ఐదారేళ్ళ క్రింద మిత్రులొకరు "నాలోన శివుడు గలడు" అని ఒక సీడీ కాపీ చేసి పంపించారు. బాపూ ఫాంట్‌లో రాసిన ఆ అక్షరాలు తప్పితే ఆ సీడీ గురించి ఏమీ తెలియదు. అది పంపించిన మిత్రుని అభిరుచి మీద నమ్మకం, టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉండడం చూసి వింటే భరణి గారి గొంతులో శివతత్వాలు వినిపిస్తున్నాయి. భలే ఉన్నాయంటూ అర్ధరాత్రి ఆపరాత్రి చూడకుండా వెంటనే ఫోన్ చేస్తే "అవునూ, ఆయనే రాశారు. బాగుంది కాబట్టే పంపించా. ఇక ఫోన్ పెట్టేసి నన్ను పడుకోనియ్" అని పెట్టేశారా ఫ్రెండ్.
అప్పటికే భరణి గారి "పరికిణీ" కవిత్వాన్ని చదివాను కాబట్టి మంచి ఎత్తుగడలతో రాస్తారని తెలుసు (ఉదాహరణకు కుంకుంపువ్వు కాశ్మీరంలోనే ఎందుకు పూస్తుందో అనే కవిత చూడండి). అదే శైలి పాటల్లో కూడా కనిపించింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఆ పాటలు ఫ్రెండ్స్ అడిగినవాళ్ళకీ అడగని వాళ్ళకీ వినిపించాను. ఇంట్లో మాత్రం అపుడపుడూ కూనిరాగాలు తీయడం తప్పితే ఎప్పుడూ వినిపించలేదు. ఏడాది క్రింద నాన్న కొత్త సెల్ ఫోన్ కొనుక్కొని పాటలు లోడ్ చేసియ్యమంటే కాస్త వెరైటీ భక్తి పాటలు వినండి అని ఇవి లోడ్ చేసిచ్చాను. (ఆయన చిన్నప్పటినుండి సుందరకాండ, సుబ్బులక్ష్మి స్తవాలు తప్పితే వేరేవి వినడం నేను చూడలేదు.. అందుకే బహుశా ఎప్పుడూ వినిపించలేదేమో). నాన్నకు ఎంతగా నచ్చాయంటే ఎక్కడబడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళకు వినిపించడం మొదలేట్టారు. ఇంట్లో వాళ్ళంతా ఎవడ్రా ఈయనకు ఈ పాటలు లోడ్ చేసిచ్చిందీ అని గుర్రుగా చూసే స్థాయికి వచ్చింది వ్యవహారం. అయ్యో ఆరేళ్ళుగా ఒక్కసారైనా ఈయనకు వినిపించలేదేంటా అనుకున్నాను.
సరే ఇంతగా ఇష్టపడుతున్నారు కదా ఈ ఆరేళ్ళలో భరణిగారు ఇంకేమైనా రాశారేమో అని మ్యూజిక్ షాపులో ఒక పిట్ స్టాప్ తీసుకుని వెతుకుతుంటే కనిపించింది కొత్త సీడీ. "నా మనసు కోతిరా రామ". మొదటి సీడీ శివుని పాటలైతే ఇది అందరు దేవతల మీద రాసుకున్న పాటలు. అన్నీ ప్రొఫెషనల్ సింగర్స్ తో పాడించారు. భరణి గారి గొంతు లేదు.
ఇకపాటల విషయానికొస్తే భావయుక్తంగా బాలు గారు పాడిన "నా మనసు కోతిరా రామ" సంగీత పరంగా సాహిత్యపరంగా భేషుగ్గా ఉంది. మొదటి సీడీ పాటల కంటే కూడా మిన్నగా ఉంది. మిగిలిన పాటలు మాత్రం నన్నంతగా ఆకట్టుకోలేదు. మరి ఆ ఒక్క పాటకోసం సీడీ కొనాలా అంటే మాత్రం తప్పకుండా అనే చెబుతాను. ఈ పాట విన్నాక భరణి గారు తరచూ ఇలా పాటలు రిలీజ్ చేస్తే బాగుండుననిపించింది.
నెట్లో ఇక్కడ వినొచ్చు.
http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Naa+Manasu+Kothi+Ra+Rama
పాట :
నా మనసు కోతిరా రామా
మారుతిగా జేయు శ్రీరామా
నా మనసు రాయిరా రామా
మానినిగ జేయి శ్రీరామా
నా మనసు నావరా రామా
చుక్కాని వెయ్యి శ్రీరామ
|| నా మనసు ||
మాయలేడిర మనసు రామా
శరముతో దునుము శ్రీరామా
నా మనసు వాలిరా రామా
బాణమున గూల్చు శ్రీరామా
|| నా మనసు ||
నా మనసు కడలిరా రామా
అమ్ముతో అణచు శ్రీరామా
నా మనసు లంకరా రామా
కాల్చి బూడిద చెయ్యి రామా
|| నా మనసు ||
మనసంత రావణమే రామా
చీల్చి చెండాడు శ్రీరామా
|| నా మనసు ||
నా భక్తి సీతమ్మ రామా
అగ్గిలో తోయకురా రామా
నా భక్తి జానకిర రామా
అడవి పాల్జేయకు ఓ రామా