రెండేళ్ళ క్రింద జీ తెలుగు వాళ్ళు సరిగమప అని జీ హిందీ వారిని అనుకరిస్తూ రూపొందించిన కార్యక్రమం బాగా హిట్టయ్యింది. ఆ ప్రోగ్రాం ముగిసిన తరువాత సరిగమప లిటిల్‌చాంప్స్ అని పిల్లలకోసం అలాంటి ప్రోగ్రామే నడిపించారు. ఈ పిల్లల ప్రోగ్రాంలో సాయిదేవహర్ష, భువనకృతి, శరద్ లాంటి "పిట్ట కొంచెం కూత ఘనం" టాలెంటు బయటికొచ్చి అందరూ అహో అంటే ఒహో అనుకున్నారు. అక్కడిదాకా కథ బానే ఉంది. పాటల రియాల్టీ సక్సెస్ చూసిన ప్రోగ్రాం నిర్మాతలకు డాన్స్ రియాల్టీ అయిడియా రావడం సహజమే. 'ఆటా అని జీ ఛానెల్ ఒక కార్యక్రమాన్ని మొదలెట్టారు. (సోనీ బూగీ వూగీ) తరహాలో. అదీ కూడా TRPలని బానే సంపాదించింది. 'ఆట ను కూడ పిల్లలతో మొదలెట్టారు. అక్కడే ముసలం మొదలయ్యింది. ఒకటి రెండు ఎపిసోడ్లు అయినతరువాత ఒక " ఐటం సాంగ్స్ " ఎపిసోడ్ పెట్టారు. చింపిరి బట్టలేసుకొని వెకిలిగా పిల్లలు చేసే ఆ నృత్యాలు చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉండేదో చెప్పలేను. ఇప్పటికింకా నా వయసు అని ఐదారేళ్ళ పసివయసు పిల్లలు చింపిరి బట్టలతో, pelvic movesతో శివా శివా అనిపించేరు. అక్కడితో నేనా ప్రోగ్రాములు చూడ్డం మానేశాను. (సంగీతపోటీలు కూడా...)
ఉగాది పండగ రోజు టీవీ9 చూస్తుంటే గీతిక అని ముద్దొచ్చే పాపాయిని, మరో అబ్బాయిని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు (ఆట విన్నర్స్ అట.) టీవీ9 బృందం. అలాగే ఆ జీ ఆట నిర్మాత ఓంకార్('ఓకే అని సరిగా అనడం రాని వెర్రి మొహం) ని అభినందిస్తూ లైవ్ ఫోన్-ఇన్ చర్చ జరిగింది. కనీసం ఈ ఐటం సాంగ్స్ ని ఎక్కడైనా అబ్జెక్ట్ చేస్తాడా అని చూశా.. ఉహూ..అలాంటిది లేదు కదా అలాంటివే క్లిప్పింగులు ప్రదర్శిస్తూ ఆట సక్సెస్ కు కంగ్రాట్స్ చెబుతూ ముగించారు.
రెండు రోజుల క్రింద ఛానల్ బ్రౌజింగ్ చేస్తుంటే హఠాత్తుగా టీవీ9లో ఆట ప్రోగ్రాములో అశ్లీలనృత్యాలు అని చర్చ చేస్తున్నారు. వాళ్ళు స్టూడియోకి పిలిచిన ఎక్స్‌పర్ట్స్ ఎవరంటే కూచిపూడిలో ఎమ్మే చేసిన ఇద్దరు ఆర్టిస్టులు. వాళ్ళు చర్చను చక్కగా పక్కదారి పట్టించి కూచిపూడి ఔన్నత్యాన్ని గురించి చెప్పి, మధ్యమధ్యలో పిల్లలు వాంప్ డాన్సులు చేయడమేంటి? ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక ఏమవుతారు? అని రెండు రిలవెంట్ ప్రశ్నలు వేశారు. (చర్చకు అలాంటి వాళ్ళ బదులు, ఏ పేరెంట్శ్ అసోసియేషన్ వాళ్ళనో, సైకాలజిస్టునో పిలుస్తే బాగుండేదనో నా అభిప్రాయం) ఏమిట్రా టీవీ9 కు హఠాత్తుగా ఇంత బుద్ధొచ్చిందనుకుని పేపర్ తిరగేస్తే ఈ పిల్లల అసభ్య నృత్యాలు నిషేధించాలని ఎవరో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారట (ఆ మహానుభావునికి శతకోటి వందనాలు. ) అందుకే సడెన్‌గా టీవీ9 కు బుద్ధొచ్చి చర్చ మొదలెట్టింది.
ఇవాళ మళ్ళీ టీవీ ఛానెల్లు సర్ఫ్ చేస్తుంటే జీ ఆటలో తల్లిదండ్రులెవరో టీవీ9 తిడుతూ...మా పిల్లల మీద వాంప్ అని ముద్ర వేసే హక్కు మీకెవరిచ్చారు? వారేమైనా చేసుకుంటే దానికెవరు బాధ్యులు? మా పిల్లలమంచి మాకు తెలియదా? (నాకు డౌటే) అంటూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక జీ వాళ్ళు భారతమాత, దేశభక్తి గీతాల క్లిప్పింగ్సు బాక్‌గ్రౌండులో చూపిస్తూ ఇది తప్పా అని ప్రశ్నించడం.. (మీరు చేసిన పని తప్పు కాదని అనుకుంటే ఐటం సాంగు క్లిప్పింగు ఎందుకు చూపించలేదు? ప్రేక్షకులంటే అంత వెర్రోళ్ళనుకుంటున్నారా?)
అసలు రెండు ఛానెళ్ళకూ, ఆ ఛానళ్ళ ఎడిటర్లకూ, నిర్మాతలకూ కాస్తైన బుద్ధుందా? అంత సఛ్ఛీలురైతే టీవీ9 ఉగాది రోజు ఆ పిల్లల్ని స్టూడియోకి పిలిచి, నిర్మాతని అభినందించినప్పుడు ఈ నృత్యాలు, చింపిరి బట్టల గుర్తుకు రాలేదా?
ఇక జీ తెలుగు వాళ్ళకు -- మీరు చేసింది ససేమీరా తప్పు. వెధవ డైలాగులతో సమర్థించుకోకుండా ఎంత త్వరంగా కట్టిపెడితే అంత మంచిది.
ఈ డ్రామా అంతా చూశాక టీవీ9 అంటే, పిల్లల రియాలిటీ ఎప్పట్నుంచో ఉన్న వెగటు ఎక్కువవడమే తప్ప కొత్తగా తెలుసుకున్నదేమీ లేదు.
అమెరికాలో టీవో బాక్సులు, డీవీఆర్లు వచ్చి టీవీ చూసే ప్రేక్షకులకు అలవాట్లను విప్లవాత్మకంగా మార్చాయని చదువుతాం. ఇలాంటివిప్పుడు ఇండియాలో కూడా వస్తున్నాయి. (tatasky+, airtel dvr etc..) కాని నాకు అర్ధమవని విషయమల్లా మిస్సయితే రికార్డు చేసుకొని చూడదగ్గ ప్రోగ్రాములు మన ఛానళ్ళలో ఏమున్నయబ్బా? అని.
కొసమెరుపేంటంటే కోర్టు ఛానెల్ కు తల్లిదండ్రులకు అక్షింతలు వేయడం. (హమ్మయ్య..) పూర్తి తీర్పు రేపు పేపర్లో చదవాలి.
No comments:
Post a Comment