మా మూడున్నరేళ్ళ బుడుగు ఉరఫ్ పిడుగు, తల్లో నాలుకలా అందరికీ బోలెడు టైంపాసు చేసి, క్షణంలో కోపం తెప్పించి, మరుక్షణంలో నవ్వించే వాడు, ఉంటే క్షణం ఊపిరి తీసుకోనివ్వనివాడు, లేకుంటే క్షణం తోచనివ్వని వాడు, ఒక్క ముద్ద అన్నం తినడానికి ఇరవై నిమిషాలు తీసుకొని, ఇరవై తాయిలాలు ఒక్క నిమిషంలో తినగల పారడాక్సుడు, ఒకరోజు సెలవులంటూ అమ్మతో ఊరెళ్ళాడు. అప్పుడు రాసుకున్న కవిత ఇది.
ఇంట్లో పిల్లాడు లేడు.
--------------------------------
అలమారీపై దాగే
చిలుకల చేతి కర్ర
వాలుకుర్చీ పక్కన వాలింది.
మడీ ఆచారమంటూ
బిగుసుక్కూర్చునే పూజగది
తలుపులు తెరచి
తెరపిన పడింది.
మట్టిగోళాల్లో
మగ్గిపోతున్న నాణేలు
నాన్నగారి బల్ల మీద
బారులుగ లెఖ్ఖకొచ్చాయి.
పెంపుడుకుక్క
విసుగ్గా ఆవులిస్తోంది.
ఇంట్లో పిల్లాడు లేడు.
-------------------------------------
అదీ కథ మొదటి భాగం. మొదట రాసిన ఫస్టు డ్రాఫ్టుకు చిన్నపాటి కోతలు, కత్తిరింపులు చేసి ఒక షేపుకు తెచ్చి చదివితే ఆల్రెడీ ఎక్కడో చదివినట్టు ఏ మూలో చిన్న అనుమానం. కాసేపు అమృత సినిమాలో 'జంట తోకల సుందరీ పాటా అని అనుమానం, కాదని తేల్చాక లిటిల్ సోల్జర్స్ సినిమా పాటేమో అని అనుమానం. అదీ కాదని తేలాక ఇస్మాయిల్ ట్వింకిల్, హనీ, బెల్లంకాయలు చదివితే అవీ కావని తేలింది. మనసులో అనుమానం వీడదే.. దగ్గిరున్న పుస్తకాలన్ని వెతుకుతుంటే, వెక్కిరిస్తూ కనబడింది. "వానకు తడిసిన పువ్వొకటిలో" ఇంద్రాణి రాసిన కవిత.
"పిల్లలు నిదరోతున్నారు".
హతవిధీ!! అనుకుని బ్లాగులో పోస్టు చేస్తున్నాను. అదీ సంగతి.
No comments:
Post a Comment