Thursday, January 28, 2010

తిమ్మరుసు పుస్తకం

టైటిల్ చూసి మంచి పుస్తకం ఆనవాలు దొరికిందనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.

గుమ్మడిగారు పోయారని ఈటీవీలో "మహామంత్రి తిమ్మరుసు" సినిమా వేస్తున్నారు. ఈ సినిమా చూస్తోంటే మనసు అలా వలయాల్లోకి వెళ్ళి ఎక్కడో ఒక చిన్నప్పటి ఆదివారం మధ్యాహ్నం దగ్గర ఆగిపోయింది. ఏడెనిమిదేళ్ళ వయసప్పుడనుకుంటా. ఒకరోజు అమ్మతో పాటు ఎవరో తెలిసినవాళ్ళింటికి వెళ్ళాను. వెళ్ళిన ఇంటావిడ గర్ల్స్ హైస్కూల్లో హిందీ టీచరు. వాళ్ళింట్లో పిల్లలెవరూ ఉండరు. ఆవిడ వాళ్ళబ్బాయి ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ఏ పదో తరగతో పధ్నాలుగో తరగతో చదివేవాడు. నేను ససేమీరా వెంటరానని మారాం చేస్తే ఒక అరగంట పని చూసుకొని తిరిగి వచ్చేయాలని ఒప్పందం కుదుర్చుకుని వెంటతీసుకొని పోయింది అమ్మ. తీరా అక్కడికి వెళ్ళాక తేలిందేమంటే ఆవిడ పాపం అమ్మనెక్కడికో తోడుకు తీసుకెళ్ళాలని పిలిచాలట. నేనక్కడ అనవసరంగా ఉన్నానని అర్థమయ్యింది.వాళ్ళ వెంట వెళ్ళడానికి లేకా, ఇంటికి వెళ్ళడానికి లేకా నేనక్కడ ఇరుక్కున్నాను. నా ఆదివారం మధ్యాహ్నం అలా చట్టుబండలైనందుకు అమ్మ మీద కోపంతో గుర్రుగా చూస్తున్నాను. పాపం అమ్మ ఎలాగో ఊరడించి, ఎవేవో వాగ్దానాలు చేసి ఏదైనా కథల పుస్తకం చదువుతూ కూర్చో అని ఆవిడని అడిగారు. ఏవైనా ఉన్నాయా అని? వాళ్ళింట్లో బోల్డన్ని హిందీ పుస్తకాలున్నాయి. నాకింకా హిందీ అ, ఆ లు మాత్రమే వచ్చు. నీరసపడిపోయి వెతుకుతూ ఉంటే వాళ్ళబ్బాయి తెలుగు ఉపవాచకమొక్కటి కనిపించింది. అప్పాజీయో తిమ్మరుసో టైటిల్ సరిగా గుర్తు లేదు. సరే ఏదో ఒకటి అని చదువుతూ కూర్చున్నాను. ఎంత అద్భుతమైన పుస్తకమది. అసలు నాకు టైమూ అవీ గుర్తుంటేగా.. అలాగే చదువుతూ వాళ్ళింట్లో ఉండిపోయాను. రెండు గంటనుకున్న వాళ్ళ పని నాలుగ్గంటలయ్యింది. వాళ్ళబ్బాయి ఏదో పరీక్షకు చదువుతూ నన్ను పట్టించుకోలేదు. నేను తనని పట్టించుకోలేదు. బోల్డంత సమయం గడిచాక అయ్యో ఆలస్యమయిందంటూ కంగారు పడుతూ అమ్మ వచ్చేసింది. కంప్లైంట్లు లేవు అలకల్లేవూ. (మరి నేను విజయనగరసామ్రాజ్యంలో ఉన్నా కదా) ఇంటికి వెళ్తుంటే విచారంగా ఉన్న నన్ను చూసి చెబుతోంది అమ్మ. అనుకోకుండా ఆలస్యమైందిరా సారీ అని. నేనింకా తిమ్మరుసు ముగింపునుంది కోలుకోలేక పాపం, అప్పాజీ కళ్ళు పొడిచేయడం తప్పుకదమ్మా అని బాధపడుతూ అడిగాను. విషయం గ్రహించి చిన్నగా నవ్వుకుంటూ సందేహనివృత్తి చేసింది అమ్మ.

వలయాలు మళ్ళీ వెనక్కి తిప్పితే... కాస్త పెద్దయ్యాక ఆ పుస్తకం కోసం ఎంతో వెతికాను. అది ఒక తెలుగు ఉపవాచకం పుస్తకమని తెలుసు కానీ కనీసం ఏ తరగతి ఉపవాచకమో కూడా తెలీదు. రచయిత అంతకన్నా తెలీదు. ఎవరికైనా నేను ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నానో తెలిస్తే కాస్త చెబుదురూ...ప్లీజ్.

4 comments:

 1. అది తొమ్మిదో తరగతి ఉపవాచకమనుకుంటానండి. పుస్తకము పేరు అప్పాజీ.

  ReplyDelete
 2. Thanks suresh garu. thats a good starting point. Now, I will try if I can find that book somewhere.

  ReplyDelete
 3. సురేష్ గారు చెప్పింది నిజం. 1980 కి ముందు. 80 లోనో 85లోనో వాచకాలు మారినై. ఇదొహటీ, ఎనిమిదో తరగతి ఉపవాచకం విశ్వనాథనాయకుడు ఒహటీ చాలా గొప్పగా రాశారు.

  ReplyDelete
 4. అది తొమ్మిదో తరగతి ఉపవాచకం .. మా అక్కల కాలం నాటిది మా ఇంట్లో ఉండేది... నేను చదివాను... ఏడు తరవాత ప్రతి సంవత్సరం ఒక ఉపవాచకం ఉండేది మనకి... విశ్వనాథ నాయకుడు ఒకటి నెహ్రు గారిది ఒకటి అనుకుంటా ....

  ReplyDelete