Sunday, December 13, 2009

వాద్య - సాజ్ - మ్యూజిక్ టుడే రీ-ప్యాక్స్

ఈ కాలం గుడికి వెళ్తే దేవుడి కన్నా ముందు దర్శించాల్సింది చెప్పుల స్టాండుని. మొన్నీ మధ్య గుడికి వెళ్ళి చెప్పుల స్టాండు దగ్గరకు వెళ్ళగానే పొందికగా పెట్టి కనిపించాయి ఆ అల్బంస్. మ్యూజిక్ టుడే వాళ్ళు శాస్త్రీయ కళాకారులతో రికార్డ్ చేసి రిలీజ్ చేసే మేస్ట్రో సిరీస్ సీడీలు. పెళ్ళికూతురిలా అలంకరించుకొని మాంచి బైండింగ్ వర్కుతో అట్టహాసంగా ఉంది. ఒకటి కర్నాటక సంగీత వాద్యకారుల కలెక్షను. పేరు - వాద్య. టీ.ఎన్.క్రిష్ణన్ వాయులీనం, కదిరి సాక్సోఫోన్, మాందలిన్ శ్రీనివాసు, చిత్రవీణ రవికిరణ్, ఎన్.రమణి ఫ్లూట్ ఇంకో మూడు నాకట్టే తెలీని ఆర్టిస్టులు.మొత్తం ఎనిమిది సీడీల కలెక్షన్. ఒకసారి వావ్ అనుకొని ధర చూస్తే ఎం.ఆర్.పి. రెండు వేల రూపాయలు. శాస్త్రీయ సంగీతంలో ఓ అంటే నా రాదు నీకింత అవసరమా అని నాలో డెవిల్, ఇది కొనకుంటే పర్లేదు కానీ మళ్ళీ ఎవరితోనైన కర్నాటక సంగీతం అంటూ మాట్లాడితే చంపేస్తాను అని ఏంజిలు రెండు వైపులా లాగుతున్నారు (ఏంజిల్స్ కూడా చంపుతారా?) . చులాగ్గా నవ్వుతూ వచ్చాడు సేల్స్‌మన్ (బుట్టలో పడిందిరా పిట్ట అనుకుంటూ..). నేను ఏదో క్యాజువల్గా ఉన్నట్టు నటిస్తున్నా కానీ పప్పులేం ఉడకట్లేదు. అది చూడగానే కళ్ళు వెలిగిపోవడం దూరంగా కూర్చొని చూసాడు కాబోలు.

ఏంటివి? చెప్పులస్టాండు దగ్గర?
క్లాసికల్ మ్యూజిక్ సీడీలు సిర్. బాగుంటాయి.
ఓహో.
ఇండియా టుడే వాళ్ళవి సార్. చాలా బాగుంటాయి. ఇప్పటికే బోలెడు డాక్టర్లు, ఎజుకేటెడ్ పీపుల్ కొనుక్కెళ్ళారు. (ఐతే ఏంటటా..?) డిస్కౌంట్ సేల్ కింద 2000 రూపీస్ వి 500 కి అమ్ముతున్నాం.
(..ఏంటీ?? మళ్ళీ చెప్పు....)
ఫైవ్ హండ్రెడా? బయట కొంటే ఒక్కోటి 250 ఉంటయి సార్. ఎం.ఆర్.పి చూడండి. (తెలుసు లేవో..)

కొందామని ఎలాగూ డిసైడ్ అయ్యాను కానీ ఆ చెప్పుల స్టాండు వాతావరణం వాడి వాలకం చూస్తుంటే కొంపతీసి డుప్లికేట్ సీడీలో ఖాళీ సీడీలో అమ్మట్లేదు కదా అని అనుమానం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి కంఫాం చేసుకొని కొనుక్కున్నా. ఆఫ్కోర్స్, నా కంఫైర్మేషన్ ఇంటికొచ్చాక రీ కంఫాం అయ్యింది.

విషయమేంటంటే డిరెక్ట్ మార్కెటర్స్ వాళ్ళు ఇలా మ్యూజిక్ టుడే వాళ్ళ పాత సరుకును తీసుకొని అందంగా ముస్తాబు చేసి మళ్ళీ అమ్ముతున్నారు.

సేల్ మొత్తమయ్యాక నిదానంగా హిందుస్తానీ సిరీస్ తీసి చూపించాడు. పేరు - సాజ్. అందులో ఐతే ఆర్టిస్టులు నాకు తెలిసినవాళ్ళే. గొప్ప గొప్ప పేర్లు. జాకీర్ హుస్సేన్ తబ్ల, రవిశంకర్ సితార్, అంజాద్ అలి ఖాన్ సరోద్, రాం నారాయణ్ సారంగి. అబ్బో. ఇది ఇంకా బాగుంది. పదహారు సీడీలు. 1200/- సేల్ ధర. మా తబ్లా సార్ పుణ్యమా అని ఈ మధ్య హిందుస్తానీ కూడా వింతున్నాను. అదీ కొందామనిపించింది కానీ అందులో ఆరు నా పర్సనల్ కలెక్షన్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కొక్కటీ అమ్మం సార్ అని శుభ్రంగా చెప్పాడు. సర్లే అని లైట్ తీసుకొని వచ్చేశా.

ఇదంతా అయిన వారం రోజులకు మొన్న మా సారు క్లాసులో, "నా దగ్గిర కొన్ని సీడీలు ఉన్నాయి. ఆ కంప్యూటర్లూ అవీ నాకు సరిగా తెలీవు. మా అబ్బాయి కొనిచ్చిన కొత్త ఐ-పాడ్ లో ఆ సీడీలు కాపీ చేసి ఇస్తావా" అని అడిగారు. "నో ప్రాబ్లం సార్" అని ఒప్పేసుకున్నా.
ఇవాళ క్లాసుకెళ్ళి చూద్దును కదా, సార్ దగ్గిర ఉన్నాయి రెండు కలెక్షన్స్. నేనారోజు కొనకుండా వదిలేసిన "సాజ్" కలెక్సన్, అలాంటిదే మ్యూజిక్టుడే వాళ్ళది మరో పదహారు సీడీల కలెక్షను.

హహ్హాహ్హా..అప్పుడు తెలిసొచ్చింది తంతే పొయి గార్ల బుట్టలో పడ్డమంటే ఏంటో.

2 comments:

  1. మరదే అద్రుష్టమంటే. అద్రుష్టవంతుణ్ణి చెడిపే వాడు లేడు, దురద్రుష్టవంతుణ్ణి బాగుచేసేవాడు లేడు.

    ReplyDelete