Thursday, October 22, 2009

ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు.

బాగా చిన్నప్పటి మాట. నాకు మా ఇంట్లో కొన్ని నిషిద్ధ వస్తువులుండేవి. నాన్నగారి షేవింగ్ కిట్టు, కాల్కులేటర్, అమ్మ కుట్టుమిషను, కత్తెర ఇలాంటివి. ఏదైనా ముట్టొద్దని చెబితే ఇక మన క్యూరియాసిటీ పదింతలయ్యేది. రాత్రింబవళ్ళూ వాటిని ఎలా తీయాలి? వాటితో ఏం చేయాలి అనే ధ్యాస. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిఉన్న సమయంలో గబుక్కున కాల్కులేటరో కత్తెరో తీసి, మా రహస్యస్థావరంలోకి (పట్టెమంచాల మీద చీరలు ఆరవేస్తే చిన్న కాంపు సైటులా తయారయ్యి మా స్థావరంగా పనికొచ్చేది) తీసుకెళ్ళి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి తిరిగి దాని స్థానంలో దాన్ని పెట్టేసేవాణ్ణి. అప్పుడప్పుడే కూడికలు, గుణకారాలు నేరుస్తున్నాను గనుక కాల్కులేటర్ ఎందుకు, ఎలా వాడతారో తెలిసేది కాదు. ఖర్మకాలి ఒకరోజు దానితో ఆడుతుంటే దాని మీద నీళ్ళు పడి పాడయిపోయి ముక్కచివాట్లు తిన్నాను. అలాగే ఓసారి బాడ్మింటన్ రాకెట్ కొనిస్తే దాన్ని నీళ్ళలో ముంచి, కట్టెల పొయ్యిలో పెట్టి ఏవో ప్రయోగాలు చేసి నాశనం చేశాను. అప్పటికే వీడితో జాగర్తగా ఉండాలి అని రెపుటేషన్ సంపాదించాను.

అప్పట్లో మా బడి గవర్నమెంటు బడికి ఎక్కువా కాన్వెంటుకు తక్కువా అన్నట్టుండేది. మా బళ్ళో నియమమేంటంటే నాలుగో తరవతి వరకు అందరూ పెన్సిల్లే వాడాలి. ఐదవ తరగతి నుండి ఇంకు పెన్నులు వాడాలి. అదిగో అలాంటి సమయంలో మా ఇంట్లో ప్రవేశించాయి ఇంకు పెన్నూ - జామెట్రీ బాక్సు. కాంలిన్ జామెట్రీ బాక్సు. దాంట్లో ఒక వృత్తలేఖిని, ఒక డివైడర్(తెలుగు పేరు మరిచాను), కోణమానిని, సెట్-స్క్వేర్లు. షార్పెనరు, రబ్బరు(అప్పట్లో ఎరేజర్ని అలాగే అనేవాళ్ళం) పెట్టుకోడానికి వేరే అరలు. యెల్లో కలరు మీద బ్లాక్ లైన్లతో తళతళ మెరుస్తూ చూట్టానికి ఎంత బాగుండేదో. ఇక ఇంకుపెన్నుది ఇంకో అందం.ఓ ఇంకుబుడ్డి, రెండు ఇంకు పిల్లర్లు (ఫిల్లెర్), రెండు తళతళ మెరిసే పాళీలు. ఇంత సరంజామాతో ఠీవీగా అలరారుతుండేది. వచ్చిన చిక్కల్లా నాకు మాత్రం వాటిని ముట్టుకోడానికి పర్మిషన్ లేదు. నేనప్పటికి మూడో తరగతే. అన్నయ్య ఐదో తరగతిలోకి వచ్చాడని కొన్నారు. ఎపుడెపుడు వాటితో ఆడదామా అని ఉవ్విళ్ళూరుతున్నాను. నా క్యూరియాసిటీ ముందే పసిగట్టిన అన్నయ్య ముడితే కాళ్ళిరగ్గొడతానని నాన్నతో వార్నింగిప్పించాడు.

ఇక చూస్కోండి నా కష్టాలు. నేనా చదివేది ముష్టి మూడో తరగతి. వెధవది జామెట్రీ బాక్సు కాదు కద కనీసం స్కేలు కూడా అఖ్ఖర్లేదు. రోజూ బడికెళ్ళే టైంలో మొదలయ్యేది అన్నయ్య తతంగం. మిలిటరీ వాళ్ళు యుద్ధానికెళ్ళే ముందు గన్స్ ఆయిలింగ్ చేసినట్టు అవసరమున్నా లేకున్నా అన్నయ్య జామెట్రీ బాక్సు తీసి అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, ఇంకు పెన్నులో ఇంకు నింపుకొని ఓ ఊరించేవాడు. నేనేం చెయ్యగలను మహా అంటే ఒక సారి పెన్సిల్ చెక్కుకొని మళ్ళీ సంచీలో పడేస్కోవడమే.ఓ వైపు పెద్దగా పట్టించుకోనట్టు నటిస్తూ, ఎప్పటికైనా నేనూ ఐదో తరగతిలో రాకపోతానా? నీ సంగతి తేల్చకపోతానా? అనుకొనేవాణ్ణి. సాయంత్రం బడి నుండి రాగానే మళ్ళీ కొత్తవేషాలు. పొద్దున్నే నింపిన పెన్నును ఇంకు పిల్లరుతో మళ్ళీ నింపుతూ, రికార్డు షీట్లపై వృత్తలేఖినితో వృత్తాలు గీస్తూ వాట్లో రంగులు నింపి బొమ్మలేస్తూ రోజో తమాషా చూపించేవాడు. ఇంకో రోజు అట్ట ముక్కలను డివైడర్‌తో కాత్తిరించి చక్రాలబండి చేసేవాడు. మరో రోజు స్కేలుతో డబల్ లైనింగ్, షాడోస్ తో పేర్లు రాసి చూపించేవాడు. అబ్బ, ఈ వెధవ మూడో తరగతి ఎప్పుడవుతుందో, దాని తర్వాత నాలుగో తరగతి ఎప్పుడవుతుందో నాకెప్పుడో జామెట్రీ బాక్సు వస్తుందో , పరమ చిరాగ్గ ఉండేది. పోనీ అన్నయ్యనడుగుదామా అంటే వాడసలే టాం సాయరు టైపు. రోజంతా వాడితో మంచిగా ఉండి రెండో మూడో లంచాలిచ్చాక(అమ్మ చిన్న చిన్న పనికి పిలిచినప్పుడల్లా నేనే వెళ్ళడం, దీపవళి బాంబుల్లో కొన్ని నా వాటాలోంచి ఇవ్వడం లాంటివి) ఇంకుపిల్లరుతో వాడి పెన్నులో ఇంకు నింపడానికి పర్మిషనిచ్చేవాడు. అప్పటికి వాడాటకు వెళ్ళినప్పుడళ్ళా ఆ జామెట్రీ బాక్సు తీసి మా రహస్యస్థావరంలో బోలెడు వృత్తాలు గీసి వాడు వచ్చే లోపు మళ్ళీ యధావిధిగా పెట్టేవాణ్ణి. కాని ఇలా దొంగతనంగా ఏం సరదాపడతాం. ఎన్ని వృత్తాలు గీసుకున్నా అన్నయ్యకు చూపించలేకపోతే ఏం లాభం. ఇలా కాదని దసరా సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు నన్నెంతో గారాబంగా చూసుకొనే నాయినమ్మని అడిగా. "నాయినమ్మా నాకో జామెట్రీ బాక్సు కొనిపెట్టవూ" అని. అదేంటో తెలీని నాయినమ్మ సరేనని డబ్బులిచ్చినా అమ్మకా విషయం తెలిసి ససేమీరా కొనివ్వనంది. మొతానికి అలా అలా మూడో తరగతిగడిచిపోయింది.
మరో ఏడాదికి నాకూ ఇంకు పెన్ను జామెట్రీ బాక్సు వస్తాయనగా నాన్నకు ఒక పల్లెటూరుకు బదిలీ అయిపోయింది. ఆ డొక్కు బళ్ళో ఇంకు పెన్ను ఎవరూ వాడరు. ఏ తరగతి వాళ్ళైనా బాల్ పాయింటు పెన్నుతో రాసుకోవచ్చు. అసలు ఈ బాల్ పెన్ను కనిపెట్టిన వాళ్ళననాలి. పుట్టింది మొదలు చచ్చేవరకు ఒకటే అవతారం అదీనూ. అసలు ఇంకు పెన్నుకున్న దర్జా హోదా బాల్ పెన్నుకెక్కడా. లైఫులో గొప్ప రొమాన్స్ మిస్సయ్యాను కదా అని బాధపడుతుంటే చల్లగా చెప్పారింకో వార్త. ఆ పల్లెటూరి బళ్ళో ఐదో తరగతిలో ఎవ్వరూ జామెట్రీ బాక్సు వాడరట. అనవసరపు ఆర్భాటాలెందుకు? అఖ్ఖర్లేదని టీచర్లే చెప్పేసారు. హతోస్మి.

నా ఐదో తరగతయిన తరువాత పల్లెటూళ్ళో చదువు చట్టుబండలైతోందని అన్నయ్యను సిటీలో బాబాయి దగ్గరికీ, నన్ను హాస్టలుకీ పంపేశారు. ట్రాజెడీ ఏంటంటే హాస్టల్లోనూ బాల్ పెన్నులే వాడేవాళ్ళం. మా హాస్టల్లో క్లాసురూములూ డార్మిటరీలు పక్కపక్కనే ఉండేవి. రోజూ పుస్తకాలు గట్రా మోసుకెళ్ళడం ఉండేది కాదు. ఎట్టకేలకూ ఆరో తరగతిలో జామెట్రీ బాక్సు కొనుకున్నా. మా హాస్టల్లో రాత్రి డెస్కులో పెట్టుకున్న పెన్నూ పెన్సిలూ తెల్లవారి అలాగే ఉంటే గొప్ప ఇక జామెట్రీ బాక్సు బతికి బట్టకడుతుందా? కల్లో మాట. మొత్తనికి ఒక్కరోజైనా పొద్దున్నే లేచి ఇంకుపెన్ను నింపుకొని, జామెట్రీ బాక్సొకసారి చెక్ చేసుకొని స్కూలుకి తీసుకెళ్ళే అవసరం లేకుండానే పదోతరగతి వరకూ చదివేశాను.

* * * *

మొన్నీ మధ్య మా విభు కి (అన్నయ్య కొడుక్కి) క్రేయాన్స్, అవి పెట్టుకుందుకు ఒక బాక్సు కొందామని స్టెషనరీ షాపుకి వెళ్ళాను. అన్నీ కొనేసి బిల్ కడ్తుంటే కౌంటర్లో అద్దాల కింద మిలమిలలాడుతూ వెక్కిరించాయి వృత్తలేఖినీ, కోణమానినీ ఇముడ్చుకున్న సరికొత్త జామెట్రీ బాక్సు, ఇంకు పెన్నూ.

13 comments:

 1. Baagundandi....
  Divider ni "Vibhagini " antaru..:)

  ReplyDelete
 2. మీ కధ చదువుతుంటే నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది . బాగా రాసారు.

  ReplyDelete
 3. మీ జామెంట్రీ బాక్స్ గురించి చెపుతుంటే మా బుడుగ్గాడి బబల్గం బాధ చెప్పలనిపిస్తోంది . వాడికి 8 ఇయర్స్ పూర్తవుతేకాని బబుల్ గం తినకూడదుట ! మిగితా ముగ్గురు వాడిముందే తింటూవుంటారు . ప్రస్తుతము వాడికి ఆరేళ్ళే ! ఇంకా రెండేళ్ళు ఆగాలి . రోజూ పొద్దున లేవగానే బామ్మా నా ఇంకో బర్త్ డే ఇంకా ఎన్ని రోజులుంది అని అడుగుతాడు . మొన్ననే 5 వ బర్త్ డే అయ్యింది . పాపం .
  బాగుంది మీ పోస్ట్.

  ReplyDelete
 4. చాలా చక్కగా,సరదాగా ఉన్నాయండీ మీ ఇంకు పెన్ను,జామెట్రీ బాక్స్ విశేషాలు...అయ్యో క్లైమాక్స్ లో అయినా మీ కోరిక తీరుతుందనుకున్నాను..ప్చ్..
  మేము ఆరవ తరగతి వరకు జామెట్రీ బాక్స్ ని 'కంపర్ బాక్స్' అనే వాళ్ళం కంపాస్ బాక్స్ అని అనడానికి బదులు. దుంపలబడి చదువు కదా మరి!

  ఇంకుపెన్ను తర్వాత పైలట్ పెన్ అని ఓ రకం ఇంకుపెన్ వచ్చింది మీకు గుర్తుందా? లోపల స్కెచ్ పెన్ మాదిరి ఓ దూది గొట్టం ఉంటుంది. నాకు దాని మీద తెగ మోజు ఉండేది.

  ReplyDelete
 5. డివైడర్=విభాగిని.. చిన్నప్పుడు నాన్న షేవింగ్ కిట్ (గడ్డం పెట్టి అనేవాళ్ళం అప్పట్లో) నుంచి బ్లేడ్ తీసి రహస్యంగా పెన్సిల్ చెక్కి మళ్ళీ అందులో పెట్టేసేవాడినా.. గడ్డం చేసుకునే రోజున నాన్న పిలిచి "నిజం చెప్పు.. పెన్సిల్ చెక్కావు కదా" అని గద్దించే వాళ్ళు.. నేను అంత రహస్యంగా చేసిన పని ఆయనకి ఎలా తెలిసిపోయేదో, నాకు గడ్డం వచ్చేవరకూ అర్ధం కాలేదు :) :) చాలా బాగున్నాయండి మీ జ్ఞాపకాలు.. అక్కడక్కడా శ్రీరమణ 'షోడా నాయుడు' గుర్తొచ్చాడు..

  ReplyDelete
 6. బావున్నయ్ కబుర్లు..
  మేము కంపర్ బాక్సు అనేవాళ్ళం.. కాంలిన్ ఎక్కువ ఖరీదని మాకు నటరాజ్ కొనేవారు. విభాగిని నా బాక్సులొ వుండేదె కానీ నేనెప్పుడు వాడలేదు. షార్పెనరు ని మర అనేవాళ్ళం.. ఇంకు పెన్ లొ స్టార్ పెన్ అని వచ్చేది.. అది గొప్ప..
  అప్పట్లొ చేతి వేలు గొరు బాగ పెంచి దాంతొ పాళి చెయ్యొచ్చు అనేవారు.. అని నిజమొ కాదొ ఇప్పటికీ తెలీదు :-)

  నాన్న షేవింగ్ కిట్ నుంచి బ్లేడ్ తీసి రహస్యంగా పెన్సిల్ చెక్కి మళ్ళీ అందులో పెట్టేయడం ఆ తరువాత చివాట్లు తినడం.. హి హి హి నేను కూడా ఈ బ్యాచె. పెన్సిల్ చెక్కాక దాని ముల్లు సూదిగా చెయ్యలని ముల్లు చెక్కెవాడిని.. అది నల్లగా బ్లేడ్ మీద అంటుకునేది.. దాన్ని బట్టి మా నాన్న గారు కనిపెట్టేసెవారు. ఆ విషయమ అప్పట్లొ అర్ద్రం అయ్యేదు కాదు ఎలా కనిపెడుతున్నారా అని ..

  ReplyDelete
 7. వేణురాం గారు, మురళి గారు డివైడర్‌కు తెలుగు పదం గుర్తు చేసినందుకు థాంక్సండీ. నేను ఎనిమిది వరకు తెలుగు మీడియం, తొమ్మిది పది ఇంగ్లీషు మీడియం వెరసి రెంటికి చెడ్డా.. షోడా నాయుడు గుర్తొచ్చాడంటే I am flattered.
  శేఖర్ గారు, పైలట్ పెన్ను భలే ఉండేది. ఎంత బాగ రాసేదో. రాక్ససుడికి బిడ్డలాగరని సామెత. అంత నాజుకు టిప్ నా చేతిలో వారానికి మించి ఆగేది కాదు. తర్వాత హీరో పెన్ అని వచ్చేది. (హీరో నేన??) బిల్ట్-ఇన్ ఇంక్ ఫిల్లర్ ఉండేది. అది కూడా భలే ఉండేది.
  మంచుపల్లకీగారు, మా దగ్గిరా కంపాస్ బాక్స్ అని, షార్పెనర్ ని "చాక్‌మార్" అని అనేవాళ్ళు :)) నాన్న గారి షేవింగ్ కిట్ మీద ఫాసినేషన్ నాకొక్కడికే కాదన్న మాట. నాకు బ్లేడ్ కన్నా అందులో ఉండే నెయిల్ కటర్ మీదే ఇంటరెష్టు. చాలా పెద్దయ్యే వరక్కూడా ఆ ఫైలర్ ఏంటో దాన్నెందుకు వాడతారో అర్థమయ్యేది కాదు :) గోళ్ళతో పాళీ తయారు చేయడం నేనూ ఎప్పుడు వినలేదు కానీ పసలపూడి కథల్లో చదివినట్టు గుర్తండీ.

  ReplyDelete
 8. మాలా గారు పాపం మీ బుడుగు పరిస్థితి ఇంచుమించు నా చిన్నప్పటి పరిస్థితే ఉన్నట్టుంది. మీవాడి ఐనిమిదో బర్త్‌డే ఎప్పుడో చెప్పండి. ఫేద్ద బబుల్‌గం పాకెట్టు పంపిస్తా.

  ReplyDelete
 9. :) :) bagundi budugugaaru....

  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 10. బుడుగు గారికి, నమస్కారములు.

  మీ చిన్నప్పట్టి అనుభవాలు, అనుభూతులు అందరికి తమ,తమ చిన్నప్పట్టి ఇటువంటి అనుభూతులే గుర్తుకు తెస్తున్నాయి. ఆ మధ్య ఒకసారి, శ్రీ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ గారు, టీ.వి.లొ మాట్లాడుతూ, తనకు స్పైడర్-మాన్ సాహసాలువంటివి చేయాలని చిన్నప్పట్టి నుంచి చేయాలని కోరిక వుండేదని, కానీ ఇప్పటికి అది నెరవేరలేదని, అందుకే అటువంటి సినిమాలు చూస్తానని చెప్పారు. చిన్నప్పటి కోరికలు కొన్ని, కొన్ని ఎప్పటికీ నెరవేరమేమో!! అందుకే వాటిని మనం మన పిల్ల ద్వారా నెర్వెర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం!!

  భవదీయ్డు,
  మాధవరావు.

  ReplyDelete
 11. beautiful.
  ఆరో క్లాసులో నా మొదటి సరికొత్త ఇంకు పెన్ను కేంలిన్ వాళ్ళదే .. నాకిప్పటికీ కళ్ళక్కట్టినట్టు గుర్తుంది. తరవాత్తరవాత హీరో పెన్నులు.

  ReplyDelete