్ రాయడానికి నిజంగానే ధైర్యముండాలి. టరంటీనో ఈ విషయంలో మొదటివాడు కాకపోవచ్చు కానీ గట్టి ప్రయత్నమే చేశాడు. నీజీలు యూదులు లాంటి అతి సున్నితమైన, గంభీరమైన విషయాన్ని తీసుకొని దాంట్లో కామెడీ చొప్పించడం నిజంగానే ఒక ఎక్స్‌పరిమెంటు. ఇక బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని వాడుకున్న తీరు సినిమా విద్యార్థులందరికి ఒక పాఠంగా మిగిలిపోతుంది. లాండా, షోషానా జర్మన్ మిలిటరీ గాంగ్‌తో కలుసుకొనే సీను ఎంత ఉత్కంఠంగా ఉంటుందో తెరమీద చూడాల్సిందే. అలాగే క్లైమాక్ష్ ముందర వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. మరి ఈ సినిమాకు పదికి పది మార్కులు వేయొచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి. కారణం. ఎడిటింగ్ లోపం. ప్రతీ సీన్నూ హాస్యాస్పదంగా మలచడానికి సాగతీసినట్టుంటుంది. అలాగే తియ్యగా మాట్లాడుతూ కోల్డ్ బ్లడెడ్‌గా వ్యవహరించే విలన్ పాత్ర చాలా మూస పాత్ర. లాండా పాత్రకు మరీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాల్సింది కాదు.

నటన విషయానికొస్తే సినిమాలో మనకు బాగా గుర్తుండి పోయే పాత్రలు మూడు. కల్నల్ హాన్స్ లాండా గా క్రిస్టొఫర్ వాల్ట్జ్ బాగా నటించాడు. కాన్స్ లో బెస్ట్ అవార్డ్ వచ్చింది కూడా. షోషానాగా ఫ్రెంచ్ నటి మెలనీ లారెంట్ నటన అద్భుతం. అల్డోగా బ్రాడ్ పిట్ కూడా బాగా నటించాడు.

గత పదిహేనేళ్ళ కాలంలో రెండో ప్రపంచయుద్ధం మీద మూడు పాపులర్ సినిమాలు వచ్చాయి. స్పీల్‌బర్గ్ షిండ్లర్స్ లిస్ట్, రాబర్టో బెనిని "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్", రొమాన్ పొలాన్స్కి "ద పియనిస్ట్". ప్రతీది దేనికదే గొప్పగా ఉంటుంది. మరి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వీటి స్థాయికి సరిపోగలదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అత్యంత గంభీర సన్నివేశాల్లో క్వెంటిన్ మార్కు హాస్యాన్ని జొప్పించి ఎదో హైబ్రీడ్ వంగడాల్లా రుచి పచీ లేకుండా చేశాడనిపించింది. కానీ సినిమా విద్యార్థులు, ప్రపంచ సినిమాపై ఆసక్తి ఉన్నవాళ్ళూ తప్పక వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తోంది. థియేటర్‌లో చూసే అవకాశం కోల్పోకండి.

తా.క.: పైన ఉదహరించిన చిత్రాల్లో life is beautiful సినిమా మీరు చూడకపోతే ఎలాగైనా సంపాదించి చూడండి. personally, I think its one of the best movies ever made. It will forever remain in my all time top 5 list.