Wednesday, August 19, 2009

ఇస్మాయిల్

మన తెలుగు కవిత్వం మీద శ్రీ శ్రీ, క్రిష్ణశాస్త్రి, తిలక్‌ల ప్రభావం ఎంతటిదో చెప్పనలవి కాదు. కొత్తగా రాసేవారు మొదలుకొని, దిగ్గజాలవరకు ఇప్పటికీ అదే ప్రభావంలో రాస్తున్నారు. ఇలాంటి సాహిత్యమఱ్ఱి చెట్లకింద మరో వృక్షం పుట్టుకురావాలంటే ఎంత ధీశక్తి, నిబ్బరం ఉండాలి. సరిగ్గా అలాంటి వాడే ఇస్మాయిల్. ఈ కవులందరినీ ఎంతో మెచ్చుకున్నా, వీరిని కాదని తెలుగు కవిత్వానికి మరో దిశను పరిచయం చేసిన కవి. మనతరంలో చాలా మందికి తెలుగు కవిత్వంతో పరిచయం పదోతరగతితో ముగుస్తొంది. ఏ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం వల్లో ఏమో జనసామాన్యానికి ఇస్మాయిల్ కవిత్వం గురించి అంతగా తెలవదు. అలాంటి ఇస్మాయిల్ ని గుర్తు చేసుకుంటూ ఇవాల రెండు సాంపుల్ కవితలు. (ఇవేమీ ఆయన రాసినవాటిల్లో గొప్పవి కావు..ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి మాత్రమే)
1) నిద్దట్లో ఆమె కళ్ళు (ఇస్మాయిల్ : 1972)

అర్ధరాత్రి దూరాన
ఎక్కడో పడగ విప్పిన చప్పుడుకి
నిద్దట్లో కలవరపడి
పక్కకు తిరిగి
నన్ను హత్తుకుందామె.

ఆమెకళ్ళు
జలజలపారే
నిద్దర సెలయేటి
అడుగుని
గలగలమని పాడే
అందమైన
గులకరాళ్ళు.

ఈ మెరిసే నీళ్ళ చప్పుడుకి
ఆకర్షితులై
చీకట్లో మెసిలే
ఏవో వింత మృగాలు
ఆమె నిద్దుర ఒడ్డుల్ని
తచ్చాడుతాయి.

2) పాట (ఇస్మాయిల్ : 1978)

సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఏలా?

3) ఆత్మహత్య (ఇస్మాయిల్ : 1975)

తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచకా
ఎటో నడిచి పోయింది.


బ్లాగ్ మితృలకు ఆసక్తి ఉంటే మరిన్ని మరోసారి...
ఇట్లు మీ..

24 comments:

 1. తన నీడను పరచుకొని
  ఎండను కప్పుకొని
  ధ్యానముద్రలో ఓ ఆకు

  కరెక్టుగా వ్రాసానో లేదో! ఎప్పుడో చదివిన ఇస్మాయిల్ గారి కవిత ఇది.

  మాములుగా అయితే, రాలిపడ్డ ఓ ఆకుని ముసలి వయసుతో అన్వయిస్తూ కవితలు అల్లేస్తారు 'సామాన్య కవులు'. ఈయన అసామాన్యుడు కనుకనే, అసాధారణంగాను అద్భుతంగానూ ఆలోచిస్తారు.

  నా అభిప్రాయంలో, ఈ శతాబ్దం నాదని శ్రీశ్రీ ప్రకటించటంలో అతిశయం లేకపోయినా, 'మరో శతాబ్దం నాది' అని ప్రకటించుకోగల స్థాయిలో ఉన్నా ఒదిగిఉన్న మహాకవులు ఇస్మాయిల్, అజంతాలు.

  ReplyDelete
 2. నీడను పరుచుకొని
  ఎండను కప్పుకొని
  రాలింది ఆకు

  ఇదొకటి ఈనాడులో చదివాను.

  ReplyDelete
 3. ఇస్మాయిల్ గారికి మంచి ఇంట్రో ఇచ్చారు.

  ఆయన ప్రపంచాన్ని చూసే దృష్టే వ్యత్యాసంగా ఉంటుంది. అసలు ఇలా కూడా ప్రకృతిని చూడవచ్చా అనిపిస్తూంటుంది.

  ఆయన కవితలు ఈమాట వారి ఆర్చైవులలో చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరుణ ముఖ్యం అనే వ్యాస సంకలనం. ప్రతీ కవి తలక్రింద పెట్టుకొని పడుకోవాల్సిన పుస్తకం అది.

  బయటకు వెళ్లాలి, నేను లింకులు ఇవ్వలేక పోతున్నాను, మీరు వెతికి ఇవ్వండి. మిగిలిన చదువరులకు ఉపయుక్తంగా ఉంటుంది.

  and finally he is a great poet with no భుజకీర్తులు అండ్ కిరీటాలు.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 4. @కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవడం అంత సొంతడబ్బా ఇంకోటి లేదు. That is singularly one of the most over-rated statements. verse libre is not SrISrI's own invention. ఐనా శ్రీ శ్రీ మహప్రస్థానం తర్వాత అంత బాగా రాసిందీ లేదు. మహాప్రస్థానం రాసినపుడు శ్రీశ్రీ యువకుడు, అప్పటి చారిత్రక సందర్భం కూడా వేరు. తర్వాత రాసిన వాట్లో చెప్పుకోదగ్గదేది? ఇస్మాయిల్ తరహా వేరు. జీవితాన్ని అతను పరికించి ఆస్వాదించే తీరు వేరు. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా మంచి కవిత్వాన్ని రాశారు. అలా అని ఇస్మాయిల్ మీద జపనీయ, చైనీయ ప్రభావం లేదనలేము. నన్నడిగితే ఇద్దఊ గొప్ప కవులే. భక్తులు యుగకర్తలు, ప్రవక్తలు అని ఎత్తేయనంతవరకూ.
  @బొల్లోజు గారు : ఈమాట లింక్ చూపించినందుకు బోల్డన్ని ఠాంక్సులు. కరుణముఖ్యం కవులకు బైబిల్ లాంటిది సార్. దాని గురించి మరెపుడైనా విపులంగా వ్యాసం రాస్తాను. ఏ పరిచయమూ లేక లింక్ పెట్టడం బావోదు.

  ReplyDelete
 5. నా అభిమాన కవి ఇస్మాయిల్ గారి గురించి తల్చుకున్నందుకు ధన్యవాదాలు. తెలుగులో వేళ్ళమీద లెక్కపెట్టగల గొప్ప కవుల్లో ఇస్మాయిల్ ఒకరు. తెలుగు కవిత్వంలో నిశ్శబ్దాన్ని ప్రవేశపెట్టిన ప్రతిభాశాలి. ఇస్మాయిల్ గారి మీద మరిన్ని మంచి వ్యాసాలు రావాల్సి ఉంది.

  ReplyDelete
 6. @కిరణ్ గారు - నన్నడిగితే ఈ శతాబ్దం నాది అని చెప్పుకోవడం అంత సొంతడబ్బా ఇంకోటి లేదు.

  a daring statement. isnt it? :-))

  let me open myself.

  శ్రీశ్రీ కవిత్వం, ఇస్మాయిల్ కవిత్వాలను కలిపి మూల్యాంకనం చేయలేం. రెండూ వేరువేరు. శ్రీశ్రీది నిబద్దకవిత్వం. ఒక వాదానికి పరిమితమై ఉంటుంది.
  ఇలాంటి కవిత్వాలు పరిధికి లోబడి ఉంటాయి. అంటే తనచుట్టూ ఒక గిరి గీసుకొని అందులోనే గానుగెద్దులా తిరగవలసిఉంటుంది.

  అయినప్పటికీ దానిలో ఎంత లోతులకు వేళ్లాలో అంతలోతులకూ తీసుకువెళతాడు. దానిలో ఎన్ని ఎత్తులకు తీసుకుకెళ్లగలరో అన్ని ఎత్తులనూ చూపిస్తాడు శ్రీశ్రీ.
  ఆ రకంగా శ్రీశీ మరీ శతాబ్ధం నాదనేంత కాకపోయినా, ఒక శతాబ్ధాన్ని ప్రభావితం చేసిన కవిగా ఒప్పుకోకతప్పదు. శ్రీశ్రీ ప్రభావం ఆయన చనిపోయేవరకూ కూడా (నక్సల్బరీ ఉద్యమ గీతాలు దిగంబరకవిత్వం, శివారెడ్డివాళ్లు మొదట్లో నరకండీ చంపండీ అంటూ వ్రాసిన విప్లవకవిత్వం వరకూ)ఉండింది.

  శ్రీశ్రీ మహాప్రస్థానం తరువాత అంతటి గొప్ప రచనలు ఏమీ ఉండకపోవచ్చు. ఇది చాలా మంది మేధావులకు జరిగే విషయమే. చాలామంది తమ పాతికేళ్లలోపు ఆవిష్కరించిన విషయాలకు వచ్చిన పేరుపై మిగిలిన జీవితకాలం బతికేసినవాళ్లే. ఏ టాగోర్ లాంటి వారో మినహా.

  అలాగని శ్రీశ్రీ ఖాళీగా కూర్చోలేదు. చాలానే వ్రాసాడు. సర్రియలిజాన్ని దింపటానికి యత్నించాడు. దాన్ని మో తప్ప మరెవ్వరూ అందుకోలేకపోయారు. ఆయన ఖడ్ఘసృష్టిని మరో సారి చదవండి. మహాప్రస్థానంతో పోల్చకపోతే అదీ ఒక గొప్ప కావ్యమే. అనంతం మంచి రచన. ప్ర.జ (ప్రశ్నలు జవాబులు)దాదాపు మూడు వందల పేజీల సంకలనం. దానిలో శ్రీశ్రీ ఉటంకింపులు చూస్తే, తెలుగు కవులలో ఇంతిలా సాహిత్యాన్ని కమిట్మెంట్ తో యజ్ఞంలా నిర్వహించిన వారు లేరేమో ననిపిస్తుంది. అతని రేడియో నాటకాలు కూడా మంచి ప్రయోగాత్మకమైనవే.

  సిప్రాలీలు, లిమరుక్కులు, సిరిసిరిమువ్వలు, చమత్కారమైన విషయాలైనప్పటికీ ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్న నానీలు, హైకూలకు అవి రా ఫార్మ్స్ గానే అనిపిస్తాయి.

  ఈ శతాబ్ధం నాదీ అన్న మాట యొక్క స్థల కాలాదులను గమనిస్తే, అప్పట్లో విశ్వనాధ వారు "నా గురువు చెల్లపిల్లవారు నన్ను శిష్యునిగా పొందటం ఆయన అదృష్టం" అంటూ చెప్పుకొన్న రోజులవి.(నాకు విశ్వనాధవారి ప్రతిభపై రవంత అనుమానం ఏమీ లేదు - నా పేచీ అల్లా పాపం ఆ గురువుగారికి జరిగిన అవమానం గురించే- ఎందుకంటే చెళ్లపల్లి వారి మునిమనవడు నేనూ క్లాస్ మేట్ లము ఓ సారి మాటల సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది) బహుసా ఈ వాఖ్య కూడా అలాంటిదే కావొచ్చు. కనుక క్షమించేయొచ్చు. మరీ సొంతడబ్బా అని తిట్టక్కర్లా. :-)

  ఇక ఇస్మాయిల్ గారి విషయానికి వస్తే వీరి శైలి వేరు. వీరు అనిబద్ద కవిత్వం వ్రాసారు.ఇలాంటి కవిత్వానికి పరిధి పెద్దది, వస్తువులు విస్త్రుతం, లోతు అనంతం.

  అనిబద్ద కవిత్వం నెమ్మదిగా హృదయంలోకి ఇంకుతుంది. ఒక సారి ఇంకిందా ఇక అది ఎన్నటికీ ఆరిపోని గంధమే. ఇలాంటి దానిలో కేచీ వాక్యాలు ఉండవు కనుక ప్రచారం పల్చగానే జరుగుతుంది.
  ఇది ఎక్కువగా హృదయానికి సంబంధించినదై ఉంటుంది. (బుద్దికి కాదు).

  ఇస్మాయిల్ గారు ఒక కవిత వ్రాయటానికి సుమారు ఓ ఇరవై రూపాలను చిత్రీ పట్టీ చిత్రీ పట్టి పదునెక్కించి, ఒకదాన్ని బయటకు వదిలేవారట. ఇక అది ఆ విషయంపై ఫైనల్ అన్నమాట. ఒక్క అక్షరాన్ని కూడా తగ్గించలేం, పెంచలేం. చేసామా మొత్తం పద్యం కుప్పకూలుతుందన్నమాట. అంత పగడ్భందీగా ఉంటుంది ఆయన వాక్యనిర్మాణం కానీ, కవితా శిల్పం కానీ.

  మూలా సుబ్రహ్మణ్యం గారన్నట్లు కవిత్వంలో డమడమల స్థానంలో నిశ్శబ్ధాన్ని ప్రవేశపెట్టింది ఈయనే. విషయాన్ని నర్మగర్భంగా చెప్పటం, వాక్యాల అర్ధాలు కాక వాక్యాల వెనుక ఉన్న అర్ధాలు కవితను ఆక్రమించటం ఇస్మాయిల్ గారి చలవే.

  అన్నట్టు ఈమాటలో ఇస్మాయిల్ గారి రచనల్ని ఎక్కించింది సుబ్బుగారే. we all should thank him on this occassion

  సరే ఏదో నాలుగు వాక్యాలు రాయాలనిపించి మొదలుపెడితే చాటంత అయ్యింది. ఎందుకు రాయాలనిపించిందంటే మీరన్న సొంతడబ్బా అన్న మాట వల్ల.

  మీరెలాగూ ఆ మాట అనేసారు కనుక, ఆ భావానికి వ్యతిరేక వాదన కూడా వినిపించాలన్న ఉద్దేశ్యంతోనే --

  అభినందనలతో

  బొల్లోజు బాబా

  ReplyDelete
 7. బొల్లోజు బాబా గారు, మీ దీర్ఘ వ్యాఖ్యకు సంతోషం. మీరు విశ్వనాథ పాండితిని శంకించనట్లే నేనూ శ్రీశ్రీ పాండితిని శంకించట్లేదు. శతాబ్దం నాది అనడం మాత్రం స్వోత్కర్ష అని అంటున్నాను. శ్రీశ్రీ కి భాష మీద ఉన్న పట్టులో ఒకవంతైనా ఆయన ప్రభావంతో రాస్తున్న నేటి కవులకుంటే ఇంత బాధే ఉండదు. ఆయన ప్రభావంలో రాసిన శివారెడ్డి, దిగంబరకవిత్వంలో ఎంతపస ఉందో మీరే తేల్చాలి.

  అలాగే ఇస్మాయిల్ కవిత్వాన్ని అనిబద్ధ కవిత్వమనకండి. కొత్తవారెవరైనా చదివితే ఆయన మాటలకు చేతలకు పొంతన లేదేమో అనుకోగలరు. ఆయనది జెన్ కవిత్వం అనొచ్చేమో. సుబ్రహ్మన్యం గారు చెప్పాలి. సరైన పదం ఏంటో..

  ReplyDelete
 8. అనిబద్ద కవిత్వం అంటే నిబద్దత లేని కవిత్వం అని కాదు నా ఉద్దేశ్యం.

  ఏ ఇజాలకు/వాదాలకు/ప్రాంతీయతలకు కట్టుబడని కవిత్వం అని. విమర్శకులు కొన్ని వాదాలకు కట్టుబడి ఉండే కవిత్వాన్ని నిబద్ద కవిత్వం అని, అలా కాక, ప్రకృతి, మానవసంబందాలు, నాస్టాల్జియా, స్త్రీపురుష కలయిక, దైవచింతన, సంస్కృతి సాంప్రదాయాలు, సమాజంలోని వైరుధ్యాలు వంటివాటిని వస్తువులుగా తీసుకొని వ్రాసే కవిత్వాన్ని అనిబద్ద కవిత్వం అనీ అంటున్నారు.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 9. అనరు మరీ. నాకు మట్టుకు అనిబద్ధ కవులు అంటే తిట్టులాగే ఉంది. మీకు మీరే ఊహించుకోండి. మిమ్మల్ని ఎవరికైనా పరిచయం చేసుకోవాలని, అనిబద్ధ కవులుగా చెప్పుకుంటే ఎదుటివారికి సదభిప్రాయం కలుగుతుందా? మన దగ్గిర ఉన్న జాఢ్యమే అది. ప్రతి వారినీ ఏదో ఒక చట్రంలో ఇరికించాలని చూడ్డం, ఏ చట్రంలోనూ ఇమడకపోతే వారి క్రెడిబిలిటీ తగ్గించడం కోసం ఇలాంటి పదాలు వాడ్డం. ఇస్మాయిల్ గారు అనుభూతి కవులుగా తెలుసు గానీ అనిబద్ధ కవులుగా ఎప్పుడూ వినలేదు. ఎవరైనా అన్నా అప్పటికప్పుడు ఖండించడం వివేకమైన పని.

  ReplyDelete
 10. ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకులు డా. ద్వానా శాస్త్రి గారు వాడారు.

  బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 11. ఈ నిబద్ద అనిబద్ద కవిత్వ రకాలు అని ప్రముఖ విమర్శకులు డా. ద్వానా శాస్త్రి గారు వాడారు.

  బహుసా వారి ఉద్దేశ్యం committal and non committal అనే తప్ప consistent and inconsistent అని కాదని అనుకొంటాను.
  =======
  బాబాగారు - అసలు నిబద్ధకవిత్వం - అనిబద్ధ కవిత్వం అని ఆయన వర్గీకరించటమూ, అవి కవిత్వంలో రకాలని తీర్మానించటమే ఓ పెద్ద నాన్సెన్స్. దానికి తోడు, ఆయన అభిప్రాయానికి మీ భాష్యం కూడానా! మిగతా విషయాల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే మీరు, కవిత్వం దగ్గరికి, కవులు, విమర్శకుల దగ్గరికి వచ్చేటప్పటికి నీరుగారిపోయి, మొహమాటానికి పోతున్నట్లు అనిపిస్తుంది. బ్లాగుల్లో కూడా పరమ చెత్త కవితలు కూడా అద్భుతంగా ఉన్నాయని మీరు మెచ్చేసుకోవటం కూడా నాకు చాలా సార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ, ఇక్కడ చెప్పేసాను.

  ReplyDelete
 12. కిరణ్ గారు, నా మనసులో మాట మీరు చెప్పారు. అసలు నిబద్ధత అనే కొలమానమే తప్పు. (నిబద్ధత ఉండకూడదనట్లేదు). అహా శ్రీ శ్రీ ఒహో శ్రీ శ్రీ అని ఎగిరేవారే ఆయన జీవన విధానం చూసి నిబద్ధత ఏదీ అనుకోకమానరు..అలాగే సాయంత్రమైతే మందు పార్టీల్లో కూర్చొని బడుగుజీవులమీద కవితలు చెప్పుకునేవారికి నిబద్ధత ఉన్నట్టా?
  అనుభూతి కవిత్వం అంటే ఒప్పుకోవచ్చు. అనిబద్ధ కవిత్వం అంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఏ? ఇస్మాయిల్ కవిగా మానవీయ విలువలకు నిబద్ధుడై లేడా? ఎవరైనా రుజువులతో ఒక వ్యాసం రాస్తే సంతోషిస్తాను..

  ReplyDelete
 13. అయ్యో బుడుగు గారు. నేను శ్రీశ్రీ, ఇస్మాయిల్, అజంతాల అభిమానినండోయ్ :))
  నాకు ఈ విమర్శకులలో నచ్చనిదల్లా ఇష్టమొచ్చినట్లు విశ్లేషణలు జరిపి, ఇష్టం వచ్చిన వర్గీకరణలు చేసి కవులను గుంపులుగా తయారు చేయటం. శ్రీశ్రీ, ఇస్మాయిల్ ఇద్దరు భిన్న దృక్ఫధాలతో కవిత్వం వ్రాసారు. నా వరకు నాకు నచ్చేది వారు వ్రాసిన వాటిట్లోని కవిత్వం మాత్రమే. శ్రీశ్రీ విప్లవకవిత్వం వ్రాసారా, ఇస్మాయిల్ అనుభూతి కవిత్వం వ్రాసారా అన్నది అసలు ముఖ్యం కాదు. వారు వ్రాసిన కవిత్వం వరకు మాత్రమే మనం చూడాలి.

  బొల్లోజు బాబాగారు వివరించిన డి.ఎన్.శాస్త్రి గారి వర్గీకరణ ప్రకారం శ్రీశ్రీ ఒక కమ్యూనిస్టు కవిగా మాత్రమే చూడబడతారు. అది తప్పు.

  ReplyDelete
 14. కిరణ్ గారూ
  ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ, ఇక్కడ చెప్పేసాను
  అంతే నంటారా? అయితే ఒకె :-))

  బుడుగు గారూ
  అలాగే సాయంత్రమైతే మందు పార్టీల్లో కూర్చొని బడుగుజీవులమీద కవితలు చెప్పుకునేవారికి నిబద్ధత ఉన్నట్టా?

  ఇది మరో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉన్న విషయం.
  ఈ మధ్య శ్రీశ్రీ శతజయంతి పేరుచెప్పి వ్రాసిన ప్రతీ వ్యాసంలోనూ, ఆయనో తాగుబోతు అన్న విషయాన్ని ప్రతిఒక్కరూ మరచిపోకుండా మరీ మరీ నొక్కి వక్కాణించారు. ఎందుకో అర్ధం కాదు.

  నిబద్దతపై మీకున్న అభిప్రాయాల ప్రకారమైతే డిటక్టివ్ నవలలు వ్రాసేవారు మర్డర్లూ, మానబంగాలతో ప్రత్యక్షానుభవాలు ఉండటమే నిబద్దతలా అనిపిస్తూంది.

  నేనైతే శ్రీశ్రీ వ్యక్తిగత జీవితాన్ని, కవిత్వాన్ని వేరువేరుగానే చూస్తాను.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 15. @బుడుగు: కవుల్ని,రచయితల్నీ వర్గీకరించి అర్థం చేసుకోవడం ఒక అకడమిక్ పద్ధతి. ఎవరి ప్రాతిపదికని (వాదం,కులం,మతం,జాతీయత etc.)బట్టి వారు ఆ వర్గీకరణలు చేసుకుంటూ పోతారు.ముఖ్యంగా సాహితీచరిత్రకారులూ విమర్శకులూ ఈ పనిచేస్తారు.

  ఆ కొలమానాలు పాఠకుడి రసస్పందనకు అనవసరం. కానీ ఒకొక్కప్పుడు ఆ ప్రాతిపదికే కొందరు పాఠకుల రసస్పందనకు మూలం అవుతుంది. దాన్నికూడా కాదనలేం కదా!

  వర్గీకరణ వారిని ఒక ధృక్కోణం నుంచీ అర్థం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే. అదే వారి కవిత్వానికి కొలమానం కాదు. కానఖ్ఖరలేదు.

  ReplyDelete
 16. చెప్పటం మరచాను
  ఇస్మాయిల్ గారు అనుభూతి కవులుగా తెలుసు .....
  అనుభూతికవిగా పిలిపించుకోవటం ఇస్మాయిల్ గారు వ్యతిరేకించారు.


  ఇస్మాయిల్ కవిగా మానవీయ విలువలకు నిబద్ధుడై లేడా?

  అసలా అనుమానం మీకెందుకు కలిగింది? రామాయణం అంతా విని రాముడికి సీతేమౌతుందని అడిగిన చందంలో.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 17. మొదట let me re-assert three of my opinions.
  1) శ్రీ శ్రీ గొప్ప కవి - తెలుగులో అగ్రగణ్యుడు - సందేహమే లేదు. (శతాబ్దం నాదనడం మాత్రం స్వోత్కర్ష).
  2) అనిబద్ధ కవులు - అనే పదానికి నేను 'బద్ధ ' వ్యతిరేకిని.
  3) నిబద్ధత వ్యక్తిత్వానికి కొలమానం కావొచ్చు. కవిత్వానికి కాకూడదు. అది అసంబద్ధం.

  వీటిలో దేనితోనైనా మీరు విభేధిస్తే మరింత చర్చ చేయండి. ఇక ఏవేవో ఇంటర్‌ప్రెటేషన్లు నాకన్వయిస్తే నేను జవాబు కూడా ఇవ్వలేను.

  @కిరణ్ గారు : మీ అభిప్రాయాలతో నాకూ ఎటువంటి పేచీయే లేదండి. నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తాను.

  @బొల్లోజు గారు: నేను శ్రీశ్రీ గురించి వేసిన ప్రశ్న అతని నిబద్ధతని ప్రశ్నిస్తుంది. నిబద్ధత అంటే ఏమిటి మీ ఉద్దేశ్యంలో? నాకైతే శ్రీ శ్రీ యువకావేశంలో రాసిన రాతలకు తరువాత అతని జీవితానికి పొంతనలేదనిపిస్తుంది. ఆ విధంగా "విమర్శకుల ప్రకారం అతని కవిత్వాన్ని నిబద్ధంగా వర్గీకరించిన" అది నిబద్ధమని నేనొప్పుకోలేను.

  రామాయణమంత......అని అనాల్సింది నేను. మీరేం చదివారో మీకేం అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు. మరొక్కసారి నా అభిప్రాయం చదవండి. ఇస్మాయిల్కు నిబద్ధత లేదని నేనట్లేదు. లేదన్న వారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు సావకాశంగా చదవండి. త్వరగా conclusions కి చేరుకోవద్దు. మళ్ళీ చర్చ చేయాలంటే నేను పైన ఉటంకించిన మూడు అభిప్రాయాలను వ్యతిరేకిస్తే చర్చ చేయండి.

  ఇస్మాయిల్ గారికి ఏ లేబిల్సూ ఇష్టముండవని ఆయన ఎన్నో మార్లు చెప్పారు. agreed.
  @ మహెష్ : విమర్శుకులు వర్గీకరించడం ఒక ప్రక్రియే. agree. ఇక్కడ నేను వ్యతిరేకించేది ఆ వర్గీకరణ కు వాడిన లేబిల్ను.

  ReplyDelete
 18. మీ అభిప్రాయాలకు నా అభిప్రాయాలకు మధ్య ఘర్షణ ఎక్కడ వస్తున్నదంటే. మీరు కవి వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని కలిపి పరిగణలోకి తీసుకొంటున్నారు. నేను విడదీసి చూస్తున్నాను. అందుకనే నిబద్దత అనంగానే దాన్నేదో వ్యక్తిత్వానికి ఆపాదించినట్లుగా భావిస్తున్నారు. నా కోణంలో అయితే, ఒక కవి కవిత్వమే నాకు ప్రామాణికం కానీ ఆతని వ్యక్తిత్వంతో నాకు సంబందం లేదు. అతను వ్రాసిందే ముఖ్యం. అది ఎంతవరకూ ఒక ఆలోచనకు నిబద్దమై ఉందీ లేదూ అనే తప్ప అతను తన జీవితంలో దాన్ని అనుసరిస్తున్నాడా లేదా అని నేను పెద్దగా పట్టించుకోను. నా ఆలోచనలు అంతవరకే ఉంతాయి. అవి మార్చుకోవాల్సిన పరిస్థితులు నాకెదురు కాలేదు.

  మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించను. గౌరవిస్తాను అంతే.

  భూషణ్ గారు (ప్రముఖ కవీ, విమర్శకులు) ఒకసారి అంటారు – ఒక కవితను చదివేపుడు దాని వ్రాసిన వారి పేరును మనసులోంచి చెరిపేసి చదువుకోవటం మంచి పద్దతి అని. – ఆ మాటలూ నాకు నచ్చుతాయి. (గమనించండి ఇక్కడ ఆ కవి వ్యక్తిగత జీవితం మాట దేముడెరుగు, అసలు ఆ కవి పేరుకూడా అనవరమనే వాదన ఇది).

  ఇస్మాయిల్ కవిగా మానవీయ విలువలకు నిబద్ధుడై లేడా? అన్న ప్రశ్న బాగానే వేసారు. ఇక్కడ అలా లేరని అన్నవారెవరు? ఇస్మాయిల్ గారు గొప్పకవి కాదని నేను కానీ ఇక్కడ కామెంటు చేసిన వారు కానీ అనలేదే మరి ఎవరూ కాదనని విషయాన్ని “అలా కాదా?” అని ప్రశ్నించటం నాకెందుకో రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లే అనిపించింది.

  నా దృష్టిలో కవిత్వంలో నిబద్దత అంటే (ఇక్కడ కవిత్వంలో అన్న మాటనేను చేర్చాను) “ నా హృదయంలో నిదురించే చెలి” అని వ్రాసి ఆ చెలి ఎవరంటే కమ్యూనిజం అని చెప్పటం. భిన్న ముఖాల కవిత్వాన్ని కొన్ని పరిధులలోనే తిప్పటం.

  మీరు ఇదివరలో ప్రశ్నించినట్లు, నన్నెవరైనా అనిబద్ద కవి అని పిలిస్తే, అదో గౌరవం లా భావిస్తాను. నా కవిత్వ పరిధి పెద్దది అని గుర్తించినందుకు గర్విస్తాను. తప్ప అదేదో తిట్టులాగా నేను భావించను.

  ఇజాలు, వాదాల కవిత్వాలు బలహీనపడిన ఈరోజున తెలుగు సాహితీలోకంలో ప్రతీ కవి అనిబద్ద కవిత్వం వ్రాయలని ప్రయత్నిస్తున్నవారే, పిలిపించుకోవాలని తాపత్రయపడుతున్నవారే. గమనించండి.

  చివరగా నిబద్దత అన్న మాట వ్యక్తిత్వాలకు సంబందించినది కాదు, కవిత్వానికి సంబందించింది.
  అదికూడా పరిధులకు లోబడిన, లోబడని అనే అర్ధాలలోనే తప్ప మరొకటి కాదు.
  కనీసం నా కామెంటులలో నేను ఉద్దేశించినది అలానే.

  థాంక్యూ
  బొల్లోజు బాబా

  ReplyDelete
 19. అయ్యా బొల్లోజు గారు, మీది సరికొత్త వాదం. చారిత్రకంగా నిబద్దత ఎప్పుడు వ్యక్తిత్వానికే ఆపాదించబడింది. అందుకే ఆ ప్రాతిపాదికన వర్గీకరణ అసంబద్ధమైంది అన్నాను. ఇలా వస్తువుకు ఆపాదించి వర్గీకరించే వాదం ఇదే మొదటిసారి. వినడానికే హాస్యాస్పదంగా ఉంది.
  చారిత్రకంగా నిబద్ధత అన్న కవులు, విరసం వారు కవిత్వ వస్తువుకే నిబద్ధంగా ఉన్నారా? వ్యక్తి నిబద్ధత ప్రశ్నిస్తున్నారా? మీరు కొంచెం రీసెర్చి చేసి చెప్పగలరు. (ఈ మధ్య రాసిన ఆర్టికల్స్ లోంచి కాదు).

  ===
  మీరు కవి వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని కలిపి పరిగణలోకి తీసుకొంటున్నారు. నేను విడదీసి చూస్తున్నాను. అందుకనే నిబద్దత అనంగానే దాన్నేదో వ్యక్తిత్వానికి ఆపాదించినట్లుగా భావిస్తున్నారు. నా కోణంలో అయితే, ఒక కవి కవిత్వమే నాకు ప్రామాణికం కానీ ఆతని వ్యక్తిత్వంతో నాకు సంబందం లేదు. అతను వ్రాసిందే ముఖ్యం
  ===
  మహాప్రభో!! నాకునూ కవి కవిత్వమే ప్రామాణికం కాబట్టే శ్రీశ్రీ నిస్సందేహంగా అగ్రగణ్యుడు అని చెప్పాను. నేనూ మొదట్నుంచి మొత్తుకొనేదీ అదే. వ్యక్తిగత నిబద్ధతకు కవిత్వానికి సంబధం లేదూ. ఆ ఉద్దేశ్యంలో నే శ్రీ శ్రీ ని ఉదహరించాను. మీరేదో చదివి, దాంట్లోంచి ఇంకేదో interpret చేసి నాకంటగట్టడం మానండి. ఇంత చిన్న చర్చలో ఇది రెండో సారి. మీకు ఇంకో టపా వేయాలంటే మళ్ళీ ఏ అమూల్య అభిప్రాయం నాదంటారో అని భయంగా ఉంది.
  సెలవు.

  ReplyDelete
 20. @బుడుగు: ఇంగ్లీషులో moral - immoral తోపాటూ ammoral అనే పదమొకటుంది. నైతికతకూ అనైతికతకూ మధ్య ‘నైతికత్వరహిత’ స్థితి అన్నమాట. ఇక్కడ "అనిబద్ధ" అనే పదానికి అర్థం నిబద్ధత లేకపోవడం కాదు. ఏ ఇజానికీ బద్ధుడు కాకపోవడం.

  కాబట్టి మీరుచెప్పేదీ బాబాగారు అన్నదీ ఒకటే!

  ReplyDelete
 21. చిన్న పిడకలవేట- Isn't it 'amoral?

  ReplyDelete
 22. @తెరెసా: ధన్యవాదాలండీ!
  అసలేనేను ఇంగ్లీషులో వీకు స్పెల్లింగులు మరీనూ!!

  ReplyDelete
 23. for your kind information pl. refer this.

  "సాదాసీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంత శక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవటమే ఆయన కవిత్వ శక్తికి కారణం’ అని ఆయన గుర్తుచేసేవారు. ---- అఫ్సర్

  రిఫరెన్స్: పేజీ నం: 32 పుస్తకం: సలాం ఇస్మాయిల్-నివాళి వ్యాసాలు. వ్యాసం పేరు: అక్కడితో బాల్యం అంతమైంది. రచన: అఫ్సర్
  ప్రచురణ: 2004

  ReplyDelete