Monday, April 12, 2010

బొల్లోజు బాబా గారి దివ్య సముఖమునకు...

బాబా గారు,
పొద్దు.నెట్లో "కో హం" మీద జరిగిన చర్చలో నా గురించి "అవాకులూ చవాకులూ పేలారు". దానికి ప్రత్యుత్తరం.
>>"బుడుగోయ్ గారి వ్యాఖ్యలు అల్లానే ఉంటాయి లెండి. విమర్శించటం, అహంకారంతో వెక్కిరించటం మధ్య తేడా ఆయనకు తెలియదు."
>>"తెలివైన వ్యక్తే కానీ అభివ్యక్తే ఒకోసారి పచ్చిమిరపకాయ సగానికి కోసి ముక్కులో దూర్చినట్టుంటుంది."
అని సెలవిచ్చారు.
1) మీకొకసారి నెరుడా అనువాదం మీద మనకు జరిగిన చర్చను గుర్తు చేస్తాను.
నీ దేహ అట్లాసు అది చదివి చాలా పొలైట్‌గా
------------------------------------------
"బాబా గారు,
మీ అనువాదం నన్ను చాలా నిరాశ పరిచింది. నెరుడా గారి కవితలో ఉన్నసెన్సౌస్నెస్స్ ఎక్కడా కనిపించలేదు. ముక్కస్య ముక్క అనువాదం కావాలనినేనట్లేదు. కనీసం ఆ భావంలేకపోతే ఎలా.
I have gone marking the atlas of your body
with crosses of fire.
స్కూల్లో పిల్లలు అట్లాస్ మీద స్థలాల్ని గుర్తించి టిక్ మార్కులు పెడతారు చూడండి. అలా ఈ కవి కాంక్షతో జ్వలించే పెదవులతో ప్రియురాలి దేహపు అట్లాస్ మీద mark చేస్తున్నాడు. కవికి మీకు ఎంత తేడా ఉంది? మరి మార్కింగ్‌కు సరైన పదమేంటి? అది తోచేవరకు ఈ అనువాదం రాకపోయినా నష్టం లేదని గ్రహించండి.
My mouth went across: a spider trying to hide.
In you, behind you, timid, driven by thirst.
మీ అనువాదం.
దప్పిగొన్న పిరికి సాలీడులాంటి నాపెదవులతో
నీలోకి, నీలోలోకి దూరిపోతున్నాను
సాలీడు దప్పికగొనడమేమిటి? పిరికిదవడమేమిటి? కవి కాంక్షతో దేహమంతటా ఎడాపెడా ముద్దిడుతున్నాడు అన్నది భావన. my mouth went across : a spider trying to hide. ఈ లైన్స్ తరవాత ఫుల్‌స్టాప్ ఉంది చూడండి. ఈ driven by thirst అన్నది కవికి వాడుకున్నాడు సాలీడుకు, పెదవులకు కాదు.
అలాగే సమాసాలు కూడా. నిప్పురేఖలంటూ వీరతాళ్ళు సృష్టించేకంటే మనకు అలాంటి ఎక్స్‌ప్రెషన్‌కి ఉన్న అగ్నికీలలు అనే పదం బాగుంటింది.
ఇది కేవలం మొదటి పేరా. మిగ్లినవి మరోసారి సరిచూసుకొని తిరిగి ప్రచురించండి.
నెరుడా...ఎల్ కపితాన్స్ వర్సెస్ చదివారా.. అవి కూడా చాలా బాగుంటాయి
---------------------------------
అని సమాధానమిచ్చాను. ఇందులో ఏమైనా అహంకారముందా? ఇలా సున్నితంగా విమర్శిస్తే మీ సమాధానమిది.
-----------------------------------------------------------------
మీ పరిశీలనలు బాగున్నాయి. మీబోటి వారు చెపితేనే కదా కొన్ని విషయాలు తెలిసేవి. అలాగని మీరు చెప్పిన విషయాలని నేను ఏకీభవించాలని ఏమీ లేదు కదా. చెపుతూనే ఉండండి.
-----------------------------------------------------------------
అరే..కవితనర్థం చేసుకోవటంలో చాలా ప్రాథమిక దోషాలు దొర్లాయని అంత స్పష్టంగా చెబితే నేను ఏకీభవించను అంటే ఏం చేసేదీ?
పైకవితలో driven by thirst అన్నది కవికా? సాలీడుకా అన్నది పదో తరగతి ఇంగ్లీషు చదువుకునేవాడికి కూడా అర్థమవుతుంది. అనువాదాలు చేయబూనేవారికి కనీసం అదర్థం కాకపోతే ఎలా? పైగా ఇలాంటివి ఇంకో నలభై దాకా ఉన్నాయట.
ఇది మన తెలుగులో ఒక సాంప్రదాయం. ఎడాపెడా అనువాదాలు చేయడం. ఒక నలభై, యాభై అవగానే ఓ పుస్తకం అచ్చు వేయడం, స్నేహితులతో ఒక ముందు మాట, రెండు సమీక్షలు రాయించడం, అమాయక పాఠకులు అదేదో బ్రహ్మపదార్థమని కొని చదువుకొని బోర్లా పడడం. ఇవన్నీ మొగ్గలో తుంచేయడానికే కటువుగా తిరుగు సమాధానమివ్వాల్సి వచ్చింది.

కోహం మీద చర్చ కూడా దాదాపు ఇలాంటిదే. "ఎందుకు విరిచి రాస్తున్నారు?" అని పొలైట్‌గా అడిగినప్పుడు కవి సమాధానమేమిటి? మరింత స్పష్టత కోసం అని. అదే కొంచెం గాఠ్ఠిగా అడిగితే నేను చిన్నప్పుడు సంస్కృతవ్యాకరణం చదువుకోలేదు..సూత్రాలు గుర్తులేవు..ఏదో పుస్తకంలో విరిచి రాశారూ..అంటూ ఏవో అస్పష్టమైన సమాధానాలిచ్చారు. మళ్ళీ కామేశ్వరరావుగారు కల్పించుకొని వివరణ ఇచ్చాక కవికి చివరికి స్పష్టత వచ్చింది. "నేనుకు ప్రత్యేకంగా నొక్కు ఇవ్వలనుకున్నాని"

చెబితే వినరు..గిల్లితే ఏడుస్తారు అన్నట్టుంది వ్యవహారం. అందుకే ఇలాంటి అభివ్యక్తి. (అహంకారం కాదు - గుర్తుంచుకోండి.)

2) ఇక మీ రెండో ఆరోపణ గురించి :
----------------------------------------------------------------
"ఈ మధ్యోచోట ఒక ప్రముఖ కవిగారి సంకలనం గురించి అవాకులు చెవాకులు పేలారు. పోనీ ఏమైనా వివరణలిచ్చారా అంటే అదీ లేదు. ఏదో పాసింగ్ కామెంట్స్ లాగా… ఆయనను తక్కువ చేసి మాట్లాడితే, ఈయన్నేదో అందరూ అంతకన్నా పెద్దవాడని అనేసుకొంటారన్న దురాశ తప్ప మరేమీ కనిపించలేదు."
----------------------------------------------------------------
మీరనే అభిప్రాయం ప్రచురించిన ఫోరం ఉద్దేశ్యమేమిటి? - ప్రతీవారూ తాము చదువుతున్న పుస్తకం గురించి చెబుతూ ఒకటీ రెండూ వాక్యాల్లో అభిప్రాయం వ్యక్తం చేయటం. సమీక్షలకు, విమర్శలకు అక్కడ తావు లేదు. పుస్తకం కొనుక్కుని చదివిన పాఠకుడికి పుస్తకం నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడానికి కవి ప్రముఖుడా అనామకుడా అన్నది అనవసరం. ఎలాగూ అడిగారు కాబట్టి త్వరలోనే ఆ పుస్తకంలో అకవిత్వాన్ని కూడా నా బ్లాగులోనే పరిచయం చేస్తాను.
సరే అఫ్సర్ అంటే ప్రముఖ కవని దురుద్దేశ్యంతో రాశానంటారు. మరి మీ అనువాదాన్ని ఎందుకు తప్పు పట్టినట్టు? కొంపతీసి మీరూ ప్రముఖుల జాబితాలో ఉన్నారా? ఇక్బాల్ చంద్ (ప్రముఖుడో కాదో తెలీదు) కవిత్వం మీద వ్యాసం రాస్తే wonderful review అని మీరే అన్నారు. కవిత్వం మీద నాకు ఆ కాస్తైన అవగాహన ఉన్నట్టు ఒప్పుకున్న మీరు అఫ్సర్ కవిత్వం మీద కామెంటు రాస్తే నిరాధారమైనవని ఎలా అనుకుంటున్నారు?
ఐనా ప్రముఖులమీద మీకు ఈ fixation ఏమిటి? ప్రముఖులు చెప్పినంత మాత్రాన పంది కాస్త నంది అవుతుందా? సైన్స్ లెక్చరరైన మీకు ప్రశ్నించడం గురించి నేను చెప్పేదేమీ లేదు. ఇదివరలో ఇస్మాయిల్ని "అనిబద్ధ కవి" అనడాన్ని ప్రశ్నించినప్పుడు కూడా మీరు మరో "ప్రముఖుణ్ణి" కోట్ చేయజూశారు.

బాబాగారు, మీకు నేను చెప్పదలచుకొన్నదొక్కటే. మనమేం చదివినా, రాసినా, విమర్శించినా ఆబ్జెక్టివ్ దృక్పథం ఉండాలి. ఎవరు రాశారన్నది అనవసరం ఏమి రాశారన్నది ముఖ్యం. ఎవరైనా ఒక విషయాన్ని తప్పు పడితే తప్పెక్కడుందన్నది చూసుకోవడం ప్రథమ కర్తవ్యం. ఇల్లు కాలుతోందని చెబితే నీళ్ళు వెతుకుతామా? చెప్పినవాణ్ణి పట్టుకొని దూషిస్తామా? దురాశంటూ కుట్ర సిద్దాంతాలు లేవదీయడం, వైరి వర్గానికి చెందిన వాడని బుకాయించడం లేదా నీకెంత వచ్చని దబాయించడం లాంటి చవకబారు పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

No comments:

Post a Comment