పుట్టగానే ఎక్కడ బోల్డు సుఖపడిపోతానో అని కాబోలు దేవుడు నాకంటే ముందు అన్నయ్యని పుట్టించి ఉంచాడు. నాకు బుద్ధి తెలిసినప్పటినుండి మేమిద్దరం పోటీ పడని క్షణం లేదు. అన్నం దగ్గిర ఎవరు ఫస్ట్ డిష్ టేస్ట్ చూస్తారో, ఎవరు ఫాస్ట్‌గా తింటారో, ఎవరు ఫస్టు చేతులు కడుక్కుంటారో అని, హోంవర్క్ ఎవరు ఫస్ట్ పూర్తి చేస్తారోనని, స్కూల్ నుండి ఎవరు ఫస్ట్ వస్తారో అని....ఉఫ్....ఇంట్లో రోజూ రామరావణ యుద్ధాలే.
ఒక్కవిషయంలో మాత్రం ఈ పోటీ ముదిరి పాకాన పడేది. ఎందుకంటే ఆ పోటీలోగనక ఓడిపోతే, ఇక నెలరోజులు ఎదుటివాడి దెప్పులు భరించాలి. అదే చందమామ ఎవరు ఫస్ట్ చదువుతారో అన్న పోటీ. నెలలో మొదటి మూడు రోజులు పేపరువాడికోసం పొద్దున్నే కాపలా కాసేవాళ్ళం. పొరపాటున మనం లేని సమయంలో చందమామ వస్తే? హమ్మో ఇంకేమైనా ఉందా.. అన్నయ్య దాచిపెట్టేసి స్కూలునుండి రాగానే చదివేయడూ..అబ్బో అదొక టెన్స్ లైఫ్ లెండి. ఎనీవే, కొన్నాళ్ళకి సంధి కుదుర్చుకొని చందమామని వదిలేశాం ఎందుకంటే ఇద్దరం తోడుదొంగలుగా ఒక పని చేయాల్సి వచ్చింది.
ఎండాకాలం సెలవులొచ్చాయి. మధ్యాహ్నం బయటకి వెళ్ళామని తెలిసిందో సాయంత్రం బడితెపూజ(అప్పుడప్పుడు బెల్టుపూజ) జరిగేది. పోనీ మూడుగంటలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటే రోజూ వేళ్ళు నెప్పులు పుట్టేలా ఇరవయెక్కాలు రాయించేవారు. అమ్మ పడుకునేదాక ఏదో గీకేసి పడుకోగానే మా రహస్య స్థావరంలోకి వెళ్ళేవాళ్ళం. స్థావరమంటే ఎక్కడో ఉందనుకునేరు. మా ఇంట్లోనే పట్టెమంచాలు గోడవారగా వేసి పెట్టి వాటిపై బట్టలారేసేవాళ్ళు. దాంట్లో దూరి చక్కగా షాడో నవల్లు చదివేసేవాళ్ళం. దీంట్లో ఆశ్చర్యమేముందా? (నాకప్పుడు ఏడేళ్ళు, అన్నయ్యకు తొమ్మిది). అప్పుడు మాకేమర్థమయ్యేవో, ఎందుకు చదివేమో ఇప్పటికీ నవ్వొస్తుంది తలచుకుంటే. బహుశా వెధవపని చేస్తున్న థ్రిల్ అనుకుంటా :) మొత్తానికి ఒక వేసవి కాలం నాన్న దగ్గిరున్న షాదో నవలల్ సిరీస్ అంతా చదివి మేం కనిపెట్టిందేమంటే అన్నీ ఒకేలా ఉంటాయి డొక్కు నవల్లు...నాన్నగారెందుకు చదువుతారో ఏం పాడో అని. అలాగే ఆంధ్రభూమి, యువ ఇలాంటివన్నీ చదివేసేవాళ్ళం. అమ్మకు తెలిస్తే వీపు చీరేస్తుందని తెలిసీ. అప్పట్లో యువ దీపావళి సంచిక అని ఇంతేసి లావుపాటి పుస్తకమొచ్చేది. అలాగే ఒక చిన్న నవల కూడా ఉండేది (యువదో, స్వాతిదో). అన్నీ చదివేవాళ్ళం ఒక నవల తప్ప. మల్లిక్ కార్టూన్లు, రాగతి పండరి ముగ్గుల కార్టూన్లు చదువుకొని బోల్డు నవ్వుకునేవాళ్ళం. కథలు చదివినట్టు గుర్తు కానీ నవలలు మాత్రం పెద్దయ్యాకే చదవాలని ఒక అన్‌స్పోకెన్ రూల్ ఉండేది..
మూడేళ్ళకో బదిలీతో నాన్న ఊర్లు మారడం మొదలవగానే అన్నయ్యని బాబాయి దగ్గరకి, నన్ను హాస్టల్కి పంపించేశారు నాన్న. మొట్టమొదటి సారి హాస్టల్లో నాలుగునెలలు ఏకధాటిన అమ్మ నాన్నలకి దూరంగా ఉండి రేపనగా ఇంటికి వెళ్తామన్న రోజు. ఆ రోజెందుకో బోలెడు ఫ్రీ టైం దొరికి హాస్టల్లో 'చెక్కీ అని ఓ మిత్రుడి దగ్గరకి వెళ్ళాను. (అసలు పేరు రమేశ్ చక్రవర్తి లెండి). మా చెక్కి గాడి దగ్గిర ఒక పెద్ద నవల కనిపించింది. టైటిల్ "ఏడు తరాలు". ఇప్పుడైతే చూసేవాళ్ళు, వద్దనేవాళ్ళు ఎవరూ లేరు కదాని చదవడం మొదలెట్టా. సాయంత్రం మొదలెడితే రాత్రి అందరు పడుకున్నా వదల్లేదు. నేను ఓరాత్రి మూడింటివరకూ ఆ నవల చదువుతూ ఉండిపోవడం ఇప్పటికీ గుర్తు. ఆరో తరగతిలో రాత్రంతా మేల్కొని చదివింపజేసిన ఆ నవల అంటే ఇప్పటికీ నాకు భలే ఇష్టం. ఒకవైపు ఆ బానిస నాయకుడి బాధననుభవిస్తూ, మరోవైపు నవల చదువుతున్నందుకు థ్రిల్లవుతూ బాగా గుర్తుండి పోయిందా రోజు.ఇంజనీరింగులో జాయిన్ అయ్యాక మళ్ళీ ఆ పుస్తకం ఏక్కడ దొరుకుతుందని తెగ ట్రై చేశా. అందరు తెలుసని చెప్పేవాళ్ళే కానీ అదెక్కడా దొరికేది కాదు. ఒకరోజు పేపరు చదువుతుంటే తెలిసింది. అది "రూట్స్" అనే గొప్ప నవలకు అనువాదమని. ఇక ఒరిజినల్ సంపాదించి చదివి మళ్ళీ ఆ నాయకుడి బాధంతా అనుభవించాను. అమెరికాలో కూడా ఆ పుస్తకం మరొక్కసారి చదివాను. మొన్నీ మధ్య సహవాసి గారి అనువాదం చూసాను ఏడుతరాలకి. కానీ అది చిన్న పుస్తకం. నేను చదివింది సాహిత్య అకాడెమీ వారి బౌండు పుస్తకమని గుర్తు. మరెవరైనా ఈ నవలకి అనువాదం చేసారా? లేక నేను చదివింది సహవాసి గారి అనువాదమేనా అన్నది నాకు ఇప్పటికీ తేలని బేతాళప్రశ్న. ఆ తరువాత గోర్కీ అమ్మ, దాశరధి చిల్లర దేవుళ్ళు చదివాను. అవి కూడా అద్భుతమైన పుస్తకాలు. అవండీ నేను మొట్ట మొదట చదివిన మూడు నవల్లు. మూడు గొప్పవే.
ఇదంతా చదువుతుంటే మీరు చదివిన మొదటి నవల గుర్తొచ్చిందా? ఆలస్యమెందుకు..వేసెయ్యండొక టపా.
తా.క.: అన్నయ్యకీ నాకు ఇప్పుడు పోటీలేదు గానీ, పుస్తకాలు వొరేషియస్ గా చదివే అలవాటు ఇప్పటికీ ఇద్దరికీ పోలేదు. పుస్తకాలే లేకుంటే లైఫ్ ఎంత బోర్ కదా.
నేను చదివిన మొదటి నవల కూడా 'ఏడుతరాలు ' ఎప్పుడొ నేను పదవ తరగతి చదువుతున్న రొజుల్లొ.. అదసలు మా ఇంట్లొకి ఎలా వచ్చిందొ ఎవరికి తెలీదు. ఇంట్లొ అందరం వున్నా..నేనుఒక్కడినే చదివాను... మిగతా వాళ్ళకి అలంటి బుక్ ఒకప్పుడు మా ఇంట్లొ వుందని కూడా తెలీదు.:-)
ReplyDeleteరూట్స్ ఇక్కడ టి వి సీరియల్ గా తీసారు.
http://www.imdb.com/title/tt0075572/
నేను చదివిన మొదటి నవల కాశ్మీర్ ఐ లవ్ యు.. నెట్ లో చాల సెర్చ్ చేసాను దొరుకుతుందేమో అని.. But దొరకలేదు..
ReplyDeleteకొన్ని అనుభవాలు అనుభూతులూ బాల్యంలో కామన్ గా ఉంటాయేమో అనిపిస్తోంది మీ టపా చదువుతుంటే! పట్టెమంచాల మీద ఆరేసిన చీరల కింద అదేదో బొమ్మరిల్లులాగానో, డెన్ లాగానో ఫీలవుతూ అందులో కూచుని పుస్తకాలు చదవడం భలే గుర్తు చేశారు.
ReplyDeleteనేను మొదట చదివిన నవల జానకి విముక్తి....నాలుగో క్లాసులో అనుకుంటాను. మా ఇంట్లో చిన్న పిల్లలు నవలలు చదవకూడదనే నిబంధన ఏమీ ఉండేది కాదు. పైగా బోల్డు పుస్తకాలు విజయ, జ్యోతి మంత్లీ, ఆంధ్ర జ్యోతి, ప్రభ,పత్రిక వీక్లీలు, చందమామ, బాల జ్యోతి, యువ ఇలా ఎన్నెన్నో! అందువల్ల ఎప్పుడో ఏదో ఒకటి చదవడల అలవాటైపోయింది.
ఏడుతరాలు నేను ఏడో క్లాసుకొచ్చాక చదివాను. గుక్క తిప్పుకోకుండా దిమ్మ తిరిగేలా చేసిన నవల. సహవాసి గారి అనువాదం!ఆ దెబ్బతో ఒరిజినల్ సంపాదించి రెండు వారాల్లో ముగించాను.కనీసం నలుగురు స్నేహితులకు బహుమతిగా ఇచ్చాను రూట్స్ నవలను. ఏడు తరాలైతే మా బంధువుల్లో పిల్లలందరి దగ్గరా నా సంతకంతో ఉంటుంది.
మీరు చెప్పిన బౌండు పుస్తకం ఎవరి అనువాదమో మీకు గుర్తు లేదా బుడుగు గారూ! అంటే సహవాసి గారు కాకుండా ఇంకెవరైనా అనువదించారేమో తెలుసుకుందామని!
షాడో నవల్లు చదివి నేనూ ఇల్లాగే ఫీలయ్యేదాన్ని! పనామా సిగిరెట్లూ, ధృడకాయుళ్ళూ, దవడ కండరాలు బిగుసుకుపోవడాలు, కులకర్ణి గారి నోట్లో పైపూ..బిందూ...ఇవేగా ప్రతి దాంట్లో అనిపించేది.
నేను చదివిన రెండో ఇంగిలీషు నవల "Roots". తెలుగు అనువాదం ఉందని కూడా నాకు చాలా రోజులు తెలియదు.తరువాత కొలంబస్ లైబ్రరీలో సీడీ తెచ్చుకుని చూశాను కాని సినిమా, నవల ఇచ్చిన అనుభూతి ఇవ్వలేదు. "కుంటా " గా నటించిన నటుడు ఆ పాత్రకు సరిపోలలేదనిపించింది. అలానే "కిజ్జీ" ని అమ్మివేయడం తో కుంటా పాత్రను మరుగున పెట్టడం కూడా గొప్ప ఆశాభంగం.
ReplyDeleteసుజాత గారు,
ReplyDeleteభలే. పట్టెమంచాల స్థావరం మీక్కూడా ఉండేదా. మేము కోడ్‌వొర్డ్‌లా సమాధి అని పిలుచుకునేవాళ్ళం. ఒకసారెపుడో అమ్మ చెవినబడి చీవాట్లు తిని మానేశాం.
అప్పుడు రచయితల పేర్లు గుర్తు పెట్టుకోవడం కాదు గదా ఎవరు రాసారని కూడా చూడలేదు. అందునా ఆ పుస్తకం నా దగ్గర ఒకే రోజు ఉండింది. తర్వాత సెలవులకి ఎక్కడివాళ్ళమక్కడ గప్‌చుప్. పోనీ మా చెక్కిగాణ్ణి అడుగుదామంటే ఏదో వాళ్ళ నాన్న పంపించడమే కాని వాడు ఆ పుస్తకాలు చదివింది లేదు పాడు లేదు. సెలవుల్లో ఏక్కడో పారేశాడుట. :-(
అలాంటిదే ఇంకో పుస్తకం మంచిర్యాల లైబ్రరీలో రష్యన్ అనువాదం చదివాను. ఛుక్, గెక్ అని ఇద్దరు అన్న దమ్ములుంటారు చిన్న చిన్న సాహసకార్యాలు చేస్తుంటారు. వాళ్ళ పేర్లు తప్పితే ఏం గుర్తులేదు నాకు.
మరో పుస్తకం "మహానగరంలో మరుగుజ్జు" అనుకుంటా. పిల్లల సైన్స్ ఫిక్షన్. పెద్దయ్యాక ఎంత వెతికినా దొరకలేదు. టైటిల్ కూడా అదో కాదో గుర్తు లేదు. విశాలాంధ్ర ప్రచురణ అని మాత్రం తెలుసు.
సునిత గారు, ఆ వీడియోలు నేనూ చూశానండీ.. ఒకటి రెండు చూసి మానేశాను. అలాంటి పుస్తకాన్ని వీడియో తీయడం కత్తిమీద సాము లాంటిది. పుస్తకాలు చదివిన వారికి వీడియోలు ఎప్పుడూ తృప్తినివ్వవు. చూడకపోయిందే ఉత్తమం. కొన్ని రేర్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. Lord of the rings, To kill a mocking bird, harry potter-3 లాంటివి.
అర్రె, భలే రాశారే! నేనూ ఇలాంటిదే ఓ టపా రాశాను నిన్నే. మంచం వెనుక కూర్చొని చదవడం, షాడో బుక్కులు, కుంభనికుంభుల పోట్లాట (అన్నదమ్ములు), ఇవన్నీ అన్ని ఇళ్ళల్లోనూ కామనేమో.
ReplyDeleteనేను చదివిన మొట్టమొదటి నవల (సీరియల్ గా చదివాను) మల్లాది రెండు రెళ్ళు ఆరు.
ఏడు తరాలు చదివి - ఆ ట్రాన్స్ లో ఎన్నాళ్ళున్నానో గుర్తు లేదు కానీ...చదివి తీరవలసిన పుస్తకమని ఎంతో మందికి చెప్పినట్టు గుర్తు... :)
ReplyDelete"పుట్టగానే ఎక్కడ బోల్డు సుఖపడిపోతానో అని కాబోలు దేవుడు నాకంటే ముందు అన్నయ్యని పుట్టించి ఉంచాడు. "
ReplyDeleteYou said it, brother!
Fantastic.