Thursday, August 13, 2009

యాది - డా.సామల సదాశివ

పుస్తకాల కొట్టులో అవీ ఇవీ వెతుకుతుంటే, "ఈ పుస్తకం చదవండి సార్. బాగుంటుంది" అని సదాశివ గారు రాసిన "యాది" పుస్తకాన్నిచ్చారు. అప్పటికి సదాశివగారి పేరు నేను వినలేదు. ఈ వ్యక్తి పేరే విననపుడు ఈయన జ్ఞాపకాలు కొనాలా వద్దా అని మీమాంస చేస్తూ రెండూ పేజీలు తిరగేశాను. అంకితం పేజీలో, రచయిత మనవడికి పుస్తకాన్ని అంకితమిస్తూ "వారీ కార్తీకా! ఇగ పటు.." అన్న వాక్యం ఆకర్షిచింది. ఇంత ప్రేమగా, ఇంటిభాషలో రాసిన పలకరింపు చూసి ఫర్లేదు బానే ఉండొచ్చనుకొని కొన్నాను. ఆ నమ్మకాన్ని నూటికి నూరు పాళ్ళూ నిజం చేసిందీపుస్తకం.

డెభ్భయ్యేళ్ళ నిండు జీవితంలో రచయిత అభిరుచులగురించీ, అవి పెంపొందిచేందుకు దోహదపడిన వ్యక్తులగురించీ, విన్నవీ, కన్నవీ, మధ్య మధ్యలో ఉర్దూ, ఫారసీ కొటెషన్లతో చదువుతుంటే "అహా, కబుర్లు చెప్పడం కూడా ఒక కళే" అనిపించకమానదు. హిందుస్తానీ సంగీతం గురించైతేనేమి (రూపాయికోసం పావలా వదులుకోనన్న పండిట్ జస్‌రాజ్ కథా, సాక్షాత్తు రామక్రిష్ణ పరమహంస దగ్గిర కడుపు నింపుకున్న ఉస్తాదోంకే ఉస్తాద్ బాబా అల్లా-ఉద్దీంఖాన్ కథా, హిందుస్తానీ సంగీతాన్ని కఠోరగురువుల చెర విడిపించిన భాత్ఖండే, పలూస్కర్ల గురించి వివరాలు), తెలుగు సాహిత్యకారుల గురించి ఐతేనేమి ( ఆంగ్లంలో "les miserables" చదివి, అనువదించేందుకు ఫ్రెంచి నేర్చుకున్న వేలూరి శివరామ శాస్త్రి గారి కబుర్లూ, విమర్శకులతో చికాకు పడి ఫోటో పంపని విశ్వనాథ వ్యవహారమూ, మధురాంతకం రాజారాం గారితో వ్యక్తిగతానుబంధం), ఉర్దూ గురించైతేనేమి (ఉర్దూ తన అనుబంధం గురించి, రూమీ మస్నవీని, అంజద్ రుబాయీలనూ అనువదించడానికి తను చేసిన శ్రమా, కాళోజీ సోదరుల గురించి రాసిన వ్యాసాలు, సియాసత్ పత్రిక సంపాదకుల గురించి చెప్పిన కబుర్లూ) అన్నీ చదివించే వ్యాసాలే. 'ఉర్దూ' ఒక మతానికి సంబంధించిన భాషకాదనీ సార్వజనీనమని చేసిన్ చర్చ కూడా మన తరం వాళ్ళు ఆలోచించదగ్గ విషయం.

సదాశివగారి విలక్షణమైన నేపథ్యమే ఇంతటి వైవిధ్యంగల కబుర్లకు మూలమనిపిస్తుంది చదువుతుంటే. సదాశివ గారి విద్యాభ్యాసం నిజాం ఏలిన తెలంగాణాలో జరిగింది. కాబట్టి చదివింది ఉర్దూ భాషా, ఉర్దూ మాధ్యమం. ప్రాతఃస్మరణీయులైన గురువుల వద్ద అమరం, ప్రబంధాలు చదివి నేర్చిన సంస్కృతాంధ్ర భాషలు. ఇవి కాక మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల అబ్బిన మరాఠీ భాష. చిన్నతనంలో ఇలాంటి పునాది వేసుకున్నవారు బహుభాషావేత్తలు కాకుండా ఉండగలరా? ఈ బహుభాషా ప్రావీణ్యమే సదాశివగారు రెండు వారధులు నిర్మించేందుకు కారణమయింది. ఒకటి రూమీ మస్నవీకి, అంజద్ రుబాయీలకు మరియు తెలుగు పాఠకులకు.ఇంకొకటి తెలుగు సాహిత్యానికి 'సియాసత్' ఉర్దూ పాఠకులకు. పుస్తకమంతా అంతర్లీనంగా కనిపించే మరొక విషయం సదాశివ గారి సహృదయత. వారి గురువుల పట్ల, శిష్యుల పట్ల, మిత్రుల పట్ల ఆయన ఆదరాభిమానాలు, భేషజాలు లేని వ్యక్తిత్వం పాఠకులను తప్పక ఆకట్టుకుంటాయి.

ఇన్ని సుగుణాలున్న పుస్తకంలో పునరుక్తిదోషాలు మాత్రం ఎక్కువే. ఒక పత్రికలో ధారావాహికగా వచ్చినపుడు పునరుక్తి అంతగా బాధించదు. పుస్తకంగా తెచ్చినప్పుడు మాత్రం పునరుక్తులను పరిష్కరించాల్సింది. అలాగే పుస్తకం చివర్లో తన స్నేహితులను గుర్తుచేసుకుంటారు రచయిత. సంగీత సాహిత్య విషయాలతో అలరారిన ఈ పుస్తకంలో అవి అంతగా నప్పలేదు.

వేసవి సెలవుల్లో తాతగారింటికి వెళ్ళినప్పుడు ఆరుబయట పక్కలు వేసుకొని పడుకునేవాళ్ళం. పిల్లలందర్ని పెట్టుకొని తన సుదీర్ఘ జీవన జ్ఞాపకాలను కథలు కథలుగా చెబుతుండేవారు తాతగారు. ఆనాటి అనుభూతిని మళ్ళీ గుర్తు తెచ్చిందీ పుస్తకం.
(యాది : ఎస్. సదాశివ. ప్ర.2005. నవోదయ, విశాలాంధ్రలో లభ్యమవుతాయి. వెల: 100/-)
కొసమెరుపు: అంతగా నన్నాకర్షించిన "వారీ..ఇగ పటు" వాక్యం సదాశివగారిది కాదట. తిరుమల రామచంద్ర గారి నుద్దేశించి ఆంధ్ర బిళణ "కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి" పలికిన పలుకులట.
(ఈ పుస్తకం తరువాత, సదాశివ గారు సంగీత శిఖరాలు- అని హిందుస్తానీ కళాకారుల మీద ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని వెలువరించారు. సంగీతప్రియులకు ఆ పుస్తకమూ పఠనీయమే).

1 comment:

  1. budugu gariki
    i have just read ur post on ismail and now, this. If u are interested in contributing to pustakam.net, please reply me back to tis id :)
    Thanks.

    ReplyDelete