Tuesday, August 04, 2009

రాఖీ పండగ

రాఖీ పండగ వస్తుందంటే బోల్డన్ని జ్ఞాపకాలు ముసురుకొస్తాయి. మేమ్ముగ్గురం అబ్బాయిలమైనా నాకు అక్షరాల ఇరవయ్యైదు మంది ఫస్ట్ కజిన్స్. సో, బానే రాఖీలు వచ్చేవి పోస్టులో. ఇవి గాక, ఇరుగుపొరుగు అక్కలు చెల్లెళ్ళు కలుపుకొని అధమ పక్షం డజన్ రాఖీలు కట్టుకొనేవాణ్ణి. చిన్నప్పుడు హాస్టల్లో ఐతే ఇంకా సరదాగా ఉండేది. అందరికి ఒకటీ రెండు రాఖీలుంటే నా దగ్గిర డజను. ఇప్పుడు కజిన్‌స్ అందరూ పెద్దవడం, పెళ్ళిళ్ళు చేసుకొని చెల్లా చెదురవడం, కారణాలేవైతేనేం.. సంఖ్య తగ్గి పోయింది.
ఎవరు పంపినా పంపకపోయినా నాకు తప్పకుండ వచ్చేదీ, నేనూ పని గట్టుకొని ఎదురు చూసేదీ పెద్దక్క (పెద్దనాన్న కూతురు) రాఖీ. పెద్దక్క రాఖీ చాలా స్పెషలు. ఠంచను గా వస్తుంది. చివరిదాకా ఎదురుచూసేలా చేయదు. ఇవన్నీ కాక రాఖీ తో పాటు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ మోసుకు వస్తుంది. చాలా చిన్నప్పుడు చాక్లెట్లు, కాస్త పెద్దయ్యాక గ్రీటింగ్ కార్డులు, హాస్టల్లో ఉన్నప్పుడు చాంతాడంత ఉత్తరాలు, తను కాస్త పెద్దయి ఉద్యోగం చేయగానే కొత్త చొక్కాలు... ఇలా సందర్భానుసారంగా ఏవేవో. కొన్నాళ్ళామధ్య అదృష్టం ఎక్కువై ఇద్దరం ఒకే ఊర్లో చదువుకునేవాళ్ళం. అప్పుడు చక్కగా నాన్న ఇచ్చిన డబ్బులతో అందరం ఏ మినర్వాకో, అబిడ్స్ తాజ్ కో వెళ్ళి పావ్ భాజీ, ఛోలే భటూరా తినే వాళ్ళం. ఇదిగో ఇవాళ కొరియర్ వాడు ఫోన్ చేసి, సార్ మీ పాకెట్ ఎట్లాగైనా తీసుకోవాలి రేపే రాఖీ అని ఫోన్ చేస్తే ఇవన్నీ గుర్తొచ్చాయి. వెధవ, స్వీట్ డబ్బా ఉందని ముందే సస్పెన్‌స్ తేల్చేశాడు.
ప్స్: చిన్నక్కా, ఇదంతా ఖోపంగా చదువుతున్నావని తెలుసు. ఏదో నీకు పెళ్ళయాక నువ్వూ పంపించడం మొదలెట్టావ్ కానీ, అప్పటి వరకు పంపిన రాఖీల క్రెడిట్టూ, క్రియేటివిటీ పెద్దక్కకే అని మనిద్దరికి తెలుసు. ఏమంటావ్ :)
అక్కలకు, చెల్లెళ్ళకూ, బ్లాగ్ మిత్రులకూ రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు మీ....

3 comments:

 1. రాఖి సంవత్సరానికి ఒక సారి.. TANA రెండు ఏళ్ళకి ఒక సారి .. మీ బ్లాగ్ మూడు ఏళ్ళకి ఒక సారా.. మరి చిన్నగా ఉంది పిప్పెర్మేంట్ బిళ్ళ లాగా. ఇంకోంచం రాస్తే మీ సొమ్మేం పోతుందో..

  ReplyDelete
 2. మూడేళ్ళ తరువాత రాస్తున్న మాట నిజమే. బహుశా ఈసారైనా తరచుగా రాద్దామని అనుకుంటున్నాను. (ఆంధ్ర జాతి అపప్రథ నిజం కాకుండా). పెద్ద పెద్ద బ్లాగులు రాయాలంటే దానికి బోలెడు టైం స్పెండ్ చేయాలి. అవి తెమలవు..బ్లాగు అప్‌డేట్స్ లేక అలాగే ఉండిపోతుంది. అందుకని ఈ చిన్న చిన్న బ్లాగులు...

  ReplyDelete
 3. బ్లాగు చూసి నేను చెప్పాలనుకున్నది 'శ్రీ' గారు చెప్పేశారు.. మీ సమాధానం కూడా చూసేశా కాబట్టి, దానిని అమలుపరిచే క్షణాల కోసం ఎదురు
  చూస్తున్నా :-)

  ReplyDelete