Tuesday, December 29, 2009

రోశయ్య చేసిన ఒకేఒక మంచి పని...

1) రోశయ్య చేసిన ఒకే ఒక్క మంచి పని:
ఏ క్షణాన రోశయ్య అధికారంలో వచ్చాడో కానీ ఒక్క రోజు కూడా అధికారాన్ని ఎంజాయ్ చేసినట్టనిపించదు. ఓ రెణ్ణెల్లు దాక జగన్ని ముఖ్యమంత్రి చేయాలంటూ కాంగ్రెస్ వాళ్ళే ఆయన్ని ఒప్పుకోలేదు. ఇటలీ మేడం రాయిని మనసు చేసుకొని ఇదింతే, మార్పులు చేర్పులకు వీల్లేదు అనేంతవరకూ కనీసం తన సీట్లో తనైనా చక్కగా కూర్చోలేకపోయాడు. సరే అనుకుంటే ఎన్నడూ లేనట్టుగా కృష్ణమ్మ కన్నెర్ర జేసింది. అంతూ దరీ లేకుండా వర్షాలు కురిసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాయి. అదీ సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు తెలంగాణ గొడవ మొదలయ్యి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇన్ని రోజుల్లో రోశయ్య చేసిన ఒకే ఒక మంచిపని ఏంటి తెలుసా? సచివాలయం నుండి మా ఇంటి వరకు ఒక్క గుంతైన లేని, గతుకులు లేని రోడ్డు వేయించాడు. అఫ్కోర్స్, మా ఇంటి పక్కనే వాళ్ళిల్లు ఉండడంతో ఆయనకూ సౌకర్యంగా ఉంటోందిట ;)

2) పిల్లలూ - పిడుగులు
స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్ సందర్భంగా మీ "విభు"కి శాంటాక్లాస్ డ్రెస్ వేయండి అని వాళ్ళ ప్లేస్కూల్ టీచర్ రిక్వెస్టు పంపింది. సరే మాకూ సరదాగానే అనిపించి ఎక్కడినుండో ఒక యాభై రూపాయల విలువ చేసే శాంటా డ్రెస్సుని ఐదొందలు పెట్టి కొన్నాం. తెల్లని పత్తితో చేసిన మీసాలు గెడ్డాలు ఒకవైపు చికాకు పెడుతున్నా పాపం బుద్ధిగా వెళ్ళి స్కూల్లో చాక్లెట్లు పంచి ఇచ్చాడు. ఇరవయి మూడున ఇదయ్యాక చక్కగా మర్చిపోయాం.
ఇక క్రిస్మస్ రోజు సాయంత్రం బయటకు వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద ఫుల్ శాంటా గెటప్‌లో ఎవరో కుర్రాడు నిల్చున్నాడు. మొహానికి శాంటా మాస్కు కూడా తగిలించుకున్నాడు. కారాపి "విభుడూ అదిగో శాంటాని చూడు" అని వాడికి చూపిస్తున్నాను.శాంటా కుర్రాడేమో చేతులూపుతూ అనుకోని బుల్లి అతిథిని "హాయ్, హాపీ క్రిస్మస్" అనుకుంటూ పలుకరించాడు. ఒక నిమిషం పాటు మా వాడి కోల్డ్ రెస్పాన్స్ చూసి సరేలే అని కిటికీ మూసేసి ముందుకి కదిలాం. కిటికీ మూయగానే మా వాడాడిగిన మొదటి ప్రశ్న.
"ఆ డ్రెస్సు ఎవరు వేసుకున్నారు బాబాయ్?"

3) ఫెయిలైతే దుఖఃం, ఫస్టొస్తే...?
3 ఇడియట్స్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. మాధవన్, శర్మాన్ జోషి పరీక్షాఫలితాలు చూడ్డానికి వెళ్తారు. చిట్టచివర్న వాళ్ళిద్దరి పేర్లు ఉండడం గమనిస్తారు. ఆమిర్ఖాన్ పేరు కిందెక్కడా ఉండదు. మాధవన్ స్నేహితునికోసం తెగ బాధపడిపోతుంటాడు ఫెయిలయ్యాడేంటా అని. అప్పుడు శర్మాన్ వచ్చి వాడు ఫెయిలవలేదు ఫస్టొచ్చాడు అని చెపుతాడు. మాధవన్ సూత్రధారిగా ఒక విషయం చెబుతాడు. "స్నేహితుడు ఫెయిలైతే అరరే అని బాధపడుతాం కాని వాడట్టే శ్రమలేకుండా ఫస్టొచ్చాడంటే మాత్రం ఈర్ష్యగా ఉంటుంది అని." ఈ డైలాగ్ ఇంటికొచ్చాక ఎందుకో మళ్ళీ గుర్తొచ్చింది. ఎందుకురా అంటే తెలుగు సాహిత్యంలో ఇలాంటిదే ఒక సంఘటన గురించి చదివింది గుర్తొచ్చింది.
తెలుగులో సీరియస్ సాహిత్యానికి ఎంకరేజ్మెంటులేదనీ పుస్తకాలుకొనేవారు లేరని సాహిత్యకారులు అపుడపుడూ వాపోతుంటారు. కథకుడి పారితోషికం కనీసం వెయ్యికూడా ఉండదని కంప్లైంటు చేస్తుంటారు. అలాంటిది ఒకసారి తానా వారు ఒకసారి నవలలపోటీల్లో ఉత్తమనవలకి లక్ష రూపాయల బహుమానం ఇచ్చారు. అప్పుడు మెజారిటీ సాహిత్యకారులు లక్షరూపాయల బహుమానం వచ్చేంత ఏముందా నవలలో అని సన్నాయి నొక్కులు నొక్కుకున్నారుట. (బై ది వే, ఆ నవల పేరు 'రేగడి విత్తులు ' మన బ్లాగరు చంద్రలత గారి రచన. చాలా బాగుంటుంది. ఎపుడైనా వీలు కుదిరితే... కాదు కాదు.. ఎలాగైనా వీలు చేసుకొని చదవండి.)

1 comment:

  1. మీ ఇంటి ప్రక్కనే మాపాప స్కూలు :-)

    ReplyDelete