Tuesday, November 30, 2010

నేడు నగరంలో పండిట్ జస్‌రాజ్ కచేరీ

1934 నవంబర్ 30: నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పండిట్ మోతీరాం అనే సంగీతకారుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆరోజు సాయంత్రం నగరంలో చౌమొహల్లా భవంతిలో కచేరీకి ఏర్పాట్లు చేశారు. ఇంకో ఐదు గంటల్లో రాజలాంఛనాలతో వచ్చి ఆయన్ని తీసుకెళ్తారనగా విధివక్రించి పండిట్ మోతీరాం పరమపదించారు. అప్పటికి పండిట్ జస్రాజ్ ప్రాయం ఐదేళ్ళు. కుటుంబ బాధ్యత అన్న పండిట్ మణిరాం తీసుకొని తిరిగి ఉత్తరభారతానికి వెళ్ళిపోయారు. మొదట్లో కాస్త తబ్లా నేర్చుకొన్న జస్రాజ్ గారు, ఎంత నేర్చిన తబ్లా వాద్యకారులు రెండవ శ్రేణి పౌరులే అన్న విషయం గ్రహించి గాత్రసంగీత సాధన చేశారు. గురువు అన్న పండిట్ మణిరాం. గానగంధర్వుడైన బడే గులాం అలీ ఖాన్ యువ జస్రాజ్ ని చూసి ఆయన దగ్గర శిష్యరికం చేయమని అడిగారు. (హిందుస్తానీ సంప్రదాయంలో ఒక గురువే శిష్యుణ్ణి ఇలా అడగడం సామన్యమైన విషయం కాదు). అప్పటికే మేవాతీ సంప్రదాయంలో సాధన చేస్తున్న జస్రాజ్ సున్నితంగా తిరస్కరించి సాధన కొనసాగించారు.
జస్రాజ్ గురించి ఇంకో పిట్టకథ ఉంది. ఆయన అర్ధాంగి ప్రఖ్యాత సంగీత దర్శకుడు వి.శాంతారాం కుమార్తె. శాంతారాం గారు సినిమాల్లో పాడు మంచి భవిష్యత్తు, ఆర్థిక బలం వస్తాయని చెబితే, రూపాయికోసం చేతిలో ఉన్న పావలాని వదులుకోనని చెప్పారట. ఏది రూపాయి? ఏది పావలా :-)

పండిట్ జస్రాజ్ తండ్రి పండిట్ మోతీరాం సమాధి హైదరాబాద్‌లోనే ఉంది. ఆయన స్మృత్యర్థం 1972 నుండి ఏటా నగరంలో నవంబర్ 30 వ తేదీ సంగీతోత్సవం నిర్వహించే సంప్రదాయానికి స్వీకారం చుట్టారు జస్రాజ్. 2008 వరకు వివిధ వేదికల్లో నిర్వహించిన ఈ ఉస్తవాణ్ణి 2009 నుండి, వాళ్ళ తండ్రి గారు ఒకప్పుడు కచేరీ నిర్వహించవలసిన చౌమొహల్లా భవంతిలోనే నిర్వహిస్తున్నారు.

ఆ ఉత్సవాల్లో భాగంగా నేడు పండిట్ జస్రాజ్ కచేరీ. ప్రవేశ రుసుము లేదు. మక్కామసీదు దగ్గర చౌమొహల్లా పాలస్ ఆరుబయట జరుగుతోంది. చక్కగా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చేరుకుంటే రాత్రి పన్నెండు వరకు జరుగుతుంది.
హిందుస్తానీ సంగీతం అభిమానించే వారైతే కచేరీ తప్పక వినవలసిందే. its really an out of world experience.

Tuesday, November 23, 2010

హ్యారీ పాటర్ -7.1

డెత్లీ హాలోస్ నవల సైజ్ చూసి, ఇంత పెద్ద కథని సినిమాగా ఎలా తీస్తార్రా అనుకున్నా? రెండు భాగాలుగా తీస్తున్నారని వార్త వచ్చింది. బిజినెస్స్ పరంగా విడుదలైన ప్రతీ హ్యారీ పాటర్ సినిమా మిలియన్ల కొద్దీ సంపాదించింది. రెండు సినిమాలు తీస్తే రెట్టింపు వసూళ్ళు వస్తాయన్న ఆశకూడా కావొచ్చు. మరి సినిమా ఎలా ఉంది అంటే? నాకైతే నచ్చింది. సినిమా ఎలా ఉండొచ్చనుకున్నానో అలాగే ఉంది. హ్యారీ, హర్మైనీ సీను తప్ప :-) (ఈ పిట్ట కథ నవల్లో లేదు. డైరెక్టరు స్వకపోల జనితం)
ఇప్పటికి వచ్చిన ఆరు సినిమాలు మీరు చూసి ఉంటే ఈ సినిమా తప్పక చూస్తారు. కానీ అడపా, దడపా కొన్ని భాగాలు చూసి, కథ గురించి అట్టే తెలీకపోతే మాత్రం మీరు చూసి శుద్ధ దండగ. ఎందుకంటే సినిమాలో పాత్రలు, రిఫరెన్సులు అన్నీ పాత కథలతో ముడిపడి ఉంటాయి. అసలు రాన్ ఎవరో, హర్మినీ ఎవరో తెలియని ఒక మిత్రుడిని సినిమాకి తీసుకెళ్ళాను. పదో నిమిషం నుండి వాడికి ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నాకు నేపథ్యం తెలుసు, నవల చదివాను కాబట్టి లీనమై చూస్తూ ఉండిపోయాను.
సినిమా కి వస్తే, ఏడవ సంవత్సరం హ్యారీ, రాన్, హర్మైనీ హాగ్వార్ట్స్ స్కూలుకి వెళ్ళడం మాని, వాల్డెమార్టునుండి తప్పించుకోడానికి దిక్కూ దివాణంలేకుండా తిరుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్కి వెళ్ళి హార్‌క్రస్టు సంపాదించే సన్నివేశం చాలా బాగుంటుంది. ఆ హార్ క్రస్టు ప్రభాంతో రాన్‌కి హ్యరీ కి గొడవై వాళ్ళు విడిపోతారు. సినిమా చివర్లో మళ్ళీ కలిసి హార్‌క్రస్టును ధ్వంసం చేస్తారు. రెండవ భాగాన్ని చూడ్డం కోసం ప్రేక్షకుణ్ణి ప్రిపేర్ చేసినట్టుంటుంది కాబట్టి గొప్ప క్లైమాక్స్ ఏమీ ఉండదు. బహుశా అదే ప్రేక్షకులను నిరాశకు గురిచేయొచ్చు.
చివర్లో మా ఫ్రెండుతో పార్టు టూ బాగుంటుంది అని చెప్పబోయాను. ఇదే నా లాస్టు హ్యారీ సినిమా అని తేల్చుకున్నడట పదకొండో నిమిషంలొ :-) మీరు హ్యారీ పాటర్ ఫ్యాన్ ఐతే లేదా ఆ కథ గురించి మీకు తెలిసుంటే తప్పక చూడొచ్చు. లేకపోతె మాత్రం డబ్బులు దండగ.

Tuesday, November 16, 2010

భారత్ అనోఖా రాగ్ హై

ఏవో చానళ్ళు మార్చుతుంటే డీడీలో ఈ మ్యూజిక్ ఆల్బం వినిపించి ఆగిపోయాను.
మిలే సుర్ మేరా తుమ్హారా, బజే సర్గం లాంటిదే కొత్తది వచ్చినట్టుంది. తర్వాత కాస్త యూట్యూబ్ లో వెతికితే దొరికింది.
పండిట్ జస్రాజ్, జేసుదాస్ ఇద్దరి ఆలాపన వినడం కోసమైనా ఈ ఆల్బం ఒకసారి తప్పక చూడాల్సిందే.

భారత్ అనోఖా రాగ్ హై


ఇప్పటి వరకు వచ్చిన వాట్లో బెస్ట్ అంటే మాత్రం నేను "బజే సర్గం - దేశ్ రాగ్" కే వోటు వేస్తాను.

Wednesday, November 03, 2010

AIR రాగం కర్నాటక సంగీత చానల్

తృష్ణ గారి టపా చూస్తే ఆకాశవాణి సంగీత సమ్మేళన్ గురించి తెలిసింది. ఎప్పుడో పాడైన రేడియోను రిపేర్ చేయించే ఆలొచన పక్కన పెట్టి చక్కగా డిజికేబుల్ వాళ్ళ చానల్ వింటున్నాను. అప్పటివరకు మా డిజికేబుల్ లో రేడియో ఒకటి ఉందని గమనించిన పాపాన పోలేదు :) సరే రేడియోలో ఏం చానల్స్ ఉన్నాయని చూస్తుటే కనిపించింది ఈ air రాగం చానల్.
ఆకాశవాణి తరపున కేవలం కర్ణాటక సంగీతానికి కేటాయించిన చానల్ ఇది పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకు కర్నాటక సంగీతం వినిపిస్తుంది. (ఆ మధ్యెప్పుడో ఒక స్నేహితుడు వరల్డ్‌స్పేస్ రేడియో గురించి చెప్పినప్పుడు సరే పెట్టిద్దామని మీనమేషాలు లెఖ్ఖెడుతుండే లోపల అది కాస్త మూసుకు పోయింది. ) ఇది ఇంచు మించు వరల్డ్ స్పేస్ చానల్ శృతి లాంటిదే.
AIR రాగం కేవలం DTH మీదే ఉంటుందని నెట్లో ఉంది మరి డైరెక్ట్ రేడియో కి వస్తుందో లేదో తెలీదు.
డిష్ లో వెతికితే వచ్చిన సమాచారమిది frequence : 370 MHz 6956 64 QAM
వారి ప్రోగ్రామింగ్ షేడ్యూల్ ఇక్కడ ఒకటే ఇబ్బంది ఏమిటంటే ఇది కేవలం రేడియో చానల్ ఐనా DTHలో వస్తుంది కాబట్టి టీవీ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సివస్తుంది ఆడియోను రీ-డైరెక్ట్ చేసే ఏర్పాట్ల గురించి ఎవరైనా ట్రై చేశారా? (టీవీ ఆన్ చేసి పెడితే వచ్చే ఇబ్బంది ఏంటని అడక్కండి. పొద్దున లేచింది యువరాజ్, శ్రీశాంత్ ల మొహాలు చూడాలంటే డొకొస్తుంది. ఈ డిజికేబుల్ వాడు ఇప్పట్లో ఆ బానర్ మార్చేట్టు లేదు).
అదీ సంగతి.
చెవులార సంగీత ప్రాప్తిరస్తు