Thursday, March 04, 2010

బాలమురళీకృష్ణ - భీంసేంజోషి జుగల్బంది

చాన్నాళ్ళ క్రింద హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సంగీతోత్సవాలు జరిగాయి. కర్నాటక, హిందుస్తానీ సంప్రదాయాల్లో మహామహులు వచ్చి కచేరీలు చేశారు. బాలమురళి, భీంసేన్ జోషి, బిస్మిల్లా ఖాన్ లాంటి వారు. దురదృష్టమేమంటే నేనప్పుడు హైదరాబాదులో లేను. ఒకరోజు బాలమురళీకృష్ణ, భింసేన్ జోషి జుగల్‌బంది చేశారుట. అది ప్రత్యక్షంగా విని ఆనందించిన నా స్నేహితుడు ఎన్ని సార్లు వర్ణించాడో ఆ కచేరీని. నాకెలాగూ వినే అవకాశం లేదనో, మరి ఉడికించాలనో మేము కలిసినపుడెపుడైనా సంగీత చర్చ వస్తే తప్పక చెప్తుండేవాడు. విన్నాకొద్దీ ఎలాగైనా ఆ కచేరీ ఆడియో విని తీరాలనిపించేలా.

చాన్నాళ్ళకు యూట్యూబ్ వచ్చింది. ఎవరో సంగీత ప్రియుడు ఆ జుగల్బందీ వీడియోను యూట్యూబ్లో పెట్టడంతో అందరికీ చూసే భాగ్యం కలిగింది. నిజం చెప్పాలంటె నా స్నేహితుడు చెప్పింది నిజమే. ఇద్దరు గంధర్వులు గానం చేయగా విని వాడికేదో అలౌకికానుభూతి కలిగుంటుంది. పదే పదే చెప్పాడంటే వాడి తప్పేమీ లేదు పాపం.

ఆ వీడియోలకు లింకు ఇక్కడ..

1) యమన్(హిందుస్తాని) - కళ్యాణి (కర్ణాటక)


2) మాల్కౌన్స్ (హిందోళం) - తరానా (థిల్లాన)


అన్నీ పది-ఐదు నిమిషాల క్లిప్పింగులు. మొన్నీ మధ్య స్నేహితుడితో కోఠీలో సంగీతం దుకాణానికి వెళ్తూ హిందుస్తానీ షెల్ఫులు చూస్తుంటే ఉన్నట్టుండి కనబడింది సీడీ.

"ఎటర్నల్ జుగల్బందీ" BMG Sony music వాళ్ళ ఎం.పీ.3 సీడీలు. రెండు వాల్యూంస్. ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న నిధి కంట బడితే ఆనందం ఎలా ఉంటుందో తెలుసుగా :)

మొదటి వాల్యూంలో భైరవ్(మాయమాళవగౌళ), రెండో వాల్యూంలో దర్బారి కానడ, హిందోళం ఉన్నాయి.
సోనీ వాళ్ళు సీడీలు బానే ఉన్నా నావి రెండు చిన్న కంప్లైంట్లు.
1) మొదటి సీడీలో జుగల్బందీ అని చెప్పి జాకీర్ హుస్సేన్-షివ్ కుమార్ శర్మ సీడీ ఏందుకు ఇంక్లూడ్ చేశారో తెలీదు. కానీ అదే సీడీలో మాయమాళవ(హిందుస్తానీ భైరవ్) జుగల్బందీ ఉంది. సో, కొనక తప్పదు :)
2) ఈ mp3 సీడీల కంటే ఆడియో ఫార్మాట్ (.wav ఫైల్) రెలీజ్ చేస్తే బాగుండేది.


అట్టే ఆలస్యం చేయక వెళ్ళి కొనుక్కోండి.

9 comments:

 1. సంతోషం.
  రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా Unity in diversity కేంపేనోటి జరిగింది దేసమంతటా. దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముఖ్య నగరాల్లో ఈ జుగల్బందీ కచేరీలు నిర్వ్హించారు. మొదటిది ముంబాయిలో జరిగినట్టు గుర్తు. అక్కణ్ణించి నిర్వాహకులకీ ప్రేక్షకులకీ కూడా దీని రుచి మరిగి, అడపాదడపా జరుగుతూ వచ్చాయివి.
  హిందుస్తానీ కర్నాటక గాత్ర జుగల్బందీలో బాలమురళీకి భీంసేన్‌కీ మంచి పరస్పర అవగాహన ఉంది. ఎవరి పద్ధతిని వాళ్ళు రాజీ పడకుండానే ఒక సంపూర్ణమైన కృతి విన్న అనుభూతి కలిగించేవారు.
  మీరు క్రిష్ణ అని రాయడం ఏం బాగా లేదు.
  ఈ పెద్ద రికార్డు కంపెనీల్లో రికార్డు ప్రొడ్యూసర్లకి శాస్త్రీయ సంగీతం ఏమీ తెలియదండీ. దేన్ని దేనితో కలిపి రిలీజ్ చెయ్యాలో, చెయ్యకూడదో. ఇటీవల చెన్నై నించి వస్తున్న చర్-సుర్ వాళ్ళకి ఈ అవగాహన బాగా ఉంది.

  ReplyDelete
 2. ElOkaMlO uMDi raaSaanO..porapaaTu sarididdaanu. cheppinaMduku kRtaj~natalu.

  ReplyDelete
 3. అదృష్టమేమిటంటే అప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నానోచ్! అంతే కాదు ఆ ముందో తర్వాతో జాకీర్ హుస్సేన్ కూడా పీపుల్స్ ప్లాజా లో కచేరీ చేశాడు.అప్పుడు కూడా ఉన్నాను.

  దురదృష్టమేమిటంటే జీవితంలో ఒక్కసారి కూడా బిస్మిల్లా ఖాన్ ని చూడలేకపోవడం.

  యూ ట్యూబులో సంగతి తెలీదు కానీ వీరిద్దరి జుగల్బందీ నా దగ్గర ఆడియో కాసెట్ ఉంది.అంటే అది హైద్రాబాదులో జరిగింది కాదు. (ఉండాలి.ఎవరికైనా ఇచ్చానేమో చూడాలి)

  ReplyDelete
 4. వీరిద్దరూ కలిసి శివాజీ పార్క్ లో 1991 లో చేసిన కచేరి ఐట్యూన్స్ షాప్ లో ఉంది. నా దగ్గర ఆడియో సిడి మంచి రిప్ చేసిన క్వాలిటీ ఉంది. కావాలంటే చెప్పండి.
  నాకెందుకో "రుద్రవీణ" సినిమాలో "లలిత ప్రియ కమలం" వింటుంటే ,వీరి జుగల్బందీ "మాయమాళవ" గుర్తొస్తుంది ...ఎందుకో?

  ReplyDelete
 5. నెనర్లు బుడుగు గారు. two maestros in symphony

  ReplyDelete
 6. ప్రవీణ్ గారు, లలితప్రియకమలం నాకు తెలిసీ మాయమాళవగౌళ కాదండీ. మరెవరైనా పండితుణ్ణి అడగాలి. అదే సినిమాలో తులసీ దళములతో పాట మాయమాళవగౌళ రాగం. మీ దగ్గిర యమన్-కళ్యాణి ఉంటె చెప్పండి. మిగిలినవి ఉన్నాయి. అడ్వాన్సుడు థాంక్సు :-)

  ReplyDelete
 7. లలితప్రియకమలం,'లలిత' రాగం లో స్వరపర్చబడినది.

  లలిత రాగం ఆలాపన ఇక్కడ వినచ్చు

  http://www.youtube.com/watch?v=fdw5v5wJYeM

  ReplyDelete
 8. "తులసీ దళములచే" --మాయా మాళవ గౌళ రాగం! కానీ లలిత, మాయా మాళవ గౌళ రాగాలలో ఒకటే ఛాయలు కదలాడతాయి అప్పుడప్పుడు!

  ReplyDelete