పండిట్ జస్రాజ్ సంఈతోత్సవం జరుగుతుందని వారం రోజులుగా మా మేష్టారు చెబుతున్నారు. ఇరవయ్యేడున ఎవరో స్నేహితుడు ఇంటికి వచ్చాడని వెళ్ళలేదు. ఇరవై ఎనిమిదిన బక్రీద్ గోల ఉంటుందని వెళ్ళలేదు. (ఈ ఉత్సవం జరిగే చౌమొహల్లా పాలస్ మక్కా మసీదు వెనకాలే ఉంది). ఇరవయితొమ్మిదిన ఇంట్లో ఏదో సెలబ్రేషన్. మా తబ్లా మేష్టారు కాస్త గాఠ్ఠిగా చెప్పారు. ఇవాళ ఎలాగైన వెళ్ళాల్సిందే. ఇవాళ యోగేష్ సంసి తబ్ల సోలో ఉంది. వెళ్ళి వినిరా అని. నాకు మొదట ఆ చౌమొహల్లా పాలస్ వెతకాడానికి బద్ధకం. ఓల్డ్ సిటీలో ఎక్కడో ఉందది. అంతరాత్రి పూట ఓల్డ్ సిటీలో ఇరుక్కోవడం అసలే మంచిది కాదని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ తప్పిస్తున్నాను. ఇక గురువాజ్ఞ కాదనలేక ఆ తబ్లా ఒక్కటీ అటెండ్ అవుదామని రాత్రి ఏడున్నరకు ఒక్కణ్ణి వెళ్ళాను. తొమ్మిదివరకు వెనక్కొచ్చేద్దామని ఇంత చలిలో కనీసం ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా బైక్ మీద వెళ్ళాను.
ఎనిమిదింటికి నిదానంగా మొదలయ్యింది. మొదట జస్రాజ్ సంతానమంతా కలిసి శిష్యులతో ప్రార్థన నిర్వహించారు. రెండు బందిష్‌లు మేవాతీ ఘరానా వాళ్ళు రాసినవి. శిష్యులంతా కలిసి పాడి బాగా రక్తి కట్టించారు. తరవాత శశాంక్ ఫ్లూట్ కచేరీ అన్నారు. ఈ యోగేష్ సంసి ఎప్పుడు వస్తాడో ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అనుకుంటూ కూర్చున్నాను. ఐదు నిమిషాలయ్యాక అర్థమయ్యింది. ఈ శశాంక్ కర్నాటిక్‌లో ఆల్రెడీ పేరు మోసిన చైల్డ్ ప్రాడిజీ ఫ్లూటిస్ట్ శశాంక్ అని. అరగంటసేపు వాగధీశ్వరీ రాగంలో శ్రోతల్ని ముంచి తడిపేశాడు. రాగం-తానం-పల్లవి, పక్క వాద్యాల్లో ఒక మృదంగం, ఒక తబ్ల సహకారం. వాహ్..ఫర్లేదు ఇంత దూరం వచినందుకు ఇది వినే అవకాశం దక్కిందని సంతోషపడిపోయాను. ఈ కర్నాటిక్ సంగీతకారుడు హిందుస్తానీ కచేరీలో ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? శశాంక్ ప్రస్తుతం జస్రాజ్ గారి దగ్గిర మేవాతీ ఘరానాలో శిక్షణ పొందుతున్నాడు. ఎంత శిష్యుడైనా అల్రెడీ మరో సంప్రదాయంలో పండితుడేనని కర్నాటిక్ కచేరీ నిర్వహింపచేశారు. నిజంగా ఎంత బాగుండిందో... ఆసక్తి ఉన్నవాళ్ళు మళ్ళీ ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే కచేరీకి వేళ్ళవచ్చు.
తరవాత మొదలయ్యింది సంసీ గారి కచేరీ. ఏడాదిగా తబ్లా పాఠాలు నేరుస్తూ అంతవరకూ జరిగిన పర్కషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తబ్ల కచేరీ మాత్రం ఒక్క ముక్క అర్థమైతే ఓట్టు. తీన్‌తాల్ అని అర్థమయ్యింది గానీ ఆయన పేషకారీ కాయిదాలు, కాయిదాలు, రేలాలు రాకెట్ స్పీడులో నడిచాయి. వర్షం కురిసినట్టు ఒకటే గిడనగలు, కిడతకలు, తిరకిటలు. నా స్థాయికి చాలా ఎక్కువని తెలిసింది. విశ్వవిఖ్యాత అల్లా రఖా, జాకీర్ హుస్సేన్ శిష్యులాయన. నాకు ఆస్వాదించేంత తబ్లా తెలీకపోవడం నా దురదృష్టం. (పాఠాలు ఇలాగే కంటిన్యూ చేస్తే బహుశా వచ్చే ఏడాది..). శ్రోతలు కూడా పాపం అంతగా ఎంజాయ్ చేసినట్టు లేదు. ఇక సంసీ గారు డెస్పరేట్ అటెంప్ట్లో తబ్లా బోల్స్ వోకలైజ్ చేస్తూ వాయించడం మొదలెట్టారు. నాకైతే ఎందుకో రసాభాస అయ్యిందని అనిపించింది. అప్పటికే పదిన్నర. అదయ్యాక వెళ్దామని బయల్దేరుతున్నానో లేదో పెద్ద హంగామా మొదలయ్యింది. ఎక్కడెక్కడివాళ్ళో వచ్చి సీట్లో కూర్చోవడం మొదలెట్టారు. విషయమేంటా అని కనుక్కుంటే అప్పుడే జస్రాజ్ గారి కచేరీ మొదలవుతుందని చెప్పారు. ఒకవైపు చలి, రాత్రి పన్నెండవుతుందేమో అయిపోయేసరికి అని ఆలోచిస్తూ కాసేపు విందాంలే అనికూర్చున్నా.
పదకొండింటికి మెల్లగా మొదలయ్యింది మాజిక్. ఒకవైపు చలి వణికించి ఇంటికి వెళ్దామంటుంటే, మరో వైపు జస్రాజ్ గారి సంగీతం ఒకపట్టాన వెళ్ళనివ్వదు. మొదట శంకరుని స్తుతిస్తూ ఒక ఆలాపన. తరువాత అల్లాహ్ మెహెర్బాన్ అని ఒక బందిష్(ఆయన రాసిందే). నిజంగా అల్లా కిందకు దిగివస్తాడేమో అన్నట్టు పాడారు. పక్కనే మక్కా మసీదు వైపు చూస్తూ అల్లా, అల్లా అని పిలుస్తుంటే కాసేపు అందరం కులమతాలకతీతంగా అల్లా వస్తాడేమో అని చూశాం. నిజంగా అదొక డివైన్ అనుభూతి. అప్పటికి పావు తక్కువ పన్నెండయ్యింది. ఇల్లు గిల్లు చలీ గిలీ అప్పటికి అన్నీ మరిచాను. మాతా కాళికా అని అడానా రాగాన్ని ఎత్తుకున్నారు. అసురహరణీ, అసురహరణీ... మా మా.. అని పిలుస్తుంటే ఓహ్....నిజంగా అదో అలౌకికానుభూతి. ట్రాన్సెండెంటల్ ఎక్స్‌పీరియన్స్. పాట ముగిసి అందరు చప్పట్లుకొడుతుంటే మెల్లిగా తేరుకొని ఈలోకంలోకి వచ్చాను. ఒకసారి ఆలోచిస్తే నాకసలు జస్రాజ్ కచేరీ ఉందనే తెలీదు. వచ్చింది యోగేష్ సంసీ తబ్లా కోసం. అందులో ఏమీ అర్ధం కాలేదు. బాగా ఎంజాయ్ చేసింది మాత్రం జస్రాజ్ గారి సంగీతం, శశాంక్ ఫ్లూట్.
ఇంటికొచ్చి అసలు నేను వెళ్ళిందిఏం ఉత్సవం అని నెట్లో శోధిస్తే తెలిసింది. ప్రతి సంవత్సరం హైదరబాద్‌లో నవంబరు 27 నుండి ముఫ్హై వరకు "పండిట్ మోతీరాం పండిట్ మణిరాం సంగీత సమారోహ్" ఉత్సవరం జరుగుతంది. గత ముప్ఫై ఏడేళ్ళుగా జరుగుతోందీ ఉత్సవం. పండిట్ మోతీరాం (జస్రాజ్ గారి తండ్రి), పండిట్ మణిరాం (ఆయన అన్న) జ్ఞాపకార్థం ప్రతిసంవత్సరం మేవతీ ఘరానా కళాకారులు హైదరబాద్‌లో జరుపుతారీ ఉత్సవాన్ని. ప్రవేశరుసుము గట్రా ఉండవు. ఓపెన్ ఫర్ ఆల్. పాపం మోతీరాం గారిది చాలా ట్రాజిక్ స్టోరీ. ఆయన నిజాం అస్థాన విద్వాంసులుగా నియమించబడే రోజు నవంబరు 30న పరమపదించారు. ఇక ఆయన కుటుంబం హైదరాబాదులోనే సెటిల్ అయ్యింది. పెద్దకొడుకు మణిరాం పోషణ భారం తన మీద వేసుకొని జస్రాజ్ కు సంగీతం నేర్పించాడు. జస్రాజ్ మొదట తబ్లా నేర్చుకున్నా పధ్నాలుగో ఏట అది మానేసి వోకల్ వైపు మరలాడు. ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ అంతటి వాడు నిన్ను శిష్యుడుగా చేస్తుకుంటాను అంటే, లేదు నేను మా నాన్న సంప్రదాయాం నిలబెట్టాలి అని వద్దన్నాడట. తరువాత సినిమా డైరెక్టరు శాంతారాం కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. శాంతారాం సినిమా సంగీతంలో మున్ముందు బోలెడు డబ్బులున్నాయి ఇందులోకి దిగిపో అంటే, రూపాయికి ఆశపడి చేతిలో ఉన్న పావల పడేసుకోను అనిచెప్పాడట. ఏది రూపాయి? ఏది పావలా? :) డెభ్హయ్యెనిమిదేళ్ళ వయసులో చలిని లెఖ్ఖ చేయక తన తండ్రికి సంగీతనివాళి అర్పించిన తీరు మనోహరం.
ఏదైతేనేం ఒక్కటి మాత్రం నిజం. ఇకపై నవంబరు 30 న హైదరాబాదులో ఉంటే మాత్రం జస్రాజ్ గారి కచేరీ మిస్సయ్యే ప్రశ్నే లేదు.
I really missed this memorable event boss .. I planned for this event 2 weeks ago, but because of bundh all these incidents I couldn't come. Missed this concert very much... :( :(
ReplyDeleteచాలా చాలా ఆసక్తి కరంగా ఉంది మీ టపా! ఇటువంటి ఈవెంట్స్ గురించి ప్రజలకు తెలిసేలా మీడియా ప్రచారం చేయాలి. వాళ్లకు అంత తీరికెక్కడ ఉంది లెండి!
ReplyDeleteసో, మీరు తబలా నేర్చుకుంటున్నారా? చాలా సంతోషం! సంగీతాన్ని ఆస్వాదించడం తెలిస్తే జీవితంలో ఇక వేరే ఏమీ అక్కర్లేదనిపిస్తుంది నాకు!శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలన్నా, పాడాలన్నా, ఆస్వాదించాలన్నా అదృష్టం ఉండాలి! అదొక యోగం!
పండిట్ జస్ రాజ్ గారి కచేరీ ఒక్కసారి నేను హైదరాబదులోనే అటెండ్ అయ్యాను. అలాగే చౌమొహల్లా పాలస్ లో చౌరాసీయా గారిదీనూ! ప్రాణాలు అక్కడికక్కడ పోయినా పర్లేదనిపిస్తుంది ఇటువంటి సందర్భాల్లోనే!
మీ అద్భుత అలౌకికానందాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు!
వి.ఎం.గారు,నిజంగా మిస్స్ అయ్యారు. బంద్ పొలిటికల్ కాబట్టి పాతబస్తిలో అంతగా ప్రభావం ఉండదు. మతకలహాల బందైతే మాత్రం జాగర్తగా ఉండాలి.
ReplyDeleteసుజాత గారు, ఈవెంట్స్ ప్రచారం నిజంగానే బాగుండదు. మనమే తెలుసుకుంటూ ఉండాలి. www.fullhyd.com వాళ్ళు కాస్తోకూస్తో ఇలాంటివి లిస్ట్ చేస్తారు.
చౌరాసియ కచేరి నేను ఒకసారి u.s.లో విన్నాను. ఆరోజు ఆయన మూడ్ బాలేదో ఏం పాడో లైట్‌గా రెండు భజనలు ఒక రాగాలాపన చేసి ఊరుకున్నాడు. ఆపాటిదానికి అవే డబ్బులతో సీడీ కొనుండాల్సిందనిపించింది. కానీ ఈ కచేరీలు గిఫ్ట్ బాక్స్ లాంటివి.. వెళ్తే గాని తెలీదు ఎలా ఉంటుందో. ఇంతకు ముందొక సారి కూడా నేను కదిరిగోపాల్ కచేరికి వెళ్ళాను. what a mind blowing experience it was.
ఇక నా తబ్ల నేర్చుకోవడమంటారా.. ఎన్నాళ్ళ ముచ్చటో తెలీదు. ప్రస్తుతం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. అదీ సంగతి.
-బు
మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు!
ReplyDelete