Wednesday, September 09, 2009

రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్

యిమూ ఝాంగ్ అనగానే ప్రపంచసినిమాలో ఆసక్తి ఉన్న ప్రతివారికీ గుర్తొచ్చేది "హీరో" సినిమా. ఇంకా house of flying daggers సినిమా. కేవలం యాక్షన్ సినిమాలే తీస్తాడేమో అన్న భ్రమలను పటాపంచలు చేస్తాడీ సినిమాతో. స్థూలంగా కథనానికి వస్తే :
జపానీయులైన తకత, కెనిచి తండ్రీ కొడుకులు. కెనిచి వాళ్ళమ్మ మరణంతో ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి ఒకరినొకరు కలుసుకోకుండా విడిపోతారు. చాన్నాళ్ళకు కెనిచికి ఒంట్లో బాలేదని తెలిసి తకత జపాన్ వస్తాడు. కానీ కెనిచి తండ్రిని చూడడానికి నిరాకరించేసరికి తకత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కెనిచి భార్య తను నిర్మించిన డాక్యుమెంటరీ ఒకటి తకత కి కానుకగ ఇస్తుంది.
ఊరెళ్ళిన తకత ఆ డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో కెనిచి ఒక చైనీయ జానపదనృత్యాన్ని చిత్రీకరిస్తూ, ఆరోజు లీడ్ సింగర్ గొంతు బాలేకపోవడంతో అతని గానమొక్కటి రికార్డు చేయలేకపోతాడు. ఇంతలో కెనిచి కి లివర్ కాన్సర్ అని తెలుస్తుంది తకత కి. కొడుకు కోసం తకత చైనా వెళ్ళి ఆ డాక్యుమెంటరీ షూట్ చేసి తీసుకువద్దామనుకుంటాడు. దాంతో మొదలవుతుంది తకత పయనం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ లీడ్ సింగర్ జైల్లో పడ్డం, అదికారుల కాళ్ళా వేళ్ళా పడి పర్మిషన్ సంపాదించి జైలుకి వెళ్తే ఆ రోజు ఎక్కడో పుట్టిన కొడుకును తలచుకొని లీడ్ సింగర్ పాడలేకపోతాడు. ఇలాకాదని తకత వాళ్ళ కొడుకు యాంగ్‌యాంగ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఊరివాళ్ళనొప్పించి తనని తీసుకువస్తుంటే దార్లో వాళ్ళిద్దరూ తప్పిపోయి ఒక రాత్రంతా కాన్యన్స్‌లో తప్పిపోతారు. ఆ రాత్రీ, మొత్తం ఈ ప్రయాణంలో తకత తన గురించి, కొడుకు గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి ఆ డాక్యుమెంటరీ చివరికి షూట్ చేయగలిగాడా? కెనిచి కి ఏమవుతుందీ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోండి.
సినిమాలో ఆకట్టుకొనేవి రెండు విషయాలు. విజువల్స్. యిమూ ఝాంగ్ సినిమాల్న్నీ దృశ్యకావ్యాలే (మన సంజయ్ లీలా భన్సాలి గుర్తొస్తారు. ప్రతీ ఫ్రేం విజువల్ రిచ్‌నెస్‌టో ఉట్టిపడుతుంది). ఇక రెండవది, ముఖ్యమయింది ఒక బాధని సినిమాలోకి అనువదించడం. దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించలేకపోతే చిత్రం తేలిపోయేది. ప్రతీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దారు. జీవితమే ఒక వేయిమైళ్ళ పయనం. పంతాలకు పట్టింపులకుపోయి దాన్ని ఒంటరి పయనంగా మార్చుకుంటే ఎడతెగని పయనమవుతుంది. బోలెడు బంధాలు ప్రేమలు, బ్రేకప్పులు, మేకప్పులతో సందోహంతో గడిపితే కలగా మిగులుతుంది. మంచి కళ రసికున్ని వేరే time and space లోకి transcend చేస్తుందంటారు. ఈ సినిమా ముమ్మాటికీ అదేపని చేస్తుంది.మీకు కాస్త నిదానంగా నడిచే మీనింగ్‌ఫుల్ సినిమాలు చూడ్డంలో అట్టే అభ్యంతరం లేకపోతే తప్పక చూడొచ్చు.

ఈ సినిమా చూశాక నాకు ఇస్మాయిల్ కవితొకటి గుర్తొచ్చింది. కవిత ఇక్కడ.
===
రికార్డు (ఇస్మాయిల్ విరచితం)

తిరిగి తిరిగిరికార్డుపాట అంచున ఆగుతుంది.
ఇప్పుడు దీని కర్తెవరో చదివి తెలిసికోవచ్చు.
జీవితం ఆగినా కర్త పేరు తెలీదు.

రికార్డుకు మల్లే దీన్ని మళ్ళీ వేయలేం.
వేసినా మొదటిలా ఉండదేమో.
కవిత్వం లాగే
మరో మారు చదివితే మొదటిలా ఉండదే.
కన్యాత్వం పోతుంది.

సాఫీగా సాగే రికార్డు ఆయుష్షు మూడు నిమిషాలు.
గాడి పడితే అనంతం.
బాధ - జీవితానికి గాడి.
=====

4 comments:

  1. ఒక మంచి సినిమా ను పరిచయం చేసారు . ధన్యవాదాలు. మీరు ఇదే వ్యాసమని www.navatarangam.com లో పెడితే నాలాంటి వాళ్ళు ఇంకా చాల మంది చూడవచ్చు.

    మీకు నవతరంగం తెలియదని నేను అనుకోను . ఏదో అనిపించి తెలిపాను.

    ReplyDelete
  2. ok... let me watch it... :)

    I hardly agree if you say 'Hero' and 'House of Flying daggers' are action movies. The second one is a beautiful love story while the prior one is a multi-perspective mind game.

    ReplyDelete
  3. బృహస్పతి గారు, మీరన్నది నిజమే. అవి కేవలం యాక్షన్ సినిమాలు కాదు. multi-genre సినిమాలనొచ్చేమో. నా మట్టుకు, house of flying daggersలొ యాక్షన్ సన్నివేశాలు తీసేస్తే సినిమా అంత గొప్పగా ఏమీ లేదు. ఆల్మోస్ట్ నాసిరకం బాలీవుడ్ సినిమా తయారవుతుంది.

    ఇక హీరో సినిమాకి వస్తే that is one of my top 5 fav.films నేనెక్కువ విమర్శించలేను :) కాని అందులో యిమూ ఝాంగ్ సిగ్నేచర్ multiple point of views కన్నా యాక్షన్ సీనలలోనే కనిపిస్తుందని నా అభిప్రాయం. multiple POVs కి ఆద్యుడు కురసవా అనుకుంటా.

    క్రాంతి గారు : ఈ మధ్యే బ్లాగులు రాస్తున్నాను. ఇప్పటివరకు కేవలం కూడలి చూస్తున్నాను. నవతరంగం ఇవ్వాళే చూశాను.

    ReplyDelete
  4. నిజమే, multiple POVs కి ఆద్యుడు కురసవానే ఆద్యుడని నేను విశ్వసిస్తా... ఆయన సినిమాలనుంచి స్ఫూర్తి పొంది ఇప్పటికీ మంచి కళాత్మక చిత్రాలు వస్తున్నాయి.

    ReplyDelete