పది పదిహేనేళ్ళ నాటి సంగతి. ఇంట్లో అందరం చదువుకునే పిల్లలం. టీనేజికి కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లలే అంతా. మా విస్తారపరివారం మొత్తంలో నగరంలో ఉన్నది మా ఒక్క కుటుంబమే కాబట్టి ఎప్పుడూ పై చదువులక్ని పెదనాన్న పిల్లలో అత్త పిల్లలో ఎవరో ఒకరు మాతో పాటే మా ఇంట ఉండేవాళ్ళు. అంత కలిపి ఐదారుగురికి తగ్గని సంత. డైనింగు టేబిలు మీదా, సెలవురోజు వస్తే అందరూ వాళ్ళ కాలేజీల కబుర్లూ, స్కూళ్ళ కబుర్లూ చెబుతూ తింటూంటే గంటలు నిమిషాల్లా దొర్లిపోయేవి. సెలవు రోజైతే ప్రతివాళ్ళకి ప్రత్యేకించి కొన్ని విధులుండేవి. దిక్కుమాలిన పాతపాటలు(అప్పట్లో నిద్రలేపితే అలాగే అనిపించేవి) చిత్రహార్లో వస్తాయని అక్కలిద్దరూ ఏడింటికే టీవీ పెట్టి అందర్నీ లేపేసేవాళ్ళు. తర్వాత పేపరు వస్తుంది. అందరూ తలో పేజీ తీసుకొని నిదానంగా చదువుతుంటే, లెండి లెండి, ఎనిమిదవ్వొచ్చింది అని అందర్ని లేపి ఎవరి పని వాళ్ళకప్పగించేది అమ్మ. అమ్మాయిలు, ఇల్లంతా దుమ్ము దులిపి, కడిగి, మొక్కలకి నీళ్ళు పోసి, వాళ్ళ పనుల్లో వాళ్ళుండేవాళ్ళు. అబ్బాయిలకు ఓ లిస్టు ఉండేది. కూరగాయల మార్కెట్టుకు పోయి వారానికి సరిపడా కూరగాయలు కొని తేవడం, కింద మంచినీళ్ళ టాంకు, పైన ఓవర్‌హెడ్డు టాంకు, కడిగి శుభ్రం చేయడం, ఇంటి చుట్టూ కలుపు మొక్కలు తీయడం, అంతా అయ్యేసరికి ఏ పదకొండో, పన్నెండో అయ్యేది. అందరూ తీరిగ్గా తలంటు పోస్తుకొని స్నానాలు ముగించే సరికి సెలవని ఏదో ఒక ప్రత్యేకవంటకంతో విందు సిద్ధంగా ఉండేది. హాయిగా తినేసి, ఏ ఆదివారం అనుబంధమో పట్టుకొని చక్కగా చదువుకుంటూ ఎప్పుడో తెలీకుండా నిద్రలోకి జారుకునేవాణ్ణి మిగిలిన వాళ్ళతో పాటు. మొన్నీ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు, నాస్టాల్జియా కోసమని ఇంచుమించు ఇలాంటి ఆదివారమే పండగలా జరుపుకొంటున్నాం అందరం. అన్నలు, తమ్ముళ్ళు, కజిన్సూ అందరం.
అసలే ఎండాకాలం, కిటికీలు, తలుపులన్నీ మూసి, వటవేళ్ళు తడిపి, కూలర్లు ఆన్ చేసి, అలాంటి కునుకే మరొకటి ఆస్వాదించేందుకు సిద్ధమయ్యాను. ఆదివారం అనుబంధం పట్టుకొని పేజీలు తిప్పుతున్నాను. కథా, కవితా, సరదా కబుర్లు ఒకటి తర్వాత ఒకటి పేజీలు తిరిగేస్తున్నాను.. ఇంకో పేజీ చదివితే మరో నిమిషంలో ఇక కళ్ళు మూసుకున్నట్టే..దిగ్గున తెలివొచ్చేస్తుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కొన్ని సమాధానాలు. ఒకసారి కళ్ళు నులుముకున్నాను. ఏంటీ? నేను చదువుతున్నది వారపత్రికా? ఏదైన సరసమైన పత్రికా? అనుమానం లేదు వార్తాపత్రికే. గిల్లి చూసుకున్నాను. ఇంకా నిద్రపోలేదు. ఇక ఆ ఆర్టికల్ గురించి విస్తారంగా చర్చించాల్సిన అవసరం లేదు. మీ ఇంటికెళ్ళి ఒక ఆదివారం అనుబంధం తెరిచితే చాలు. నేను దేనిగురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసిపోతుంది.
కొన్ని మార్పులు జీవితంలో చాలా నిశ్శబ్దంగా జరిగిపోతాయి. మనం గమనించి తేరుకునేంతలో అది మన దినచర్యలో ఒక భాగంగా మారిపోతుంది. అసలు ఆదివారం అనుబంధం దినపత్రికల్లో ఇలాంటి వ్యాసాలు ఉండడం సమంజసమేనా? నాకు బాగా గుర్తు. మా పక్కింటాళ్ళకు బోల్డన్ని వారపత్రికలు వచ్చేవి. ఒక పదిహేను-ఇరవయ్యేళ్ళ క్రింద స్వాతిలో సరసమైన కథలు మొదలుపెట్టగానే, మాకు ఇంట్లో వార్నింగొచ్చేసింది. పొరపాటున వాళ్ళింట్లో పత్రికలు చదివారని తెలిసిందో కాళ్ళిరగ్గొడతామని :( సరే ఇంట్లో చిన్నపిల్లలు లేకుంటే, వారపత్రిక తెప్పించుకోవడంలో ఏ ఇబ్బందీ లేదు. మీ డబ్బులు మీరెలా తగలేసినా మీకు హక్కు ఉంది. కాని దినపత్రికలు కూడా ఇలాంటి వ్యాసాలు ప్రచురిస్తే, చిన్నపిల్లలున్న ఇంటి వాళ్ళు ఏం చేయాలి? సినిమాల్లో ఓ... తెగ హింస ఉంది, అశ్లీలంగా ఉంది అని గొడవలు చేసి సెన్సార్ చేస్తుంటారే. మరి, పత్రికలకి అలాంటి నియమాలు లేవా? సినిమా కావాలంటే మానుకోవచ్చు. పెరిగే పిల్లలున్న ఇంట్లో సమాచారం తెలుసుకోకుండా, దినపత్రికలు తెప్పించుకోకుండా ఎలా ఉండగలరు? మన దేశంలో పత్రికల్ని సెన్సారు చేసే బోర్డు కావాలి అంటాను. మీరేమంటారు. కొన్నాళ్ళ క్రితం ఇలాంటి పత్రికలపై ఒక ప్రజాహితవాజ్యం (public interest litigation) వచ్చిందని చదివాను. మళ్ళీ దాని ఊసే వినలేదు. ఆ కేసు ఏమయిందో తెలీదు. పత్రికలు మాత్రం యధేచ్ఛగా ప్రచురిస్తూనే ఉన్నాయి. (ఉదాహరణ కావాలంటే వార్త, ఆంధ్రజ్యోతి చూడండి. అలాగే ఏ వారపత్రికైనా..)
-బుడుగాయ్.
(కిరణ్ గారూ, శృంగారము రసరాజమని అన్నారు నిజమే. సర్కులేషన్ కోసం ఇన్ని అడ్డదార్లు తొక్కాలా? ఇప్పుడేమంటారు?)
tail piece: మన తరంలో (నాబోటి వాళ్ళను కలుపుకుని) చాలామందికి తెలుగు సరిగారాదు. మన ప్రమేయం లేకుండా మనపై రుద్దబడిన ఇంగ్లీషు విద్యైనా కానీయండి లేదా మార్కెట్ శక్తుల ప్రభావమే కానీయండి. ఒకరోజు ఏదో కవిత నచ్చిగట్టిగా చదివి మా రూమ్మేటుకు వినిపించాను. "మనసున దాగిన మర్మమేమిటో" అని ఒక లైనుంది. వాడికి వెంటనే అర్థమయ్యింది. మావాడు చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు మీడియం. తెలుగు చక్కగా చదవడం కూడా రాదు. అమెరికా వచ్చి ఆ కాస్త మరచిపోయాడు. ఎనిమిది దిక్కుల్లో నాలుగే తెలుసు (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పా..వెస్ట్). అలాంటిది వాడికి మర్మం అనే పదమెలా అర్థమయిందా అని ఆశ్చర్యపోయి వాణ్ణి అడిగితే, ఇంకా వాడికి తెలిసిన గ్రాంథిక పదాలు బోలెడున్నాయి. స్తంభన, పుంసత్వం, చూషణ, భావప్రాప్తి (*)... థాంక్స్ టు సమరం అని చెప్పాడు..నాకైతే ఎలా రియాక్టవాలో ఇప్పటికీ అర్థం కాదు. బహుశా తెలుగు భాష కనుమరుగవుతుందని ఓ..దిగాలు పడిపోతున్న బోధకులేమైనా గమనించాలేమో.
(*) బ్లాగులో ఈ దిక్కుమాలిన పదాలేమిటని చికాకు పడ్డవాళ్ళకి క్షమాపణలు. కానీ మీరు గమనించాల్సిందేమిటంటే, ఇవి నేను పత్రికల్లోంచి సెలక్టు చేసినవి మాత్రమే..
స్వాతీ టీవీ ఎడ్వర్టైస్‌మెంటు చూసారా? పత్రిక చదవడానికి తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ లతోటి ఓ పాప పోటీ పడుతుంది. చివరికి సమాధానపడి, అందరూ కలిసి కూచ్చుని ఒక్కసారే చదువుతూ ఉంటారు. ఓ బూతు పత్రికకి ఆ ఎడ్వర్టైస్‌మెంటు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది.
ReplyDeleteమంచి విషయం, మంచి జాబు!
చాల చక్కగా రాసారు!
ReplyDeleteఒకప్పుడు తెలుగు సినిమాల్లో బట్టలూడదీసుకుని నాట్యం చెయ్యడానికి జ్యోతిలక్ష్మి,విజయలలిత, హలమ్,సిల్కు స్మిత మొ ఉండేవాళ్ళు. మరేమో ఇప్పుడు కథానాయికే బట్టలిప్పేసుకొని ఒళ్ళు దాచుకోకుండా నృత్యాలు(క్యాబరేలా?) చేసేసి బట్టలకు బట్టలు, నిర్మాతకు డబ్బులు ఆదాచేసేస్తోంది.
తెలుగులో శృంగారం/బూతు పత్రికలు ఒకప్పుడు విడిగా వచ్చేవి.ఇప్పుడు, తెలుగు సినిమాల్లాగే, తెలుగుపత్రికలు కూడా కుటుంబపత్రికల్లోకి శృంగారం/బూతు తిన్నగా దిగుమతి చేసేసి బూతు పత్రికల అవసరం లేకుండా చేసేసాయి.
బహుశ, ముప్పయ్యేళ్ళక్రితం అనుకొంటా శ్రీశ్రీ, దాశరథి ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపొసుకొంటు రాసారు(బహుశ శ్రీశ్రీ ఏమో)"బూతు బూతంటావు,బూతులో పుట్టాము, బూతులో పెరిగాము, బూతంటే ఏమిట్రా(?)........."
కవి చౌడప్ప తన శతకంలొ నుడివారు-
"నీతులకేమి? యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కవి చౌడప్పా!" అని.
అలా అనుకొని కిమ్మనకుండ ఉండాలి.
ఐనా ఇవ్వాళరేపు ఎంతమంది పిల్లలు తెలుగు చదవడవగలరులెండి?
వాళ్ళకు ఇంతకంటె పచ్చి బూతులు ఇంగ్లీషు నవలల్లో, ఇంటెర్నెట్లో దొరుకుతున్నప్పుడు, ఈ తెలుగు పత్రికలూ అవీ ఏ పాటివి అని సంబరపడాల్సిందే!