Thursday, December 31, 2009

ఈ మధ్య చదివిన పుస్తకాలు

1) బడి నేర్పిన పాఠాలు: పిల్లలకు పాఠాలు నేర్పుతూ తాము నేర్చుకున్న పాఠాలేమిటి? ఆంధ్రజ్యోతి-ఎమెస్కో వారు కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో ఎంపికైన వ్యాసాల సంకలనం. పుస్తకం చదువుతుంటే మన పాఠశాలల దయనీయ స్థితులను తలచుకొని నిర్వేదం, మనం అడుగిడేది 2010లోకేనా అన్న అపనమ్మకం, స్ఫూరి నిచ్చే కొన్ని వ్యక్తిత్వాలను చూసి ఇంకా హోప్ ఉందన్న భావం కలగలిసిపోతాయి. ఒట్టు-అన్న వ్యాసం చదివాక కళ్ళు చెమ్మగిల్లని వారుండరు. గిజుభాయి సూత్రాలను ఆచరిస్తున్న మరో కిశోరభారతి, సౌజన్యా ఎడ్యుకేషనల్ అకాడమీ గురించి మనమందరం తెలుసుకోవాలి. ఈ పుస్తకం concept గొప్పగా ఉన్నా చదువుతుంటే this could have been better in so many ways అనిపించింది. ఉదాహరణకి వ్యాసాలు చదువుతుంటే బోలెడు ప్రశ్నలు రేకెత్తుతుంటాఇ. ఆయా టీచర్లతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి, స్కూళ్ళ ఫోటోలు కొన్ని ప్రచురిస్తే బాగుండేది. ఇంత చక్కని కాన్సెప్టుకు ఫాలో అప్ ఏమిటి? అన్న ప్రశ్నకూడా మదిని తొలుస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా తప్పక చదవాల్సిన పుస్తకం.
(ఎమెస్కో ప్రచురణలు, వెల 50/-)

2) కథా కేరళం : తకళి శివశంకరపిళ్ళై నవల "చెమ్మీన్" అనువాదం "రొయ్యలు" చదివినప్పటినుండి ఆయన పుస్తకాలు ఇంకేవైనా చదవాలని అనుకున్నాను. బుక్‌ఫెస్ట్‌లో ఈ కథల అనువాదం చూసి వెంటనే కొన్నాను. ఒక తరం కేరళ కథకుల కథలు సంకలించి అనువదించిన పుస్తకం. మలయాళ కథా సాహిత్యానికి పరిచయదీపిక లాంటిది. పదిహేను కథల సంకలనం. ఎక్కువభాగం మంచి కథలే. కథా సాహిత్యంలో ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాలి. ఇక ఈ సంకలనంలో ఒకే ఒక యువ రచయిత కథ ఉంది. సమకాలీన సాహిత్యం ఎలా ఉందో తెలీదు కాని, ఇవి చదువుతుంటే మన తెలుగు కథ ఇంచుమించు ఇదే స్థాయిలో ఉందని అనిపించింది.
(వెల 75/- విశాలాంధ్ర/నవోదయల్లో దొరుకుతుందిట)

3) నిద్రితనగరం : వైదేహీ శశిధర్ కవితలగురించి బ్లాగ్లోకంలో ఆల్రెడీ రెండు-మూడు సమీక్షలు వచ్చాయి. పుస్తకం చదివిన తర్వాత సమీస్ఖకారులు మెచ్చుకున్నంత బావుందనిపించింది. ఈ నవతరం కవయిత్రులు ఇంద్రాణి, వైదేహి లను చదువుతుంటే కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విషయం. ప్రకృతితో ఇంతగా మమేకమై కేవలం అమ్మాయిలే రాయగలరు. కవిత్వప్రేమికులు, భావుకులు చదవాల్సిన పుస్తకం. (వెల 50/- నవోదయలో, అజోవిభో ఆన్‌లైన్ షాపుల్లో దొరుకుతుంది.)

4) దేశదేశాల హైకు : పెన్నా శివరామక్రిష్ణ గారి అనువాదాలు. దేశదేశాల హైకులను ఒక్కచోట చేర్చి అనువదించిన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం వ్యాసం మరెప్పుడైనా రాస్తాను. ప్రస్తుతానికి కొనుక్కోండి అనే నా సలహా. (వెల 30/- పాలపిట్ట ప్రచురణలు)

(బై ద వే, ఇవన్నీ నేను బుక్‌ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొన్నవి. విజయవాడ వాస్తవ్యులు నాలుగుదిక్కుల తిరక్కండా మీ బుక్ ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొనుక్కోవచ్చనుకుంటా.)

1 comment:

  1. ధన్యవాదాలు. మీరు చదివిన మంచి పుస్తకాలు పరిచయం చేస్తూ వుండండి.

    ReplyDelete