Saturday, March 06, 2010

ఈ మధ్య చదివిన పుస్తకాలు

1) వనవాసి : విభూతి భూషణ్ బంధోపాధ్యాయ బెంగాలీ నవల అరణ్యక కు అనువాదం. పథేర్ పాంచాలి నవల రాసినది ఇతనే. పుస్తకం.నెట్ లొ సుజాత గారి పుస్తకపరిచయం చూసి కొన్నాను. అద్భుతమైన పుస్తకం. ఈ నగరాన్ని విడిచి పారిపోవాలనిపిస్తుంది చదువుతుంటే. చదివినంతసేపూ మనమూ అడవుల్లో, వెన్నెల్లో విహరిస్తుంటాం. "బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" గుర్తుకువస్తుంది వెన్నెల్లో అడవిని వర్ణిస్తుంటే అలాగే గర్భదారిద్ర్యవర్ణన చదువుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది. కథ-పరిచయానికి పుస్తకం.నెట్లో సుజాత గారి వ్యాసం చదవండి. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. అనువదించినవారు సూరంపూడి సీతారాం గారుట. ఎంత చక్కని అనువాదమో. అసలు పుస్తకం తెలుగులో రాశారంటే నమ్మొచ్చు. వీలైతే ఈయన మిగిలిన అనువాదాలు సంపాదించాల్సిందే.
పుస్తకం ప్రచురించిన హైదరబాద్ బుక్ ట్రస్టు మీద మాత్రం కినుక వహించాల్సిందే. 120 రూపాయల ధర పెట్టి ఇంత చీప్ క్వాలిటీ ముద్రణా.? HBT, having published a book myself I know how much it cost and pricing models. There is no way you can justify the price. ఈ పుస్తకానికి మంచి ఆర్టిస్టు వేసిన చిత్రాలు జోడించి బైండు పుస్తకంగా ఎవరైనా పబ్లిష్ చేస్తే కొనుక్కోవాలనుంది. సుజాత గారు, ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

2) కొండఫలం - వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథల సంకలనం : కొండఫలం కథ కథా సిరీస్లో చదివినట్టు గుర్తు. అందుకే మారాలోచించక తీసుకున్నాను. అన్నీ స్త్రీవాద కథలు. అలాగని మితిమీరిన మూర్ఖవాదం కాదు. కథలకి చదివించే గుణం, మంచి కథా వస్తువు ప్రధానం అనుకుంటే, ఈ సంకలనంలో ప్రతి కథకు ఆ లక్షణముంది. కథలు - స్త్రీవాదం ఇష్టపడేవారు కొనుక్కోవచ్చు. చికాకు పెట్టిన రెండు చిన్న విషయాలు. senisitve కీ sensible కి రచయిత్రికి తేడా తెలీకపోవడం.(పుట.121). ఉజ్జ్వల అనే కథలో ప్రొటగనిస్టు డయలాగు "నేను వాక్‌మన్ అనను వాక్‌పర్సన్ అంటాను. లాంటివి.. వెల 90/-

3) అనగనగా..మరి కొన్ని కథలు - రచన :బ్నిం : టైటిల్ నాకు సరిగా గుర్తులేదు ఐదేళ్ళక్రింద బ్నిం గారిది ఒకపుస్తకం వచ్చింది. భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు, సర్దుకోవడాలు గట్రా గురించి. నాకెంతో నచ్చింది. అదే కాంఫిడెన్స్‌తో కొన్నానీ పుస్తకాన్ని. అన్నీ చక్కని కథావస్తువులు. చాలా మట్టుకు మానవత్వం గుబాళించేవీ, కనులు చెమ్మగిల్లజేసేవీ. ఐతే కథనం మాత్రం పకడ్బందీగా ఉండదు. ఎవరో టీవీ సీరియల్ తీస్తుంటే కథను క్లుప్తంగా వివరించినట్టుంటుంది. ఆ విషయమే నాకు నచ్చలేదు. ఎంతైనా నాకు నచ్చీ, నాతో కొనిపించిన మొదటిపుస్తకమంత బాగా రాలేదు. బ్నిం పుస్తకాలు ఇంతకు ముందు చదవకపోతే ఒకసారి కొనుక్కోండి. వెల 70/-

4) అడవి పాడింది : ఆ మధ్య మనకు చక్కని సూఫీఅనువాదాలు, కన్నడ తత్వాలకు అనువాదాలు "మాటన్నది జ్యోతిర్లింగం" అందించిన దీవి సుబ్బారావు గారి రచన. చిన్నచిన్న పిట్టకథలు. చదువుతుంటే కాసేపు "చికెన్ సూప్ ఫర్ ద తెలుగు సోల్" చదువుతున్నట్టూ, కాసేపు తాతగారితో కబుర్లు చెబుతున్నట్టూ ఉంటుంది. కొన్నేమో పుక్కిటి పురాణాలు, కొన్ని యధార్త ఘటనలు, కొన్ని జెన్ కథలు..అన్నీ కలగా పులగంగా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. చాలామందికి నచ్చవచ్చు. పుస్తకాలకొట్టులో రెండు మూడు పేజీలు తిరగేసి నచ్చితే కొనుక్కోండి. వెల 60/-

5) బంజార : ఇక్బాల్ చంద్: ఇక్బాల్ చంద్ నిస్సందేహంగా బలమైన కవి. ఈ పుస్తకం గురించి వీలైతే పుస్తకం.నెట్లో వ్యాసం రాయాలని ప్లాను. అప్పటిదాకా వేచి చూడండి. :-)

No comments:

Post a Comment