Monday, December 21, 2009

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్‌కు జనరల్‌గా రెండు ట్రిప్పులేస్తాను. ఓసారి తెలుగు పుస్తకాలు కొనుక్కోడానికీ, ఓసారి ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోడానికి. ఈ టపాలో పిల్లలపుస్తకాలగురించి నా అనుభవాలు రాస్తాను. నాక్కావలసింది, ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి తెలుగు పుస్తకాలు.
ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి చదవడమే రాదు వాళ్ళకి పుస్తకాలేమిటా అని అడక్కండి. ఆరునెల్ల వయసునుండే మనం పిల్లలకి పుస్తకాలు చదివి వినిపించొచ్చు. మొదట మనం పేజీకి ఒకే బొమ్మ ఉండే ఆపిల్, ఆరెంజ్ లాంటి పుస్తకాలతో ప్రారంభించాలి. ఒక్కొక్క పదం రిపీట్ చేస్తూ ఎంత నెమ్మదిగా చదివించినా పదినిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. ఆ తరువాత ఒక పేజీలో ఏదైనా ఆక్టివిటీ ఉండే పుస్తకాలు చదవడం మొదలెట్టాలి. (ఉదాహరణకి తోటమాలి మొక్కలకి నీళ్ళు పోయడం), 3-6 ఆరు నెలల్లో పిల్లలూ ఆ స్థాయి దాటేస్తారు. అప్పుడు మనం కాస్త కామిక్స్, అమర్ చిత్ర కథలాంటివి చదవొచ్చు వాళ్ళకి. ఇవన్నీ ఇంత సాధికారికంగా చెప్పడానికి నాకేమీ సైకాలజీ డిగ్రీల్లేవూ అలా అని నేను కనీసం పేరెంట్ ని కూడా కాదు. కాని అక్క/అన్నల పిల్లల మీద ఈపాటికే ప్రయోగాలు చేసి కరెష్టే అని తీర్మానించుకున్నాను.

మా ఇంట్లో ఓ మూడేళ్ళ బు(పి)డుగు. వాడికి టీవీ అట్టే చూపించొద్దని చాలా చిన్నప్పుడే వాళ్ళమ్మా నాన్న డిసైడ్ చేయడంతో దాంట్లో వాడికి పెద్ద అభిరుచి లేదు. వాడికి ఏడాది/ఏడాదిన్నర వయసున్నప్పుడు బొమ్మల కథలున్న పుస్తకాలు ముందేసి వాడికి చెబుతుంటే వాడి తిండి తినే ప్రసహనం గంటన్నర నుండి సగానికి కుదించవచ్చని, పాలు తాగే ప్రసహనం ముప్ఫై నుండి పది నిమిషాలకు కుదించవచని ఒక దేవరహస్యం తెలిసింది. ఇక అప్పుడు మొదలయ్యింది పిల్లలపుస్తకాల వేట. ఇక్కడ వాడి వయసు 1.5-3 కి మధ్య కాబట్టి వాడు స్వతహాగ చదవలేడు. అలాగే ఒక పేజీలో రెండు కంటే మించి బొమ్మలుంటే వాడికి నచ్చదు. మరి అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

విశాలాంధ్రలో/నవోదయల్లో చూడ్డం శుద్ధ దండగ. అక్కడ పిల్లల పుస్తకాలు 2-5% ఉంటాయి. అవీ తమంతట తామే తెలుగు చదువుకోగలిగే పిల్లల కోసం. ఇక Walden/AA Hussain వంటి ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో బోల్డు దేశీయ ప్రచురణలుంటాయి. అవన్ని misguided missiles లాగా ఉంటాయి. అసలు పిల్లల అభిరుచి గురించి వాళ్ళకి కాస్తైన జ్ఞానం ఉన్నట్టనిపించదు. ఒక టెక్ ఉపమానం ఇవాలంటే, బోల్డు ఇన్‌ఫర్మేషన్ పెట్టుకొని యూజర్ ఇంటర్ఫేస్ సరిగా లేని వెబ్‌సైట్లలా ఉంటాయి. ముందే చెప్పినట్టు అంత చిన్న పిల్లలకి ఒక పేజీలో ఒకటికన్నా ఎక్కువ బొమ్మలుండడం నచ్చదు. వాళ్ళ దృష్టి పరిపరి విధాలుగా పోతుంది. చివరికి నాకు దొరికినవి విదేశీ ప్రచురణలు. చక్కటి పిల్లల పుస్తకాలుంటాయి ఇంగ్లీషులో. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకొనే కార్టూన్ కారక్టర్స్ గట్రా. కానీ వీటితో ఒక పెద్ద చిక్కుంది. ఒకటి - అవి ఇంగ్లీషులో ఉంటాయి. అదేం పెద్ద కష్టం కాదు, కథ పూర్తిగా మనం చదివేసి వాళ్ళకి తెలుగులో చెబితే సరిపోతుందనుకుంటే, అవి చెప్పే కథలు కూడా ఏ డిస్నీ కారక్టర్సో, ఫెయిరీ ప్రిన్సెస్‌ల గురించో ఉంటాయి. పేర్లు కూడా జాన్, టాం బార్బీ ఇవి. మాటలు నేర్చుకునే వయసులో వాళ్ళకు వాళ్ళ చుట్టూ ఉన్న పేర్లు కాక వేరే అరువు పేర్లు వినిపించడం ఎంత సబబు? మనకు బోల్డన్ని పంచతంత్రాలు, రామాయణ భాగవతాలుండగా మనకూ తెలియని, మనం రిలేట్ చేసుకోలేని డిస్నీ కథలెందుకు చెప్పాలి?

ఇలాంటి సమయంలో నాకు 2007 బుక్ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ బెంగళూరు వాళ్ళ స్టాలు కనిపించింది. చిల్డ్రన్స్ బుక్ ట్రస్టు వాళ్ళు చక్కగా మన భారతీయ నేటివిటీ ఉన్న కథలు పేజీకొక బొమ్మ/ ఆక్టివిటీ ఇలస్ట్రేషన్లతో ఒకే లైన్ టెక్స్ట్ తో కొన్ని పుస్తకాలు ముద్రించారు. పోలోమని బోల్డు కొనేసుకున్నా.. అందులో ఉదాహరణకి ఒక కథ చెబుతాను. ఒక చిన్న పక్షి ఉంటుంది. ఓ రోజు నోట్లో గింజ పెట్టుకొని తింటుంటే గింజ కాస్త పడి మట్టిలో కూరుకుపోతుంది. ఆ పక్షి రోజూ అక్కడికి వచ్చి వెతుకుతుంటే ఓ రోజు అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. ఇలా... ఇంకొన్ని సబ్జెక్ట్స్, మీతా అండ్ హర్ మాజిక్ షూస్, మోహినీ భస్మాసుర, దీపావళి పండగ( మావాడికి ఇదెంత ఇష్టమో) etc... ఇవి ఇంగ్లీషులోనే ఉన్నా మన నేటివిటీకి దగ్గరగా ఉండి కొంతలో కొంత మేలనిపించాయి. అదే ఏడు తార్నాక నుండి ప్రచురితమయ్యే "మంచిపుస్తకం" ప్రచురణలు కూడా చూశాను. కానీ వాళ్ళవి ఇంకా బాల్యదశలోనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పిల్లల్ని ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. అలాగే ముట్టుకుంటే చిరిగిపోయేట్టు. ఆ వయసు పిల్లలనుండి మనం డెలికేట్ హాండ్లింగ్ ఆశిచంలేం కదా. 2008లో కూడా సేం స్టోరీ. తెలుగులో సరైన పుస్తకాలు లేవు. పిల్లల పుస్త్కాల్లో పేజీలు కాస్త మందంగా, త్వరగా చినిగిపోకండా ఉండాలి. CBT వాళ్ళూ, మంచిపుస్తకం వాళ్ళూ ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కాని రెండు కారణాల వల్ల దీన్ని క్షమించేయవచ్చు. 1) పిల్లలు ఒక కథని మహా అంటే రెణ్ణేల్లకు మించి చదవరు. అప్పటికి వారికది కంఠతా రావడమయి ఆ పుస్తకంతో పనిలేకుండా పోతుంది. పుస్తకం జీర్ణమైనా పెద్ద నష్టమేమీ ఉండదు. 2) దళసరి అట్టలు పెట్టి ముద్రిస్తే పుస్తకం ధర పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పుస్తకాల ధర్ ఇరవయి రూపాయలు. ఈ రోజుల్లో ఇది కారు చవక ధరంటాను. కాదంటారా? ప్రతీ సంవత్సరం నేను స్టాల్ ఓనర్లతో నేరుగా మాట్లాడి వాళ్ళకి ఫీడ్‌బాక్ ఇచ్చాను. అదీ పూర్వరంగం.

ఈ సంవత్సరం 2009 ఫెస్టివల్లో తిరుగుతూ తిరుగుతూ "మంచిపుస్తకం" వాళ్ళ స్టాల్‌కి వెళ్ళి చూద్దును కదా నేకోరుకున్న పిల్లల పుస్తకాలన్నీ అచ్చ తెలుగులో. ఎంత ఆనందమేసిందో. చక్కని తెలుగులో చిన్న చిన్న పిల్లల పుస్తకాలు. ఒక్కోటీ పది-పదదహారు పేజీల పుస్తకాలు. ధర ఇరవయి రూపాయలతో అందుబాటులోనే ఉంది. ఎడా పెడా కొనేశాను.

అఫ్కోర్స్ మా వాడికి కాదు. వాడు రెండేళ్ళుగా ఇలాంటివి చదివించుకొనీ చదివించుకొనీ వివిధదశలు దాటిపోయాడు. ప్రస్తుతం ఒక మెట్టెక్కి అమర్-చిత్ర కథ సిరీస్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. రామాయణ, భారత భగవతాలు తెగ విని బాగా ముదిరిపోయీ మొన్నీ మధ్యే ప్లేస్కూల్లో టీచర్లపై ఆగ్నేయాస్త్రం వేస్తానని, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే బ్రహాస్త్రం వేసి గదతో కొడతానని బెదిరించాడట. సో మావాడికీ యేడు బొమ్మలు తగ్గిపోయి ఒక్కో పేరాగ్రాఫున్న పుస్తకాలు కొన్నాను. చూడాలి వాడు ఎలా రియాక్టవుతాడో.

మీరు కూడా ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్ కి వెళ్తే రెండు స్టాల్స్ చూడ్డం మరవొద్దు. 1) చిల్డ్రన్స్ బూక్ ట్రస్టు వాళ్ళది 2) మంచిపుస్తకం వాళ్ళదీ. నాకు వీళ్ళతో ఎటువంటీ లావాదేవీలు లేవు సుమీ. పిల్లలు మీవాళ్ళైనా, మీ బంధుమిత్రగణంలో వాళ్ళైనా మనం పదిమందికి పుస్తకాలు బహుమానమిస్తే కనీసం ఒక్కరికి పుస్తకాలు చదివే అలవాటు అబ్బినా అవన్నీ సార్థకమయినట్టే. ఇంకోసారి పిల్లలున్న ఇంటికి వెళ్ళేప్పుడు ఇరవయి రూపాయలు పెట్టి డైరీమిల్క్ చాక్లెట్లు కొనేకన్నా ఇలాంటి పుస్తకమొకటి ఇచ్చి చూడండి.

ఇక నా విష్‌లిస్టులో తరువాతి ఐటం. అమర్‌చిత్రకథ లాంటి సిరీస్‌లు తెలుగులో కావాలి. తెలుగు ప్రచురణకర్తలూ వింటున్నారా?

అలాగే ఈ బుక్‌ఫెస్టివల్ కి నాదో విష్ లిస్టు. ఒక ఎలక్ట్రానికి స్క్రోల్ ఏర్పరచి ఉన్న రేర్/మంచి పుస్తకాల పేర్లు/రచయితలు అవి దొరికే స్టాల్స్ లిస్టు ఇవ్వొచ్చు. అప్పుడు చాలా మందికి ఎక్కువ తిరక్కుండా టీవీ ముందు కూర్చొని పుస్తకాలు కొనేసుకోవచ్చు. ఏమంటారు.

12 comments:

 1. చిన్నప్పటి నుండి మీ బాబుకి, పుస్తకాలని అలవాటు చేయడం అనేది చాలా మంచి విషయం.. అలానే, పుస్తక విక్రేతలకి కూడా విలువైన సూచనలు ఇచ్చి, వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకా బావుంది..

  ReplyDelete
 2. పిల్లల పుస్తకాల కోసమైతే మంచి పుస్తకం వాళ్ళ స్టాలే అందరికీ నచ్చింది. ఇంకోటి చూశారా? వాళ్ళ దగ్గరున్న పుస్తకాల్లో కథ తెలుగు-ఇంగ్లీషు రెంటిలోనూ ఉన్న పుస్తకాలున్నాయి! తెలుగు-ఇంగ్లీష్ రెండూ నేర్చుకుంటున్న మా పాప లాంటి వాళ్లకు భలే నచ్చుతాయి. అందుకే నేనూ అక్కడ కొనేశాను. అందులో కొన్ని పిల్లల కథలు నా కోసం కూడా! నక్క-కుందేలు, పాము కథ ఇలాంటివి చదవడం ఈనాటికీ ఫాంటసీయే నాకు!

  ReplyDelete
 3. చాలా ఉపయోగపడే సమాచారం అందించారు.

  అమర చిత్ర కథ వాళ్లు తెలుగులో కొన్ని పుస్తకాలు వేసారు. అవి నేను వారి site లో చూసాను. ఇప్పుడు చూస్తే కనపడటంలేదు. వారి catalog లో ఇప్పుడే చూసాను, కనీసం మూడు వేల కాపీలు ఆర్డర్ చేస్తే ప్రాంతీయ భాషల్లో అచ్చేస్తారుట...... తెలుగులో ఎవరయినా ఇవి తీసుకొస్తే కొనాలని నేను ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
 4. .” రామాయణ, భారత భగవతాలు తెగ విని బాగా ముదిరిపోయీ మొన్నీ మధ్యే ప్లేస్కూల్లో టీచర్లపై ఆగ్నేయాస్త్రం వేస్తానని, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే బ్రహాస్త్రం వేసి గదతో కొడతానని బెదిరించాడట. సో మావాడికీ యేడు బొమ్మలు తగ్గిపోయి ఒక్కో పేరాగ్రాఫున్న పుస్తకాలు కొన్నాను. చూడాలి వాడు ఎలా రియాక్టవుతాడో”

  హాహాహా. మీ పిల్లడి వయస్సు ఎంత? మీరే బుడుగు అయితే మీ వాడేమిటో?

  ReplyDelete
 5. సంతోషం. మంచి సమాచారం. పిల్లల్ని టీవీకి దూరంగా ఉంచగలగడం నిజంగా అద్భుతం

  ReplyDelete
 6. మీ పోస్ట్ లో నాకు రెండు విషయాలు నచ్చాయి. మొదటిది టి. వి. కి దూరంగా పిల్లల్ని పెంచాలనే తాపత్రయం. రెండోది, ముఖ్యమైనది బుక్ ఫెస్టివల్ గురించి రాయటం. నేను మహా inspire అయిపోయ్యా. ఇవ్వాళ్ళ మధ్యానం కల్లా పోస్ట్ పోస్ట్ తా. మీ అబ్బాయికి గుడ్ లక్. ఇన్ని పుస్తకాలు కొంటున్నారు కదా, మరి బుక్ షెల్ఫ్ కొన్నారా?

  ReplyDelete
 7. @ మేధ గారు, కొత్తపాళీ గారు : థాంక్సు.

  @సుజాత గారు : నేనూ ఓ రెండు ద్విభాషా పుస్తకాలు కొన్నాను. ఇంటికొచ్చి ఇలా తిరగేసి చూద్దును కదా భాష అస్సలు బాలేదు. అదేంటో పిల్లల ఇంగ్లీషు ఎవరుపడితే వాళ్ళు రాయగలరనుకున్నారో ఏంటో. (నేను చెబుతున్న ఉదాహరణ, పడవ ప్రయాణం అన్న illustrations బుక్. రెండో ట్రిప్పులో ఈముక్కా వాళ్ళ చెవిన వేస్తాను. I would like to see a second opinion

  @ హర్ష గారు : మూడు వేల పుస్తకాలు తెలుగులో అమ్ముడుపోవడం కష్టమే. ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా వాళ్ళ పుస్తకాలు జాగర్తగా చదవాలి. ఉదాహరణకి అమర్‌చిత్రకథలో - వృకాసురుడి కథ, సత్యభామ కథ వర్షన్సు తెలుగు వారు చెప్పుకునే కథలకి ఆమడ దూరముంటాయి.

  @కల్పన గారు: నా "బుడుగు" పేరు సరదాకి పెట్టుకున్నది లెండి. మావాడికి ప్రస్తుతం మూడేళ్ళే ఐనా ప్రస్తుతానికైతే పిడుగు :)

  @కిరణ్మయి గారు: ఇపుడప్పుడే లేదండీ. but its on the agenda.

  ReplyDelete
 8. ఇంత మంచి వ్యాసం పుస్తకం.నెట్ లో మీరు ప్రచురించాలంటే మేమేం చెయ్యాలండీ? :)

  అన్నట్టు.. మరో రెండునెలల వ్యవధిలో పుస్తకం.నెట్ లో "బాలసాహిత్యం" పై ఫోకస్ నిర్వహించాలనుకుంటున్నాం. మీరూ ఒక చేయి వేస్తారు కదూ.. అందులో?!

  బుక్ ఫేర్ లో, GROLIER (In-home learning Expert) అని ఒక స్టాల్ ఉంది.. చూశారా? పిల్లలకి ఎలా నేర్పించాలి అన్న దాని మీద ఏవో సి.డీలు ఉన్నాయి. ఒకసారి చూడండి. అదీ కాక, ప్రజాశక్తి వాళ్ళు గిజుభాయ్ పుస్తకాల సంకలనం వేశారు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? విద్యావిధానంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా ఉండాలి? అన్నవాటి మీద పుస్తకాలున్నాయి. చూశారా?

  మంచి వ్యాసం!

  పూర్ణిమ

  ReplyDelete
 9. పూర్ణిమ గారు. థాంక్సండి. నాక్కాస్త బద్దకమెక్కువ. మూడునెలలుగా బ్లాగు రాస్తున్నాను. పుస్తకం.నెట్‌లో ఆర్టికల్స్ చదివినా ఎలాంటివి సబ్‌మిట్ చేయాలో? ఎలా చేయాలో ఇంతవరకు చూడలేదు. ఇది పుస్తకం.నెట్‌లో పబ్లిష్ చేయొచ్చంటే మొదట అక్కడే చేసేవాణ్ణి. ఎక్కువమంది చదివితే నాకూ సంతోషమే కదా.

  ఈ బ్లాగులో టచ్ చేసిన టాపిక్స్ మీద ఇంకొన్ని పాయింట్స్ రాసేవున్నాయి. బాలసాహిత్యం మీద చర్చ వచ్చినప్పుడు అవీ, ఇంకొన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేస్తాను.
  -బు

  ReplyDelete
 10. Ah, there, some one else, who could exactly explain what I have been trying to do about the state of Telugu books.Your feedback is even more significant since you have better access to various book shops and fairs and are interested in the age range I have been advocating about.
  I'm glad to hear praise for a good publishing initiative by "manchi pustakam".
  Amarchitra katha in Telugu - it's something I have been looking for too. I am a little skeptical, though about quality of translation.
  I completely agree with your description about the language (English) in some children's books, and about the books in book stores like Walden. There are quite a few books designed age appropriately there too.
  I totally agree with the effect of mythological stories on kids, which is both amusing and scary at the same time.
  I'm eagerly looking forward to the presenting of all these experiences and more thoughts and discussions on pustakam.net
  Telugu language needs Telugu kids to be attracted to it and Telugu kids need to be drawn to the best that Telugu literature and that only Telugu literature can offer.

  There seems to be quite an effort going on there. So, I can just sit back, relax and benefit by such useful inputs while doing my best on http://www.telugu4kids.com :-)

  ReplyDelete
 11. బుడుగు గారు,
  ఈ ద్విభాషా పుస్తకాలు నేనూ రెండే కొన్నాను. అనుకోకుండా అందులో పడవ ప్రయాణం ఉంది. నేను బుక్ ఫేర్ కి నాలుగైదు సార్లు వెళ్ళాను గానీ మంచి పుస్తకం స్టాలుకు వెళ్ళడానికి తీరిక చిక్కలేదు. అంతా అయ్యాక ఇప్పుడు చదవడం మొదలు పెడితే మీరన్నట్లు అంత గొప్పగా ఏం లేదు. శివమెత్తిన నది, అమ్మ మనసు, నీలం రంగు గొడుగు..ఇవి మంచి వ్యావహారిక తెలుగు భాష తో చక్కగా ఉన్నాయి.

  పూర్ణిమా,
  ఆ GROLIER స్టాలుకు నేను వెళ్ళాను. curriculam బానే ఉంది గానీ ఇక వాళ్ళిచ్చే పుస్తకాలే జీవితంగా గడపాలి......పిల్లలు కాదు, తల్లులు!(తండ్రులకింత టైముండదుగా మరి)కొన్ని అంశాలు మరీ బేసిగ్గా ఉన్నాయి. ఏడెనిమిదేళ్ళ పిల్లలకిచ్చే స్టఫ్ లో కూడా మూడేళ్ళ పిల్లల excercise లు ఉన్నాయి.ఒక్కో టాపిక్ మీద 24 వాల్యూముల పుస్తకాలు, 20 వాల్యూముల డీవీడీలు..ఇలా ఉంది. స్కూల్లో రోజంతా గడిపి సాయంత్రం వచ్చే పిల్లలకు వీటన్నింటిమీదా కాన్సంట్రేట్ చేయాలంటే కష్టమే అనిపించింది.

  ఒకపక్కన "బాగానే" ఉందనిపించినా మరోవైపు వీటన్నింటికంటే సహజంగా నేర్చుకోవడమే మంచిదనిపించింది...వాళ్లు చెప్పే కిట్ ధర వినకముందే! విన్నాక బలపడింది. 25 వేల రూపాయలనుంచీ మొదలు ఆ కిట్ ధర! సామాన్యులైతే ఆలోచించాల్సిన ధరేగా!

  ReplyDelete
 12. సుజాత గారు నేను కొన్న పుస్తకాలన్నిట్లో పెళ్ళిబట్టలు అని ఓ పుస్తకం చాలా సరదాగా ఉంది. పిల్లల్నీ, పెద్దల్నీ ఇట్టే ఆకట్టుకునేలా. (ఇది చీ.బీ.టీ
  పూర్ణిమ గారి సలహాపై నేనూ గ్రోలియర్ స్టాలుకి వెళ్ళి కూర్చున్నాను. సుజాత గారు, నావీ డిటో కంప్లైంట్లు. గ్రోలియర్ వాళ్ళ కాన్సెప్టు బాగానే ఉంది కాని నావి రెండు సలహాలు.
  1) అలా మొత్తం ఒకసారి జనాల మీద రుద్దే బదులు రీడింగ్ లెవెల్స్ కి మల్లే డివిజన్స్ చేసి పార్టులుగా అమ్మితే బాగుండేది. అప్పుడు ఎవరి పిల్లల స్థాయికి తగ్గ లెవెల్ పుస్తకాలు వాళ్ళు కొనుక్కోగలరు.
  2) ఇంకోటేంటంటే ఆ పుస్తకాలు కాస్త మొనాటనీ అయ్యే ప్రమాదముంది. స్కూలు సిలబస్ కు పారలల్ గా ఇంట్లో ఇదెంట్రా అనుకునేట్టు.

  ఇక అన్నిటికన్నా పెద్ద అబ్జెక్షను. ఇప్పటి వరకు నాకున్న అనుభవం బట్టి, every child has his own tastes and quirks. Generally, I try to buy samples from 3-4 series and see how does my child react to it each one. Here there is no scope for such trials. I am not so sure every child wil like these and embrace them. ఇరవై ఐదు వేలు పెట్టేప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది.

  ReplyDelete